SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Annapurna Studios/FB
అడివి శేష్ సినిమాలకి మంచి బజ్ ఉంది. క్షణం, హిట్ 2, మేజర్ సినిమాల తరువాత బాగా గ్యాప్ తీసుకుని డెకాయిట్‌గా వచ్చాడు. మరి మళ్లీ హిట్ పడిందా లేదా?
కథ ఏమంటే,
హరిదాస్ (అడివి శేష్) హిందూపురంలో ఉంటాడు. దళితుడైన హీరో జూలియట్ అలియాస్ సరస్వతి (మృణాల్ ఠాకూర్) ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆమె అన్నకి ఇది ఇష్టం లేదు.
హరి, సరస్వతి ఏకాంతంగా ఉండగా స్నేహితులతో వచ్చి అతనిపై దాడి చేస్తాడు ఆమె అన్న. ఈ సంఘటనలో హీరో 13 ఏళ్లు జైలుకెళతాడు. సరస్వతి అబద్ధపు సాక్ష్యం చెబుతుంది.
13 ఏళ్ల తరువాత కరోనా టైంలో హరి జైలు నుంచి పారిపోతాడు. దుబయ్ పారిపోవడం, సరస్వతి మీద పగ తీర్చుకోవడం అతని లక్ష్యం. దుబయ్ వెళ్లాలంటే డబ్బు కావాలి.
సరస్వతికి పెళ్లై కూతురు ఉంటుంది. భర్త ఆస్పత్రిలో ఉంటాడు. ఆస్పత్రి ఫీజులకి డబ్బులు కావాలి. ఆస్పత్రిలో డబ్బు దోపిడీ చేసి సరస్వతిని కేసులో ఇరికించాలని హరి అనుకుంటాడు. అతనికి డ్రైవింగ్ రాదు కాబట్టి సరస్వతి సాయం కోరతాడు. డబ్బు కోసం దోపిడీకి ఒప్పుకుంటుంది. హరి కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు.
దోపిడీ జరిగిందా? సరస్వతి కష్టాలు తీరాయా? ఆమె ఎందుకు అబద్ధపు సాక్ష్యం చెప్పింది? ఇది మిగతా కథ.

ఫొటో సోర్స్, Annapurna studios/Sony music South/YT
ఈ సినిమాకి ఒక ప్రేమకథ అని ట్యాగ్‌లైన్‌పెట్టారు. అయితే ప్రేమ, నేరం రెండూ సరిగ్గా వర్కౌట్ కాలేదని అనిపిస్తుంది.
అడివి శేష్ సినిమాల్లో సహజంగా ఉండే బిగువైన కథనం మిస్సయ్యింది.
దర్శకుడు షానిల్ ధియోతో పాటు అడివి శేష్ కూడా స్క్రీన్‌ప్లే రాశారు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఎస్టాబ్లిష్ కావడానికి మొదటి 15 నిమిషాలు పట్టింది.
ఆ తరువాత హీరోయిన్‌కి పెళ్లై, తల్లిగా అనేక కష్టాల్లో ఉంటుంది. హీరోకి పగ, ప్రతీకారాలు ఉంటాయి. వాళ్ల మధ్య ప్రేమని క్లైమాక్స్‌లో తప్ప ఇంకెక్కడా ప్రేక్షకులు ఫీల్ అవ్వరు. ఇది పెద్ద లోపం.
ప్రేమకి అడ్డుపడిన దళిత వాదం కూడా ఎక్కడా ఎస్టాబ్లిష్ కాలేదు. వీళ్లని విడదీసే అన్న క్యారెక్టర్ అసలు రిజిస్టరే కాదు. అతనెవరో కూడా ప్రేక్షకులకి గుర్తుండదు. సెకండాఫ్‌లో రెండు ట్విస్ట్‌లు బావున్నాయి.
