Home జాతీయ national telgu ‘అమరావతి’ రాజధానిపై ఏపీ ప్రభుత్వం తీర్మానం.. దీనిపై విపక్ష వైసీపీ ఏమంటోంది?

‘అమరావతి’ రాజధానిపై ఏపీ ప్రభుత్వం తీర్మానం.. దీనిపై విపక్ష వైసీపీ ఏమంటోంది?

9
0

SOURCE :- BBC NEWS

అమరావతి

ఫొటో సోర్స్, Chandrababu/APCMO/YSR Congress Party

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయాలని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మార్చి 28న ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్‌–5లో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరింది.

ఏపీ రాజధాని ‘అమరావతి వద్ద’ అనే పదాన్ని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం–2014లో సెక్షన్‌– 5లోని సబ్‌ సెక్షన్‌– 2 వద్ద చేర్చాలని శాసనసభ తీర్మానం చేసింది. అదేవిధంగా అమరావతి అంటే… ‘ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) చట్టం 2014 కింద నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసుంటాయి’ అనే పదాలను ఆ తీర్మానంలో చేర్చింది.

మార్చి 28వ తేదీన శనివారం అత్యవసరంగా నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ఇతర మంత్రులతో సహా మొత్తం 23 మంది సుమారు ఐదుగంటలపాటు చర్చించారు.

అనంతరం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించి, ఆ తీర్మానం కాపీని వెంటనే కేంద్రానికి పంపిస్తున్నట్టు సభలో వెల్లడించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదించేలా కేంద్ర హోం శాఖకు, రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌కు పంపుతున్నట్టు తెలిపారు.

కాగా, ఏప్రిల్‌ 2వ తేదీలోగా పార్లమెంటులో ఈ బిల్లు వచ్చే అవకాశముందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి బీబీసీకి వెల్లడించారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా కచ్చితంగా బిల్లుకు ఆమోదం దక్కుతుందని అన్నారు. బిల్లు ఆమోదం పొందితే భవిష్యత్‌లో అమరావతిని ఎవ్వరూ కదలించలేరని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ తీర్మానం వ్యవహారమంతా ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని వైసీపీ విమర్శించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
అమరావతి, ఏపీ సీఎం చంద్రబాబు

ఫొటో సోర్స్, Chandrababu Naidu WhatsApp channel

2028కల్లా రాజధాని నిర్మాణ పనులు పూర్తి: చంద్రబాబు

తీర్మానంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ముగింపు ఉపన్యాసం చేస్తూ, 2028 ఆగస్టు నాటికి రాజధాని నిర్మాణ పనులన్నీ పూర్తిచేసి అమరావతికి రూపం తీసుకువస్తామని ప్రకటించారు. రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతి ఉన్నా, అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తామని తెలిపారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఈ తీర్మానం అత్యవసరమని భావిస్తున్నామని రాజధాని అమరావతికి రక్షణాత్మక చర్యలు అవసరమని భావిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని చంద్రబాబు చెప్పారు.

రూ.11 వేల కోట్ల ఏడీబీ రుణం, రూ.7,300 కోట్ల వరకు నాబార్డు రుణం.. కేంద్రం సాయం మొత్తంగా రూ.56 వేల కోట్లతో రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుందని సీఎం తెలిపారు.

2015లో ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించినా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు నిలిపివేయడం వల్ల 2025 మే 2వ తేదీన మరోసారి ప్రధానితో శంకుస్థాపన చేయించామన్నారు చంద్రబాబు. ఒకే రాజధానికి రెండుసార్లు శంకుస్థాపనలు చేయాల్సి వచ్చిందన్నారు. మొత్తంగా ఆరేళ్ల తరువాత అమరావతి పనులు రీస్టార్ట్‌ చేశామని తెలిపారు.

రాజధాని అమరావతిపై వైసీపీ బుద్ధి ఇంకా మారలేదని, అందుకే భవిష్యత్‌లో అమరావతి రాజధానిని ఎవరూ టచ్‌ చేయకుండా ఇంచ్‌ కూడా కదపకుండా ఈ తీర్మానం చేసినట్టు సీఎం ప్రకటించారు. వైసీపీ శాశ్వతంగా అమరావతి ద్రోహిగా నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు.

అమరావతి, వైసీపీ నేత మార్గాని భరత్‌

ఫొటో సోర్స్, Margani Bharat

పూర్తిచేస్తే స్వాగతిస్తాం: వైసీపీ

‘‘సీఎం చంద్రబాబు 2028 ఆగస్టుకల్లా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని శాసనసభ సాక్షిగా ఈనెల 28న ప్రకటించారు. నిజంగా అప్పటికల్లా రాజధాని నిర్మాణం పూర్తి చేయమనండి, మేం కచ్చితంగా స్వాగతిస్తాం” అని వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ బీబీసీతో అన్నారు.

