Home జాతీయ national telgu కరీంనగర్: ‘కోట్ల ఆస్తి, ఆడపిల్లల పెళ్లిళ్లకే ఖర్చు అయిపోతుందని చంపేసిన తండ్రి’

కరీంనగర్: ‘కోట్ల ఆస్తి, ఆడపిల్లల పెళ్లిళ్లకే ఖర్చు అయిపోతుందని చంపేసిన తండ్రి’

3
0

SOURCE :- BBC NEWS

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌

ఫొటో సోర్స్, UGC

(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు కలచివేయొచ్చు)

పెళ్లి ఖర్చులు, కట్నం కింద తన ఆస్తి అంతా ఇద్దరు ఆడపిల్లలకే పోతుందని, ఐదేళ్లలోపు వయసున్న కవల పిల్లలను వ్యవసాయ బావిలో తోసేసి హత్య చేసిన ఘటనలో కన్నతండ్రితో పాటు ఆయనకు సహకరించిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ పోలీసులు వెల్లడించారు.

‘ఉన్న ఆస్తి అంతా ఆడపిల్లలకే పోతే, తిరిగి అంత ఆస్తి (సుమారు రూ.2 కోట్లు) సంపాదించడం కష్టం’ అని భావించి పథకం ప్రకారం కవల పిల్లల హత్యలు జరిగాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

అసలేం జరిగింది?

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం (ఏప్రిల్ 6న) మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. 2020లో మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన చుక్క మౌనికతో ఆయనకు వివాహమైంది. 2022లో వారికి కవల ఆడ పిల్లలు (గీతాంశీ, గీతాన్విక) జన్మించారు.

“అయితే, భార్య గర్భవతిగా ఉండగానే తమకు కవల ఆడపిల్లలు పుట్టబోతున్నారన్న విషయం తెలుసుకున్న శ్రీశైలం.. అబార్షన్ చేసుకోవాలని మౌనికపై ఒత్తిడి చేశారు. శ్రీశైలం నిర్ణయాన్ని ఆయన తల్లి, తండ్రి, తమ్ముడు సమర్థించారు. అయితే, అబార్షన్‌కు మౌనిక ఒప్పుకోలేదు. కాన్పులో కవల ఆడపిల్లలు కలగడంతో నిరాశ చెందిన శ్రీశైలం, వారిపట్ల ప్రేమగా ఉండేవారు కాదు. క్రమంగా పిల్లలిద్దరిపై ద్వేషం పెంచుకున్నారు” అని కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.

“మొదటి నుంచి ఆడ పిల్లలంటే శ్రీశైలంకు ఇష్టం లేదు. మగపిల్లలే పుట్టాలని ఆయన కోరుకున్నారు” అని ఈ కేసు విచారణాధికారి, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

కరీంనగర్, కవలల హత్య

ఫొటో సోర్స్, UGC

‘పథకం ప్రకారం హత్య’

శ్రీశైలం – మౌనికల సంసారం అంత సఖ్యతగా సాగలేదని ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఆడపిల్లలు పుట్టారని, తన కూతురును పుట్టింట్లోనే వదిలేశారని, పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిర్చి అత్తారింటికి తిరిగి పంపామని మౌనిక తండ్రి చుక్క రాజమల్లు బీబీసీతో చెప్పారు.

“గర్భం దాల్చిన ఆరో నెలలో స్కానింగ్ రిపోర్టులో కవలలు అని తెలిసిన తర్వాత అబార్షన్ చేయించాలన్నారు. తల్లికి ప్రాణాపాయం ఉంటుందని మేం ఒప్పుకోలేదు. నా మనవరాళ్లకు తల్లిపాలు సరిపోకపోతే పోతపాలు పట్టేందుకు ఒక ఆవును కూడా మాట్లాడాం. అదనపు కట్నం కింద 20 గుంటల భూమి అల్లుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాను. చివరికి ఇలా జరుగుతుందని అనుకోలేదు” అని రాజమల్లు అన్నారు.

అయితే, కవల ఆడపిల్లలే పుట్టబోతున్నారని కుటుంబ సభ్యులకు ముందే ఎలా తెలిసింది? నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధరణ పరీక్షలు జరిగాయా? ప్రెగ్నెన్సీ రెగ్యులర్ చెకప్స్‌లో భాగంగా నిర్వహించిన స్కానింగ్ వివరాల్లో పుట్టబోయేది ఆడ లేదా మగ అన్న వివరాలను ఆసుపత్రి వర్గాలు వెల్లడించకూడదు కదా? అన్న ప్రశ్నలు ఈ కేసులో ఉత్పన్నమవుతున్నాయి.

ఈ అంశాలపై కరీంనగర్ సీపీ గౌస్ ఆలంను బీబీసీ వివరణ కోరగా.. “ఆ దిశగా మా విచారణ కొనసాగుతోంది” అని ఆయన తెలిపారు.

కరీంనగర్, కవలల హత్య

ఫొటో సోర్స్, UGC

ఘటన రోజు ఏం జరిగింది?

పోలీసులు మీడియా సమావేశంలో చెప్పిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 3న కవల పిల్లలు గీతాంశీ, గీతాన్వికలు వారి కుటుంబ వ్యవసాయ బావిలో విగతజీవులుగా కనిపించారు.

