Home జాతీయ national telgu కేరళ అసెంబ్లీ ఎన్నికలు: ‘బీజేపీ రహస్య పొత్తు’ ఎవరితో? కమ్యూనిస్ట్‌లతోనా? కాంగ్రెస్‌తోనా?.. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ రెండూ...

కేరళ అసెంబ్లీ ఎన్నికలు: ‘బీజేపీ రహస్య పొత్తు’ ఎవరితో? కమ్యూనిస్ట్‌లతోనా? కాంగ్రెస్‌తోనా?.. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ రెండూ ఒకే ఆరోపణ చేస్తున్నాయెందుకు?

7
0

SOURCE :- BBC NEWS

రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ, పినరయి విజయన్

ఫొటో సోర్స్, Getty Images

కేరళ శాసనసభ ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు పార్టీల మధ్యే పోటీ ఉండేది.

అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గత పదేళ్లుగా కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐ(ఎం)) నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మాత్రమే కాకుండా… ఈసారి బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఎ) కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల బరిలో దిగింది.

కాంగ్రెస్‌ను ఓడించేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), బీజేపీ మధ్య ‘రహస్య పొత్తు’ కుదిరిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

కేరళలో బీజేపీకి విజయం దక్కినప్పుడల్లా అది కాంగ్రెస్ పరోక్ష అంగీకారంతోనే జరిగిందని, కాంగ్రెస్ చేసిన ఎన్నికల హామీలను నెరవేర్చడం సాధ్యం కాదని సీపీఎం కోఆర్డినేటర్ విజయ్ రాఘవన్ బీబీసీతో అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ కేరళకు వచ్చి ప్రచారం చేస్తున్నప్పటికీ, బీజేపీ కేవలం 30 సీట్లపైనే దృష్టి సారిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్ అన్నారు.

త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

పినరయి విజయన్

ఫొటో సోర్స్, ANI

పినరయి విజయన్‌కోసం నిబంధనల సడలింపు

కేరళ శాసనసభ ఎన్నికలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.

తుది ఓటర్ల జాబితా ప్రకారం, 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళ రాష్ట్రంలో సుమారు 2.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఏ నాయకుడూ ముఖ్యమంత్రి పదవిలో రెండు పర్యాయాల కన్నా ఎక్కువ కాలం కొనసాగకూడదనే భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) నిబంధనను ఈసారి సడలించారు.

ఈ కారణంగానే పినరయి విజయన్, మాజీ మంత్రి శైలజ సహా పలువురు నేతలకు మూడోసారి పోటీ చేసే అవకాశం కల్పించారు. అంతేకాకుండా పినరయి విజయన్‌ను మూడోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు.

సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా.. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ‘పుథుయుగ యాత్ర'(నవయుగ యాత్ర) చేపట్టి కేరళలో ప్రచారం చేశారు.

ఈ ప్రచారంలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల త్రిసూర్‌లో రోడ్ షోలో పాల్గొన్న అనంతరం పాలక్కాడ్ , తిరువనంతపురంలోనూ ప్రచారం చేశారు.

దీంతో కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి.

సాధారణంగా కేరళ ఎన్నికలలో రెండు పార్టీల మధ్యే పోటీ ఉండేది. కానీ ఈసారి ఎన్నికలను మొదటిసారిగా ‘త్రిముఖ పోటీ’ అని పిలవవచ్చని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్ అంటున్నారు.

అయితే అటువంటి పోటీ కేవలం 30 స్థానాల్లో మాత్రమే ఉందని, మిగిలిన స్థానాల్లో పోటీ ఇప్పటికీ రెండు పార్టీల మధ్యే ఉందన్నది ఆయన అభిప్రాయం.

“గడచిన పదేళ్లుగా కేరళలో బీజేపీ క్రమంగా బలపడింది. త్రిసూర్ లోకసభ స్థానం నుండి నటుడు సురేష్ గోపి విజయం సాధించారు. ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను కుడా బీజేపీ కైవసం చేసుకుంది. 2024 లోకసభ ఎన్నికల్లో ఓట్ల శాతం పరంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, మరికొన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అందుకే బీజేపీ ఈసారి 30 సీట్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది” అని ప్రదీప్ కుమార్ బీబీసీతో అన్నారు.

