SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రపంచంలోనే అతిపెద్ద జన గణన కార్యక్రమానికి భారత్ సిద్ధమవుతోంది.
మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. 7,092 మండలాలు – తాలూకాలు.. 5128 మున్సిపాలిటీలు.. 6,39,902 గ్రామాలలో జనగణన చేస్తారు.
అసలు జనాభాను ఎలా లెక్కిస్తారు? ఎన్ని దశల్లో చేస్తారు?

జనగణన అంటే?
జనగణన అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారనే లెక్క.
కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసే జనగణనను ‘కుల జనగణన లేదా కులగణన’గా పిలుస్తారు.
అయితే, ఈ జనగణన ప్రక్రియ కేవలం జనాభా ఎంతమంది అని లెక్కించడం మాత్రమే కాదు, ఇందులో ఇతర అంశాలు కూడా ఇమిడి ఉంటాయి.
1948 నాటి జనగణన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, జనగణన సమయంలో అడిగే ప్రశ్నలకు ప్రతి పౌరుడూ సరైన సమాధానాలు ఇవ్వడం తప్పనిసరి.
ఫొటో సోర్స్, Getty Images
2027 జనగణన ఎలా, ఎన్ని దశల్లో..?
జనగణన -2027ను రెండు దశల్లో నిర్వహిస్తారు. తొలి దశను గృహాల జాబితా, లేదా గృహగణన అని పిలుస్తారు. రెండో దశ జనగణనను ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు.
దేశంలో తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు సేకరించనున్నారు.
గృహాల జాబితా & గృహగణన (హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్):
ఈ దశలో ఆ ప్రాంతంలోని భవనాలు, ఇళ్లు, ప్రతి నిర్మాణాన్ని జాబితా చేసి వాటికి నంబర్లు కేటాయిస్తారు. ఈ సమాచారం తర్వాతి దశకు చాలా కీలకం. ఎందుకంటే, జనగణన అధికారులకు బ్లాక్‌ల కేటాయింపులో ఇది సాయపడుతుంది. ఏ భవనం, ఏ ఇంటిని కూడా లెక్క నుంచి తప్పిపోకుండా చూస్తుంది.
ఈ దశలో ఇంటి రకం, దాని ప్రస్తుత పరిస్థితి, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంధన వినియోగం, మరుగుదొడ్డి ఉందా లేదా, నివాసితుల యాజమాన్యంలోని ఆస్తులు, అద్దె ఇల్లా లేక సొంతిల్లా వంటి వివరాలను కూడా నమోదు చేస్తారు.
జన గణన(పాపులేషన్ ఎన్యూమరేషన్):
ఈ దశలో, జనగణన అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రతి వ్యక్తినీ లెక్కించి, నమోదు చేయడంతో పాటు వారి నిర్దిష్ట సమాచారం సేకరిస్తారు.
సీసీపీఏ నిర్ణయంమేరకు .. ఈ రెండో దశలోనే కుల గణన కూడా చేపట్టనున్నారు. ఈ దశలో ప్రతి వ్యక్తి నుంచి జనాభా వివరాలు, సామాజిక-ఆర్థిక స్థితిగతులు, విద్య, వలసలు, సంతానోత్పత్తి వంటి అంశాలపై సమాచారాన్ని సేకరిస్తారు.
పౌరులు తమ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చు. దీని వల్ల పొరపాట్లు జరిగే అవకాశం తగ్గుతుంది. అలాగే, వివరాల సేకరణ కూడా వేగవంతమవుతుంది. అయితే, ఇది తప్పనిసరి కాదు.
మీరు ఆన్‌లైన్‌లో సమాచారాన్ని నమోదు చేసినప్పటికీ, సమాచార సేకరణ కోసం అధికారులు మీ ఇంటికి వస్తారు.
మీరు ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేసినట్లయితే, దానిని ఎస్‌ఈ ఐడీ (సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ) ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
జనగణనకు కాలపరిమితి ఏమిటి?
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు:
ఈ సమయంలో గృహాల జాబితా తయారీతో పాటు గృహగణన నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి నిర్దిష్టమైన 30 రోజుల సమయం కేటాయించారు.
ఈ కాలపరిమితి ప్రారంభానికి 15 రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకునే స్వీయగణన ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది. https://test.census.gov.in/se/ అనే వెబ్‌సైట్‌తో పాటు సంబంధిత యాప్ 16 భాషల్లో అందుబాటులో ఉంది.
