SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, UGC
(గమనిక:ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)
తనతో పెళ్లికి నిరాకరించిందని, మరదలు వరుస అయ్యే యువతికి ఓ యువకుడు హెచ్ఐవీ సోకిన తన రక్తాన్ని ఎక్కించిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది. బాధిత యువతి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.
ఈ మొత్తం ఘటనపై హైదరాబాద్ శివార్లలోని ఓ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది, దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సదరు యువకుడు జైలులో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
”ఇంజెక్షన్ ఎక్కించినప్పట్నుంచి యువతి తీవ్ర మనస్థాపంతో ఉంది. ఈ ఘటనతో డిప్రెషన్ కారణంగా ఆత్మహ్య చేసుకున్నట్లు మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది” అని కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్ కె.కనకయ్య బీబీసీతో చెప్పారు.
ఈ ఏడాది మార్చి 11న యువతికి సదరు యవకుడు హెచ్ఐవీ రక్తాన్ని ఇంజెక్ట్ చేసినట్లుగా పోలీసులు చెప్పారు.
తమ కుమార్తె తీవ్ర ఒత్తిడి కారణంగా మనస్థాపంతో ఉన్నట్లు గమనించి అప్పట్నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నామని యువతి తండ్రి చెప్పారు.
”ఏప్రిల్ 10, శుక్రవారం పనిమీద బయటకు వెళ్లాం. ఆ సమయంలో మా అమ్మాయి ఒక్కటే ఉంది. తిరిగి వచ్చి చూసేసరికి ఆత్మహత్య చేసుకుని ఉంది” అని యువతి తండ్రి మీడియాతో చెప్పారు.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ శివార్లలోని ఓ కాలనీకి చెందిన 20ల వయసులో ఉన్న యువతీయువకులకు వివాహం చేయాలని కొన్ని నెలల కిందట రెండు కుటుంబాలు నిర్ణయించాయి.
వారిద్దరూ బావ, మరదళ్లు అవుతారు.
తండ్రి చనిపోవడంతో యువకుడు తన తల్లితో కలిసి ఉంటున్నారు. వారు పాతికేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. యువకుడు ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు.
“అతని తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉండటంతో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆరు నెలల క్రితం యువతి తల్లిదండ్రులు యువకుడికి టెస్టులు చేయించారు. ఉప్పల్‌లోని ఓ ల్యాబ్‌లో టెస్టులు చేయించగా యువకుడికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. పెళ్లిని రద్దు చేసుకున్నాం” అని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివాహం రద్దు కావడంతో, అప్పటి నుంచి ఆ యువకుడు పగ పెంచుకున్నారని నగర శివార్లలోని ఓ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ భాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
“ఆ అమ్మాయి తనకే దక్కాలన్న ఉద్దేశంతో ఆ యువకుడు తన రక్తాన్ని యువతికి ఎక్కించినట్లు మా విచారణలో తేలింది. హెచ్ఐవీ రక్తం ఎక్కించడం వల్ల ఇకపై వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయరని భావించాడు” అని ఎస్ఐ వివరించారు.
‘బలవంతంగా ఇంట్లోకి వచ్చి…’
మార్చి 11న ఈ ఘటన జరిగిందని యువతి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
“ఆరోజు సాయంత్రం పూలు అమ్ముకోవడానికి మార్కెట్‌కు వెళ్లాం. ఆ సమయంలో ఇంట్లో నా కూతురు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన యువకుడు ఇంట్లోకి వెళ్లి, మరోసారి పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, మా అమ్మాయి నిరాకరించింది. దీంతో తనతో తీసుకువచ్చిన ఎర్రరంగు లిక్విడ్ ఉన్న ఇంజెక్షన్ బలవంతంగా నా కుమార్తె చేతికి ఎక్కించాడు” అని యువతి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
యువతి భయపడి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టినట్లు పోలీసులు చెప్పారు.
రెండు రోజుల తర్వాత యువతికి జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. ఆ సమయంలో డాక్టర్ ప్రశ్నించడంతో యువతి అసలు విషయం బయటపెట్టినట్లు ఆమె తండ్రి పోలీసులకు చెప్పారు.
“హెచ్ఐవీతో కూడిన ప్రమాదకర రక్తాన్ని ఎక్కించి, తన కుమార్తెపై హత్యాయత్నం చేసిన ఆ యువకుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి” అని ఆమె తండ్రి చేసిన ఫిర్యాదులో పోలీసులు పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘ఎయిడ్స్ ఉందని యువకుడికి ముందే తెలుసు’
మార్చి 13, సాయంత్రం తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆ యువకుడిని అరెస్ట్ చేసి, రిమాండుకు పంపించామని ఎస్ఐ విజయభాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
“అతనికి ఎయిడ్స్ ఎలా సోకిందన్న విషయంపైనా విచారణ చేస్తున్నాం. పుట్టినప్పట్నుంచి ఉందని కొన్నిసార్లు, తర్వాత సోకిందని కొన్నిసార్లు చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తున్నాం” అని పోలీసులు చెప్పారు.
అయితే, తనకు ఎయిడ్స్ ఉందని తెలిసినప్పటికీ.. పెళ్లి చేసుకునేందుకు యువకుడు సిద్ధమయ్యారని విజయభాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
రక్త పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవీ నెగిటివ్ వచ్చిందని, రెండు నెలల తర్వాత మరోసారి టెస్టులు చేస్తే స్పష్టత వస్తుందని వైద్యులు చెప్పినట్లు కేసు నమోదైన సమయంలో విజయభాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఆ సమయంలోనే, యువకుడి తల్లితో మాట్లాడేందుకు బీబీసీ మూడుసార్లు ఫోన్ ద్వారా ప్రయత్నించింది. కానీ, ఆమె ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. వారి ఇంటికి కూడా తాళం వేసి ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
తనకు మాత్రమే దక్కాలన్న స్వార్థంతో కూడిన వ్యక్తిత్వం డీవియెంట్ బిహేవియర్ కిందకు వస్తుందని చెప్పారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ మీనా హరిహరన్.
“తనకు దక్కకపోతే వేరొకరికి కూడా దక్కకూడదన్న స్వార్థం ఈ ఘటనలో కనిపిస్తోంది. వ్యక్తిగత స్వార్థంతో కూడిన ప్రవర్తనతో మనిషి ఈ విధంగా ప్రవర్తిస్తాడు” అని వివరించారు.
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



