Home LATEST NEWS telugu తాజా వార్తలు ఇరాన్ – అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏమన్నారు?

ఇరాన్ – అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏమన్నారు?

6
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, కాల్పుల విరమణ

ఫొటో సోర్స్, EPA

8 ఏప్రిల్ 2026, 06:41 IST

అప్‌డేట్ అయ్యింది 6 గంటలు క్రితం

చదివే సమయం: 5 నిమిషాలు

హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు ఇరాన్ అంగీకరిస్తే ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఉంటుందని డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో సాగిన చర్చల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

“ఇరాన్‌పై బాంబు దాడులు, ఇతర అన్ని రకాల దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి నేను అంగీకరిస్తున్నా” అని ట్రంప్ చెప్పారు.

‘హార్ముజ్ జలసంధిని తక్షణమే, సురక్షిత రీతిలో పూర్తిగా తెరవడానికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంగీకరిస్తేనే’ తాను ఈ రెండు వారాల కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటానని ట్రంప్ స్పష్టం చేశారు.

తామిప్పటికే అనుకున్న సైనిక లక్ష్యాలను, అంతకుమించిన విజయాన్ని సాధించామని అందుకే తాత్కాలిక కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ట్రంప్ ఏమన్నారు?

ఇది ప్రపంచ శాంతికి ఒక గొప్పరోజని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు. ”ప్రపంచ శాంతి విషయంలో ఇది చాలా కీలకమైన రోజు” అని ట్రంప్ ఆ పోస్టులో రాశారు.

“ఇది జరగాలని ఇరాన్ కోరుకుంది. వాళ్లిప్పటికే చాలా భరించారు. ప్రతిఒక్కరికీ ఇక చాలనిపించింది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

హార్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ పెంచడానికి అమెరికా సాయం చేస్తుందన్నారు. చాలా సానుకూల పరిణామాలుంటాయని తెలిపారు.

“భారీ స్థాయిలో ఆర్థిక లాభాలు అందుతాయి. ఇరాన్ పునర్నిర్మాణం ప్రారంభించగలదు. మేం అవసరమైనవన్నీ పంపి పరిస్థితులన్నీ బాగుండేలా చూస్తాం. అంతా బాగవుతుందన్న విశ్వాసముంది. అమెరికాలో మేం అనుభూతి చెందుతున్నట్టుగా మిడిల్ ఈస్ట్‌ బంగారు యుగంలోకి వెళ్లొచ్చు” అని తన పోస్టులో ట్రంప్ తెలిపారు.

ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అమెరికా పూర్తి స్థాయిలో మొత్తం విజయం సాధించిందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఒప్పందం కింద ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి యురేనియం ‘‘పూర్తి సురక్షితంగా’’ ఉంటుందని లేకపోతే తాను ఈ ఒప్పందానికి అంగీకరించేవాణ్ని కాదని వార్తాసంస్థ ఏఎఫ్‌పీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ యురేనియంను తర్వాతేం చేయబోతున్నారనేదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

ఒప్పందం విఫలమైతే ముందు బెదిరించినట్టు ఇరాన్ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలను ధ్వంసం చేస్తారా అన్న ప్రశ్నకు ‘‘ఏం జరుగుతుందో మీరు చూస్తారు’’ అని సమాధానమిచ్చారు.

చర్చల్లో చైనా సాయం చేసిందా అన్న ప్రశ్నకు ‘‘అవుననిపిస్తోంది’’ అని ట్రంప్ సమాధానమిచ్చారు.

పాకిస్తాన్ ప్రస్తావన..

ఇరాన్‌తో కుదిరిన ఈ షరతులతో కూడిన కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తాను పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు.

దీంతో పాటు ఆయన తన ట్రూత్ సోషల్‌లో చేసిన ఓ పోస్ట్‌లో.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పేరునూ ప్రస్తావించారు.

తాము విధించిన డెడ్‌లైన్ ముగిసిన తరువాత చేయబోయే విధ్వంసకర దాడులను నిలిపివేయాల్సిందిగా షరీఫ్, మునీర్‌లు తనను కోరినట్లు ట్రంప్ వెల్లడించారు.

ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, IRINN

ట్రంప్ వెనక్కి తగ్గారు: ఇరాన్ మీడియా

డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌ అనంతరం ఇరాన్ ప్రభుత్వ మీడియా దీనికి సంబంధించి కథనాలు ప్రసారం చేసింది.

యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ షరతులను అంగీకరిస్తూ ట్రంప్ రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించారని వెల్లడించింది.

ఇరాన్ వ్యతిరేక వాదనల నుంచి ట్రంప్ అవమానకరంగా వెనక్కి తగ్గారు అని ఆ మీడియాతో తన కథనాల్లో పేర్కొంది.

ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనం ప్రకారం పది పాయింట్ల ప్రణాళిక

  • ఇరాక్, లెబనాన్, యెమెన్‌లపై జరుగుతున్న యుద్ధాన్ని పూర్తిగా నిలిపేయాలి.
  • ఎలాంటి కాలపరిమితి లేకుండా ఇరాన్‌పై యుద్ధాన్ని పూర్తిగా, శాశ్వతంగా నిలిపివేయాలి.
  • ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఘర్షణలకు ముగింపు పలకాలి.
  • హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం
  • హార్ముజ్ జలసంధిలో నౌకాయానానికి స్వేచ్ఛ, భద్రత ఉండేలా నిబంధనలు, ప్రోటోకాల్ ఏర్పాటుచేయాలి.
  • ఇరాన్ పునర్నిర్మాణ ఖర్చుల కోసం పూర్తి నష్టపరిహారం అందించాలి.
  • ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేతలో పూర్తి నిబద్ధత పాటించాలి.
  • ఇరాన్ నిధులు, ఆస్తులపై ఉన్న జప్తును అమెరికా తొలగించాలి.
  • అణ్వాయుధాలు పొందడానికి ప్రయత్నించబోమని హామీ
  • పై నిబంధనలు అన్నీ ఆమోదించిన వెంటనే అన్ని ప్రాంతాల్లో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలి.
ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

కాల్పుల విరమణకు, హార్ముజ్ జలసంధి తెరవడానికి ఇరాన్ అంగీకారం

ఇరాన్‌పై దాడులు ఆపితే కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆ దేశ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు.

రెండు వారాలపాటు హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల సురక్షిత ప్రయాణానికి అవకాశం ఉందన్నారు.

ఇరాన్ సాయుధ బలగాల సమన్వయం, సాంకేతిక పరిమితులను పరిగణనలోకి తీసుకుని ఇది అమలవుతుందని ఆయన తెలిపారు.

ఇస్లామాబాద్‌లో అమెరికాతో చర్చలు జరుగుతాయని ఇరాన్ సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది.

మరోవైపు, కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.

‘‘ఇస్తామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, అమెరికా, దాని మిత్రపక్షాలు లెబనాన్ సహా ప్రతిచోటా తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని నేను ప్రకటిస్తున్నా’’ అని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.

‘‘అన్ని వివాదాల తుది పరిష్కారం కోసం మరిన్ని చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాలను ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌కు రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు.

ఇరాన్, అమెరికా, ట్రంప్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్ ఏం చెప్పింది?

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటన వెలువడ్డ కాసేపటికే ఇజ్రాయెల్‌లో సైరన్ శబ్దాలు వినిపించాయి. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.

”ఇరాన్‌ తక్షణమే హార్ముజ్ జలసంధిని తెరిస్తే.. అమెరికా, ఇజ్రాయెల్, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలపై అన్ని దాడులు నిలిపివేస్తే.. ఇరాన్‌పై రెండు వారాల పాటు దాడులు నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతిస్తోంది” అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.

కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని ఆ ప్రకటనలో తెలిపారు.

ట్రంప్ నిర్ణయంలో నెతన్యాహు భాగస్వామ్యమెంత అనేదానిపై స్పష్టత లేదు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

తర్వాతేం జరగనుంది?

అన్ని వివాదాల పరిష్కారానికి, తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు తదుపరి చర్చల కోసం శుక్రవారం ఇస్లామాబాద్ రావాలని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ఆహ్వానించింది.

చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ చెప్పారు. అధ్యక్షుడు లేదా వైట్ హౌస్ ప్రకటించేవరకు ఏదీ ఫైనల్ కాదని అన్నారు.

చర్చలు ఏ రూపంలో జరిగినా అవి చాలా కష్టంగా ఉండనున్నాయి.

ఇప్పటికే కాల్పుల విరమణ గురించి రెండు దేశాలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది అమెరికా, ఇరాన్ మధ్య రెండుసార్లు చర్చలు జరిగాయి. చర్చల మధ్యలోనే రెండుసార్లు రెండు వైపులా సైనిక ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS