SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఏకమై భీకర దాడులు చేసినప్పటికీ ఇరాన్ ప్రభుత్వం అంతర్గత భద్రతపై తన పట్టును కోల్పోలేదు. నాయకత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నప్పటికీ, యుద్ధ సమయంలో పెద్ద ఎత్తున నిరసనలు జరగలేదు.
కొంతమంది నిపుణులు దీనిని యుద్ధం ప్రారంభమైన తర్వాత ఏర్పడిన ‘అణచివేత వాతావరణం’తో ముడిపెట్టి చూస్తున్నారు.
జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఇరాన్ ప్రభుత్వం అణచివేసిన తీరు, ప్రజల్లో భయాన్ని నింపింది.
చెక్-పోస్టులు, భారీ భద్రత దళాల మోహరింపు, రోజువారీ అరెస్టులతో ప్రభుత్వం తన నియంత్రణను మరింత కఠినతరం చేసింది.
మానవ హక్కుల కార్యకర్తలు, అసమ్మతివాదులు యుద్ధానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను విదేశీ మీడియాకు పంపారనే ఆరోపణలు ఉన్న వారిని కూడా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది.

ఇంటర్‌నెట్ సేవలను దాదాపు పూర్తిగా నిలిపేయడం వల్ల ప్రజలు సంఘటితమయ్యే శక్తి మరింత పరిమితమైపోయింది.
కమ్యూనికేషన్, సమన్వయం, సమాచార మార్పిడి ఆధారంగా నిరసనలను నిర్వహించే నెట్‌వర్క్‌లు చాలావరకు దెబ్బతిన్నాయి.
మరోవైపు, ఇరాన్ ప్రభుత్వం తమ మద్దతుదారులకు పరిమితంగా ఇంటర్‌నెట్ సదుపాయాన్ని కల్పిస్తూ.. తన వాదనను ప్రపంచానికి వినిపిస్తోంది.
దీనివల్ల, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రమాదకరంగా మారడమే కాకుండా, ప్రజలను ఏకం చేయడం కూడా అత్యంత కష్టతరమైంది. ముఖ్యంగా యుద్ధం కొనసాగుతున్న సమయంలో ప్రజలు తమ ప్రాణరక్షణకే ప్రాధాన్యం ఇస్తారు.
ఫొటో సోర్స్, TABNAK
ఆ ప్రచారాన్ని ఎలా అదుపుచేస్తున్నారు?
అన్ని యుక్తులతో పాటు, యుద్ధం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ పోరాటాన్ని కేవలం ‘ఇస్లామిక్ రిపబ్లిక్’ ప్రభుత్వంపై దాడిగా కాకుండా, ఇరాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా అక్కడి పాలకులు చూపిస్తున్నారు.
ఈ వ్యత్యాసం చాలా కీలకమైంది. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు కూడా, విదేశీ దాడులు జరిగినప్పుడు జాతీయవాద భావనలకు లోనయ్యే అవకాశం ఉంది. దీనిని తరచుగా ”ర్యాలీ-అరౌండ్-ది-ఫ్లాగ్” ప్రభావం అని పిలుస్తారు. ఇదే పరిస్థితి 2025 జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా కనిపించింది.
దీనివల్ల ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు ఏకమయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
ప్రభుత్వ మీడియా పౌరుల మరణాల గురించి ఎక్కువగా ప్రచారంచేస్తూ, తమ దాడులను కేవలం ఆత్మరక్షణ చర్యలుగా చెప్పుకుంటూ, ఈ వాదనను నిరంతరం బలపరుస్తోంది.
అదే సమయంలో, ప్రభుత్వ మద్దతుదారులు నిర్వహించే ర్యాలీలు, ప్రదర్శనలు దేశంలో ‘నియంత్రణ, స్థిరత్వం, బలం’ ఉన్నాయనే ఇమేజ్‌ను సృష్టిస్తున్నాయి.
ఫొటో సోర్స్, TASNIM
సంక్షోభాలను తట్టుకునేలా వ్యవస్థ…
అగ్ర నాయకత్వంపై దాడులు జరిగినప్పటికీ అధికారిక వ్యవస్థ కుప్పకూలకపోవడానికి ప్రధాన కారణం దాని నిర్మాణమే.
ఇరాన్ వ్యవస్థ కేవలం ఒక వ్యక్తిపై ఆధారపడి లేదు. అది మతపరమైన, సైనిక, రాజకీయ, ఆర్థిక సంస్థల నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంది.
అధికారం అనేక సంస్థల మధ్య విభజితమైంది. ఉదాహరణకు సైన్యం, మతపరమైన నాయకత్వం, భద్రతా సంస్థలు. దీనివల్ల, ఎవరైనా అగ్రనేతను తొలగించినా వ్యవస్థ నిరంతరాయంగా కొనసాగుతుంది.
అధికార వారసత్వానికి సంబంధించిన అధికారిక, అనధికారిక ఏర్పాట్లు కూడా ఈ కొనసాగింపునకు సహాయపడతాయి.
ఈ పటిష్టతకు కేంద్ర బిందువు ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్’ (ఐఆర్‌జీసీ). ఇది కేవలం సైన్యం మాత్రమే కాదు, రాజకీయ, ఆర్థిక, భద్రతా శక్తి కూడా. దీనికి దేశవ్యాప్తంగా లోతైన పట్టు ఉంది.
