Home జాతీయ national telgu మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలని అనుకుంటున్నారా, అయితే ఇవి తెలుసుకోండి..

మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలని అనుకుంటున్నారా, అయితే ఇవి తెలుసుకోండి..

15
0

SOURCE :- BBC NEWS

ఆరోగ్యం, మెమరీ, వ్యాయామం, మెదడు, జ్ఞాపకశక్తి

ఫొటో సోర్స్, Getty Images

జ్ఞాపకశక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు.

తెలిసినవారి పేర్లు మర్చిపోవడం, దుకాణానికి వెళ్లినప్పుడు తీసుకురావాల్సిన సరుకులు గుర్తుకురాకపోవడం, ముఖ్యమైన పరీక్షకు లేదా జాబ్ ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కక్షణం మీ మెదడులో ఉన్న సమాచారమంతా ఎగిరిపోవడం.. వంటివి మీకూ జరిగే ఉంటాయి.

అయితే, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు.. మీ జ్ఞాపక్షశక్తిని తక్షణమే పెంచుకునేందుకు.. ఒక సులభమైన మార్గం ఉంది.

అదే కొన్ని నిమిషాలపాటు సైకిల్‌ తొక్కడం లేదా వేగంగా నడవడం.

మీరు చేసే చిన్న వ్యాయామమైనా సరే.. మీ మెదడులో తరంగాలను సృష్టించి మీ జ్ఞాపకాలను నిల్వ చేయడంలో, తిరిగి గుర్తుచేయడంలో సాయపడుతుంది.

ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ లేదా కార్డియో చేయడం ద్వారా మీ జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకోవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

నా న్యూస్‌లెటర్ కోర్సు ‘లైవ్ వెల్ ఫర్ లాంగర్‘లో చెప్పినట్లుగా వ్యాయామం జ్ఞాపకశక్తిని పెంచుతుందని మనకు చాలా కాలంగా తెలుసు.

శారీరక వ్యాయామం మన పనితీరును మెరుగుపర్చడమే కాకుండా వయసురీత్యా బలహీనపడే మెదడు భాగాలను దృఢపరుస్తుంది. దీని ద్వారా.. జ్ఞాపకశక్తి తగ్గుదలను నెమ్మదింపజేస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అలాగే, వ్యాయామం చేసే సమయం వల్ల కూడా తేడా ఉంటుందని ఇతర అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏదైనా కొత్త విషయం నేర్చుకున్న వెంటనే వ్యాయామం చేయడాన్ని, నాలుగు గంటల తర్వాత వ్యాయామం చేయడంతో పోలిస్తే గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుందని, ఆ తర్వాత వెంటనే వాటిని గుర్తు చేసుకోవడంలో సాయపడుతుంది. అయితే, కేవలం స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులు ఎలాంటి జ్ఞాపకశక్తిని పెంచలేవు.

ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. కానీ, ఒక కొత్త పరిశోధన సరిగ్గా దీన్ని అర్థం చేసుకోవడాన్నే లక్ష్యంగా పెట్టుకుంది.

వ్యాయామం చేసిన వెంటనే 14 మంది వ్యక్తుల మెదడు లోపల జరిగే ప్రక్రియను నాడీ శాస్త్రవేత్తలు పరిశీలించారు. జ్ఞాపకాలను పటిష్టం చేయడంలో ముఖ్యమైనవిగా పేరుగాంచిన మెదడు కణాలు లేదా న్యూరాన్‌ల మధ్య ప్రవహించే చిన్నపాటి విద్యుత్ తరంగాలను గమనించారు.

అనేక న్యూరాన్లు కలిసి ఒకేసారి ఉత్తేజితం కావడమే ఈ తరంగాలు అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ లోవా న్యూరోసైంటిస్ట్ మిషెల్ వోస్ చెప్పారు.

నిద్రపోయేటప్పుడు, ప్రశాంతంగా ఉన్న సమయాల్లో మెదడు జ్ఞాపకాలను ఎలా క్రోడీకరించి, నిక్షిప్తం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. (అధ్యయనం చేసిన వారందరికీ మూర్ఛ వ్యాధి ఉంది. కానీ, మెదడులోని ఆరోగ్యకరమైన, సాధారణ విద్యుత్ తరంగాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలను ఈ అధ్యయనంలో నాడీ శాస్త్రవేత్తలు పరిశీలించారు)

