Home జాతీయ national telgu రాజ్‌గురు: భగత్‌సింగ్, సుఖ్‌దేవ్‌లతో కలిసి ఉరికంబం ఎక్కిన ఈ విప్లవకారుడి కథ తెలుసా?

రాజ్‌గురు: భగత్‌సింగ్, సుఖ్‌దేవ్‌లతో కలిసి ఉరికంబం ఎక్కిన ఈ విప్లవకారుడి కథ తెలుసా?

8
0

SOURCE :- BBC NEWS

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST

(ఈ కథనంలో హృదయాన్ని కలిచివేసే సంఘటనలున్నాయి)

శివరామ్ హరి రాజ్‌గురుకు చిన్నప్పటి నుంచే ఈత, విలువిద్య, కుస్తీ అంటే ఇష్టం. వడిసెలతో గురిపెట్టి కొట్టడంలో కూడా ఆయన నిష్ణాతులు. పిస్టల్ వాడటం కూడా నేర్చుకున్నారాయన.

స్వాతంత్ర్య సమరయోధులలో చంద్రశేఖర్ ఆజాద్ తర్వాత రాజ్‌గురుకే మంచి గురి ఉందని అంటారు.

వారణాసిలో ఆయన స్వాతంత్ర్యోద్యమకారుడు విశ్వనాథ్ వైశంపాయన్‌ను కలుసుకున్నారు. కాన్పూర్‌లో రాజ్‌గురును చంద్రశేఖర్ ఆజాద్‌కు పరిచయం చేసింది ఆయనే.

అనిల్ వర్మ తన ‘రాజ్‌గురు-ది ఇన్విన్సిబుల్ రివల్యూషనరీ’ అనే పుస్తకంలో ఈ సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విషయం రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

‘నీ అర్హత లేంటి? లోపాలేంటి?’

ఆ పుస్తకంలో పేర్కొన్నదాని ప్రకారం వారి సంభాషణ ఇలా సాగింది.

‘‘అయితే మీరు విప్లవకారుడు కావాలనుకుంటున్నారా?’ అని రాజ్‌గురును అడిగారు ఆజాద్

“అవును. నేనీదిశగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా” అని రాజ్‌గురు బదులిచ్చారు.

అప్పుడు రాజ్‌గురుతో ఆజాద్ ఇలా అన్నారు. విప్లవకారుడివి అయితే “తూటాలతో ఛిద్రమైన శరీరం, దేశ బహిష్కరణ లేదా ఉరిశిక్ష ఉంటుందని తెలిసినప్పటికీ కావాలనుకుంటున్నావా?” అని ప్రశ్నించారు.

“నాకు దాని గురించి తెలుసు, కానీ నేను భయపడను” అని రాజ్‌గురు బదులిచ్చారు.

అప్పుడు ఆజాద్, “మీ అర్హతలేంటి?” అని అడిగారు.

“నేను శారీరకంగా బలంగా ఉన్నానని నమ్ముతున్నాను. ఆయుధాలు లేకుండా పోరాడడంలో నేను నిపుణుడిని. నాకు అప్పగించిన ఏ పనైనా చేయగలను. మూడు, నాలుగు రోజుల పాటు ఆహారం, నీళ్లు లేకుండా ఉండగలను” అని రాజ్‌గురు అన్నారు.

తర్వాత ఆజాద్ “ఇప్పుడు నీ లోపాల గురించి చెప్పు” అని అన్నారు.

“నాకు ఒకే ఒక లోపం ఉంది. నేను చాలా ఎక్కువగా నిద్రపోతాను. నిలబడి ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా నిద్రపోగలను” అని రాజ్‌గురు బదులిచ్చారు.

చంద్రశేఖర్ ఆజాద్‌కు రాజ్‌గురు చాలా నచ్చారు. ఆయన్ను తన స్వాతంత్ర్య ఉద్యమకారుల బృందంలో చేర్చుకున్నారు. ఆయనకు “రఘునాథ్” అనే మారుపేరు పెట్టారు.

