SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, EPA
ఒక గంట క్రితం
చదివే సమయం: 3 నిమిషాలు
ఇరాన్ ఎనర్జీ ప్లాంట్‌లపై మరో పదిరోజులపాటు దాడులు నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.
‘ఇరాన్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఎనర్జీ ప్లాంట్‌పై దాడులను పదిరోజుల పాటు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు నిలిపివేస్తున్నాం. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నా.. నిజానికి పరిస్థితి బాగానే ఉంది’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
ఇరాన్ చమురు మౌలికసదుపాయాలపై దాడులకు అయిదు రోజులు విరామం ఇస్తున్నట్టు ట్రంప్ మొదట సోమవారం(మార్చి 23) ప్రకటించారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇప్పుడు ఈ విరామాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపారు. ట్రంప్ తాజా ప్రకటనపై ఇరాన్ ఇంకా స్పందించలేదు.


ఇరాన్‌తో చర్చలుచాలా బాగా జరుగుతున్నాయని, ఎనిమిది ఓడల గురించి తాము మాట్లాడుకున్నామని ‘ఫాక్స్ న్యూస్’తో ట్రంప్ తెలిపారు.
అంతకుముందు చర్చల సమయంలో ఇరాన్ తనకు గిఫ్ట్ ఇచ్చిందని, హార్మూజ్ జలసంధి మీదుగా కొన్ని ఆయిల్ ట్యాంకర్లు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందని వైట్ హౌస్ సమావేశంలో ట్రంప్ అన్నారు. అప్పుడు ఈ విషయాన్ని ఇరాన్ ఖండించింది.
పది రోజుల పాటు దాడులు ఆపుతామని ట్రంప్ చెప్పినస్పటికీ భూతల దాడులు ఆపుతున్నారని భావించలేమని గతంలో ఇరాన్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన రాబర్ట్ మలీ ‘బీబీసీ’తో అన్నారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాబర్ట్ ఇరాన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారిగా పనిచేశారు.
ఇరాన్‌పై ట్రంప్ ఎప్పుడైనా సైనికచర్యకు దిగే అవకాశం ఉందన్నారు.
”చర్చలు బాగా జరుగుతున్నాయి” అని ట్రంప్ చెప్పినప్పటికీ అసలు చర్చలు జరుగుతున్నాయా లేదా అనేదానిపై స్పష్టత లేదని రాబర్ట్ అన్నారు.
ఈ వారంలో పెంటగాన్ మధ్యప్రాచ్యంలో మరిన్ని బలగాలను మోహరించిందని, అదే సమయంలో 15 పాయింట్ల శాంతి ప్రణాళిక ఇచ్చామని అమెరికా చెబుతోందని ఆయన అన్నారు.
అమెరికా, ఇరాన్ మధ్య భారీ ఒప్పందం ఉండబోదని, ఇక చాలు అని ట్రంప్ అనుకుకున్నప్పుడు ఇది ముగుస్తుందని అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోతోందని రాబర్ట్ మలీ హెచ్చరించారు.
ఫొటో సోర్స్, Reuters
కాగా రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ట్రంప్‌కు ప్రజాదరణ క్రమంగా తగ్గుతూ వస్తోందని అంతర్జాతీయ అంశాల నిపుణులు అంటున్నారు.
‘ఇరాన్ యుద్దం మొదలై మూడువారాలు దాటింది. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ ఆర్థిక వ్యవహారాలపై ప్రజామోదం 29శాతానికి పడిపోయింది.
యుద్ధం మొదలయిన ఫిబ్రవరి 28నాటికి కేవలం 42శాతం ప్రజలకు అధ్యక్షుడిపై సదభిప్రాయం ఉంది. ఇది ఈ వారంలో 40శాతానికి పడిపోయింది.
ట్రంప్ ప్రకటన తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు కాస్త తగ్గాయి’ అని బీబీసీ నార్త్ అమెరికా కరస్పాండెంట్ ఆంథోనీ జర్చర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



