Home జాతీయ national telgu “పౌర్ణమి వచ్చిందంటే భయమేస్తోంది”, అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలోని స్థానికుల సమస్యలేంటి?

“పౌర్ణమి వచ్చిందంటే భయమేస్తోంది”, అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలోని స్థానికుల సమస్యలేంటి?

20
0

SOURCE :- BBC NEWS

అరుణాచలం, తిరువణ్ణామలై, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి, దేవాలయం

పౌర్ణమి వంటి ప్రత్యేక దినాల్లో కేవలం తమిళనాడు నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో అరుణాచలం సందర్శిస్తారు.

అరుణాచలంలో కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గం వెంబడి ఉండే స్థానిక వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఇక్కడకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కార్పొరేషన్ యంత్రాంగం కూడా కృషి చేస్తోంది.

“అయితే, ఈ కొండనే నమ్ముకుని బతుకుతున్న మమ్మల్ని కొందరు ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారు” అనే వాదనలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

అన్నామలైయార్ ఆలయంగా కూడా పిలిచే అరుణాచలేశ్వర ఆలయం, తిరువణ్ణామలై కొండ దిగువభాగంలో ఉంటుంది. ఈ పర్వతం ఎత్తు సుమారు 2,600 అడుగులు, చుట్టుకొలత 14 కిలోమీటర్లు.

దేవాదాయ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. తొమ్మిదో శతాబ్దంలో చోళ రాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని, తదనంతరం విజయనగర నాయక కాలంనాటి రాజులు మరింత అభివృద్ధి చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
అరుణాచలం, తిరువణ్ణామలై, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి, దేవాలయం

అయితే, పొరుగు రాష్ట్రాలతో పాటు ఎన్నో ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు వచ్చే ఈ కొండ చుట్టూ నివసిస్తున్న స్థానికులు మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

బీబీసీ తమిళ్ ‘యువర్ వాయిస్’ బృందం క్షేత్రస్థాయికి వెళ్లి వారితో మాట్లాడింది.

తిరువణ్ణామలైలో ఆక్రమణలకు సంబంధించి చెన్నై హైకోర్టులో కేసు దాఖలైంది. గత కొన్నేళ్లుగా తిరువణ్ణామలైలోని గిరి ప్రదక్షిణ మార్గంలో ఆక్రమణలు పెరిగాయంటూ న్యాయవాది యానై రాజేంద్రన్ గత ఏడాది మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు.

“కొండపై ఇళ్లు, మరుగుదొడ్లు, సిమెంట్ రోడ్లు నిర్మించారు. అంతేకాకుండా వాణిజ్య సంస్థలు విపరీతంగా పెరిగిపోవడంతో గిరి ప్రదక్షిణ మార్గం అస్తవ్యస్తమైంది” అని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అరుణాచలం, తిరువణ్ణామలై, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి, దేవాలయం

ప్రమాదంలో 3,430 గృహాలు..

ఈ కొండకు దక్షిణం వైపున, 2024లో కొండచరియ విరిగిపడిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. విచారణ సందర్భంగా యానై రాజేంద్రన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “అదే ప్రమాదం ఉత్తరం వైపు సంభవించి ఉంటే నష్టం ఇంకా ఎక్కువగా ఉండేది” అని పేర్కొన్నారు.

ఈ కేసు విచారణ సందర్భంగా, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోవిందరాజన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది న్యాయస్థానం.

ఈ కమిటీ సర్వే నిర్వహించి, 554 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. ఈ ఆక్రమణలను తొలగించాలని తన నివేదికలో పేర్కొంది.

అరుణాచలం, తిరువణ్ణామలై, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి, దేవాలయం

కమిటీ నివేదిక ప్రకారం, కార్పొరేషన్‌లోని ఆరు వార్డులలో, గిరి ప్రదక్షిణ రోడ్డు వెంబడి ఉన్న కొండ ప్రాంతంలో సుమారు 3,430 ఇళ్లు, 154 వాణిజ్య భవనాలు నిర్మితమయ్యాయి.

