Home జాతీయ national telgu మూత్ర విసర్జన తర్వాత కొన్ని చుక్కలు పడుతున్నాయా.. అసలు సమస్యేంటి?

మూత్ర విసర్జన తర్వాత కొన్ని చుక్కలు పడుతున్నాయా.. అసలు సమస్యేంటి?

6
0

SOURCE :- BBC NEWS

ఆరోగ్యం, మూత్రవిసర్జన, యూరిన్, పీఎండీ

ఫొటో సోర్స్, Getty Images

మూత్ర విసర్జన చేసిన కొద్ది సెకన్ల తర్వాత లేదా వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చాక అకస్మాత్తుగా కొన్ని చుక్కలు పడడాన్ని ‘పోస్ట్ మిక్చురిషన్ డ్రిబుల్’ అంటారు.

ఈ సమస్య పైకి చిన్నదిగా అనిపించినప్పటికీ, ఇది చాలామంది పురుషుల దైనందిన జీవితంపై, ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

వయస్సు పెరిగే కొద్దీ ఈ సమస్య వస్తుందని ఒక సాధారణ అపోహ ఉంది, కానీ వాస్తవానికి పీఎండీ యువకులలో కూడా అంతే సాధారణంగా కనిపిస్తుంది.

పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడటం, మూత్రనాళంలో కొన్ని చుక్కలు ఉండిపోవడం, తప్పుడు మూత్ర విసర్జన పద్ధతులు దీనికి ప్రధాన కారణాలు.

పీఎండీ అసలు ఎందుకు జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాలి? నివారణకు ఏం చేయాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

మూత్ర విసర్జన తర్వాత కొన్ని క్షణాలకు అకస్మాత్తుగా చుక్కలు పడటం, లోదుస్తులు తడిసిపోవడం లేదా వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసౌకర్యంగా అనిపించడం వంటి అనుభవాలు చాలామంది పురుషులకు తరచుగా ఎదురవుతాయి. ఈ సమస్య సాధారణమైనదే అయినప్పటికీ, చాలామంది పురుషులు దీని గురించి మాట్లాడటానికి సంకోచిస్తారు.

సిగ్గు పడటం లేదా ఎవరైనా ఎగతాళి చేస్తారనే భయం, ‘వయసు పెరిగితే ఇలాగే జరుగుతుంది’ అనే అపోహ లేదా ఇది అంత తీవ్రమైన విషయం కాదని భావించడం వంటి కారణాల వల్ల ‘పోస్ట్ మిక్చురిషన్ డ్రిబుల్’ అనే అంశం పెద్దగా బయటికి రాదు.

నిజానికి పీఎండీ అనేది వృద్ధులకు మాత్రమే వచ్చే సమస్య కాదు. చాలామంది యువకులు కూడా ఈ అనుభవాన్ని ఎదుర్కొంటారు. మూత్రం చుక్కలు అకస్మాత్తుగా పడటం వల్ల రోజంతా తేమగా అనిపించడం, పని చేసే చోట అసౌకర్యానికి గురికావడం, నిరంతరం బట్టల మీద దృష్టి పెట్టడం, బయట ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఒత్తిడి పెరగడం వంటి వాటివల్ల దైనందిన జీవితం, ఆత్మవిశ్వాసం దెబ్బతింటాయి.

చాలామంది పురుషులు ఈ సమస్యను నేరుగా ప్రోస్టేట్‌కు ముడిపెట్టి అనవసరమైన భయాన్ని పెంచుకుంటారు. కొందరు ఇంటర్నెట్‌లో తప్పుడు సమాచారాన్ని చదివి అయోమయానికి గురవుతారు, మరికొందరు దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు.