సీనియర్ కమాండర్లు హతమైనప్పటికీ, ఈ సంస్థ పనిచేస్తూనే ఉంది. అంతర్గత, బాహ్య అంశాలతో పాటు ప్రజల ప్రతిస్పందనలను కూడా నియంత్రిస్తోంది.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు సైన్యం లేదా భద్రతా వ్యవస్థలో పెద్దఎత్తున చీలికలు లేదా తిరుగుబాటు సంకేతాలు కనిపించలేదు. సాధారణంగా ఒకరి అధికార పీఠం కుప్పకూలడానికి ఇవే ప్రధాన సంకేతాలుగా ఉంటాయి.
ఫొటో సోర్స్, AFP via Getty Images
మనుగడ సాగించడమే ప్రధాన వ్యూహం
ఇరాన్ ఈ యుద్ధంలో సంప్రదాయబద్ధమైన విజయాన్ని సాధించడానికి ప్రయత్నించడం లేదు. దానికి బదులుగా ఒక భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది, అదే శత్రువు తాలూకా యుద్ధ వ్యయాలను పెంచడం, సంఘర్షణను సుదీర్ఘ కాలం పాటు సాగదీయడం.
ఇరాన్ నాయకత్వం దృష్టిలో ‘విజయం’ అంటే యుద్ధం తర్వాత కూడా తమ అధికారం పదిలంగా ఉండటమే. దీనిలో భాగంగానే అది తన శక్తిని, ముఖ్యంగా ‘హార్ముజ్ జలసంధి’ని ఉపయోగించుకుంటూ ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతోంది.
దీనివల్ల ఈ యుద్ధం కేవలం సైనిక ఘర్షణగానే కాకుండా, ఎవరు ఎక్కువ కాలం తట్టుకుని నిలబడగలరు అనే పోరాటంగా మారింది. ఎవరు అలసిపోతే వారు ఓడిపోయినట్లే.
అంతేకాకుండా, వారి సిద్ధాంతం కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. షియా సంప్రదాయానికి చెందిన ‘ప్రతిఘటన, త్యాగం, బలిదానం’ అనే ఆలోచనలను నిరంతరం బలపరుస్తున్నారు.
ఈ నిర్మాణంలో సైనికుల మరణాన్ని ఓటమిగా కాకుండా, వీరమరణంగా చిత్రీకరిస్తారు. ఇదే ధోరణి 1980వ దశకంలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా కనిపించింది.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రతిపక్షం ఎక్కడ?
ఇరాన్ ప్రజల్లో అసంతృప్తి విస్తృతంగా ఉన్నప్పటికీ, దానిని ఒక వ్యవస్థీకృత రాజకీయ సవాలుగా మార్చగల ఏకీకృత నాయకత్వం అక్కడ లేదు.
విపక్షాలు చీలిపోయి ఉన్నాయి. చాలామంది నాయకులు దేశం బయట ఉన్నారు, దేశంలో ఉన్నవారు జైలు పాలయ్యారు.
చరిత్ర చెబుతున్న పాఠం ఏమిటంటే, కేవలం అసంతృప్తి మాత్రమే అధికార మార్పిడిని తీసుకురాలేదు. దాని కోసం బలమైన సంస్థ, నాయకత్వం, ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా అవసరం.
బయట నుంచి ఒత్తిళ్ల వల్ల ప్రస్తుత వ్యవస్థ బలహీనపడినా, ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనిశ్చితంగా ఉంది.
లిబియా, ఇరాక్ తదితర దేశాల చూస్తే, సరైన ప్రత్యామ్నాయం సిద్ధంగా లేకపోతే దేశంలో అరాచకం, సుదీర్ఘ కాలం పాటు అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని అర్థమవుతుంది.
ఫొటో సోర్స్, Majid Saeedi/Getty Images
ఇరాన్‌కు ఈ బలం శాశ్వతంగా ఉంటుందా?
ప్రస్తుతానికి ఇరాన్ వ్యవస్థ నిలదొక్కుకున్నట్లు కనిపిస్తోంది. సంస్థాగత పటిష్టత, అణచివేత సామర్థ్యం, వ్యూహాత్మక సరళత, భౌగోళిక రాజకీయ స్థితి దీనికి ప్రధాన కారణాలు. అయితే, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.
ప్రజలపై అవసరానికి మించిన నియంత్రణ విధించడం కొన్నిసార్లు బెడిసికొట్టవచ్చు. సమాచారంపై పూర్తిగా ఆధారపడే వ్యవస్థలు కాలక్రమేణా బలహీనపడతాయి. దీనివల్ల భవిష్యత్తులో పెద్దఎత్తున కుదుపులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
చివరగా, ఇరాన్ భవిష్యత్తు బాహ్య దాడుల కంటే అంతర్గత కారకాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అధికారం ఏకతాటిపై ఉండటం, సామాజిక ఐక్యత, ఆర్థిక సంక్షోభం, ‘నియంత్రణ వర్సెస్ ఒత్తిడి’ మధ్య సమతుల్యత వంటివి.
అందుకే, ప్రభుత్వం వీధుల్లో కూడా ఒక సమాంతర యుద్ధాన్ని చేస్తోంది. తద్వారా రాబోయే తిరుగుబాట్లు ఏవైనా లేదా ప్రజల ఆగ్రహాన్ని ప్రారంభంలోనే అణచివేయవచ్చని వారి భావన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