అయితే, కమిటీలో పేర్కొన్న 554 ఎకరాల భూమిని అటవీ ప్రాంతంగా ప్రకటిస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

“మేం యాభై ఏళ్లకు పైగా ఇక్కడే ఉంటున్నాం. ఖాళీ చేయించొద్దని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాం. నిరసన తెలియజేశాం” అని రమణాశ్రమం వెనుక వైపు నివసించే సరోజ అన్నారు.

“మాకు ఈ జాగా కావాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారోనని భయంగా ఉంది” అని ఆమె అన్నారు.

అరుణాచలం, తిరువణ్ణామలై, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి, దేవాలయం

‘ఖాళీ చేయలేమని చెప్పాం’

“ఈ కొండ చుట్టూ లక్షల మంది జీవిస్తున్నారు. మమ్మల్ని ఖాళీ చేయిస్తే తిరువణ్ణామలై ప్రతిష్ట దెబ్బతింటుంది. ఖాళీ చేయాలంటూ కార్పొరేషన్ నోటీసులిచ్చింది. కానీ, మేం ఖాళీ చేసేది లేదని చెప్పాం” అని అదే ప్రాంతంలో నివసిస్తున్న త్రిపుర అన్నారు.

సుమారు యాభై ఏళ్ల కిందట, కొండ చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో ప్రజలు ఆవాసాలు ఏర్పరుచుకోవడం మొదలైంది. ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకుని స్థిరపడిన స్థానికులకు క్రమంగా రోడ్లు, విద్యుత్ సహా ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించారు.

“మేం ఈ ప్రాంతాన్ని దైవంగా భావిస్తాం. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారి సౌకర్యాల కోసం మమ్మల్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారు” అని వివోసీ నగర్‌కు చెందిన చిత్ర అంటున్నారు.

“మేం ఇక్కడకు వచ్చినప్పుడు నీళ్లు కానీ, రోడ్లు కానీ లేవు. క్రమంగా అన్ని సౌకర్యాలూ వచ్చాయి. ఇక్కడ నివసించే వారిలో చాలామంది గృహ నిర్మాణ కూలీలే. ఇప్పుడు మా ఇళ్లను కూల్చివేస్తే, మేం ఎక్కడికెళ్లాలి?” అని ఆమె ప్రశ్నించారు.

అరుణాచలం, తిరువణ్ణామలై, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి, దేవాలయం

‘తిరుపతిలా మార్చాలనుకుంటున్నారు’

“ఈ ఇల్లు తప్ప నాకు వేరే ఆస్తి లేదు. ఇంటి పనులు చేసుకోగా వచ్చే సంపాదన తిండి ఖర్చులకే సరిపోతుంది. ఆ అరుణాచలేశ్వరుడే ఆదుకుంటాడని కోరుకుంటున్నాం” అని మరో మహిళ గీత అన్నారు.

తిరువణ్ణామలైని అధికారులు తిరుపతిలా మార్చాలనుకుంటున్నారని ఆటో డ్రైవర్ వెంకటేష్ అన్నారు. “కొండచరియలు విరిగిపడటం వల్ల దక్షిణం వైపు ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తామని అంటున్నారు.”

“మూడు తరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ, ఎలాంటి సమస్యలూ రాలేదు. ఈ కొండను కాపాడేది మేమే. లేకపోతే, ఇక్కడ బయటివారి ఆక్రమణలు పెరిగిపోతాయి” అని ఆయన బీబీసీతో అన్నారు.

