SOURCE :- BBC NEWS

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ దొరకడం లేదా?
నాలుగైదు రోజులుగా పెట్రోలు బంకుల వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.
”చాలా భయం ఉంది. మళ్లీ లాక్‌డౌన్ పరిస్థితి రావొచ్చు అంటూ మోదీ గారు చెప్పేసరికి జనాలు భయపడిపోయారు” అన్నారు ట్రావెలర్ విందూ రెడ్డి. ”ఆ టైమ్‌కు ఏమో దొరక్కపోవచ్చు. రేటు ఎక్కువ కావొచ్చు. అందుకే పెట్రోల్ కోసం బంకుకు వచ్చాను” అని ఆమె చెప్పారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బంకులు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా నాలుగైదు రోజులుగా ఈ రద్దీ బాగా పెరిగింది.
‘పెట్రోలు, డీజిల్ కొరత ఉంది’ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో వాహనదారులు పెద్దసంఖ్యలో బంకులకు క్యూ కట్టారు.
అందరూ అనుకుంటున్నట్లుగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం స్పష్టం చేస్తోంది.


పెట్రోల్ కొరత వల్లే బంకుల్ని మూసేస్తున్నారా?
హైదరాబాద్ సహా తెలంగాణలోని పట్టణాలు, నగరాలు, గ్రామాల పరిధిలోని బంకులు మూసి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. మరికొన్నిచోట్ల ‘నో స్టాక్ ప్లీజ్’ అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఉగాది, రంజాన్ పండుగలు ముగిసిన తర్వాత బంకులు మూతపడటం ఎక్కువగా కనిపిస్తోందని వాహనదారులు చెబుతున్నారు.
ఈ పరిస్థితికి కొన్ని కారణాలున్నాయని బీబీసీకి తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి చెప్పారు.
”క్రెడిట్ పాలసీ నిబంధనలలో మార్పుల కారణంగా కొన్ని పెట్రోల్ బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా ఆగుతోంది. అందుకే బంకులు మూతపడుతున్నాయి” అని చెప్పారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆయన బీబీసీకి వివరించారు.
గతంలో పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు ముందుగా అడ్వాన్సులు చెల్లించకపోయినా ఇండెంట్ ఆధారంగా మరుసటి రోజు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసేవనీ, ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక క్రెడిట్ పాలసీ నిబంధనలల్లో మార్పులు చేశారనీ అమరేందర్ రెడ్డి చెప్పారు.
”ఇప్పుడు పాత బాకీలు కట్టాలి. అదే సమయంలో మరుసటి రోజుకు అవసరమైన ఇండెంట్‌కు తగ్గట్టుగా అడ్వాన్సులు కట్టాలి. అది కూడా ముందు రోజు మధ్యాహ్నం రెండున్నరకల్లా కట్టాలి. అప్పుడే తర్వాత రోజుకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారు” అని అమరేందర్ రెడ్డి వెల్లడించారు.
అంటే పాత బకాయిలు ఉన్నా, బంకు యజమానులు ముందస్తు అడ్వాన్సులు కట్టకపోయినా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయడం లేదని, దీనర్థం తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని కాదని చెప్పారు అమరేందర్ రెడ్డి.
క్రెడిట్ పాలసీలో మార్పులపై ఇప్పటివరకు చమురు సంస్థలు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు.

