Home జాతీయ national telgu పాకిస్తాన్: భారత్, అఫ్గాన్ సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్తతలు.. ఇప్పుడు మూడోవైపు ఇరాన్ సరిహద్దులో యుద్ధం ఆగకపోతే...

పాకిస్తాన్: భారత్, అఫ్గాన్ సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్తతలు.. ఇప్పుడు మూడోవైపు ఇరాన్ సరిహద్దులో యుద్ధం ఆగకపోతే భరించడం కష్టమనే భయంతోనే పాక్ మధ్యవర్తిత్వం చేస్తోందా?

30
0

SOURCE :- BBC NEWS

పాకిస్తాన్, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, BBC / Getty Images

అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణకోసం సంప్రదింపులు నిర్వహించి విజయం సాధించామని భావిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు చర్చలకు ఆతిథ్యమిస్తోంది.

అమెరికాతో శాంతి చర్చల కోసం తమ ప్రతినిధులు పాకిస్తాన్ చేరుకున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ వెళ్తున్నారు.

చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

ఇస్లామాబాద్‌లో చర్చల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. 10వేలమంది పోలీసు అధికారులు, భద్రత బలగాల మోహరింపుతో ఇస్లామాబాద్ వీధుల్లో నిశ్శబ్దం నెలకొంది.

ప్రపంచానికి ఈ చర్చలు చాలా కీలకమైనవి. సంక్షోభం ముగియాలని, హార్ముజ్ తిరిగి తెరుచుకోవాలని ప్రపంచదేశాలు కోరుకుంటున్నాయి.

మిగిలిన దేశాలతో పోలిస్తే సంక్షోభం ముగియాల్సిన అవసరం పాకిస్తాన్‌కు అనేక విధాలుగా ఎక్కువ ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పాకిస్తాన్, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, ఇరాన్‌తో యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని సింగపుర్‌లోని నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు అబ్దుల్ బాసిత్ అన్నారు.

గత ఏడాది సౌదీ అరేబియాతో పాకిస్తాన్ పరస్పర రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, సౌదీలకు ఇచ్చిన హామీని గౌరవిస్తామని పాకిస్తాన్ చెప్పిందని ఆయనన్నారు.

దీనివల్ల పాకిస్తాన్ మూడు సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంటుందని ఇప్పటికే భారత్, అప్గానిస్తాన్‌తో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి బాసిత్ అన్నారు.

పాకిస్తాన్ తన నాలుగు ప్రావిన్సుల్లో రెండింటిలో పూర్తిస్థాయిలో సాగుతున్న తిరుగుబాట్లతో ఇప్పటికే సతమతమవుతోందని.. వీటన్నింటినీ పాకిస్తాన్ భరించలేదని అన్నారు.

మరోవైపు పాకిస్తాన్ సోషల్ మీడియాలో గర్వకారణంగా భావించే, ఉత్సాహవంతమైన రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

”ఓ కోణంలో దీన్ని ఓ విజయంలా చూడొచ్చు. ప్రపంచంలోని మరే దేశం కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించలేకపోయింది. మనం ఒక పెద్ద విపత్తు అంచున ఉన్న సమయంలో పాకిస్తాన్ దాన్ని నివారించింది” అని బాసిత్ అన్నారు.

ఏళ్లగా రాజకీయ అశాంతి, రెండు సంవత్సారాల క్రితం దివాలాకు దగ్గరగా వెళ్లిన బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, భారత్‌తో తీవ్రమైన పోటీవంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఈ విజయం అవసరం చాలా ఉంది.

అయితే పాకిస్తాన్ ఈ విజయాన్ని ఎలా సాధించింది?

పాకిస్తాన్, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Kash Patel/X

ట్రంప్‌కు ఇష్టమైన దేశం

అమెరికా, ఇరాన్, గల్ఫ్ దేశాలకు నమ్మకం ఉన్న ప్రత్యేకస్థానంలో పాకిస్తాన్ ఉంది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తనకు ఇష్టమైన ఫీల్డ్ మార్షల్ అని చెప్పిన పాకిస్తాన్ మిలటరీ చీఫ్ అసీమ్ మునీర్ ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారని పాకిస్తాన్ అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్‌కు చెందిన సెనెటర్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ చెప్పారు.

రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఆర్మీ ఆధిపత్యం సాగుతున్న పాకిస్తాన్‌లో మునీర్‌ను శక్తిమంతమైన వ్యక్తిగా భావిస్తారు.

ట్రంప్ రెండో పదవీకాలం ప్రారంభమైన వెంటనే మునీర్ అమెరికా అధ్యక్షుడితో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడం ప్రారంభించారని, రెండు విజయాలు అందించారని అమెరికా, ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ మాజీ రాయబారి మలీహా లోధి చెప్పారు.

అమెరికన్లు అప్గానిస్తాన్‌నుంచి వెళ్లిపోయేటప్పుడు 2021లో కాబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన బాంబుదాడి ప్రధాన నిందితుణ్ని సీఐఏ సమాచారం ఆధారంగా అమెరికాకు అప్పగించారు. కాబూల్‌లోఅప్పుడు జరిగిన ఆత్మాహుతిదాడిలో 170మంది అఫ్గాన్లు, 13మంది అమెరికా సైనికులు మరణించారు.

దీనిపై ట్రంప్ చాలా సంతోషించారని, కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారని లోధి చెప్పారు.

పాకిస్తాన్, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌తో యుద్ధం ఆగడానికి ట్రంప్ కారణమని చెప్పిన పాకిస్తాన్

భారత్‌తో భారీ యుద్ధాన్ని నివారించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించినట్టు పాకిస్తాన్ ఆయనకు తెలియజేసిన విధానం రెండో విజయనమని లోధీ అన్నారు.

ట్రంప్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును ప్రతిపాదించిన కొన్నిదేశాల్లో పాకిస్తాన్ ఒకటని లోధి తెలిపారు.

ప్రపంచంలోని ప్రతి దేశంపై సుంకాలు విధిస్తూ చేసిన టారిఫ్ యుద్ధంలో ట్రంప్‌కు పెద్ద సంతోషం దక్కకపోవడంతో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇలాంటి స్పందన అవసరం ఆయనకు చాలా ఉందని లోధి విశ్లేషించారు.

జాతీయ భద్రతకు ముఖ్యమైనవిగా అమెరికా భావిస్తున్న కీలక ఖనిజాల తవ్వకాల విషయంలోనూ అమెరికాకు అవకాశం కల్పిస్తామని కూడా పాకిస్తాన్ హామీ ఇచ్చింది.

కీలక ఖనిజాల తవ్వకాల్లో ప్రధాన సంస్థ అయిన పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ 2025 సెప్టెంబరులో అమెరికా కంపెనీతో 50 కోట్ల డాలర్ల పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసింది. పాకిస్తాన్ ప్రధాని ఇంట్లో జరిగిన ఈ ఒప్పందం సమయంలో మునీర్ అక్కడే ఉన్నారు.

ఆ తర్వాత జనవరిలో ట్రంప్, ఆయన కుటుంబం సహ వ్యవస్థాపకులుగా ఉన్న క్రిప్టో కరెన్సీ వెంచర్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్స్‌తో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల పాకిస్తాన్ డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌కు చెందిన స్టేబుల్‌కాయిన్‌ను చేర్చడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో ట్రంప్ వర్గంతో పాకిస్తాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి.

పాకిస్తాన్, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఏకపక్షంగా లేని పాకిస్తాన్ వైఖరి

అయితే ఈ దగ్గరి సంబంధాలు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన తొలి దాడులను అధికారికంగా పాకిస్తాన్ ఖండించకుండా ఆపలేకపోయాయి. కానీ పాకిస్తాన్ సైనిక మిత్రదేశం సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇరాన్ బాంబు దాడులు చేయడంతో పాకిస్తాన్.. ఇరాన్‌ను గట్టిగా వ్యతిరేకిస్తూ ప్రకటన జారీచేసింది.

హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సమన్వయం చేయాల్సిందిగా దేశాలను విజ్ఞప్తి చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఏప్రిల్7న చేసిన తీర్మానంపై ఓటింగ్‌కు పాకిస్తాన్ దూరంగా ఉంది. ఈ తీర్మానం ఏకపక్షమైనదని, అందులో ఎక్కడా అమెరికా, ఇజ్రాయెల్ మొదట దాడి చేశాయని లేదని సయ్యద్ చెప్పారు. పాకిస్తాన్ ఇలా అంశాలకు తగ్గట్టుగా వైఖరి ప్రదర్శించడం, సమతుల్యత పాటించడం ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల నమ్మకం పొందేలా చేసిందని ఆయన తెలిపారు.