పోటీ త్రిముఖంగా ఉన్నప్పటికీ, కేరళ ఎన్నికలలో గెలుపు ఓటములు కేవలం ఐదు అంశాలపైనే ఆధారపడి ఉంటాయని కేరళ జర్నలిస్ట్ ప్రమోద్ గోపు అంటున్నారు.

అవి… ప్రభుత్వ వ్యతిరేకత, బీజేపీ ఓటు బ్యాంకు ప్రభావం, ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న మలయాళీలు ఎదుర్కొంటున్న సమస్యలు, మైనారిటీ ఓట్లు, ఎన్నికల హామీలు అని ఆయన చెప్పారు.

“లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) మొదటి ఐదేళ్ల పాలన చాలా బాగుంది. కోవిడ్ మహమ్మారి, వరదల వంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం మెరుగ్గా పనిచేసింది, అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. కానీ గత ఐదేళ్లలో ఎటువంటి పెద్ద అభివృద్ధి పథకాలు కనిపించలేదు, పైగా అవినీతి ఆరోపణలు రావడం, అప్పుల భారం పెరగడంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది” అని ప్రమోద్ అన్నారు.

“లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కేంద్రంగా చేసుకుని ఎన్నికల్లో పోరాడుతోందని, మరోవైపు యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) తన పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ అభ్యర్థుల వ్యక్తిగత బలానికి ప్రాధాన్యం ఇస్తోంది’ అని కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక కథనంలో ‘ఫ్రంట్‌లైన్’ పత్రిక రాసింది.

బీజేపీ తన హిందూత్వ మద్దతుదారుల పరిధిని దాటి పోరాడటానికి ప్రయత్నిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, భౌగోళిక రాజకీయ పరిణామాలు, స్థానిక సమస్యల ప్రభావం వంటి సవాళ్లను అన్ని పార్టీలు ఎదుర్కొంటున్నాయి.

కేరళలో నిరంతరం పర్యటించి, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కలిసిన తర్వాతే తాను ఈ వ్యాసం రాశానని సీనియర్ జర్నలిస్ట్ ఆర్.కె. రాధాకృష్ణన్ అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ కేరళ ఎన్నికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

మైనారిటీ ఓట్లు, గల్ఫ్‌లో కొనసాగుతున్న సంఘర్షణ వల్ల తలెత్తే పరిస్థితి ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని రాధాకృష్ణన్ అన్నారు.

“గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అధికార పార్టీకి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని సూచించాయి. వీటిని బట్టి చూస్తే కాంగ్రెస్ బలపడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, పార్టీలోని అంతర్గత కలహాలు దాన్ని బలహీనపరుస్తున్నాయి” అని ఆయన అన్నారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా , బీజేపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ , నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ , కాంగ్రెస్‌, పినరయి విజయన్

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధం, ప్రపంచ రాజకీయాల ప్రభావం

కేరళకు చెందిన లక్షలాది మంది గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారు.

ప్రవాస కేరళీయుల కోసం ‘నోర్కా’ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్-రెసిడెంట్ కేరళైట్స్ అఫైర్స్) అనే ప్రత్యేక విభాగం కూడా పనిచేస్తుంది.

విదేశాలలో నివసిస్తున్న సుమారు 30 లక్షల మంది మలయాళీలలో అధిక సంఖ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పనిచేస్తున్నట్టు రాధాకృష్ణన్ చెప్పారు.

అక్కడ ఇరాన్ జరుపుతున్న దాడుల కారణంగా కేరళ ప్రజలలో ప్రాణ, ఆస్తి భద్రతపై ఆందోళన, భారీ స్థాయిలో ఉపాధి కోల్పోతామనే భయం పెరిగాయి.

“కేరళ 90 శాతానికి పైగా అక్షరాస్యత ఉన్న రాష్ట్రం. అక్కడి ప్రజలకు ప్రపంచ రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. విదేశాలపై ఆధారపడిన ఈ 30 లక్షల మందిలో, సుమారు 10 లక్షల మంది ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. వారి కుటుంబాల ఓట్లు కూడా వారి ఆలోచనా విధానాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది గెలుపును నిర్ణయించే ఏకైక కారణం కాకపోయినప్పటికీ, దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఈ ఎన్నికలలో ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఇది బీజేపీని వెనక్కి నెట్టే కారణం కావచ్చు” అని రాధాకృష్ణన్ అంటున్నారు.

