Home జాతీయ national telgu యోమ్ కిప్పూర్ యుద్ధం: ఇజ్రాయెల్ సైన్యం ముప్పావువంతు సెలవుపై ఉంది…ఈజిప్ట్, సిరియా హఠాత్తుగా దాడులు మొదలుపెట్టాయి,...

యోమ్ కిప్పూర్ యుద్ధం: ఇజ్రాయెల్ సైన్యం ముప్పావువంతు సెలవుపై ఉంది…ఈజిప్ట్, సిరియా హఠాత్తుగా దాడులు మొదలుపెట్టాయి, తరువాత ఏం జరిగిందంటే…?

13
0

SOURCE :- BBC NEWS

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్ వైమానిక దళం 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో తొలి ఆరు గంటల్లోనే ఈజిప్ట్ వైమానిక దళాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.

జూన్ 5వ తేదీ ఉదయం 7:45 గంటల సమయంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఈజిప్ట్‌లోని పలు విమానాశ్రయాలపై ఏకకాలంలో దాడి చేశాయి. ఈజిప్ట్ పైలట్లు తమ విమానాల వద్దకు చేరుకోకముందే, ఆ దేశానికి చెందిన మెజారిటీ విమానాలు రన్‌వేలపైనే ధ్వంసమయ్యాయి.

కొద్దిసేపటి తర్వాత మరోసారి దాడి చేసిన ఇజ్రాయెల్ విమానాలు, ఆ రన్‌వేలను కనీసం వాడుకోవడానికి కూడా వీలు లేకుండా ధ్వంసం చేశాయి. ఈ దాడి నుంచి ఈజిప్ట్ వైమానిక దళం కోలుకోలేకపోయింది. ఈ యుద్ధంలో ఈజిప్ట్ ఘోరంగా ఓడిపోయింది.

అంతేకాకుండా, ఇజ్రాయెల్ పదాతి దళం సినాయ్ ఎడారిలోని పెద్ద భూభాగాన్ని, సిరియాలోని గోలన్ హైట్స్ పర్వత ప్రాంతాలను కూడా ఆక్రమించింది.

ఈ దాడిలో ఇజ్రాయెల్ నిర్ణయాత్మక విజయం సాధించినప్పటి నుంచి ఈజిప్ట్, సిరియా తాము కోల్పోయిన ఆ భూభాగాలను తిరిగి పొందాలని కోరుకున్నాయి. అందుకోసం 1973 అక్టోబర్ 6వ తేదీని ఎంచుకున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

చరిత్ర అధ్యాపకురాలు, పులిట్జర్ బహుమతికి నామినేట్ అయిన అమెరికన్ జర్నలిస్ట్ ఎలినార్ బర్కెట్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గోల్డా మేయర్ జీవిత చరిత్ర ‘గోల్డా’లో కీలక సమాచారాన్ని అందించారు.

”సోవియట్ గూఢచారి సంస్థ ‘కేజీబీ’ పంపిన రేడియో సందేశాలను ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పసిగట్టినప్పుడే ఇజ్రాయెల్‌పై ఈజిప్ట్, సిరియా దాడి చేయబోతున్నాయనే మొదటి సంకేతం అందింది. ఆ సందేశాల్లో సోవియట్ కుటుంబాలను ఈజిప్ట్, సిరియా నుంచి తక్షణమే ఖాళీ చేయించాలనే ఆదేశాలు ఉన్నాయి. సోవియట్ ‘ఆంటోనోవ్ 22ఎస్’ భారీ విమానాలు ఆ కుటుంబాలను తీసుకెళ్లడానికి అక్కడికి చేరుకున్నప్పుడు, ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ అధికారుల మనసులో హెచ్చరిక గంటలు మోగడం మొదలైంది” అని ఆమె రాశారు.