ఆరోగ్యం, మూత్రవిసర్జన, యూరిన్, పీఎండీ

ఫొటో సోర్స్, Getty Images

అయితే, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. పీఎండీ అనేది తీవ్రమైన వ్యాధి కాదు. పెల్విక్ ఫ్లోర్ కండరాల బలం తగ్గడం, మూత్రనాళంలో కొంచెం మూత్రం నిలిచిపోవడం లేదా ఎక్కువ సేపు కూర్చునే అలవాటు వంటి కారణాల వల్ల ఇది సంభవించవచ్చు.

సరైన వ్యాయామం, కొన్ని సాధారణ మెళుకువలు, సరైన మూత్ర విసర్జన పద్ధతిని అనుసరించడం ద్వారా పీఎండీని సులభంగా తగ్గించుకోవచ్చు.

పీఎండీ అనుభవం చాలా మంది పురుషులకు ఉంటుంది కానీ, దీని గురించి మాట్లాడటానికి ఎక్కువగా ముందుకురారు.

అందుకే ఈ సమస్య వెనుక ఉన్న విజ్ఞానాన్ని, కారణాలను, పరిష్కారాలను అర్థం చేసుకోవడమే మొదటి, అత్యంత కీలకమైన అడుగు.

ఆరోగ్యం, మూత్రవిసర్జన, యూరిన్, పీఎండీ

ఫొటో సోర్స్, Getty Images

పీఎండీ అంటే ఏమిటి?

పీఎండీ అంటే, మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రనాళంలో చిక్కుకుపోయిన మూత్రం చుక్కలు తర్వాత బయటకు రావడం. వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన కొన్ని సెకన్ల తర్వాత లేదా నిమిషాల తర్వాత అకస్మాత్తుగా చుక్కలు పడటం దీని ప్రధాన లక్షణం.

ఈ సమస్య చాలా వరకు మూత్రనాళం దిగువ భాగంలో కొంచెం మూత్రం నిలిచిపోవడం వల్ల వస్తుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనంగా ఉండటం, ప్రోస్టేట్ గ్రంథి పెరగడం, ఎక్కువ సేపు కూర్చునే అలవాటు, సరైన పద్ధతిలో మూత్ర విసర్జన చేయకపోవడం లేదా మూత్రనాళ కండరాల మధ్య సమన్వయం లేకపోవడం వంటి కారణాల వల్ల పీఎండీ పెరుగుతుంది.

థానేలోని కిమ్స్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ అఖిల్ ఖాన్ దీని గురించి బీబీసీ మరాఠీకి మరిన్ని వివరాలు అందించారు.

“పోస్ట్ మిక్చురిషన్ డ్రిబుల్ సంప్రదాయ ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్’ కిందికి రాదు. ఇది ‘వాయిడింగ్ డిస్ఫంక్షన్’ అనే ప్రత్యేక విభాగంలోకి వస్తుంది. ఇందులో మూత్ర విసర్జన తర్వాత మూత్రనాళంలో కొంతమూత్రం నిలిచిపోయి, ఆ తర్వాత బయటకు వస్తుంది” అన్నారు డాక్టర్ అఖిల్ ఖాన్.

ఈ సమస్య అసౌకర్యంగా అనిపించినప్పటికీ, సరైన వ్యాయామం, పద్ధతులను పాటిస్తే సులభంగా అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యం, మూత్రవిసర్జన, యూరిన్, పీఎండీ

ఫొటో సోర్స్, Getty Images

పెల్విక్ ఫ్లోర్ అంటే ఏమిటి?

పెల్విక్ ఫ్లోర్ అంటే పొత్తికడుపు దిగువ భాగంలో ఉండే కండరాలు, కణజాలాలు, లిగ్మంట్స్‌తో కూడిన ఒక బలమైన, సాగే గుణం కలిగిన పొర వంటి నిర్మాణం. ఈ మొత్తం నిర్మాణం ఒక ఉయ్యాల వంటి నెట్‌వర్క్‌లా పనిచేస్తుంది. ఇది పెల్విస్‌‌లోని ముఖ్యమైన అవయవాలైన మూత్రాశయం, మూత్రనాళం, పేగులు, పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి స్థిరంగా ఉండేందుకు కారణమవుతుంది.

