Home జాతీయ national telgu పహల్గాం: మిలిటెంట్ దాడి జరిగిన ఏడాది తర్వాత ఈ పర్యటక కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంది?

పహల్గాం: మిలిటెంట్ దాడి జరిగిన ఏడాది తర్వాత ఈ పర్యటక కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంది?

12
0

SOURCE :- BBC NEWS

కశ్మీర్, పహల్గాం దాడి, కశ్మీర్, పర్యటక పరిశ్రమ, భారత్ పాకిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పటి మాదిరిగానే సాయంత్రం పూట నజాకత్ అలీ ఫోన్ మోగుతూ ఉంది.

కశ్మీర్‌లోని ప్రముఖ పర్యటక కేంద్రంలో గైడ్‌గా పని చేస్తున్న 30 ఏళ్ల అలీ, ఫోన్‌లో అవతల ఉన్న వారితో అలవాటైన అవే సమాధానాలు చెబుతున్నారు.

ఔను, ఇప్పుడంతా బాగానే ఉంది. భయపడాల్సింది ఏమీ లేదు. మా మనిషి మీకు అందుబాటులో ఉంటారు. ఔను వాళ్లు రావచ్చు.

ఫోన్‌కు అవతలి వైపున పర్వతాలు, పచ్చికబయళ్లతో నిండిన హిమాలయ ప్రాంతానికి విహారయాత్రకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్న టూరిస్టులు ఉన్నారు.

వాళ్లు “చాలా భయంగా ఉంది” అని అంటారు. “అంతా బావుందని చెప్పి మనం వాళ్లను ఒప్పించాలి” అని అలీ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

మిలిటెంట్ల దాడిలో 26 మంది చనిపోయి ఏడాది గడుస్తున్నప్పటికీ పహల్గాం పర్యటక ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. గత కొన్ని దశాబ్దాలలో కశ్మీర్ పర్యటకులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇదొకటి.

దాడి జరిగిన తర్వాతి వారాల్లో అధికారులు పహల్గాంలోని 87 పర్యటక ప్రదేశాలలో 48 ప్రదేశాలను మూసేశారు.

2024లో దాదాపు 30 లక్షలుగా ఉన్న సందర్శకుల సంఖ్య 2025 నాటికి 12 లక్షలకు కంటే తక్కువకు పడిపోయిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తర్వాత కొన్ని ప్రదేశాలను తిరిగి తెరిచారు. కానీ మారణ కాండ జరిగిన బైసరన్ ప్రాంతం ఇప్పటికీ మూసివేసే ఉంది.

కశ్మీర్, పహల్గాం దాడి, కశ్మీర్, పర్యటక పరిశ్రమ, భారత్ పాకిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

సగానికి పడిపోయిన పర్యటకుల సంఖ్య

ఏళ్ల తరబడి అనిశ్చితి ఉన్నప్పటికీ, కశ్మీర్ లోయలో నిలదొక్కుకున్న పర్యటక పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ప్రాంతంపైనే ఈ దాడి జరిగింది.

కశ్మీర్‌లో హింస కొన్ని దశాబ్ధాలుగా అనేకమందిని బలి తీసుకుంది.

పహల్గాం దాడి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలను మరింత పెంచింది. రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సైనిక ఘర్షణ చెలరేగింది.

ఇది పాకిస్తాన్‌కు చెందిన ఒక టెర్రరిస్టు ముఠా పని అని భారత్ ఆరోపించింది. పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది.

నాలుగు రోజుల దాడుల తర్వాత కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది.

పహల్గాం దాడి తర్వాత కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లో పర్యటక పరిశ్రమ కొంత కోలుకున్నప్పటికీ, ఎప్పుడూ రద్దీగా ఉండే పహల్గాంకు టూరిస్టులు గతంలో మాదిరిగా రావడం లేదు.