నాటి ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మేయర్ ఈ సమాచారంతో ఆందోళన చెందినప్పటికీ, ఆమె జనరల్స్ దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ లోపు, ఈజిప్ట్ సైన్యంలోని ఒక విభాగం సూయజ్ కాలువ వైపు దూసుకువస్తోందని, సుమారు లక్షా ఇరవై వేల మంది రిజర్వ్ సైనికులను విధుల్లోకి పిలిపించిందని ఇజ్రాయెల్ గూఢచారి వర్గాలు సమాచారం ఇచ్చాయి. అయినప్పటికీ, ఈజిప్ట్ కేవలం సాధారణ సైనిక విన్యాసాలు చేస్తోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మోషే దయాన్ భావించారు.

అక్టోబర్ 6, 1973: ‘యోమ్ కిప్పూర్’ పండుగరోజు . యూదులు దీనిని ఏడాదిలో అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఇజ్రాయెల్ అంతటా సెలవు. చివరికి రేడియో, టెలివిజన్ స్టేషన్లు కూడా పనిచేయడం లేదు. ఇజ్రాయెల్ సైన్యంలోని ముప్పావు వంతు సైనికులు సెలవుపై తమ ఇళ్లకు వెళ్లారు.

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్‌పై ఈజిప్ట్, సిరియా ఉమ్మడి దాడి

గోల్డా మేయర్ జీవిత చరిత్రలో ఎలినార్ బర్కెట్ ఇలా రాశారు…

”ఉదయం 8 గంటలకే గోల్డా తన కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె తన సైన్యాధిపతి డేవిడ్ ‘డాడో’ ఎలాజార్, రక్షణ మంత్రి మోషే దయాన్ మధ్య విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై ఈజిప్ట్ దాడి చేయకముందే, ఇజ్రాయెలే ముందస్తుగా వైమానిక దాడి చేసి ప్రత్యర్థుల ప్రణాళికలను మట్టికరిపించాలని డాడో కోరుకున్నారు.”

”మరోవైపు, యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందనే విషయంలో మోషే దయాన్‌కు నమ్మకం లేదు. ఇజ్రాయెల్ తీసుకునే ఇటువంటి ముందస్తు చర్య అమెరికాకు నచ్చదని చెబుతూ, ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.”

”రిజర్వ్ సైనికులను విధుల్లోకి పిలవాలన్న జనరల్ డాడో అభ్యర్థనను కూడా దయాన్ అనవసరమైనదిగా కొట్టిపారేశారు. మొదటి గుండు పేలిన తర్వాతే రిజర్వ్ సైనికులను పిలవాలని ఆయన వాదించారు. ఒకవేళ యుద్ధం జరగకపోతే, ఆ రిజర్వ్ సైనికులతో మనం ఏం పని చేయిస్తామని ప్రశ్నించారు. గోల్డా మేయర్ కూడా తన రక్షణ మంత్రికి మద్దతు తెలుపుతూ, ముందస్తు దాడి చేసే ఆలోచనను తోసిపుచ్చారు.”

మధ్యాహ్నం 2 గంటల సమయంలో అకస్మాత్తుగా ఇజ్రాయెల్ అంతటా ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగడం మొదలైంది.

ఉత్తరాన సిరియా సైన్యానికి చెందిన ఐదు డివిజన్లు, 1400 ట్యాంకులు, వెయ్యి ఫిరంగులతో ఇజ్రాయెల్‌లోని గోలన్ కొండలపై మోహరించి ఉన్న రెండు బ్రిగేడ్‌లపై దాడి చేశాయి.

యూరి బార్ జోసెఫ్ తన పుస్తకం ‘ది ఏంజెల్’లో ఇలా రాశారు….

”ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ వద్ద కేవలం 177 ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. దక్షిణాన లక్ష మంది ఈజిప్ట్ సైనికులు 1300 ట్యాంకులతో సినాయ్ ఎడారిలోకి ప్రవేశించారు. దాడి మొదటి దశలో 32 వేల మంది ఈజిప్ట్ సైనికులు ఆరు గంటల్లో 720 పడవల ద్వారా సూయజ్ కాలువను దాటారు.”