మనం నిలబడినప్పుడు లేదా కదులుతున్నప్పుడు ఈ కండరాలు అవయవాల బరువును మోస్తూ, వాటిని సరైన స్థితిలో ఉంచుతాయి. ఈ కండరాల మరొక ముఖ్యమైన పని ఏమిటంటే.. మూత్రం, మల విసర్జనను నియంత్రించే కవాటాలకు ఆధారాన్ని అందించడం. శ్వాస తీసుకోవడం, దగ్గడం, తుమ్మడం, బరువులు ఎత్తడం లేదా వ్యాయామం చేసేటప్పుడు కడుపులో ఒత్తిడి పెరుగుతుంది. ఆ సమయంలో పెల్విక్ ఫ్లోర్ ఆ ఒత్తిడిని తట్టుకుని అవయవాలకు సరైన స్థిరత్వాన్ని ఇస్తుంది.

అందుకే, శరీర సమతుల్యతకు, అంతర్గత శక్తికి, మలమూత్ర విసర్జనపై నియంత్రణకు పెల్విక్ ఫ్లోర్ చాలా కీలకం. కానీ, మనలో చాలామంది దీని గురించి పెద్దగా పట్టించుకోరు.

ఆరోగ్యం, మూత్రవిసర్జన, యూరిన్, పీఎండీ

ఫొటో సోర్స్, Getty Images

ఎవరికి వస్తుంది? ప్రోస్టేట్‌తో సంబంధం ఉందా?

పీఎండీ రావడానికి అత్యంత సాధారణ కారణం పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడటం లేదా వాటి మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవడం. మూత్ర విసర్జన చివరలో మిగిలిన చుక్కలను బయటకు పంపే పనిని ఈ కండరాలే చేస్తాయి.

పెల్విక్ ఫ్లోర్ బలహీనంగా ఉన్నప్పుడు మూత్రనాళంలో కొంచెం మూత్రం నిలిచిపోయి, ఆ తర్వాత బయటకు వస్తుంది. ఈ సమస్య కేవలం వృద్ధులలోనే వస్తుందనే నమ్మకం తప్పు. యువకులలో కూడా ఎక్కువ సేపు కూర్చునే అలవాటు, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం లేదా మూత్ర విసర్జన సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల పీఎండీ వచ్చే అవకాశం పెరుగుతుంది.

పీఎండీకి ప్రోస్టేట్‌తో నేరుగా సంబంధం ఉంటుందనేది మరొక సాధారణ అపోహ. నిజానికి కొన్ని సందర్భాల్లో ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడం ఒక కారణం కావొచ్చు. కానీ మెజారిటీ పురుషులకు, ముఖ్యంగా యువకులకు ఎటువంటి ప్రోస్టేట్ వ్యాధి ఉండదు. వారిలో కనిపించే పీఎండీ అనేది నిర్మాణపరమైన సమస్య కాదు, అది కండరాల పనితీరుకు సంబంధించిన ‘ఫంక్షనల్’ సమస్య మాత్రమే.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పీఎండీ కేవలం చుక్కలు పడటమే కాకుండా ఇతర లక్షణాలతో కలిసి కనిపిస్తే పరీక్ష అవసరం.

ఉదాహరణకు: మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రధార సన్నగా ఉండటం, మూత్ర విసర్జనకు ఒత్తిడి పెట్టాల్సి రావడం, మాటిమాటికీ మూత్రం వస్తున్నట్లు అనిపించడం, మూత్రంలో రక్తం పడటం లేదా పెల్విక్ భాగంలో నొప్పి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే మూత్రనాళ ఇన్ఫెక్షన్, మూత్రనాళం సన్నబడటం లేదా ప్రోస్టేట్ వాపు వంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించుకోవాలి.

ఆరోగ్యం, మూత్రవిసర్జన, యూరిన్, పీఎండీ

ఫొటో సోర్స్, Getty Images

నిర్ధరణ ఎలా?

