Home జాతీయ national telgu ‘చిన్నస్వామి స్టేడియంలో ఆ 11 సీట్లు శాశ్వతంగా ఖాళీగా ఉంచుతాం’ అని ఆర్సీబీ ఎందుకు అన్నది?

‘చిన్నస్వామి స్టేడియంలో ఆ 11 సీట్లు శాశ్వతంగా ఖాళీగా ఉంచుతాం’ అని ఆర్సీబీ ఎందుకు అన్నది?

8
0

SOURCE :- BBC NEWS

క్రికెట్, ఐపీఎల్, రాయల్ చాలెంజర్స్, క్రీడలు, బెంగళూరు, కర్ణాటక

ఫొటో సోర్స్, Getty Images

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తన హోమ్ గ్రౌండ్ ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్ ‌కోసం 11 సీట్లను ఖాళీగానే ఉంచాలని ఆలోచిస్తోంది.

ఐపీఎల్ 2025 విజయోత్సవాల సమయంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.

వారి జ్ఞాపకార్థం, ఆ స్టేడియంలో జరిగే ఆర్‌సీబీ మ్యాచ్‌లలో 11 సీట్లను ఖాళీగా ఉంచుతారు.

శనివారం ఈ స్టేడియంలో ఆర్‌సీబీ ఆడనుంది.

గత ఏడాది తొక్కిసలాట నేపథ్యంలో, అసలు ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారా లేదా అనేదీ కొన్ని వారాల క్రితం వరకూ ప్రశ్నార్థకంగా ఉండేది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్, ఐపీఎల్, రాయల్ చాలెంజర్స్, క్రీడలు, బెంగళూరు, కర్ణాటక

ఫొటో సోర్స్, Getty Images

ఆరోజు అసలేం జరిగిందంటే…

ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీని గెలవాలనే ఆర్‌సీబీ కల, కలగానే ఉండిపోయింది. అది సాకారం కావడానికి ఆర్‌సీబీ అభిమానులు దాదాపు 18 ఏళ్లుగా ఎదురుచూశారు.

2025 సీజన్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించి, తొలిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ దక్కించుకుంది.

దీంతో ఆర్‌సీబీ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

ఫైనల్ మ్యాచ్ జరిగిన జూన్ 3వ తేదీ మంగళవారం అర్ధరాత్రి నుంచి మర్నాడు బుధవారం తెల్లవారుజాము వరకూ బెంగళూరు అంతటా బాణసంచా కాల్చి ఆర్‌సీబీ విజయాన్ని ఆస్వాదించారు.

జూన్ 4వ తేదీ సాయంత్రం 3:30 గంటలకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయ యాత్ర ఉంటుందని ఆర్‌సీబీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఉదయం 7 గంటలకు ప్రకటన వెలువడింది.

ఈ విజయ యాత్రలో పాల్గొనాలనుకునేవారు ఉచిత పాస్‌లను తమ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆర్‌సీబీ మరో పోస్టులో ప్రకటించింది.

పోలీసులు, ఇతర అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రజలను కోరింది.

ఆ ప్రకటనలతో ఆర్‌సీబీ అభిమానులు భారీఎత్తున చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఈ విజయ యాత్ర కోసం సుమారు 2 లక్షలకు పైగా వచ్చారని, అయితే తాము అందులో సగం మాత్రమే వస్తారని ఊహించామని ఒక పోలీసు అధికారి బీబీసీతో అన్నారు.

ఈ అనూహ్యంగా పోటెత్తిన జనంతో స్టేడియం ముందు భారీ రద్దీ ఏర్పడింది. తర్వాత జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతుల్లో తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల కామాక్షి కూడా ఒకరు.

క్రికెట్, ఐపీఎల్, రాయల్ చాలెంజర్స్, క్రీడలు, బెంగళూరు, కర్ణాటక

ఫొటో సోర్స్, Getty Images

చిన్నస్వామి స్టేడియానికి మళ్లీ ఐపీఎల్ కళ…

జూన్ 4 నాటి తొక్కిసలాట సంఘటనతో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ), ఆర్‌సీబీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర అప్పుడు రిపోర్టర్లతో మాట్లాడుతూ, ”ఈ మొత్తం ఈవెంట్‌ను కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఆర్‌సీబీ యాజమాన్యం నిర్వహించాయి. ప్రభుత్వం కేవలం ఈ ఉత్సవంలో పాలుపంచుకోవాలని మాత్రమే భావించింది” అని చెప్పారు.

చిన్నస్వామి స్టేడియం భద్రతా కోణంలోనూ అనేక సందేహాలు వెల్లువెత్తాయి.

2025 మహిళల ప్రపంచకప్, 2026 మహిళల ప్రీమియర్ లీగ్, 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వడానికి బెంగళూరు స్టేడియాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.

దీంతో, అక్కడ మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు జరగకపోవచ్చని అంతా భావించారు.

ఆర్‌సీబీ యాజమాన్యం కూడా టోర్నమెంట్‌ను ఇతర వేదికలపై నిర్వహించాలనే ఆలోచించింది.

అదే సమయంలో, తమ టీమ్‌ను విక్రయించాలని ఆర్‌సీబీ యాజమాన్యం నిర్ణయించుకుందనే వార్తలు వచ్చాయి.

దీంతో అసలు బెంగళూరులో అసలు ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ నిరుడు డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఐపీఎల్‌కు తప్పనిసరిగా బెంగళూరులో మళ్లీ అతిథ్యం ఇవ్వాలని ఆయన ప్రయత్నాలు చేశారు.

చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం మార్చి 16వ తేదీన అనుమతి ఇచ్చింది.

దీంతో, 2026 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ జట్టు ఐదు హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. మిగతా రెండు మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో ఆడుతుంది.

క్రికెట్, ఐపీఎల్, రాయల్ చాలెంజర్స్, క్రీడలు, బెంగళూరు, కర్ణాటక

ఫొటో సోర్స్, Getty Images

ఆ 11 మంది జ్ఞాపకార్థంగా…

ఆర్‌సీబీ సీఈవో రాజేశ్ మీనన్ ఈ కొత్త ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మాట్లాడుతూ, ”జూన్ 4న మనం కోల్పోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం, మ్యాచ్‌కు ముందుకు జరిగే శిక్షణ సమయంలో ఆటగాళ్లు 11వ నంబర్ జెర్సీ ధరిస్తారు. ఆటగాళ్లందరి జెర్సీల వెనుక 11 నంబర్ ఉంటుంది” అని చెప్పారు.

‘‘మార్చి 28న జరిగే మ్యాచ్‌లో నల్లరంగు రిబ్బన్లను పెట్టుకుంటారు. అలాగే, చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగానే ఉంచాలని ఆలోచిస్తున్నాం. మాకు అండగా ఉన్న ఆ 11 మంది అభిమానులకు మా నివాళులు ఇవి” అని రాజేశ్ మీనన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)