ఈ దేశాలతో జరిగిన చర్చల్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక పాత్ర పోషించారని పాకిస్తాన్ మాజీ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్ చౌధురి చెప్పారు.

షరీఫ్, డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాఖ్ దర్ కలిసి గడచిన ఐదు వారాల్లో పదుల సంఖ్యలో విదేశీ నేతలు, సీనియర్ అధికారులతో మాట్లాడారు. వాషింగ్టన్, మాస్కో, బీజింగ్, కీలక యూరప్ దేశాలు తుర్కియే, ఈజిప్టు, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల నేతలతో మాట్లాడారు.

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో తాను అర్ధవంతమైన, మంచి చర్చలు జరిపానని కాల్పుల విరమణ ప్రకటించిన రోజు షరీఫ్ చెప్పారు. చర్చల్లో ఇరాన్ పాల్గొంటుందని ఇరాన్ అధ్యక్షుడు అప్పుడు చెప్పారు. పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు.

పాకిస్తాన్, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌తో సుదీర్ఘ అనుబంధం

ఇరాన్‌తో పాకిస్తాన్‌కు దీర్ఘకాలికంగా ఉన్న సంబంధాలను ఈ సందర్భంలో షరీఫ్ ఉపయోగించుకోగలిగినట్టు కనిపిస్తుంది. రెండు దేశాలను కలుపుతూ 920కిలోమీటర్ల సరిహద్దు ఉండడంతో దశాబ్దాలుగా ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని ఇరాన్‌లో పాకిస్తాన్ మాజీ రాయబారి ఆసిఫ్ దురానీ చెప్పారు.

ఉగ్రవాదులు, అప్గానిస్తాన్ అస్థిరత్వం వంటి ఇతర సమస్యలు కూడా రెండు దేశాలకున్నాయి.

”శరణార్థుల రూపంలో గడచిన ఐదు దశాబ్దాలుగా మా రెండు దేశాలూ అస్థిరతను ఎదుర్కొంటున్నాయి” అని దురానీ చెప్పారు.

నమ్మకాన్ని, సంబంధాలను పెంచడంలో మతం పాత్రను తక్కువగా అంచనావేయకూడదు. పాకిస్తాన్ సున్నీలు ఎక్కువగా ఉండే దేశమైనప్పటికీ, షియా జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో అదొకటి. అతిపెద్ద షియా దేశమైన ఇరాన్‌కు ఏటా ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా వేలాదిమంది పాకిస్తానీలు వెళ్తారు.

పాకిస్తాన్, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, EPA/Shutterstock

పాకిస్తాన్ పాత్ర ఎలా ఉండబోతోంది?

”సమగ్ర ఒప్పందం కుదరడమనే తర్వాతి దశ క్లిష్టమైనది. ఈ ప్రకియను తేలిగ్గా మార్చే ప్రక్రియను పాకిస్తాన్ కొనసాగించాలి” అని చౌధురి చెప్పారు.

లెబనాన్‌లో దాడులు తీవ్రతరం చేయడం ద్వారా కాల్పులవిరమణను తక్కువగా చేసి చూపడానికి ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని లోధి చెప్పారు. ఏప్రిల్ 8న లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 300మందికిపైగా చనిపోయారు. కాల్పుల విరమణలో లెబనాన్ భాగం కాదని ఇజ్రాయెల్ అంటోంది.

”దీనిపై పాకిస్తాన్ అధికారుల్లో చాలా ఆందోళన ఉంది. ఇజ్రాయెల్‌ను నియంత్రించాల్సిన బాధ్యత ట్రంప్‌పైనే ఉంది” అని చౌధురి అన్నారు.

శాంతిని పెంపొందించేందుకు పాకిస్తాన్ ఇప్పటికే తనవంతు ప్రయత్నాలు చేస్తోందని దుర్రానీ అన్నారు. ”మధ్యవర్తిగా, చర్చలకు అనువైన వాతావరణం కల్పించే దిశగా మన పని గుర్రాన్ని నీళ్ల దగ్గరికి తీసుకెళ్లడం. కానీ మనం గుర్రాన్ని నీళ్లుతాగించలేం. పాకిస్తాన్ కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఆ వర్గాలది” అని దురానీ విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)