”ప్రతి పడవ 12 సార్లు అటూఇటూ తిరిగింది. ఈజిప్ట్ సైనికులు సూయజ్ కాలువను దాటుతున్నప్పుడు ఇజ్రాయెల్ సైనికులు కనీస ప్రతిఘటన చూపలేదు, కనీసం ఎదురుదాడి కూడా చేయలేదు.”

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Harper

ఈజిప్ట్ తొలి విజయం

ఈజిప్ట్ సైనికులు మరింతగా ముందుకు చొచ్చుకు రాకుండా ఉండటానికి ఇజ్రాయెల్ తన వైమానిక దళంపైనే ఎక్కువగా ఆధారపడింది.

అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు, మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ బృందంలో పనిచేసిన మైఖేల్ డోరన్, తన వ్యాసం ‘ది హిడెన్ కాలిక్యులేషన్ బిహైండ్ యోమ్ కిప్పూర్ వార్’లో ఇలా రాశారు….

”నేల నుంచి గగనతలంలోకి ప్రయోగించే ‘సామ్’ (ఎస్‌ఏఎం) మిసైళ్లను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ పైలట్లు అస్సలు సిద్ధంగా లేరు. 1967లో ఈజిప్ట్ గగనతలంపై వారిదే పూర్తి ఆధిపత్యం ఉండేది. కానీ ఆరేళ్ల తర్వాత పరిస్థితి ఎంతలా మారిపోయిందంటే, యుద్ధం మొదలైన మొదటి 24 గంటల్లోనే వారి యుద్ధ విమానాలలో 10 నుంచి 30 శాతం వరకు ధ్వంసమయ్యాయి. దీనితో ఇజ్రాయెల్ సైనిక నాయకత్వం పూర్తిగా దిగ్భ్రాంతికి లోనైంది.”

ఈజిప్ట్ సైనికులు ఎటువంటి ప్రతిఘటన లేకుండానే సూయజ్ కాలువను దాటారు. వారి సైనికుల్లో ఒక్కరు కూడా గాయపడలేదు. ఇజ్రాయెల్ ట్యాంకులు ఎదురుదాడి చేయాల్సిన తమ ‘స్విమ్ ఫిన్స్’ స్థావరాలకు చేరుకునేసరికి, అప్పటికే వాటిని ఈజిప్ట్ కమాండోలు ఆక్రమించుకున్నారని తెలుసుకున్నారు. ఇజ్రాయెల్ ట్యాంకులు కనిపించగానే వారు యాంటీ-ట్యాంక్ మిసైళ్లతో దాడికి దిగారు.

ఆదివారం తెల్లవారుజాముకల్లా ఈజిప్ట్ సైనికులు సూయజ్ కాలువ తూర్పు తీరంలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటివరకు వారి సైనికులెవరూ మరణించలేదు. అదే సమయంలో, ఈజిప్టుకు చెందిన 222 యుద్ధ విమానాలు సూయజ్ కాలువను దాటి ఇజ్రాయెల్ స్థావరాలు, రాడార్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించడం ప్రారంభించాయి.

”ఇజ్రాయెల్ సైనికులు ఈ దాడిని చూసి నిశ్చేష్టులయ్యారు. వారిని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ ట్యాంకులు ముందుకు సాగినప్పుడు, ఈజిప్ట్ సైనికులు భుజంపై నుంచి ప్రయోగించే రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌పీజీ) లాంచర్లతోనే కాకుండా, ఇజ్రాయెల్ సైనికులు అంతకుముందెన్నడూ చూడని కొన్ని కొత్త ఆయుధాలతో సమాధానం ఇచ్చారు. యుద్ధం మొదలైన 24 గంటలు గడవకముందే, యుద్ధం గురించి ఇజ్రాయెల్‌కు ఉన్న పాత అంచనాలన్నీ తలకిందులయ్యాయి” అని ఎలినార్ బర్కెట్ రాశారు.