ఈ సమస్యను గుర్తించడానికి రోగి చెప్పే లక్షణాలు, డాక్టర్ చేసే ప్రాథమిక పరీక్షలు సరిపోతాయి. అవసరమనుకుంటే మరిన్ని వివరాల కోసం యూరోఫ్లోమెట్రీ లేదా యూరిన్ అనాలిసిస్ వంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు

ఈ సమస్యను అదుపు చేయడంలో (లేదా నివారించడంలో) అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. సరైన పద్ధతిలో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ చేయడం.

“దీని నిర్ధరణ ప్రధానంగా క్లినికల్ అంశాలపై, అంటే లక్షణాల చరిత్ర, శారీరక పరీక్షపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యూరిన్ అనాలిసిస్ లేదా యూరోఫ్లోమెట్రీ వంటి పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇవ్వవచ్చు. మూత్ర విసర్జన ఆగిపోయిన తర్వాత కూడా చుక్కలు పడుతుండడం వంటి విషయాలను స్వయంగా గమనించవచ్చు. అయితే, దీని వెనుక మరేదైనా తీవ్రమైన కారణం లేదని నిర్ధరించుకోవడానికి సరైన వైద్య పరీక్ష అవసరం” అని డాక్టర్ అఖిల్ ఖాన్ అన్నారు.

“పీఎండీ నివారణ ప్రక్రియలో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామం అత్యంత ముఖ్యమైన విషయం. ‘యూరెత్రల్ మిల్కింగ్’ అంటే మూత్ర విసర్జన తర్వాత స్క్రోటం (వృషణాలు) వెనుక భాగంపై స్వల్పంగా ఒత్తిడి పడడం. దీనివల్ల మిగిలిపోయిన మూత్రం బయటకు రావడానికి సహాయపడుతుంది. ఒక సాధారణ పొరపాటు ఏమిటంటే.. కీగల్ ఎక్సర్‌సైజులు తప్పుడు పద్ధతిలో లేదా క్రమం తప్పకుండా చేయడం. అందుకు సరైన మార్గదర్శకత్వం అత్యంత అవసరం. ఇన్ఫెక్షన్ లేదా ప్రోస్టేట్ వాపు వంటి సంబంధిత సమస్యలు లేనంత వరకు దీనికి మందుల అవసరం ఉండదు” అన్నారు.

ఆరోగ్యం, మూత్రవిసర్జన, యూరిన్, పీఎండీ

ఫొటో సోర్స్, Getty Images

పీఎండీతో పాటు కనిపించే సమస్యలు

పీఎండీ ఉన్నప్పటికీ కొన్ని వేరే లక్షణాలు కనిపిస్తుంటే, అవి మరింత తీవ్రమైన సమస్యకు సూచన కావచ్చు. మూత్రం నుంచి రక్తం రావడం, మంట, జ్వరం, పెల్విక్ లేదా పెరినియల్ నొప్పి, బలహీనమైన ధార లేదా తరచుగా ఇన్ఫెక్షన్ రావడం వంటి లక్షణాలు తక్షణం పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తాయి. ఇటువంటి స్థితిలో స్ట్రిక్చర్, ఇన్ఫెక్షన్ లేదా అబ్‌స్ట్రక్షన్ వంటివి జరిగి ఉండవచ్చు.

దీని గురించి ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో యూరాలజిస్ట్, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్యామ్ వర్మ మరింత సమాచారం అందించారు.

“ఒకవేళ పీఎండీతో పాటు మూత్రం నుంచి రక్తం, నొప్పి లేదా బలహీనమైన ధార వంటి లక్షణాలు కనిపిస్తుంటే, అది కేవలం పీఎండీ మాత్రమే కాదు. అది ఒక అంతర్గత సమస్య అవ్వొచ్చు, పరీక్షలు అవసరమవుతాయి” అన్నారు డాక్టర్ శ్యామ్ వర్మ .

