SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) శనివారం నుంచి ప్రారంభం కానుండడంతో అందరి దృష్టి కీలక ఆటగాళ్లపైనే ఉండనుంది, అందులో ఓ టీనేజర్‌పైనా అందరి చూపూ ఉంది.
ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభానికి ఒకరోజు ముందు మార్చి 27న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్లు నిండాయి. అదే సమయంలో, అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి తలెత్తుతోంది. ఈ పెద్దవాళ్ల భారీ టోర్నమెంట్‌కు అతను సన్నద్ధమేనా? అని.
మూడేళ్ల కిందట, సుమారుగా తన తండ్రి వయసున్న బౌలర్లపై బ్యాట్ ఝుళిపిస్తూ సూర్యవంశీ తొలిసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
ఏదేమైనా, అప్పటి నుంచి తన బ్యాటింగ్ నైపుణ్యం, నిలకడగా రాణించడం, అత్యధిక స్ట్రైక్ రేట్‌తో భారీ స్కోర్లు సాధించాలనే తపన ప్రధానంగా కనిపించేవి.
క్రీజ్‌లో గంభీరంగా కనిపించే సూర్యవంశీ ఆటలో దూకుడెక్కువ. బంతి వచ్చేవరకు చూడకుండా, ఎదురెళ్లి ఆడుతాడు. అతని ఆటతీరు, స్ట్రోక్ ప్లే చూసిన కొందరు వైభవ్‌ను క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్‌తో పోలుస్తున్నారు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2020లో, “ఆటగాళ్ల భద్రత” పేరుతో కనీస వయోపరిమితి నిబంధనలను తీసుకొచ్చింది. అండర్ 19లోపు ఆటగాళ్లకు సంబంధించి నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. వాటి ప్రకారం, పదిహేనేళ్లలోపు వారెవరూ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేరు.
ఐసీసీ కనీస వయోపరిమితి నిబంధనలు తీసుకురావడం ఇదే తొలిసారి. 1996లో, కేవలం 14 ఏళ్ల 227 రోజుల వయసులో అరంగేట్రం చేసిన పాకిస్తానీ ఆటగాడు హసన్ రజా ఇప్పటివరకూ అత్యంత పిన్నవయస్కుడైన టెస్ట్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
రజా రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకపోయినా, వైభవ్‌కు ఒక అడ్డంకి దానంతట అదే తొలగిపోయింది. పదహారేళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన సచిన్ తెందూల్కర్ రికార్డును అధిగమించడం సూర్యవంశీకి ఇక అసాధ్యం కాకపోవచ్చు.
భారత సెలెక్టర్లు ఇంకా వేచిచూడకపోవచ్చు. తెందూల్కర్ తర్వాత ఎంతోమంది యువ క్రికెటర్లకు వేగంగా అవకాశాలు వచ్చినప్పటికీ, మెరుగ్గా రాణించి జట్టులోకి తీసుకోక తప్పని పరిస్థితులను సృష్టించిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో మలుపు..
చిత్రంగా, సూర్యవంశీ ఎదుగుదలకు తన ప్రతిభతో పాటు 2023లో వచ్చిన అవకాశాలు కూడా అంతే దోహదపడ్డాయి.
బీసీసీఐ ఆధ్వర్యంలో, వినూ మంకడ్ ట్రోఫీలో భాగంగా, చంఢీగడ్‌లో జరగాల్సిన అండర్ 19 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌ను సెలక్టర్ తిలక్ నాయుడు చూడాల్సి ఉంది.
దీంతో సమయం చిక్కడంతో.. అప్పటికే బిహార్‌కు చెందిన ఒక యువ క్రికెటర్ గురించి విన్న తిలక్ నాయుడు ఆ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు.
అక్కడ, ఇంకా టీనేజ్‌లోకి కూడా రాని సూర్యవంశీ 76 బంతుల్లో 86 పరుగులు చేసి అస్సాంపై బిహార్ జట్టును గెలిపించాడు. ఆ తర్వాత, అతను వేగంగా ఎదగడానికి ఆ ఇన్నింగ్స్ బలమైన పునాది వేసింది.
దానికితోడు మరో రెండు హాఫ్ సెంచరీల రికార్డుతో సూర్యవంశీ సామర్థ్యంపై నమ్మకం కుదిరిన తిలక్ నాయుడు వెంటనే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌కు అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌తో మాట్లాడి, ఆ బ్యాటర్‌కు మరింత ప్రోత్సాహాన్నిచ్చారు.
సూర్యవంశీ తనదైన శైలితో, నిలకడగా రాణిస్తూ ఒక్కో మెట్టు ఎక్కాడు.
అనంతరం, 2023 నవంబర్‌లో జరిగిన అండర్ 19 ఛాలెంజర్ ట్రోఫీలో పరుగుల వర్షం కురిపించిన వైభవ్ సూర్యవంశీ.. అదే నెల చివర్లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లోనూ భారత అండర్ 19 జట్టు తరఫున తన ఫామ్ కొనసాగించాడు.
ఏడాది తర్వాత అందరి దృష్టినీ అమితంగా ఆకర్షించాడు సూర్యవంశీ. 2024 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్ట్‌కు ఎంపికైన సూర్యవంశీ కేవలం 58 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆ ఇన్నింగ్స్ తనేంటో నిరూపించింది.
ఆ సమయంలో, ఇప్పడిప్పుడే రాణిస్తున్న ఒక బాలుడు ఐపీఎల్‌కు ఆడడం పెద్దవిషయమేనని, కాకపోతే ఇంత చిన్న వయసులోనే ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఎదుర్కోవడం వల్ల మంచి కంటే హాని జరిగే అవకాశమే ఎక్కువన్న వాదనలు కూడా వినిపించాయి.