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

అణ్వాయుధాల ప్రయోగంపై ఆలోచన…

ఈజిప్ట్ దాడితో ఇజ్రాయెల్ యుద్ధ వీరుడిగా పేరుగాంచిన రక్షణ మంత్రి ఎంతలా కలవరపడ్డారంటే, ఆయన మానసికంగా కుంగిపోయారు. నరాల బలహీనతకు లోనయ్యారు. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో తాను పెద్ద పొరపాటు చేశానని ప్రధానమంత్రి గోల్డా మేయర్ ముందు ఒప్పుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు.

కానీ గోల్డా మేయర్ ఆ ప్రతిపాదనను కనీసం పరిశీలించడానికి కూడా నిరాకరించారు.

”ఈజిప్ట్, సిరియాలను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ అణ్వాయుధాలను ప్రయోగించే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని కూడా మోషే దయాన్ ప్రధానమంత్రికి సిఫార్సు చేశారు” అని మైఖేల్ డోరన్ రాశారు.

దీనిని ధ్రువీకరిస్తూ, ”కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, కొంత సమయం పాటు గోల్డా కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దయాన్ అభ్యర్థన మేరకు ఇజ్రాయెల్ అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంచాలని ఆమె ఆదేశించారు” అని ఎలినార్ బర్కెట్ పేర్కొన్నారు.

యోమ్ కిప్పూర్ యుద్ధంలో ఇజ్రాయెల్ ట్యాంక్ డివిజన్‌కు నాయకత్వం వహించి, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయిన ఏరియల్ షారోన్ తన ఆత్మకథ ”వారియర్”లో, ”నేను మొదటిసారిగా ఇజ్రాయెల్ సైనికుల ముఖాల్లో భయం కంటే ఆశ్చర్యపు ఛాయలను చూశాను. అకస్మాత్తుగా వారి జీవితంలో అంతకుముందెన్నడూ అనుభవించని సంఘటనలు ఎదురవుతున్నాయి. వారి సైనిక జీవితమంతా విజయాలతోనే గడిచింది. తమ కళ్లముందే ఈజిప్ట్ సైనికులు సూయజ్ కాలువను దాటుతుంటే వారు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు” అని రాశారు.

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

రిజర్వ్ సైనికుల్లో చాలామంది ఇళ్లకు తిరిగిరాలేదు…

సాయంత్రం అయ్యేసరికి రిజర్వ్ సైనికుల ఇళ్లకు సైనిక ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది.

‘హోలోకాస్ట్’పై పరిశోధన చేసిన డెబ్బీ షాపిరో తన వ్యాసం ‘రిమెంబరింగ్ యోమ్ కిప్పూర్ వార్’లో జెరూసలేంలో తన అనుభవాల గురించి ప్రస్తావించారు.

”మోకాళ్ల వరకు తెల్లని ‘కిటెల్’ (సంప్రదాయ దుస్తులు) ధరించిన అనేకమంది వ్యక్తులు తమ యూనిట్లకు చేరుకోవడానికి రోడ్లపై దాదాపుగా పరుగెడుతున్న ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా గుండె తరుక్కుపోతుంది. వారి వెనుక స్యాండ్‌విచ్‌లు, థర్మస్ ఫ్లాస్కుల్లో వేడి కాఫీ పట్టుకుని వారి భార్యలు కూడా పరిగెడుతున్నారు. సైనికులు వెంటనే తమ ఉపవాసాన్ని విరమించి, తమ స్థావరాలకు బయలుదేరాలని వారికి ఆదేశాలు అందాయి” అని రాశారు.