వచ్చే ఏడాది, అంటే 2027 ఫిబ్రవరిలో అసలైన జన గణన ప్రక్రియ జరుగుతుంది. అయితే, ఆ నెలల్లో భారీ ముంచు కురిసే ప్రాంతాల్లో మాత్రం 2026 సెప్టెంబర్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని అన్ని ప్రాంతాలు, మంచు ప్రభావిత జమ్మూకశ్మీర్‌లోని కేంద్రపాలిత ప్రాంతాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని మంచు ప్రభావిత ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి.
రెండో దశలో కులగణన వివరాలు కూడా నమోదు చేస్తారు.
దీనితో పాటు ప్రతి పౌరుడి నుంచి డెమోగ్రఫిక్ సమాచారం సేకరిస్తారు. వీటిలో వారి వయస్సు, లింగం, ఆదాయం, మతం, భాష, విద్యార్హత, పిల్లల సంఖ్య, వలసకు సంబంధించిన వివరాలు ఉంటాయి.
మే నెల 1 నుంచి 30 వరకు గృహాల జాబితా తయారీ, గృహగణన ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలంగాణలో 2026 ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయగణన వెసులుబాటు ఉంటుంది.
అలాగే, మే నెల 11 నుంచి జూన్ 9 వరకు గృహాల జాబితా తయారీ, గృహగణన ప్రక్రియ నిర్వహిస్తారు.
ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ జనగణన ఎలా ఉండబోతోంది?
జనాభా లెక్కల సమాచారం సేకరించే వ్యక్తిని ఎన్యూమరేటర్ అంటారు. 2027 జనాభా లెక్కల కోసం దేశవ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇతర అధికారులు విధులు నిర్వహించనున్నారు.
ఎన్యూమరేటర్ స్మార్ట్‌ఫోన్ ద్వారా మొబైల్ యాప్‌లో సమాచారం నమోదు చేసి, ఆ డేటాను ప్రభుత్వానికి సమర్పిస్తారు.
డేటా సంరక్షణకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
జనాభా లెక్కల చరిత్ర
బ్రిటిష్ పాలనా కాలంలో, 1872లో వైస్రాయ్ లార్డ్ మాయో భారత్‌లో జనాభా లెక్కలు ప్రారంభించారు. బ్రిటిష్ వారు జనగణన నిర్వహించిన ప్రతిసారీ, 1931 వరకు కుల సంబంధిత సమాచారం కూడా నమోదు చేసేవారు.
భారత్‌లో 1881 నుంచి ప్రతి పదేళ్లకొకసారి జనగణన నిర్వహిస్తున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, 1951లో తొలిసారి జనగణన జరిగింది. అప్పట్లో సామాజిక విభజన, వివక్షను రూపుమాపడం కోసం కులానికి సంబంధించిన వివరణాత్మక సమాచారం సేకరించలేదు.
షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మిగిలిన వారిని జనరల్ కేటగిరీగా వర్గీకరించారు.
అప్పటి నుంచి భారత ప్రభుత్వం ఒక విధాన నిర్ణయంగా, కుల ఆధారిత జనగణను నిలిపివేసింది.
ఫొటో సోర్స్, Getty Images
జనగణన ఎవరు నిర్వహిస్తారు?
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఈ ప్రక్రియను నిర్వహిస్తారు.
దేశంలో సాధారణంగా ప్రతి పదేళ్లకొకసారి జనగణన నిర్వహించేవారు.
కానీ, 2011 నుంచి జనగణన జరగలేదు.
2011లో సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహించారు. కానీ, ఆ డేటాను ఎప్పుడూ బయటపెట్టలేదు.
2015లో కూడా కుల ఆధారిత జనగణన నిర్వహించినప్పటికీ ఆ డేటాను కూడా విడుదల చేయలేదు.
ఆ డేటా లోపభూయిష్టంగా, తప్పుగా ఉందని.. అందువల్ల దానిని పరిగణనలోకి తీసుకోలేమని ఒక కేసు విచారణ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కోవిడ్ మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనాభా లెక్కల కార్యక్రమం వాయిదా పడింది. ఫలితంగా, ప్రస్తుతం 2027 జనగణన ప్రక్రియకు రంగం సిద్ధమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