నిజంగానే పెట్రోల్ కొరత ఉందా?
ఒక చోట పెట్రోల్, డీజిల్ లేక బంకులు మూతపడితే దానికి సమీపంలో తెరిచి ఉన్న మరో బంకుపై ఆ ప్రభావం, ఒత్తిడి పడుతోంది.
దీనికితోడు పెట్రోల్, డీజిల్ కొరత వల్లే బంకులు మూసివేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు. దీంతో తెరిచి ఉన్న బంకులకు వాహనదారులు పెద్ద సంఖ్యలో రావడంతో రద్దీ బాగా పెరిగింది.
గతంతో పోలిస్తే ఇప్పుడు ‘ఫుల్ ట్యాంక్’ చేయించుకుంటున్న వాహనదారులు ఎక్కువగా కనిపిస్తున్నారు.
”నేను ఎప్పుడు రెండు లీటర్ల వరకే పెట్రోల్ పోయించేవాడిని. కానీ, ఇప్పుడు కొరత అంటున్నారని ఫుల్ ట్యాంకు చేయించాను” అని ఐలేష్ అనే వ్యక్తి బీబీసీతో అన్నారు.
”చాలామంది ముందు జాగ్రత్త అంటూ ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారు. పెద్ద క్యాన్లలో నింపి తీసుకెళ్తున్నారు” అని హైదరాబాద్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ అరవింద్ అన్నారు.
అయితే పెట్రోలు, డీజిల్‌లను క్యాన్లలో నింపవద్దని అన్ని బంకులకు సూచనలు చేసినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం చెబుతోంది.

మోదీ ఏమన్నారంటే..
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులపై మార్చి 23న ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో మాట్లాడారు.
”మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూడు వారాలుగా ఈ సంక్షోభం కొనసాగుతోంది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోంది” అని మోదీ అన్నారు.
”ఈ యుద్ధం భారత్‌కు ఊహించని సవాళ్లను కూడా తీసుకొచ్చింది. ఈ సవాళ్లు ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతకు సంబంధించినవి. మానవతా సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది” అని తెలిపారు.
మోదీ మాట్లాడిన తర్వాత కూడా తెలియని భయం ఏర్పడి, ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ కొనుగోలుకు వచ్చామని హైదరాబాద్‌కు చెందిన విందూ రెడ్డి వివరించారు.
అయితే, మోదీ ప్రసంగాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మరొక వాహనదారు రాజీ అభిప్రాయపడ్డారు.
”కోవిడ్ వంటి పరిస్థితి రావొచ్చు అన్నారే తప్ప వస్తుందని చెప్పలేదు. అలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలన్నారు, అంతే. దానివల్ల ఏదో జరిగిపోతుందని పెట్రోల్ బంకులకు రావడమేంటి?” అని అన్నారామె.
‘‘పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందని ప్రభుత్వం చెబుతోంది. కానీ పెట్రోల్ బంకులకు వచ్చి చూస్తే ‘నో స్టాక్’ బోర్డు కనిపిస్తోంది’’ అని ఎర్రమంజిల్‌కు చెందిన ఆటోడ్రైవర్ అనిల్ చెప్పారు.

తెలంగాణలో ఇంధనం నిల్వల గురించి మంత్రి ఏమన్నారు?
హైదరాబాద్ సహా తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత అనుమానాలపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.
”రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత లేదు” అని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో బంకుల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
బుధవారం (మార్చి 25) 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరిగిందని మంత్రి వివరించారు.
”అదనంగా 16,000 కిలో లీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నాం” అని మంత్రి చెప్పారు.

ఇంకా ఎన్ని రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి?
వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో రోజువారీ డిమాండ్ ఒక్కసారిగా 25 శాతం పెరిగినా రోజువారీ సరఫరాలో సగటుతో పోల్చిచూసినపుడు ఎక్కడా అంతరాయం లేకుండా అదనంగా 22 శాతం నిల్వలు ఉన్నాయని మంత్రి చెప్పారు.
వదంతులను నమ్మి వినియోగదారులు కంటైనర్లలో, డబ్బాల్లో పెట్రోల్, డీజిల్‌ను తీసుకెళ్లడం పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 65 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని వివరించారు.
ఇదే విషయంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు.
”తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. వదంతులు నమ్మొద్దు. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దు” అని చెప్పారు.
ఈ అంశంపై చమురు కంపెనీలు కూడా స్పందించాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాయి. పెట్రోల్, డీజిల్ కొరత అంటూ వస్తున్న వదంతులు వాస్తవం కాదని స్పష్టం చేశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