మూత్రనాళం దిగువ భాగంలో ఉండే ఇతర సమస్యలతో పాటే పీఎండీ కూడా తరచుగా కనిపిస్తుంటుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్(మూత్రాశయం) ఉన్నవారికి ఇప్పటికే మాటిమాటికీ మూత్రం రావడం, అత్యవసరంగా వెళ్లాల్సి రావడం వంటి ఇబ్బందులు ఉంటాయి. దీనికి తోడు మూత్ర విసర్జన తర్వాత చుక్కలు పడటం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది. ఇటువంటి సమయాల్లో మూత్రనాళం సన్నబడటం, ఇన్ఫెక్షన్ లేదా మూత్ర ప్రవాహానికి అడ్డంకులు వంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రోస్టటైటిస్‌లో వచ్చే వాపు, పెల్విక్ ఫ్లోర్ కండరాల నొప్పుల వల్ల కలిగే సంకోచాలు పీఎండీ ని మరింత పెంచుతాయి.

“మూత్రాశయం అతిగా స్పందించడం, మూత్రనాళం సన్నబడటం లేదా ప్రోస్టటైటిస్ వల్ల వచ్చే వాపు.. ఇవన్నీ డ్రిబ్లింగ్‌పై ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మూత్రనాళం పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది” అని డాక్టర్ వర్మ తెలిపారు.

క్లినికల్ పరీక్షలు ఎలా జరుగుతాయి?

క్లినికల్ పరీక్ష అనేది రోగి నుంచి పూర్తి వివరాలను తెలుసుకోవడంతో మొదలవుతుంది. డ్రిబ్లింగ్ ఎప్పుడు అవుతుంది, ఎంత పరిమాణంలో అవుతుంది, మంట లేదా నొప్పి ఉందా, దీనివల్ల దైనందిన జీవితంపై ఎంత ప్రభావం పడుతోంది.. వంటి విషయాలను డాక్టర్లు తెలుసుకుంటారు.

ఆ తర్వాత శారీరక పరీక్ష, అవసరమైతే ప్రోస్టేట్ ఎవల్యూయేషన్, అలాగే మూత్ర పరీక్ష, యూరోఫ్లోమెట్రీ, పోస్ట్-వాయిడ్ రెసిడ్యూ (మూత్ర విసర్జన తర్వాత మిగిలిన మూత్రం) కొలవడం వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. ప్రమాదకర లక్షణాలు ఏవైనా ఉంటే సిస్టోస్కోపీ లేదా ఇమేజింగ్ పరీక్షలను సూచిస్తారు.

పీఎండీ నిరంతరం అవుతున్నా, పెరుగుతున్నా, ఇబ్బందికరంగా ఉన్నా లేదా మంట, నొప్పి, మూత్రంలో రక్తం లేదా బలహీనమైన ధార వంటి ఇతర లక్షణాలతో కూడి ఉన్నా పరీక్ష తప్పనిసరి. ముఖ్యంగా యువకులు దీనిని అశ్రద్ధ చేయకూడదు.

తక్కువ స్థాయిలో ఉండే పీఎండీ ప్రమాదకరం కాదు, కానీ అది ఏదైనా పెద్ద సమస్యకు లక్షణమైతే.. నిర్ధరణ ఆలస్యమై ఇబ్బంది పెరగవచ్చు. చాలా సందర్భాల్లో మానసిక అసౌకర్యం, జీవన ప్రమాణాలు తగ్గడమే పెద్ద సమస్యగా మారుతుంది.

ఆరోగ్యం, మూత్రవిసర్జన, యూరిన్, పీఎండీ

ఫొటో సోర్స్, Getty Images

పీఎండీ ఉన్నవారు ఒక సాధారణ ‘బ్లాడర్ డైరీ’ని నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రిబ్లింగ్ ఎప్పుడు అవుతుంది, ఎన్నిసార్లు అవుతుంది, తాగే నీటి పరిమాణం ఎంత, మూత్ర విసర్జన తర్వాత కాసేపు వేచి ఉండటం వల్ల ఏమైనా తేడా కనిపిస్తుందా వంటి వివరాలను ఇందులో నమోదు చేయవచ్చు.