అరుణాచలం, తిరువణ్ణామలై, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి, దేవాలయం

‘కనీస సౌకర్యాలు లేవు’

ఇక్కడి స్థానికుల మాదిరిగానే, గిరి ప్రదక్షిణ మార్గంలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

“సరైన తాగునీటి సౌకర్యం లేదు. టాయిలెట్‌కు వెళ్లాలంటే డబ్బులు చెల్లించాలి. గుడికి, షాపింగ్ ఏరియాకు వెళ్లేందుకు ప్రభుత్వ బస్సులు అందుబాటులో లేవు” అని సుగుణ అంటున్నారు.

గిరి ప్రదక్షిణ మార్గంలో సుగుణ జ్యూస్ షాప్ నడుపుతున్నారు. “బయటి ప్రాంతాల నుంచి చాలా వాహనాలు వస్తుంటాయి. పార్కింగ్ సౌకర్యం సరిగ్గా లేదు. దుకాణాల ముందు పార్కింగ్ చేస్తుండడం వల్ల వ్యాపారం దెబ్బతింటోంది.”

“దుకాణాలు పెట్టుకున్నందుకు ప్రతిరోజూ కార్పొరేషన్‌కు పన్నులు చెల్లిస్తున్నాం. కానీ, కనీస సౌకర్యాలు లేవు. గుడికి ఉచిత బస్సు ఉంటే బాగుంటుంది.”

“గిరి ప్రదక్షిణ రోడ్డు వెంబడి పలుచోట్ల ఉచిత మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, చాలామంది వాటిని గమనించరు. రోడ్లపక్కన మలమూత్ర విసర్జన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి” అని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

అరుణాచలం, తిరువణ్ణామలై, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి, దేవాలయం

‘పౌర్ణమి వస్తే భయమేస్తోంది’

కార్తీక దీపం, పౌర్ణమి వంటి ప్రత్యేక దినాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని గిరి ప్రదక్షిణ మార్గంలో రెస్టారెంట్ నడుపుతున్న మురుగన్ చెప్పారు.

“ప్రత్యేక రోజుల్లో ఏర్పాట్ల కోసం, అధికారులు దుకాణాల ముందు ఉంచిన బోర్డులు, బండలు ప్రొక్లెయిన్‌తో పగలగొట్టేస్తారు. కానీ, ఆ షాపు మరమ్మతులు చేసుకోవడానికి మూణ్నెళ్లు పడుతుంది.”

ఏడాదికి రెండుసార్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మురుగన్ అంటున్నారు. “మేం లేకపోతే భక్తులకు తినడానికి ఏం దొరుకుతుంది. చైత్ర పౌర్ణమి వస్తే నాకు భయమేస్తుంది” అని ఆయన అన్నారు.

అరుణాచలం, తిరువణ్ణామలై, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి, దేవాలయం

కార్పొరేషన్ కమిషనర్ ఏమన్నారంటే..

స్థానికులు లేవనెత్తిన సమస్యలపై తిరువణ్ణామలై కార్పొరేషన్ కమిషనర్ ఎస్.సెల్వ బాలాజీతో బీబీసీ మాట్లాడింది.

“కొండ చుట్టూ ఉన్న నివాసాలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఒకవేళ ఆ ప్రాంతాన్ని అటవీ భూమిగా ప్రకటించినట్లయితే, జిల్లా కలెక్టర్ నాయకత్వంలో సమావేశమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తాం” అని ఆయన అన్నారు.

కొండచరియలు విరిగిపడటం వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయం తీసుకుంటాం.”

“గత 2 నెలల్లో గిరి ప్రదక్షిణ మార్గంలో ప్రతి 200 మీటర్లకు ఒక టాయిలెట్ చొప్పున 30 టాయిలెట్లు నిర్మించాం. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 60,000 లీటర్ల ట్యాంక్‌ ఏర్పాటు చేశాం. పార్కింగ్ స్థలం విషయమై రవాణా శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం” అని ఆయన అన్నారు.

వ్యాపారులు లేవనెత్తిన ఇతర సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుని సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరుపుతామని కార్పొరేషన్ కమిషనర్ ఎస్.సెల్వ బాలాజీ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)