కాకపోతే, అడివి శేష్ గత సినిమాల స్టాండర్డ్ అందుకోలేక పోయింది. దీనికి కారణం కథ, కథనంలోని గందరగోళం. చాలా మంచి నటులున్నప్పటికీ ఒక్కరికీ సరైన స్క్రీన్ స్పేస్ లేదు. పాత్ర చిత్రణ అసలు లేదు. ఉన్నంతలో ఇన్‌స్పెక్టర్‌గా వేసిన అనురాగ్ కశ్యప్ బెటర్.
ప్రకాష్‌రాజ్ ఎంట్రీతో కథ మారిపోతుందనుకుంటాం. అయితే, ఆయన ఒకటి రెండు సీన్స్‌లో హడావుడిగా కనిపించి మాయమయ్యాడు. కరోనా టైంలో మెడికల్ మాఫియా నడుపుతున్న ఆయనకి ఒకటి రెండు మంచి సీన్స్ కూడా లేకపోవడం ఆశ్చర్యం.
ఫొటో సోర్స్, Annapurna studios/Sony music South/YT
ఇన్‌స్పెక్టర్‌గా వేసిన అనురాగ్ కశ్యప్ చాలా బాగా చేశాడు.
ఆయన కూతురుగా వేసిన జైన్ మేరీఖాన్‌కి నటించడానికి ఏమీ లేదు.
సునీల్, జెన్నీ, జరీనావహబ్, అతుల్ కులకర్ణి మంచి నటులే అయినా దర్శకుడు వాళ్లని వాడుకోలేదు. సినిమా అంతా హీరో హీరోయిన్ల మధ్యనే నడుస్తుంది.
అడివి శేష్ ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించినా రాయలసీమ యాస అతకలేదు.
హిందూపురంలో కథ నడిచినా ఆ యాస పుష్పలో ఉన్నట్టు చిత్తూరు స్టయిల్‌లో నడుస్తుంది. హీరో దళితుడని గ్రహించడానికి ప్రేక్షకుడికి చాలా టైం పడుతుంది. జైలు నుంచి పెద్ద యాక్షన్ సీన్‌లో పారిపోయిన హీరో వెంటనే ఐటం సాంగ్‌లో స్టెప్స్ వేయడం ఎబ్బెట్టుగా ఉంది.
మృణాల్ ఠాకూర్ గొప్ప నటి. పాత్ర పరిధి మేరకే చాలా బాగా నటించింది. ఆ క్యారెక్టర్‌లోనే గందరగోళం, తికమక ఉండడంతో ఆమె అలా ఎందుకుంటుందో అర్ధంకాదు.
సినిమాకి బలం కెమెరా. ధనుష్ భాస్కర్ ఫోటోగ్రఫి ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ఫ్రేమ్ ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
భీమ్స్ సంగీతంలో ఒక పాట బావుంది. గ్యాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్‌కి బీజీఎం ప్రాణం పోసింది. నిర్మాత సుప్రియా యార్లగడ్డ ఖర్చుకి వెనకాడలేదు.
షానిల్ డెమో మేకింగ్ కొత్తగా ఉన్నా, కథ పాతది, ప్రిడిక్టబుల్. క్లైమాక్స్ షోలేని గుర్తుకు తెస్తే మన తప్పుకాదు. అబ్బూరి రవి డైలాగ్‌లు జస్ట్ ఓకే.
ఫొటో సోర్స్, Annapurna studios/Sony music South/YT
ప్లస్ పాయింట్స్
1) అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటన
2) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
3) కెమెరా
మైనస్ పాయింట్స్
1) కథ, కథనం
2) సెకండాఫ్‌లో తొలి అరగంట
3) పెద్ద నటులను కూడా వాడుకోలేకపోవడం
ఫైనల్‌గా డెకాయిట్‌లో ఒకటి తగ్గింది. అది ఎమోషన్. ప్రేమకథలో ప్రేమ, యాక్షన్ ఉడికీ ఉడకని కిచిడీలా ఉంది.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