వ్యాయామం, మెదడు, జ్ఞాపకశక్తి

ఫొటో సోర్స్, Getty Images

కొంత వ్యాయామం చేసిన తర్వాత.. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి మెదళ్లలో ఏం జరుగుతుందో శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షించింది. వ్యాయామం తర్వాత.. హిప్పోక్యాంపస్‌లో, హిప్పోక్యాంపస్‌తో అనుసంధానమై ఉన్న ఇతర భాగాలలో జ్ఞాపకశక్తి తరంగాల పెరుగుదల ఉందని నాడీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది జ్ఞాపకశక్తిని క్రోడీకరించడంలో మెదడుకు సాయపడుతుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

మూర్ఛ వ్యాధి సర్జరీ కోసం పర్యవేక్షణలో ఉన్న రోగులలో విద్యుత్ తరంగాల కార్యకలాపాలను పర్యవేక్షించే న్యూరోసర్జన్లతో న్యూరోసైంటిస్ట్ మిషెల్ వోస్ బృందం అనుసంధానమైంది. ఈ రోగులకు తాత్కాలికంగా వారి మెదళ్లలో ఎలక్ట్రోడ్స్‌ను పెట్టేవారు. సైకిల్ తొక్కిన తర్వాత, దానికి ముందు విద్యుత్ తరంగాల కార్యాకాలపాలను పరిశీలించే అవకాశం దక్కింది.

”మెదడు పనితీరుకు ప్రధానమైన విద్యుత్ సంకేతాలను నేరుగా కొలవడం ద్వారా మానవ మెదడు ఎలా పనిచేస్తుందని అర్థం చేసుకునేందుకు ఇది ఒక ప్రత్యేకమైన అవకాశాన్నిస్తుంది” అని వోస్ తెలిపారు.

ఈ మెదడు తరంగాలు ప్రాథమిక బ్రెయిన్ స్కాన్లు అందుకోలేనంత వేగంగా విడుదల అవుతాయి. అందువల్ల, వ్యాయామం మెదడు విద్యుత్ కార్యకలాపాలను నేరుగా ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేసిన తొలి అధ్యయనం ఇదే.

ఏదైనా నేర్చుకున్న తర్వాత వెంటనే వ్యాయామం చేస్తే.. ప్రజలు ఎందుకు సమాచారాన్ని చాలా మెరుగ్గా అర్థం చేసుకుంటారో బయోలాజికల్ వివరణను ఇది అందించగలదని వోస్ నమ్ముతున్నారు.

అంతేకాకుండా, మెదడులో ఈ తరంగాలను పెంచడానికి కేవలం తక్కువ సమయం పాటు చేసిన శారీరక వ్యాయామం చేసినా సరిపోయింది – అంటే.. చిన్నపాటి వ్యాయామాలు కూడా మన జ్ఞాపకశక్తికి ఎంతో మేలు చేస్తాయని స్పష్టమైంది.

మెదడు, జ్ఞాపకశక్తి, వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

శారీరక శ్రామ చుట్టూ ప్రజల ఆరోగ్య సందేశాలను పునర్నిర్మించేందుకు ఈ పని సాయం చేస్తుందని వోస్ ఆశిస్తున్నారు. అలాగే, వృద్ధాప్యాన్ని మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడుతుందన్నారు. ముఖ్యంగా, జ్ఞాపకశక్తికి కీలకమైన మెదడు భాగాలను బలోపేతం చేయడం ద్వారా, మెదడు పనితీరు మందగించకుండా కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా తరచూ వ్యాయామాలు చేయడం ద్వారా.. మెదడుకు, శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా మనకు అందుతాయని మరో అధ్యయనం వెల్లడించింది. ఒక్క వర్కవుట్ ద్వారానే.. ఆ తర్వాత రెండు గంటల వరకు ఏకాగ్రత మెరుగవుతుంది. అలాగే, ”మంచి అనుభూతిని” కలిగించే డోపమైన్ హార్మోన్ స్థాయిలను వెంటనే పెంచుతుందని మరో అధ్యయనం వెల్లడించింది.

ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే, అంత మెరుగవుతామని తాజాగా మరో అధ్యయనం గుర్తించింది. వర్కవుట్ చేసిన తర్వాత.. మన మెదడుకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిసింది. అయితే, మనమెంత చురుగ్గా ఉంటే మెదడుకు కలిగే ప్రయోజనాలు అంత పెరుగుతాయని ఈ కొత్త అధ్యయనం వెల్లడించింది.

యూకేలోని యూనివర్సిటీ కాలేజీ లండన్‌లోని ఎక్సర్‌సైజు సైకాలజీ రీసెర్చర్ ఫ్లామినియా రోంకా ప్రకారం, ”ఆరు వారాల పాటు నిరంతరం వ్యాయామం చేస్తే, ఆ తర్వాత చేసే ప్రతి సెషన్ వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.”

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)