2026 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య పహల్గాంకు 2.59 లక్షల మంది టూరిస్టులు వచ్చారు. దాడి జరగడానికి ముందు ఇదే కాలంలో 4.69 లక్షల మంది కంటే ఎక్కువ మంది వచ్చారు.

టూరిస్టుల రాక తగ్గిపోవడంతో స్థానికంగా వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. దాడి జరగడానికి 4 నెలల ముందు 25 ఏళ్ల మొహమ్మద్ అబూబకర్ 20 లక్షలు పెట్టుబడి పెట్టి హోటల్ ప్రారంభించారు.

“ఏప్రిల్ తర్వాత మాకు ఆదాయం ఏమీ లేదు” అని ఆయన చెప్పారు. దీంతో హోటల్ మూసివేశానని న్నారు.

కశ్మీర్, పహల్గాం దాడి, కశ్మీర్, పర్యటక పరిశ్రమ, భారత్ పాకిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Abid Bhat

సందర్శకుల రాకపై సందేహాలు

దాడి ప్రభావం కేవలం అంకెల పరంగానే కాకుండా ఇంకా అనేక ఇతర అంశాలపైనా పడింది.

హత్యల తర్వాత కశ్మీర్‌తో పాటు దేశమంతటా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. తర్వాతి రోజుల్లో భద్రతా చర్యలు పెరిగాయి.

దర్యాప్తు బృందాలు విచారణ కోసం దాదాపు 3వేల మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో అధికారులు అనుమానిత మిలిటెంట్ల ఇళ్లను కూల్చివేశారు.

దాడి పర్యవసానాలు కొంతమంది వ్యక్తుల రోజువారీ జీవితంలోకి విస్తరించాయి.

తర్వాతి కాలంలో భద్రత కొంత మెరుగైందని అధికారులు చెబుతున్నా పర్యటకంపై ఆధార పడిన వారి జీవితాల్లో అనిశ్చితి అలాగే కొనసాగుతోంది.

సందర్శకులు ఎప్పుడొస్తారు? అసలు వస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

“గతంలోనూ మేము అనేక కష్టాలను చూశాం” అని పహల్గాం లోని పోనీ రైడర్స్ అసోసియేషన్ అధిపతి అబ్దుల్ వాహిద్ భట్ చెప్పారు.

“అయితే ఈ దాడి భిన్నమైనది. ఇది ప్రతికూల సందేశాన్ని పంపింది” అని ఆయన అన్నారు.

కశ్మీర్, పహల్గాం దాడి, కశ్మీర్, పర్యటక పరిశ్రమ, భారత్ పాకిస్తాన్ యుద్ధం

ఉపాధి కోల్పోయిన స్థానికులు

కశ్మీర్‌లో అస్థిర పరిస్ధితుల మధ్య పర్యటక రంగం ఒక్కటే ఆశాదీపంగా ఉంది. అంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కూడా పైన్ చెట్లు, పచ్చిక బయళ్లకు ప్రసిద్ది చెందిన పహల్గాం లాంటి ప్రాంతాల్లో హింస లేదు.

కానీ గతేడాది ఏప్రిల్‌లో జరిగిన దాడి దాన్ని కకావికలం చేసింది.

కశ్మీర్‌లో అత్యంత రద్దీగా ఉండే ఒక పర్యటక కేంద్రంలో పర్యటకుల్ని లక్ష్యంగా చేసుకోవడంతో అస్థిరత ఏర్పడటంతో పాటు జీవనోపాధి కూడా దెబ్బతిందని స్థానికులు చెప్పారు.

ఈ మార్పు ఇప్పుడు దైనందిన జీవితాల్లో కనిపిస్తోంది.

పహల్గాంలో ఇప్పటికీ ఎప్పటిలాగే తెల్లారుతోంది. పైన్ చెట్ల వాలుపై పడే లేత సూర్యుడి కాంతి, లోయ గుండా నిలకడగా ప్రవహించే నది గలగలలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

కానీ పరిస్థితులు మారిపోయాయి.