ఓర్ఛాలోని ఖలియాధానా అడవుల్లో రాజ్‌గురుకు చంద్రశేఖర్ ఆజాద్ పిస్టల్ షూటింగ్‌లో శిక్షణ ఇచ్చారని చెబుతుంటారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, Unistar

‘పాము తలదగ్గరే బుస కొడుతున్నా మెలకువ రాలేదు’

రాజ్‌గురు గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి రాజ్‌గురు, భగత్ సింగ్, శివ్ వర్మ ప్రభుత్వ ఖజానాను దోచుకునేందుకు గోరఖ్‌పూర్‌కు వెళ్లారు.

అక్కడ వారు ఒక షాప్‌ను అద్దెకు తీసుకున్నారు. వారంతా రాత్రిపూట అక్కడ నిద్రపోయేవారు.

“మొదటిరోజు రాత్రి మేం నేలపై పరిచిన పరుపుల మీద నిద్రపోతున్నాం. అర్థరాత్రి ఒంటి గంటకు బుసకొడుతున్నట్టుగా వస్తున్న శబ్దానికి నాకు మెలకువ వచ్చింది. నేను టార్చ్ వేసి చూడగా రాజ్‌గురు తలకు రెండు అడుగుల దూరంలో పడగ విప్పి ఒక పాము కనిపించింది. నేను భగత్ సింగ్‌ను నిద్రలేపాను. భగత్‌సింగ్ ‘నీ తల దగ్గర పాము పాముంది’ అని అరుస్తూ రాజ్‌గురు కాలు పట్టుకుని లాగారు. వెలుగు చూడగానే ఆ పాము మరో గదిలోకి పాక్కుంటూ వెళ్లిపోయింది. రాజ్‌గురు పక్కకు తిరిగి “నన్ను ఇబ్బంది పెట్టకండి” అని చెప్పి మళ్లీ నిద్రపోయారు” అని శివ్‌వర్మ తన ‘రెమినిసెన్సెస్ ఆఫ్ ఫెలో రెవల్యూషనరీస్’ అనే పుస్తకంలో రాశారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, Indian Post

‘స్కాట్ అని పొరపాటుపడి’

లాలా లజపత్ రాయ్ లాఠీచార్జ్‌లో మరణించడంతో లాఠీచార్జ్‌కు ఆదేశించిన లాహోర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ స్కాట్‌ను హత్య చేయడానికి ఆజాద్ నాయకత్వంలోని స్వాతంత్ర్య ఉద్యమకారులు పథకం వేశారు.

ఈ మిషన్‌కు సమన్వయకర్తగా సుఖ్‌దేవ్‌ను ఎంపిక చేశారు. ఆ తర్వాత సుఖ్‌దేవ్ తన బృందాన్ని ఎంచుకున్నారు. ఇందులో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్‌గురు, జై గోపాల్ ఉన్నారు. గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉండడంతో రాజ్‌గురును ఎంపిక చేశారు.

పిస్టల్‌ను ఆజాద్ తన వద్దే ఉంచుకున్నారు. రాజ్‌గురుకు ఒక రివాల్వర్, భగత్ సింగ్‌కు ఒక ఆటోమేటిక్ పిస్టల్ ఇచ్చారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు రాజ్‌గురు నడిచి వెళ్లారు. భగత్ సింగ్, సుఖ్‌దేవ్, జై గోపాల్ సైకిళ్లపై వెళ్లారు.

టోపీ పెట్టుకున్న ఒక ఇంగ్లీష్ పోలీసు అధికారి ఎర్రని మోటార్ సైకిల్‌ స్టార్ట్ చేయడం జై గోపాల్ చూశారు. ఆయన స్కాట్ అని జై గోపాల్ అనుకున్నారు. రాజ్‌గురుకు సంకేతం ఇచ్చారు. కానీ ఆయన శాండర్స్.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, National Book Trust

