Home జాతీయ national telgu మాంసం సరిగ్గా ఉడికిందో లేదో తెలుసుకోవడం ఎలా?

మాంసం సరిగ్గా ఉడికిందో లేదో తెలుసుకోవడం ఎలా?

10
0

SOURCE :- BBC NEWS

మాంసం, ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

పరిశుభ్రమైన, పూర్తిగా ఉడికిన ఆహారం తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషకాహారం, ఆహారభద్రత విడదీయరానివి.

మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తగిన పరిమాణంలో పోషక విలువలున్న సురక్షితమైన ఆహారం అవసరం.

హానికరమైన బ్యాక్టిరీయా, వైరస్‌, పరాన్నజీవులు లేదా రసాయన పదార్థాలు కలిగిన ఆహారాలు విరేచనాల నుంచి క్యాన్సర్‌‌ వరకు 200కుపైగా వ్యాధులకు కారణమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఒకరు కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. దీని కారణంగా ఏటా 4 లక్షల 20 వేల మంది మరణిస్తున్నారు.

ఆహారం ద్వారా సంభవించే వ్యాధుల కారణంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాలు ఉత్పాదకత, వైద్యఖర్చుల రూపేణా సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు కోల్పోతున్నాయి.

ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల బారినపడుతున్న వారిలో 40 శాతం ఐదేళ్లలోపు చిన్నారులే. దీని కారణంగా ఏటా 1,25,000 పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఆహారం కారణంగా వచ్చే వ్యాధుల వల్ల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒత్తిడిపడటమే కాక, ఆర్థిక, పర్యటక, వాణిజ్య రంగాలు కూడా ప్రభావితమవుతాయి.

అంటే.. మన ఆహారానికి, ఆరోగ్యానికి, ఆర్థికరంగానికి ఇంత సంబంధం ఉందన్నమాట.

అలాంటి ఆహారం విషయంలో మనమెంత జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు వంటగదిలో ఏమేం చేయాలి? కూరగాయలను, మాంసాన్ని ఎంతవరకు ఉడికిస్తే మంచిది?

మాంసం, ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి..

​వంటగదిలో బ్యాక్టీరియా చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇది మన చేతులు, కూరలు తరిగే పీటలు, గరిటెలు మాత్రమే కాకుండా ఆహార పదార్థాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది.

  • ​ఆహార పదార్థాలను తాకడానికి ముందు, తర్వాత.. అలాగే బాత్‌రూమ్‌కు వెళ్లొచ్చినా, పెంపుడు జంతువులతో ఆడినా కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, గోరువెచ్చని నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • ​ఒక పదార్థం వండటం పూర్తయ్యాక, మరో పదార్థం సిద్ధం చేసే లోపు వాడిన పీటలను, గిన్నెలను, కౌంటర్ టాప్‌లను వేడి నీరు, సబ్బుతో కడగాలి.
  • ​వంటగదిని శుభ్రం చేయడానికి సాధ్యమైనంత వరకు పేపర్ టవల్స్ వాడండి. ఒకవేళ వస్త్రం వాడితే గనుక, వాటిని తరచుగా వేడి నీటితో ఉతకాలి.
కూరగాయలు, మాంసం, ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

పచ్చిమాంసం ఉంచిన ప్లేట్‌లో వడ్డించకూడదు..

  • పండ్లు, కూరగాయలను కుళాయి నీటి కింద ఉంచి బాగా కడగాలి. పైన తొక్క తీసి తినే పండ్ల విషయంలోనూ ఇదే పద్ధతి పాటించాలి.
  • ​గట్టిగా ఉండే కాయగూరలను నీటి కింద ఉంచి బ్రష్‌తో రుద్ది మరీ కడగాలి.
  • ​టిన్ లేదా క్యాన్లలో వచ్చే ఆహార పదార్థాలను వాడేముందు వాటి మూతలను శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
  • ​ఒక ఆహారం నుంచి మరొకదానికి బ్యాక్టీరియా చేరకుండా చూడాలి. దీనినే క్రాస్‌కంటామినేషన్ అంటారు.
  • ​పచ్చి మాంసం, చేపలు, గుడ్ల నుంచి బ్యాక్టీరియా ఇతర ఆహార పదార్థాలకు వ్యాపించే అవకాశం ఎక్కువ. కాబట్టి వీటిని తినడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి.
  • ​బజారులో సామాన్లు కొనేటప్పుడు, సంచుల్లో పెట్టేటప్పుడు, ఇంటికి తెచ్చాక ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు కూడా పచ్చిమాంసం, గుడ్లను మిగతా వస్తువులతో కలపకుండా విడిగా ఉంచండి.
  • ​కూరగాయలు తరగడానికి ఒకటి, పచ్చి మాంసానికి మరొకటి.. ఇలా వేర్వేరు పీటలను వాడటం మంచిది.
  • ​పచ్చి మాంసం ఉంచిన ప్లేటులోనే వండిన పదార్థాలను ఎప్పుడూ వడ్డించకూడదు.
  • ​మాంసం నానేందుకు వాడిన మసాలా మిశ్రమాలను మళ్లీ వాడకపోవడం ఉత్తమం.
మాంసం, ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

మాంసం ఉడికిందా? లేదా?

​మాంసం, గుడ్లు వంటివి పూర్తిగా ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ‘ఫుడ్ థర్మామీటర్’ ఉపయోగపడుతుంది. వండిన పదార్థాల అంతర్గత ఉష్ణోగ్రతను కొలవడానికి ఇది వాడొచ్చు.

  • ​మాంసం రంగు మారినంత మాత్రాన అది ఉడికినట్లు కాదు, సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికిందో లేదో థర్మామీటర్ ద్వారా సరిచూసుకోవాలి. మాంసం పూర్తిగా ఉడకడానికి 71 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉడికించాలి.
  • ​గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన గట్టిపడే వరకు ఉడికించాలి. గుడ్డుతో చేసే వంటలు కూడా 71 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేయాలి.
  • ​మైక్రోవేవ్ ఓవెన్‌లో వండేటప్పుడు పదార్థంపై మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. వండటం పూర్తయ్యాక కొద్దిసేపు అలాగే వదిలేసి, ఆ తర్వాతే థర్మామీటర్ పరీక్ష చేయాలి.
  • ​మిగిలిపోయిన సూప్‌లు, సాస్‌లను తిరిగి వేడి చేసేప్పుడు అవి బాగా మరిగేలా చూడాలి.

​ఆహారంలోని హానికారక బ్యాక్టీరియా నశించాలంటే పదార్థం లోపలి భాగం వరకు తగినంత ఉష్ణోగ్రత వద్ద ఉడకాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)