SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన బాలేంద్ర షా (బాలెన్ షా).. నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గత ఏడాది యువత నిరసనలు చేపట్టిన తర్వాత దేశంలో జరిగిన తొలి ఎన్నికల్లో బాలెన్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఘనవిజయం సాధించింది.
35 ఏళ్ల బాలెన్ షా ఎదిగిన తీరు నేపాల్ రాజకీయాల్లో కీలకమైన మార్పుకు నాంది పలుకుతోంది.
అవినీతి, నెపోటిజం (బంధుప్రీతి), ఉన్నత వర్గాల విలాసాలపై ఆగ్రహంతో ఉన్న ఓటర్లను.. మార్పును తీసుకొస్తానని ఆయన చేసిన వాగ్దానం ఆకట్టుకుంది.
శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు.. నేపాల్ భవిష్యత్‌పై ఆశావాదంతో ఉన్న ఒక పాటను ఆయన విడుదల చేశారు.

”అవిభాజ్య నేపాలీ, ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం.. ” అంటూ ఒక ట్రాక్‌లో ఆయన పాడారు. విడుదలైన కొన్ని గంటల్లోనే దీనికి 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ పాట, నేపాల్‌లో అవినీతి, ఇతర సామాజిక సమస్యలను లేవనెత్తేందుకు సంగీతాన్ని ఉపయోగించిన అండర్‌గ్రౌండ్ ర్యాప్ సీన్‌లోని బాలెన్ షా మూలాలను గుర్తు చేస్తుంది.
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూకు మేయర్‌గా పనిచేసిన మూడేళ్లలోనే.. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీతో (ఆర్ఎస్‌పీ) జతకట్టి బాలెన్ షా ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీకి దిగారు. ఈ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
ఆయన మద్దతుదారులు మార్పుకు ఒక చిహ్నంగా చూస్తున్నారు. నేపాల్ పాతతరం రాజకీయ నాయకుల వైఫల్యాల నుంచి లభించిన ఒక విముక్తిగా భావిస్తున్నారు.
అయితే, నాలుగేళ్ల ఆర్‌ఎస్‌పీ పార్టీ ఇటువంటి సాహసోపేతమైన వాగ్దానాలను నెరవేర్చగలదా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో సోర్స్, Nepal Photo Library
బాలెన్ షా నేపథ్యం ఏమిటి?
బాలెన్ షా 1990లో కాఠ్‌మాండూలోని గైర్ గావ్‌లో జన్మించారు. బాలెన్ తండ్రి రామ్ నారాయణ్ షా ఆయుర్వేద వైద్యుడు, తల్లి ధ్రువదేవి.
బాలెన్ చిన్నప్పటి నుంచి సంగీత ప్రియుడని, ఆయనకు టోపీలంటే ఇష్టమని నేపాల్ వార్తాపత్రిక ‘మై రిపబ్లిక్’ రాసింది. ఆయన స్ట్రక్చరల్ ఇంజనీర్, ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, నటుడు, గీత రచయిత, కవిగా ప్రసిద్ధి చెందారు.
బాలెన్ షా కాఠ్‌మాండూలోని వైట్ హౌస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందారు.
కాలేజీ రోజుల్లో బాలెన్ విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 2022లో నేపాల్ స్థానిక ఎన్నికలతో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
మే 2022లో బాలెన్ షా నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ మేయర్‌గా ఎన్నికవడం, అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
ఆయన నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన శ్రీజన సింగ్‌ను ఓడించారు. షాకు 61,767 ఓట్లు, శ్రీజన సింగ్‌కు 38,341 ఓట్లు వచ్చాయి. ఓలి పార్టీ అభ్యర్థి కేశవ్ సత్పిత్ మూడవ స్థానంలో నిలిచారు.
అప్పుడు బాలెన్ షా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. నేపాల్‌లో బలంగా ఉన్న పార్టీలను ఓడించి తనను తాను నిరూపించుకున్నారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
నల్లటి సన్‌గ్లాసులు, నల్ల బ్లేజర్, నల్ల బ్రౌజర్ ఆయన ట్రేడ్‌మార్క్
”బాలెన్ షాను ఒక ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రజలు చూస్తారు. ఆయనొక గాయకుడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు” అని నేపాల్‌కు చెందిన విశ్లేషకుడు సీకే లాల్ గతంలో అన్నారు.
కాఠ్‌మాండూ మేయర్‌గా బాలెన్ షా తన పదవీకాలంలో నగరాన్ని శుభ్రం చేయడం, స్థానిక చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం, అవినీతిపై ఉక్కుపాదం మోపడం వంటివి చేపట్టారు.
అక్రమ భవనాలను కూల్చి వేసేందుకు ఒక వివాదాస్పద క్యాంపెయిన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. దీనివల్ల ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు కాస్త సాయపడినప్పటికీ, వీధి వర్తకులు, అనధికారిక నివాసాల్లో ఉంటున్న ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
బాలెన్ షా నేపాల్‌లోని అవినీతిని, సామాజిక అసమానతలను విమర్శిస్తూ అనేక పాటలను విడుదల చేశారు. మ్యూజిక్ వీడియోల్లో ఆయన విలక్షణమైన వ్యక్తిగా కనిపిస్తుంటారు. నల్లటి సన్‌గ్లాసులు, నల్ల బ్లేజర్, నల్ల బ్రౌజర్‌తో కనిపించడం ఆయన ట్రేడ్‌మార్క్.
ఆయన పాడిన పాటల్లో ఎక్కువగా ప్రజాదరణ పొందింది బలిదాన్. యూట్యూబ్‌లో దీనికి 14 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