”మహిళలు ఇంటికి వెళ్లి తమ భర్తలు యుద్ధరంగంలోకి వెళ్లేటప్పుడు ఆకలితో ఉండకుండా, వారి కోసం భోజనం వండాలని కోరారు. ఈలోపు ముదురు ఆకుపచ్చ రంగు సైనిక జీపులు రోడ్లపై వేగంగా తిరుగుతున్నాయి. అవి రిజర్వ్ సైనికులను ‘షూల్’ (యూదుల ప్రార్థనా మందిరం) నుండి నేరుగా యుద్ధ రంగానికి తీసుకెళ్లడానికి వచ్చాయి. వారిలో చాలామంది మళ్లీ ఎప్పటికీ తమ ఇళ్లకు తిరిగి రాలేదు” అని ఆ వ్యాసంలో డెబ్బీ షాపిరో పేర్కొన్నారు.

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

సిరియాపైకి ఇజ్రాయెల్ ఎదురుదాడి

అటు గోలన్ హైట్స్ యుద్ధ రంగంలో సిరియా సైన్యం కూడా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోంది. గోలన్ ఎత్తైన ప్రాంతాలపై తమ నియంత్రణ సాధించాలని వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ మరుసటి రోజే ఇజ్రాయెల్ సిరియాపై ఎదురుదాడి ప్రారంభించింది. అక్టోబర్ 7వ తేదీ సాయంత్రం కల్లా సిరియా మొదటి రక్షణ వలయాన్ని ఇజ్రాయెల్ ఛేదించింది.

ఇజ్రాయెల్ వైమానిక దళం సిరియాలోని విమాన స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది. అందులో రాజధాని డమాస్కస్ విమానాశ్రయం కూడా ఉంది.

1973 అక్టోబర్ 9 నాటికి ఇజ్రాయెల్ సైనికులు సిరియా సైనికులను 1967 యుద్ధ విరామ రేఖ వెనక్కి వెళ్లేలా తిప్పికొట్టారు.

అక్టోబర్ 10వ తేదీ ముగిసేసరికి సిరియా గగనతలంపై ఇజ్రాయెల్ నియంత్రణ సాధించింది.

ఆడ్రీ షుల్ తన పుస్తకం ‘ది యోమ్ కిప్పూర్ వార్’లో, ”సిరియా ఆందోళనతో ఇతర అరబ్ దేశాలైన ఇరాక్, కువైట్, మొరాకోలను సైనిక సహాయం కోసం అర్థించింది. మరుసటి రోజే ఆ సహాయం అందింది కూడా. అయినప్పటికీ, గోలన్ హైట్స్ యుద్ధ భూమిలో ఇజ్రాయెల్ సైనికుల పురోగతి కొనసాగుతూనే ఉంది” అని రాశారు.

”అక్టోబర్ 11న ఇజ్రాయెల్ సైనికులు సిరియా సరిహద్దులో 9.5 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయారు. అక్టోబర్ 15 నాటికి ఇజ్రాయెల్ సైనికులు డమాస్కస్ సమీపంలోని ‘సాసా’ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ నుంచి డమాస్కస్ దూరం కేవలం 32 కిలోమీటర్లు మాత్రమే” అని పేర్కొన్నారు.

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఇరుపక్షాలకూ తీవ్ర నష్టం…

1973 అక్టోబర్ 14 నుంచి యుద్ధ గతి మారడం ప్రారంభమైంది. ఎందుకంటే అప్పటి నుంచి అమెరికా ఆయుధాలు ఇజ్రాయెల్‌కు చేరుకోవడం మొదలైంది.

జనరల్ ఎలాజర్ అదే రోజు రాత్రి ”గోల్డా, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. మన ఫామ్ తిరిగి వస్తోంది, అరబ్ దేశాలు మళ్లీ తమ పాత స్థితికే చేరుకుంటున్నాయి” అని పేర్కొంటూ ప్రధానమంత్రి మేయర్‌కు ఒక సందేశం పంపారు.