ఐపీఎల్ 2025 సీజన్‌లో, అనుభవమున్న బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి బంతికే సిక్సర్ బాదడం ద్వారా అలాంటి ఆందోళనలన్నింటికీ సూర్యవంశీ తెరదించాడు.
ఆ తర్వాత కొద్దిరోజులకే, తనపై పెట్టిన సుమారు కోటి రూపాయలకుపైగా పెట్టుబడికి న్యాయం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే మెరుపు శతకం సాధించి సీనియర్ క్రికెట్‌లో సెంచరీ చేసిన అత్యంత చిన్నవయస్కుడిగా నిలిచాడు.
ఫొటో సోర్స్, ICC via Getty Images
ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ మాత్రమే సరిపోదు..
అయినా మరో మెలిక. ఐపీఎల్ కేవలం దేశీయంగా తమ ప్రతిభ నిరూపించుకునేందుకు ఒక వేదిక మాత్రమేనని, అదే సరిపోదని విమర్శకులు వాదించారు. అవి 2026 మొదట్లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ వరకూ కొనసాగాయి.
అదే సమయానికి, భారత్ తన విధానాన్ని కూడా కాస్త కఠినతరం చేసింది. వయసు ఎంత అనేదానితో సంబంధం లేకుండా టోర్నమెంట్‌లో ఆడేందుకు ఒక అవకాశం కల్పించడం. దీని ప్రధాన ఉద్దేశమేంటంటే.. వయసు విషయంలో జరిగే మోసాలను నివారించడం, ప్రమాణాల పెంపు, ఆటగాళ్లు త్వరగా జట్టులోకి రావడం కాకుండా.. పూర్తిగా సన్నద్ధమైన తర్వాతే జట్టులోకి వచ్చేలా చేయడం.
లీగ్ దశలో సూర్యవంశీ 72, 40, 52, 30 పరుగులు చేయడంతో భారత్ నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
కానీ, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సూర్యవంశీ.. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ, 55 బంతుల్లో సెంచరీ, మొత్తం 80 బంతుల్లో 15 సిక్సర్లు, 15 ఫోర్లతో 175 పరుగులు చేశాడు.
అప్పటికే, తనకంటే ఐదేళ్లు పెద్దవాళ్లతో ఆడుతున్న సూర్యవంశీని ఇక ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఆడించొద్దన్న డిమాండ్ మొదలైంది.
సూర్యవంశీ ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఆడడం అసలు సంబంధమే లేదన్నట్లుగా ఉండేది. కానీ, ఐసీసీ నిబంధనల ప్రకారం సీనియర్ జట్టులోకి తీసుకోవడం కుదరదు.
అయితే, సూర్యవంశీ ఆటపై మాజీ క్రికెటర్లలో ఆశ్చర్యం, అపనమ్మకం మధ్య ఊగిసలాట కనిపించేది.
“ఆ వయసులో సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ ఎంత బాగా రాణించారు. ఇతను ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా ఆడుతుంటే, టెస్ట్ క్రికెట్ ఎందుకు ఆడకూడదు” అని రవిశాస్త్రి అన్నారు.
ఫొటో సోర్స్, MB Media/Getty Images
మార్చి 27, మళ్లీ అదే రిపీట్ అవుతుందా?
“సూర్యవంశీ వయసుకు మించిన పరిణతి కలిగిన ఆటగాడు” అని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. “ఎలాంటి ఆటలోనైనా, ఎదగాలని కలలుకనే యువతకు సూర్యవంశీ ఐపీఎల్ సెంచరీ స్ఫూర్తిదాయకం” అని మాథ్యూ హేడెన్ అన్నారు.
సూర్యవంశీ ఆటతీరును “లైసెన్స్ టు థ్రిల్” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు డబ్ల్యూవీ రామన్.
“నిర్భయంగా ఆడడం, అతని బ్యాట్ కదిలే వేగం, బంతిని ముందుగానే అంచనా వేయడం, ఆ బంతిని కొట్టేటప్పుడు అతని ఎనర్జీ” వంటి వాటిని సచిన్ తెందూల్కర్ ప్రశంసించారు.
మార్చి 27న తన పుట్టినరోజు కేక్‌పై కొవ్వొత్తులు ఆర్పేసిన క్షణం.. అసలు ప్రశ్న రివర్స్ అవుతుంది. సీనియర్ జట్టుకు ఆడేందుకు అతను సిద్ధంగా ఉన్నాడా లేడా? అని కాదు, ప్రపంచం అందుకు సిద్ధంగానే ఉందా? అని.
భారత క్రికెట్ అభిమానులకు ఈ తేదీ ఇప్పటికే ప్రత్యేకం. ఎందుకంటే, 1994లో ఆక్లాండ్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కు ముందు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మెడనొప్పితో బాధపడుతుండడంతో తెందూల్కర్‌ను ఓపెనర్‌గా పంపించాడు మొహమ్మద్ అజారుద్దీన్.
ఆ మ్యాచ్‌లో 49 బంతుల్లో 82 పరుగులు చేసిన తెందూల్కర్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
వన్డేలలో ఓపెనర్‌గా 48.29 సగటుతో 15,310 పరుగులు సాధించాడు. తెందూల్కర్ 49 సెంచరీల్లో 45 ఓపెనర్‌గా చేసినవే.
అలా 1994 మార్చి 27 భారత క్రికెట్ గమనాన్ని సమూలంగా మార్చేసిందని చెప్పడం తప్పేమీ కాదు.
సుమారు 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు, అలాంటి మలుపు కోసమే ఎదురుచూస్తోంది ఇండియన్ క్రికెట్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