అయితే, గత పదేళ్లలో కేరళలో బీజేపీ క్రమంగా ఎదిగిందని, కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 30 సీట్లను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుందని కేరళ సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్ అంటున్నారు.

తిరువనంతపురంలోని మూడు సీట్లు, పాలక్కాడ్, కాసరగోడ్, త్రిసూర్ జిల్లాల్లో ఒక్కో సీటు చొప్పున మొత్తం మూడు నుంచి ఆరు సీట్లలో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉందని ఆయనంటున్నారు.

“కేరళలో బీజేపీ మద్దతుదారులు రెండు వర్గాలుగా ఉన్నారు – మోదీకి కరడు కట్టిన మద్దతుదారులు, స్థానిక సమస్యల కోసం పోరాడేవారు” అని ప్రదీప్ కుమార్ అన్నారు.

కేరళ జనాభాలో కీలకమైన హిందూ ఈళవ సామాజికవర్గ సంస్థ కూడా బీజేపీ కూటమిలో చేరిందని ఆయన తెలిపారు.

ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కు మద్దతు ఇచ్చిన ఈళవ సమాజం, ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) ద్వారా బీజేపీకి మద్దతు ఇచ్చిన వారు ఇప్పుడు నేరుగా ఆ పార్టీలో చేరుతున్నారు.

ఈ ఎన్నికల్లో అధికార వామపక్ష కూటమిపై ఉన్న వ్యతిరేకత కంటే ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వ శైలిపైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయని ప్రదీప్ కుమార్ అంటున్నారు.

పార్టీలో రెండో శ్రేణి నాయకులను ఎదగనివ్వకపోవడం, ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్య మంత్రిగా అద్భుతంగా పనిచేసిన శైలజ ఎన్నికల్లో ఓటమి పాలుకావడం వెనుక పినరయి విజయన్ పాత్ర ఉందనే అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాష్ట్ర కోఆర్డినేటర్ విజయ్ రాఘవన్ ఈ ఆరోపణలను తిరస్కరించారు.

“పినరయి విజయన్ సీపీఎంకు కీలకం. అందుకే ఆయన మరింత తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. కేరళలో త్రిముఖ పోటీ అనే ఆలోచన తప్పు. త్రిసూర్‌లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగింది మళ్లీ జరగదు. అక్కడ బీజేపీ కాంగ్రెస్ సహాయంతో గెలిచింది. ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీ ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య మాత్రమే ఉంది” అని ఆయన అన్నారు.

ఇటీవల కేరళలో ప్రచారం చేసిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “కేరళలో, సీపీఎం బీజేపీతో పొత్తు పెట్టుకుని సీజేపీని ఏర్పాటు చేసింది. నాపై 36 కేసులు నమోదయ్యాయి, కానీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై ఉన్న ప్రధాన కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయడం లేదు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం గురించి కేరళ ప్రజలకు తెలుసు” అని అన్నారు.

దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, “బీజేపీతో సీపీఎం కుమ్మక్కైందని వారు ఏ ప్రాతిపదికన ఆరోపిస్తున్నారు? లేదా మా ముఖ్యమంత్రిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని వారు కోరుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.

“కేరళలో ఎక్కడైనా బీజేపీ గెలిచిందంటే, దాని వెనుక కాంగ్రెస్ ఉందనే అర్థం” అని విజయ్ రాఘవన్ అన్నారు.

విజయ్ రాఘవన్ భార్య బిందు ప్రస్తుతం కేరళ ప్రభుత్వంలో ఉన్నత విద్య, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా , బీజేపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ , నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ , కాంగ్రెస్‌, పినరయి విజయన్

ఫొటో సోర్స్, Getty Images

మైనారిటీలు ఎటు?

కేరళలో ఎన్నికలలో పోటీ చేస్తున్న మూడు కూటములలో, లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ మాత్రమే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.

యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ , నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ రెండూ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

అయితే, కేరళ ప్రజలకు సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై పెద్దగా ఆసక్తి ఉండదని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్ అంటున్నారు.

“కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, ముఖ్యమంత్రి ఎవరు అనే నిర్ణయాన్ని ఎన్నికల తర్వాత జాతీయ నాయకత్వం తీసుకుంటుంది. కేరళ కాంగ్రెస్‌లో సతీషన్, రమేష్ చెన్నితాలతో సహా ముఖ్యమంత్రి అయ్యే సామర్థ్యం ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి, ప్రత్యర్థి శిబిరంలో వ్యక్తిగత ప్రాధాన్య రాజకీయాలు ప్రబలంగా ఉన్నాయి” అని కాంగ్రెస్ పార్టీ పాలక్కాడ్ లోక్‌సభ ఎంపీ శ్రీకాంతన్ బీబీసీకి చెప్పారు.

పినరయి విజయన్‌పై అసంతృప్తి ఉన్నప్పటికీ, పార్టీలోని కింది స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రజల్లో కలిసి పనిచేస్తున్నందువల్లే పార్టీపై నమ్మకం ఇంకా నిలిచి ఉందని ప్రదీప్ కుమార్ అంటున్నారు.

“పినరయి విజయన్ కాకుండా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి మరో ముఖం లేదు” అని జర్నలిస్ట్ రాధాకృష్ణన్ అంటున్నారు.

కేరళలోని అధిక సంఖ్యలో ఉన్న మైనారిటీ జనాభా ఓట్లను ఏ కూటమి గెలుచుకుంటుందనేది కూడా ఈ ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయించే ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నారు.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ సహా చాలా ఇస్లామిక్ పార్టీలు, సంస్థలు యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు మద్దతు ఇస్తున్నాయని కేరళ జర్నలిస్ట్ అమీర్ అంటున్నారు.

“గతంలో మార్క్సిస్ట్ పార్టీకి మద్దతుగా ఉన్న హిందూ ఈళవ సామాజిక వర్గం ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. ఆ ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకునే క్రమంలో సీపీఎం నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని నొప్పించాయని, అందుకే ముస్లిం ఓట్లు పెద్ద ఎత్తున యూడీఎఫ్ వైపు వెళ్లే అవకాశం ఉంది” అని అమీర్ వివరించారు.

కేరళ జనాభాలో 18 శాతానికి పైగా ఉన్న క్రైస్తవ సమాజం ఓట్లు ఎవరికి దక్కుతాయనే ప్రశ్న కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

సైరో మలబార్, లాటిన్ కాథలిక్, సిరియన్ ఆర్థోడాక్స్, సిరియన్ మార్ థోమా, సిఎస్ఐ, పెంటకోస్టల్ వంటి వివిధ క్రైస్తవ శాఖలకు చెందిన ప్రజలు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉన్నారు.

కేరళలోని క్రైస్తవ సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న కాథలిక్ వర్గం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. కానీ వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఉన్న క్రైస్తవ వర్గం బీజేపీకి మద్దతు ఇస్తోంది. ఇస్లామిక్ వ్యాపారవేత్తలతో ఉన్న వ్యాపార పోటీ కారణంగానే తాము బీజేపీతో నిలబడక తప్పడం లేదని వారు చెబుతున్నారు” అని రాధాకృష్ణన్ అన్నారు.

వీటన్నిటితో పాటు మూడు కూటముల ప్రధాన ఎన్నికల హామీలు కూడా ఎన్నికల చర్చకు కేంద్ర బిందువుగా ఉన్నాయి.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ‘ఇందిరా గ్యారంటీ’ పథకాలపై చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రజలు రుణ భారం గురించి కూడా ఆలోచిస్తారని జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్ అంటున్నారు.

త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం లేదని ఆయన అన్నారు.

జర్నలిస్ట్ రాధాకృష్ణన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

2021లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో, సీపీఎం ఒక శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో 62 స్థానాలను గెలుచుకుంది.

అప్పుడు కాంగ్రెస్‌కు కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓట్ల శాతం 35.3 శాతానికి పెరగడంతో, కేరళలోని 20 స్థానాలకు గానూ 14 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది.

అదే సమయంలో 26 శాతం ఓట్లు సాధించిన సీపీఎం, 16.8 శాతం ఓట్లు సాధించిన బీజేపీకి ఒక్కొక్క సీటు మాత్రమే లభించిందని రాధాకృష్ణన్ గుర్తుచేశారు.

“ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ‘ఇందిరా గ్యారెంటీ’నే అసలైన హీరో. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మోదీ ఎన్నిసార్లు ప్రచారానికి వచ్చినా ఫలితం ఉండదు” అని పాలక్కాడ్ ఎంపీ శ్రీకాంతన్ అన్నారు.