అక్టోబర్ 14న ఈజిప్టుకు చెందిన మూడవ ఆర్మర్డ్ బ్రిగేడ్ 124 ట్యాంకులతో ‘మిత్లా పాస్’పై దాడి చేసింది. ఎనిమిది గంటల లోపే వారి 60 ట్యాంకులు ధ్వంసమయ్యాయి. ఇక్కడి నుండే పాచిక తిరగబడటం మొదలైంది.

ఈజిప్టుకు చెందిన థర్డ్ ఆర్మీని సూయజ్ కాలువ పశ్చిమ తీరంలో నలువైపులా చుట్టుముట్టే ప్రణాళికపై ఏరియల్ షారోన్ పని చేయడం ప్రారంభించారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ట్యాంక్ యుద్ధం తర్వాతి ఐదు రోజుల్లో ఇరు పక్షాల మధ్య జరిగింది.

అక్టోబర్ 15 రాత్రి ‘చైనీస్ ఫార్మ్’ అనే ప్రదేశంలో అత్యంత భయంకరమైన యుద్ధం జరిగింది. ఏరియల్ షారోన్ ఆ యుద్ధాన్ని వివరిస్తూ తన ఆత్మకథ ‘వారియర్’లో, ”యుద్ధం ఎంత సమీపంలో జరిగిందంటే ఈజిప్ట్, ఇజ్రాయెల్ సైనికుల మృతదేహాలు పక్కపక్కనే పడి ఉండటం మీరు చూడవచ్చు. తగులబడుతున్న ట్యాంకుల నుంచి ఇరు పక్షాల సైనికులు దూకి, కలిసి మరణించారు” అని రాశారు.

షారోన్ ఈజిప్ట్ సైనికులపై ఒత్తిడిని కొనసాగించారు. ఇజ్రాయెల్ సైన్యం సూయజ్ కాలువను దాటడంలో విజయం సాధించింది.

”ఓటమి భయంతో ఈజిప్ట్ యుద్ధ విరామం కోసం అర్థించింది. అమెరికా, సోవియట్ యూనియన్ ఒత్తిడితో ఇజ్రాయెల్ తన పురోగతిని ఆపేసింది. ఈ యుద్ధంలో ఈజిప్ట్, సిరియాకు చెందిన మొత్తం 15,600 మంది సైనికులు మరణించారు. సుమారు 35 వేల మంది సైనికులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ మొత్తం 2,569 మంది సైనికులను కోల్పోయింది, మరో 7,251 మంది సైనికులు గాయపడ్డారు. ఈ యుద్ధంలో అరబ్ దేశాల 440 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా, ఇజ్రాయెల్ 102 విమానాలను కోల్పోయింది” అని మైఖేల్ డోరన్ రాశారు.

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Simon & Schuster

యుద్ధ విరామానికి అంగీకారం

ఐక్యరాజ్యసమితి 1973 అక్టోబర్ 22న యుద్ధ విరామాన్ని ప్రకటించింది. అప్పటికే సూయజ్ నగరం నుంచి కైరో వెళ్లే రహదారిపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ సాధించింది.

”ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ సంపూర్ణ విజయం సాధించడం సోవియట్ యూనియన్, అమెరికా రెండింటికీ ఇష్టం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ విజయంపై ఆగ్రహించిన అరబ్ దేశాలు చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించవచ్చని అవి భయపడ్డాయి. ఇజ్రాయెల్ ఈ యుద్ధ విరామాన్ని అస్సలు ఇష్టపడలేదు. ఎందుకంటే, తాము నిర్ణయాత్మక విజయం వైపు దూసుకుపోతున్న సమయంలో తమను అడ్డుకున్నారని వారు భావించారు” అని ఆడ్రీ షుల్ రాశారు.