పని దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితిలో గైడ్‌లు రోడ్డు పక్కన గుంపుగా నిలబడి ఎదురుచూస్తుంటారు.

మధ్యాహ్నానికల్లా చిన్న చిన్న టూరిస్ట్ గ్రూపులో వెనుక నుంచి ఎవరో తరుముతున్నట్లు హడావుడిగా ఫోటోలు తీసుకుంటూ వెళతారు.

సాయంత్రం అయ్యేసరికి రాత్రికి అక్కడే బస చేద్దామనుకున్న కొద్ది మందితో ఆ పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది.

ఒకప్పుడు టూరిస్టులతో కిటకిటలాడిన హోటళ్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దాదాపు 80శాతం గదులు ఖాళీగా ఉన్నాయి.

“గతేడాది నేను 20 లక్షల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే 15 లక్షల రూపాయలు మాత్రమే సంపాదించ గలిగాను” అని పహల్గాం హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ మగ్రే చెప్పారు.

కశ్మీర్, పహల్గాం దాడి, కశ్మీర్, పర్యటక పరిశ్రమ, భారత్ పాకిస్తాన్ యుద్ధం

ప్రభుత్వ ప్రయత్నాలకు విఘాతం

పహల్గాం పచ్చిక బయళ్ల నుంచి దగ్గర దగ్గరగా 5 కిలోమీటర్ల దూరంలో ఒక స్మారక చిహ్నం ఉంది.

ప్రజలు నెమ్మదిగా దాని వద్దకు వస్తారు. కొందరు పూలు సమర్పిస్తారు. మరికొందరు బాధితుల పేర్లు చదివి క్షణం మాత్రమే ఆగి వెనుదిరుగుతారు.

నజాకత్ అలీకి ఇదంతా ఉద్యోగంలో ఒక భాగమైపోయింది.

ప్రతీ ఫోన్ కాల్‌లోనూ ఒక లెక్క ఉంటుంది. ప్రతీ కాల్‌కి సంబంధించి ఎంత భరోసా ఇవ్వాలి, ఎంత గట్టిగా చెప్పాలనేది ఆయన తూకం వేస్తుంటారు.

“పరిసరాల్లో ఎలాంటి మార్పు లేదు. అయినా ఈ ప్రదేశం మునుపటిలా అనిపించడం లేదు” అని ఆయన చెప్పారు.

కశ్మీర్‌లో ప్రశాంతత ఏర్పడింది. పర్యటకానికి ఇది అనువైదని చెప్పేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు ఈ దాడి విఘాతం కలిగించింది.

ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న సందర్శకుల సంఖ్య, విస్తరిస్తున్న మౌలిక వసతులు, ఉన్నత స్థాయి కార్యక్రమాల నిర్వహణ లాంటివి ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేందుకు సంకేతాలుగా అధికారులు పేర్కొన్నారు.

2019లో ఈ ప్రాంతపు స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేసిన తర్వాత ఇది స్పష్టమైంది.

కశ్మీర్, పహల్గాం దాడి, కశ్మీర్, పర్యటక పరిశ్రమ, భారత్ పాకిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, AFP via Getty Images

కశ్మీర్ లోయలో ప్రస్తుతం హింస దశాబ్దాలలోనే అత్యల్ప స్థాయికి చేరుకుందని, ఈ ప్రాంతం కోలుకోవడానికి తొలి సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన గణాంకాలను వివరించేందుకు కశ్మీర్ పర్యాటక శాఖ డైరెక్టర్ సయ్యద్ కమర్ సజాద్ నిరాకరించారు.

అయితే పహల్గాంతో సహా ఈ ప్రాంతానికి పర్యాటకులు ఇప్పటికీ వస్తున్నారని పరిస్థితులు చక్కబడుతున్నాయని ఆయన అన్నారు.