తమ పార్టీ అమరావతి రాజధానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అమరావతి పేరిట టీడీపీ, కూటమి నేతలు చేసే డ్రామాలకే వైసీపీ వ్యతిరేకమని భరత్‌ అన్నారు.

భూములు కోల్పోయిన రైతులకే న్యాయం చేయని చంద్రబాబు, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న డ్రామా అని ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు భరత్. అమరావతి రాజధానికి వైసీపీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతికి మాత్రమే వ్యతిరేకమని అన్నారు.

రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో మరో 50 వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా, రైతులంతా వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అమరావతి రాజధానిలో తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019కి ముందు నుంచే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారని, కానీ ఇప్పటికీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు హైదరాబాద్‌లోనే స్థిర నివాసం ఉంటున్నారని, కేవలం రాజకీయాల కోసం షటిల్‌ సర్వీస్‌ చేస్తున్నారని భరత్‌ విమర్శించారు.

‘అమరావతి నిర్మాణం తర్వాతి సంగతి, ముందు ఆ ముగ్గురినీ అమరావతిలో నివాసం ఉండమనండి చాలు’ అన్నారు.

అలాగే, రాజధాని అమరావతిపై శాసన మండలిలో ఎందుకు తీర్మానం చేయలేదని భరత్ ప్రశ్నించగా, మండలిలో తీర్మానం అవసరం లేదని మంత్రి పార్థ సారథి బదులిచ్చారు.

ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం కాపీ

ఫొటో సోర్స్, Chandrababu Naidu WhatsApp channel

మూడు రాజధానులపై ఇప్పుడు వైసీపీ స్టాండ్‌ ఏంటి?

2014–19 వరకు అమరావతిలో టీడీపీ హయాంలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే చేపట్టారని, దాంతో 2019లో అధికారంలోకి వచ్చిన తమ పార్టీ అప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రతిపాదించిందని భరత్‌ అన్నారు. అంతేతప్ప, తాము అమరావతి రాజధానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.

అప్పటి పరిస్థితులను బట్టి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రస్తుతం వైసీపీ విధానాన్ని తమ పార్టీ కోర్‌ కమిటీ ప్రకటిస్తుందని భరత్‌ చెప్పారు.

వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదని భరత్‌ ఆరోపించారు.

రాజధాని నిర్మాణం మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనీ, పనులు చేపట్టకుండా నాన్చుతూ, 2029లో కూడా ఇదే అజెండాతో ప్రజల ముందుకు రావడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఆయన విమర్శించారు.

మంత్రి కొలుసు పార్థ సారథి, అమరావతి

ఫొటో సోర్స్, UGC

‘కచ్చితంగా పూర్తిచేస్తాం’

రాజధాని నిర్మాణ పనులు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత వ్యవధిలోనే పూర్తవుతాయని మంత్రి పార్థ సారథి బీబీసీతో అనగా, తీర్మానాలతో ఉపయోగం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘‘వేగంగా నిర్మాణాలు పూర్తవ్వడంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలి” అని రాజకీయ పరిశీలకులు, సీనియర్‌ పాత్రికేయులు గాలి నాగరాజు బీబీసీతో అన్నారు.

”2015లో రాజధాని పనులకు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు 2028 నాటికి పూర్తి చేస్తామంటున్నారు. వైసీపీ హయాంలో ఏం జరగలేదన్న టీడీపీ ఆరోపణలే నిజమని అనుకున్నా.. మరి ఈ రెండేళ్లలో కూటమి పాలకులు ఏం చేశారు” అని నాగరాజు ప్రశ్నించారు.

‘‘చంద్రబాబు ఎందుకో రాజధాని నిర్మాణంపై గందరగోళంలో ఉన్నట్టు అర్థమవుతోంది. గతంలో సేకరించిన స్థలం కంటే ఇంకా ఎక్కువ కావాలని అంటున్నారు. మరోసారి తీర్మానం అని కేంద్రానికి పంపుతున్నారు. వైసీపీ మూడు రాజధానుల విషయమై ఇదే కేంద్రం.. రాష్ట్ర రాజధాని నిర్ణయాధికారం ఆయా రాష్ట్రాలదే అని స్పష్టం చేసిందన్న విషయం చంద్రబాబు గుర్తు చేసుకోవాలి. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది” అన్నారు నాగరాజు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)