”అక్టోబర్ 23న వారు సూయజ్ కాలువ తూర్పు తీరంలో ఈజిప్టుకు చెందిన ‘థర్డ్ ఆర్మీ’ని చుట్టుముట్టారు. వారి వేలాది మంది సైనికులను బందీలుగా చేసుకున్నారు. వారు ఈజిప్ట్ రాజధాని కైరోకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయారు. దీనితో ఈజిప్ట్ ఆందోళన చెంది సోవియట్ యూనియన్‌ను సహాయం కోరింది, దానికి సోవియట్ వెంటనే అంగీకరించింది” అని పేర్కొన్నారు.

1973 అక్టోబర్ 26న రెండు అగ్రరాజ్యాల ప్రయత్నంతో ఇజ్రాయెల్, ఈజిప్ట్ యుద్ధ విరామానికి అంగీకరించాయి.

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఆయిల్ వెపన్

అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం అక్టోబర్ 26 నాటికి ముగిసినప్పటికీ, అది మధ్యప్రాచ్యాన్ని, ప్రపంచ ఇంధన మార్కెట్‌ను పూర్తిగా మార్చివేసింది.

చివరికి ఈ యుద్ధంలో అతిపెద్ద విజేతగా సౌదీ అరేబియా నిలిచింది. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇచ్చినందుకు ప్రతిచర్యగా, సౌదీ అరేబియా అమెరికాకు చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

”1814లో బ్రిటన్ వాషింగ్టన్‌ను తగులబెట్టిన తర్వాత, మరే ఇతర దేశం కూడా అమెరికాకు సౌదీ అరేబియా అంతటి ఆర్థిక నష్టాన్ని కలిగించలేదు” అని సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ తన వ్యాసం ‘ఫిఫ్టీ ఇయర్స్ ఎగో సౌదీ అరేబియా వాజ్ ద బిగ్గెస్ట్ విన్నర్ ఆఫ్ ద యోమ్ కిప్పూర్ వార్’లో రాశారు.

”అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే జరిగిన ఒక రహస్య సమావేశంలో, ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ సౌదీ రాజు ఫైసల్‌కు ఒక సలహా ఇచ్చారు. అవసరమైతే ‘చమురు’ అనే ఆయుధాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు” అని ప్రస్తావించారు.

అక్టోబర్ 17న సౌదీ విదేశాంగ మంత్రి ఒమర్ సఖ్కాఫ్ అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ను కలిసి రాజు ఫైసల్ రాసిన లేఖను అందజేశారు. రెండు రోజుల్లోగా అమెరికా ఇజ్రాయెల్‌కు ఆయుధాలు పంపడం ఆపకపోతే, అమెరికాకు చమురు సరఫరాపై సౌదీ ఆంక్షలు విధిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

అలా చేయడానికి నిక్సన్ నిరాకరించారు. దీనితో సౌదీ అరేబియా మొదట తన చమురు ఉత్పత్తిలో 10 శాతం కోత విధించింది. ఆ తర్వాత అమెరికాకు చమురు పంపడం పూర్తిగా నిలిపివేసింది.

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

అమెరికాకు చమురు ఎగుమతులపై సౌదీ అరేబియా విధించిన ఆంక్షల వల్ల తీవ్రమైన ఫలితాలు కనిపించాయి.

1973, జూలై నెలలో ఒక బ్యారెల్ చమురు ధర 2.90 డాలర్లుగా ఉండేది. అది 1973, డిసెంబర్ నాటికి 11.65 డాలర్లకు పెరిగింది.

ఈ ఆంక్షలు అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని మాంద్యంలోకి నెట్టాయి. ఇది లక్షలాది మంది అమెరికన్ల జీవితాలను ప్రభావితం చేసింది.

1971 యుద్ధం కలిగించిన ఆర్థిక ప్రభావాలతో అప్పటికే పోరాడుతున్న భారతదేశపు చమురు దిగుమతి బడ్జెట్ కూడా దాదాపు మూడు రెట్లు పెరిగింది.

ద్రవ్యోల్బణం కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉప్పెనలా వెల్లువెత్తాయి. ఇది భారత రాజకీయాలను కూడా చాలావరకు ప్రభావితం చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)