అయితే, ఈ వివరాలు రాసుకున్నంత మాత్రాన డాక్టరును సంప్రదించాల్సిన అవసరం లేదని కాదు. లక్షణాలు పెరుగుతుంటే వైద్య సహాయం కచ్చితంగా తీసుకోవాలి.

దీనిపై డాక్టర్ వర్మ మాట్లాడుతూ, “ఈ డైరీతో సమస్య తీరు అర్థమవుతుంది కాబట్టి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, లక్షణాలు తగ్గకుండా అలాగే ఉంటే కేవలం సొంత పరిశీలన సరిపోదు, క్లినికల్ పరీక్ష తప్పనిసరి” అని తెలిపారు.

“కేవలం కొన్ని చుక్కలు పడటం వెనుక ఏదైనా పెద్ద కారణం ఉన్నప్పుడు మాత్రమే మందుల అవసరం ఉంటుంది. కేవలం పీఎండీ కోసం మందులు ఇవ్వడం చాలా అరుదు. పెల్విక్ ఫ్లోర్ ట్రైనింగ్ , యూరెత్రల్ మిల్కింగ్ అనేవి పీఎండీ నివారణకు అత్యంత ఉపయోగకరమైన, శాస్త్రీయంగా నిరూపితమైన పద్ధతులు” అన్నారు.

కీగల్ ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు కొన్ని విషయాలను గమనించడం అవసరమని డాక్టర్ వర్మ చెప్పారు.

“ఇందులో చేసే అతిపెద్ద తప్పులు ఏమిటంటే.. తప్పుడు కండరాలను బిగించడం, కడుపు, పిరుదులు లేదా తొడల కండరాలను ఎక్కువగా ఉపయోగించడం, శ్వాస ఆపి వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా చేయడం లేదా కొన్ని రోజుల్లోనే ఫలితాలు రావాలని ఆశించడం.

చాలామంది పురుషులు ‘స్క్వీజింగ్’ రకం వ్యాయామాలు చేస్తారు, కానీ పెల్విక్ ఫ్లోర్ కండరాలను సరైన పద్ధతిలో ఎలా సంకోచింపజేయాలో వారికి తెలియదు. మీరు ఎంత తీవ్రంగా వ్యాయామం చేస్తున్నారు అనేదాని కంటే, ఆ వ్యాయామం చేసే విధానం (టెక్నిక్) చాలా ముఖ్యం.” అన్నారు వర్మ.

మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు

ఆరోగ్యపరంగా దీనివల్ల పెద్ద ప్రమాదం లేకపోయినా, పీఎండీ వల్ల చాలామంది పురుషులలో సిగ్గు, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటివి కనిపిస్తాయి. బట్టలపై మరకలు పడతాయనే భయం వల్ల సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండే ధోరణి కూడా కనిపిస్తుంది.

దీనిపై డాక్టర్ వర్మ మాట్లాడుతూ, “చాలామంది రోగులు పీఎండీ గురించి మాట్లాడటానికి సంకోచిస్తారు. కానీ ఇది సాధారణమైన, చికిత్స చేయదగిన సమస్య, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు” అన్నారు.

జీవనశైలిలో ఏదైనా ముఖ్యమైన మార్పు చేయాలన్నా, ఆహారంలో మార్పులు అన్నా లేదా శారీరక వ్యాయామాలు ప్రారంభించాలన్నా వైద్యుల, సరైన శిక్షకుల సహాయం తీసుకోవడం అవసరం.

మన శరీరాన్ని అలాగే లక్షణాలను వైద్యుల ద్వారా సరైన పద్ధతిలో పరీక్షించుకుని, వారి సలహా మేరకు మాత్రమే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఉత్తమం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)