ఈ ఘటనకు నాలుగు రోజుల ముందు (మార్చి 30న) పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో బంధువుల ఇంట్లో గ్రామ దేవత ఉత్సవం ఉందని శ్రీశైలంతో పాటు ఆయన తండ్రి కచ్చు అశోక్, తల్లి కచ్చు లావణ్య, తమ్ముడు కచ్చు రాకేశ్‌ వెళ్లారు.

అయితే, పథకం ప్రకారం శ్రీశైలం ఒక్కరే జూబ్లీనగర్‌కు తిరిగి వచ్చారు. తనతో పాటు తెచ్చిన మటన్ (మాంసం) వండాలని భార్య మౌనికకు ఇచ్చారు.

పిల్లలిద్దరూ అల్లరి చేస్తూ వంటపని చేయనివ్వరని, తనతో పొలం వద్దకు తీసుకెళ్తున్నానని, అరగంట తర్వాత పొలానికి రావాలని ఆమెకు చెప్పారు.

మధ్యాహ్నం పూట చుట్టుపక్కల పొలాల్లో రైతులెవరూ లేరని గమనించిన శ్రీశైలం, కూతుళ్లిద్దరినీ వ్యవసాయ బావిలోకి తోసేశారు.

కరీంనగర్, కవలల హత్య

ఫొటో సోర్స్, UGC

‘బతికితే అసలు విషయం తెలిసిపోతుందని’

వ్యవసాయ బావి వద్ద ఏం జరిగిందనే సమాచారాన్ని పోలీసులు బీబీసీకి వివరిస్తూ, “కవలల్లో ఒకరైన గీతాన్విక నీటిలో ఊపిరాడక చనిపోయింది. గీతాంశీ మాత్రం పైకి తేలేందుకు కాళ్లూ చేతులు ఆడిస్తుండటాన్ని తండ్రి శ్రీశైలం పైనుంచి గమనించారు. పాప బతికితే తన నేరం బయటపడుతుందని భావించి, బావిలోకి దిగి ఆమెను కూడా నీటిలో ముంచి హత్య చేశారు.

ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గీతాన్విక మృతదేహంతో పాటు బావిలోని మోటార్ పైపును పట్టుకుని అరుస్తుంటే.. చుట్టుపక్కల రైతులతో పాటు అప్పటికే అక్కడకు వస్తున్న ఆయన భార్య మౌనిక బావి దగ్గరకు వచ్చారు. తాళ్ల సహాయంతో గ్రామస్థులు ఇద్దరినీ పైకి తెచ్చారు.

మరో పాప ఆచూకీ ఎక్కడ అని ఆరా తీస్తే.. తనకు తెలియదని, పొలంలో గడ్డి కోసుకుని తిరిగి వచ్చేసరికి పిల్లలు కనిపించలేదని, అనుమానంతో బావిలో చూస్తే గీతాన్విక నీటిపైన తేలుతూ కనిపించిందని శ్రీశైలం సమాధానం ఇచ్చారు” అని తెలిపారు.

కరీంనగర్, కవలల హత్య

ఫొటో సోర్స్, UGC

ఆ సమయంలో, శ్రీశైలం ప్రవర్తనపై అనుమానంతో గ్రామస్థులు ఆయనపై దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అనంతరం, అక్కడే ఉంటే తనను చంపేస్తారన్న భయంతో శ్రీశైలం మోటార్ సైకిల్‌పై పారిపోయారని పోలీసులు తెలిపారు.

అనంతరం, గజ ఈతగాళ్ల సహాయంతో గీతాంశీ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

శ్రీశైలంతో పాటు ఆయన కుటుంబం ఎవరికీ చెప్పకుండా జూబ్లీ నగర్ విడిచి వెళ్లిపోయారు. ముందు జాగ్రత్తగా పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

శ్రీశైలం, ఆయన తల్లి, తండ్రి, తమ్ముడు సమీపంలోని గోపాల్ పూర్ గ్రామంలో తలదాచుకున్నారన్న సమాచారంతో ఏప్రిల్ 5న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారని, వారిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై శ్రీశైలం భార్య మౌనికతో ఫోన్‌లో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. పిల్లలు మరణించడంతో మానసికంగా కుంగిపోయిన మౌనిక మాట్లాడే స్థితిలో లేరని ఆమె తండ్రి రాజమల్లు బీబీసీకి తెలిపారు.

అయితే, నేరం జరిగిన రోజు (ఏప్రిల్ 3న) మౌనిక స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆరోజు ఏం జరిగిందో వివరించారు.

“ఆరోజు పిల్లలతో పాటు నేనూ పొలం వద్దకు వస్తానన్నాను. బైక్‌పై ఇంతమంది వెళ్లడం వీలుకాదని, కొద్దిసేపయ్యాక పొలానికి రమ్మన్నారు. బాటిల్లో మంచినీళ్లు నింపి ఇచ్చాను. ఆ తర్వాత నేను పొలానికి వెళ్లేసరికి నా పిల్లలు కనిపించలేదు. అడిగితే బావిలో పడ్డారని చెప్పారు. ఇద్దరూ బంగారు తల్లులు, ఊరంతా వాళ్లని రామచిలుకలు అని పిలిచేవారు” అని ఆమె వాపోయారు.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో శ్రీశైలం తరపు దగ్గరి బంధువులెవరూ అందుబాటులో లేరు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)