“మాకు నమ్మకం ఉంది” అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

కొంతమంది సందర్శకులు తగు జాగ్రత్తలో తమ పర్యటన ముగించుకున్నారు. భద్రత పరమైన అంశాలు తమను ఆపలేక పోయాయని కేరళ నుంచి కుటుంబంతో కశ్మీర్ సందర్శనకు వచ్చిన కిరణ్ రావు చెప్పారు.

“టూర్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ముందు మాకు ఆందోళనగా ఉంది. కానీ ఇక్కడకు రావడం చాలా బావుంది” అని ఆయన అన్నారు.

దాడి తర్వాత ఏర్పడిన పరిస్థితుల్ని అధిగమించడం కశ్మీర్‌లో అనేకమందికి చాలా కష్టంగా మారింది.

పహల్గాంలోని పచ్చిక బయళ్లలో కాల్పులు జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్న వారిలో మొదటి వ్యక్తి గుర్రపు సవారీ నడిపించే రాయీస్ అహ్మద్ భట్.

ఏడాది గడుస్తున్నా ఆ జ్ఞాపకం ఆయనను ఇంకా వెంటాడుతోంది.

“చుట్టూ శవాలు పడి ఉన్నాయి. ప్రజలు సాయం కోసం ఏడుస్తున్నారు” అని ఆయన చెప్పారు.

ఆ తర్వాతి నెలల్లో ఆయన చికిత్స తీసుకున్నారు.

కశ్మీర్, పహల్గాం దాడి, కశ్మీర్, పర్యటక పరిశ్రమ, భారత్ పాకిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

సయ్యద్ హైదర్ షా గుర్రపు స్వారీ చేసేవారు. ఆయన కుటుంబానికి జీవనాధారమైన ఆయన కుమారుడు ఆదిల్ పర్యటకులను దాడి చేసిన వారి నుంచి దూరంగా తీసుకెళ్లి కాపాడే ప్రయత్నంలో చనిపోయారు.

“ఆదిల్‌ను మేము రోజూ తలచుకుంటాం. అతనిని చూసి గర్విస్తాం” అని షా అన్నారు.

ఇతర ప్రాంతాల్లో పరిణామాలు మరోలా ఉన్నాయి.

దాడి తర్వాత విస్తృతంగా జరిగిన తీవ్రవాదుల అణచివేతలో భాగంగా పుల్వామా జిల్లాలో అబ్దుల్ రషీద్ ఇంటిని కూల్చేశారు. దీంతో తమ కుటుంబం ఏడాది కాలంగా తాత్కాలిక ఆశ్రయంలో ఉండాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

మిలిటెంట్ గ్రూప్‌లో చేరిన ఆయన కుమారుడు గతేడాది కాల్పుల్లో చనిపోయాడు.

ఇలాంటి కూల్చివేతలు తీవ్రవాదాన్ని నిరోధించడానికేనని అధికారులు చెబుతుంటే, వీటిని సామూహిక శిక్ష అని విమర్శకులు అంటున్నారు.

రషీద్‌ ఇల్లు కూలిపోవడంతో ఆయన చలికాలంలో భయంకరమైన చల్లని వాతావరణాన్ని భరించాల్సి వచ్చింది.

“ఉష్ణోగ్రతలు సున్నాకంటే తగ్గాయి. ఒక వ్యక్తి నేరం చేస్తే అతని కుటుంబం ఎందుకు బాధ పడాలి” అని ఆయన ప్రశ్నించారు.

పహల్గాంలో నజాకత్ అలీ ఇప్పటికీ ఫోన్ కాల్స్‌కు సమాధానమిస్తూ సందర్శకులకు అవే హామీలు ఇస్తున్నారు.

“ఇప్పుడీ ప్రదేశానికి శాపం తగిలినట్లు అనిపిస్తోంది” అని ఆయన అన్నారు.

ఇంతలోనే ఆయనకు మరో కాల్ వచ్చింది. మళ్లీ అవే మాటలు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)