అయితే ‘ఇందిరా గ్యారెంటీ’ పేరుతో రాహుల్ గాంధీ చేసిన హామీలను నెరవేర్చడం సాధ్యం కాదని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ కోఆర్డినేటర్ విజయ్ రాఘవన్ అంటున్నారు.

అదే సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ పథకాలన్నీ అమలు చేయగలమని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

“బీజేపీకి ఈ ఎన్నికలు భవిష్యత్తు కోసం వేసుకునే పునాది మాత్రమే. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు ఇది జీవన్మరణ సమస్య. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే కేరళలో ఆ పార్టీ వేగంగా బలహీనపడుతుంది. అదే పరిస్థితి వామపక్ష కూటమికి కూడా ఎదురవుతుంది. ఆ ఖాళీని భర్తీ చేసేందుకు బీజేపీ వేగంగా ప్రయత్నిస్తుంది” అని సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణన్ అన్నారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా , బీజేపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ , నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ , కాంగ్రెస్‌, పినరయి విజయన్

ఫొటో సోర్స్, Getty Images

ఎల్‌డీఎఫ్ 60 హామీలు

గత 10 సంవత్సరాలుగా కేరళను పాలిస్తున్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), తన ఎన్నికల ప్రణాళికలో మొత్తం 60 పథకాలను ప్రకటించింది.

వాటిలో కీలక హామీలు:

  • సామాజిక సంక్షేమ పింఛను రూ. 3,000కి పెంచడం
  • ఐదు లక్షల కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి
  • 60 వేల మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ అవకాశాలు
  • స్కిల్ యూనివర్శిటీ స్థాపన
  • కేఎస్ఆర్టీసీని లాభదాయకంగా మార్చేందుకు సంస్కరణలు
  • మానవులకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణను తగ్గించడానికి చర్యలు
  • ఆశా కార్యకర్తల జీతాలపెంపు
కేరళ అసెంబ్లీ ఎన్నికలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా , బీజేపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ , నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ , కాంగ్రెస్‌, పినరయి విజయన్

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty

కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ‘ఇందిరా గ్యారెంటీ’ పేరుతో ఇప్పటికే ఐదు ప్రధాన హామీలను ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు :

  • కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
  • కళాశాల విద్యార్థినులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం
  • సామాజిక సంక్షేమ పింఛనును రూ. 3,000కి పెంచడం
  • అన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత ‘ఊమెన్ చాందీ’ ఆరోగ్య బీమా
  • వ్యాపారం ప్రారంభించే యువతకు రూ. 5 లక్షల వడ్డీ లేని రుణం
  • వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
  • మత విశ్వాసాలను పరిరక్షించడానికి ప్రత్యేక చట్టాలు
  • ఆశా కార్యకర్తల రోజువారీ వేతనాలను కనీసం రూ. 700 పెంచనున్నారు
  • పుదుచ్చేరి జిప్‌మర్ నమూనాలో ఫీజు లేని ఆసుపత్రులు
కేరళ అసెంబ్లీ ఎన్నికలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా , బీజేపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ , నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ , కాంగ్రెస్‌, పినరయి విజయన్

ఫొటో సోర్స్, BJP

ఎన్డీయే ఎన్నికల ప్రణాళికను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విడుదల చేశారు.

కీలక ప్రణాళికలు:

  • పేద కుటుంబాలకు సంవత్సరానికి రెండు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు
  • రాష్ట్రంలో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు
  • తిరువనంతపురం-కన్నూర్ హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం
  • ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు
  • ముల్లపెరియార్ డ్యామ్ సమస్యపై.. “తమిళనాడుకు నీరు, కేరళకు భద్రత”
  • దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబంలోని మహిళకు నెలకు రూ. 2,500 రీఛార్జ్, దీనిని మందుల దుకాణాలు, కిరాణా దుకాణాలలో ఉపయోగించుకోవచ్చు.
  • శబరిమల, గురువాయూర్‌ సహా అన్ని దేవస్థానాల బోర్డుల పునర్వ్యవస్థీకరణ
  • శబరిమల బంగారంచోరీ కేసులో సీబీఐ దర్యాప్తుకు డెడ్‌లైన్
  • రాష్ట్రంలోని నగరాలను ప్రత్యేక ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రణాళిక

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)