శాండర్స్‌పై రాజ్‌గురు కాల్పులు

“శాండర్స్ తన మోటార్ సైకిల్‌పై నెమ్మదిగా మెయిన్‌ గేట్ వైపు కదిలారు. అప్పుడు శాండర్స్‌పై రాజ్‌గురు కాల్పులు జరిపారు. గురి కచ్చితంగా తగిలింది. శాండర్స్ నేలపై పడిపోగా కదులుతున్న మోటార్ సైకిల్‌లో ఒక కాలు ఇరుక్కుపోయింది. తాము పొరపాటున వేరే వ్యక్తిని కాల్చామని భగత్ సింగ్ ఆ క్షణంలోనే గ్రహించారు. కానీ ఆయనకు మరో మార్గం లేదు. శాండర్స్‌పై ఆయన మరిన్ని కాల్పులు జరిపారు” అని అనిల్ వర్మ రాశారు.

ఆ తర్వాత భగత్ సింగ్, రాజ్‌గురు కోర్ట్ స్ట్రీట్ గుండా డీఏవీ కాలేజ్ వైపు పరుగెత్తారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ డబ్ల్యూజే ఫీమ్, హెడ్ కానిస్టేబుల్ చనన్ సింగ్ వారిని వెంబడించడం ప్రారంభించారు.

“రాజ్‌గురు కాల్పులు జరిపారు. కానీ గురి తప్పింది. ఫీమ్ ఒక మురుగు కాలువలో పడిపోయారు. కానీ చనన్ సింగ్ ఆయన్ను వెంబడిస్తూనేఉన్నారు. ఇద్దరూ డీఏవీ కాలేజ్ ఆవరణలోకి పరుగెత్తారు. ఆజాద్ అప్పటికే అక్కడ ఉన్నారు. వెంబడించవద్దని చనన్ సింగ్‌ను ఆజాద్ హెచ్చరించారు. కానీ చనన్ వినలేదు. ఆజాద్ కాల్చిన ఒక బుల్లెట్ చనన్ సింగ్ తొడకు తగిలింది. రెండో తూటా తగలడంతో చనన్ నేలమీద పడిపోయారు. ఓ గంట తర్వాత ఆయన ఆసుపత్రిలో చనిపోయారు” అని వర్మ రాశారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, Chaman Lal

లాహోర్ గోడలపై గులాబీ రంగు పోస్టర్లు

భగత్ సింగ్, రాజ్‌గురు, ఆజాద్ గోడ దూకి హాస్టల్‌లోకి ప్రవేశించారు. తమను ఎవరూ వెంబడించడం లేదని నిర్ధరించుకోవడానికి కాసేపు హాస్టల్ పై కప్పుమీద ఉన్నారు. పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధించారు.

“బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ ఘటనకు పాల్పడిన వారి దగ్గర ఆ రాత్రి తినడానికి కూడా డబ్బులు లేకపోవడం ఒక విచిత్రం. జై గోపాల్ ఎలాగోలా తన స్నేహితుడైన బన్సీలాల్ దగ్గర పది రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ తర్వాత వారికి భోజనం ఏర్పాటుచేశారు” అని దీపకాంత్ రాక్షే తన ‘హుతాత్మా శివ్‌రామ్ రాజ్‌గురు’ అనే పుస్తకంలో రాశారు.

25 ఏళ్ల శాండర్స్ ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. అప్పటి పంజాబ్ గవర్నర్ పీఏకి అల్లుడు.

మరుసటి రోజు నగరవ్యాప్తంగా గోడలపై చేతితో రాసిన గులాబీ రంగు పోస్టర్లు వెలిశాయి. వాటిపై “శాండర్స్ మరణించారు. లాలాజీ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాం” అని రాసి ఉంది. వాటిపై హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్ అయిన బల్‌రాజ్ సంతకం ఉంది.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, National Book Trust

భగత్‌ సింగ్ సేవకుని వేషంలో రాజ్‌గురు

ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటంటే శాండర్స్‌ను హత్య చేసిన వారిని లాహోర్ నుంచి సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలి అని.

వేరొకరి భార్యలా లాహోర్ నుంచి బయటకు వెళ్లగలరా అని విప్లవకారుడైన భగవతి చరణ్ భార్యను సుఖ్‌దేవ్ అడిగారు. అందుకామె అంగీకరించారు. అందరూ ఆమెను దుర్గా భాభీ (వదిన) అని పిలిచేవారు. రాజ్‌గురు ఒక సేవకుడి వేషంలో ఆమెతో పాటు వెళ్లడానికి అంగీకరించారు.

దుర్గా భాభీ తర్వాత గుర్తుచేసుకుంటూ “రాజ్‌గురు మురికి దుస్తులు వేసుకుని ఒక సేవకుడిలా ఉన్నారు. ఆయన ఇంటి బయట ఒక చాప పరిచి పడుకున్నారు. ఆ సమయంలో రాజ్‌గురుపై నేను చూపిన అమర్యాదకు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను” అని అన్నారు.

”భగత్ సింగ్, సుఖ్‌దేవ్ నేను వండిన భోజనం తిన్నారు. కానీ రాజ్‌గురు మా సేవకుడు అన్నట్టుగా చూపించడానికి ఆయనకు ఒక పళ్ళెంలో భోజనం బయటకు పంపించారు. ఆ సమయంలో ఆయన కూడా మాలో ఒకరన్న సంగతి మర్చిపోయాను. కానీ రాజ్‌గురు ఏమాత్రం నొచ్చుకోలేదు. ఒక్క మాట కూడా అనలేదు” అని దుర్గా భాభీ చెప్పారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, amritmahotsav.in

మూడో తరగతి కంపార్ట్‌మెంట్‌లో రాజ్‌గురు

డిసెంబర్ 20వ తేదీ ఉదయం భగత్ సింగ్, ఆయన భార్య వేషంలో ఉన్న దుర్గా భాభీ ఓవర్‌కోటు ధరించి గుర్రపు బండిలో లాహోర్ స్టేషన్‌కు బయలుదేరారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు భగత్ సింగ్ తన ఓవర్‌కోటు కాలర్‌ను పైకి మడిచి పెట్టుకున్నారు.

ఆయన కుడి చేయి కోటు జేబులో ఉంది. ఎడమ చేత్తో దుర్గా భాభీ కొడుకు శచిని పట్టుకున్నారు. దుర్గా భాభీ హైహీల్స్ చెప్పులు వేసుకుని, ఖరీదైన చీర కట్టుకుని ఒక అధికారి భార్యలా కనిపించారు.

రాజ్‌గురు తన పైజామాపై చిరిగిన పాత కోటు వేసుకున్నారు. ఆయన తలకు తలపాగా ధరించారు. నడుముకు స్కార్ఫ్ కట్టుకున్నారు. ఒక పెట్టెను మోసుకుంటూ సేవకుడిలా వారి వెనుక నడిచారు. 14 డౌన్ డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు భగత్‌సింగ్ రెండు ఫస్ట్-క్లాస్, ఒక థర్డ్-క్లాస్ టిక్కెట్లను కొన్నారు.

భగత్‌సింగ్ మొదటి తరగతి కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కగా రాజ్‌గురు మూడో తరగతి కంపార్ట్‌మెంట్ వైపు వెళ్ళారు.

రాజ్‌గురు, భగత్ సింగ్ లఖ్‌నవూ స్టేషన్‌లో దుర్గా భాభీ నుంచి విడిపోయి కాన్పూర్, ఆగ్రా మీదుగా వారణాసికి చేరుకున్నారు. అక్కడ నాగరీ ప్రచారిణి సభకు ఎదురుగా ఉన్న వ్యాయామశాలలో యువకులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, Unistar

రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్ మధ్య వాదోపవాదాలు

కొన్ని రోజుల తర్వాత విప్లవ కార్యకలాపాలకు ఆగ్రా కేంద్రంగా మారింది. అక్కడ వారు ఇంగువ మార్కెట్, క్షౌరవృత్తిదారుల మార్కెట్‌లో రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. ఒక రోజు రాజ్‌గురు ఒక అందమైన మహిళ చిత్రం ఉన్న క్యాలెండర్‌ను తీసుకువచ్చారు. దానిని గోడకు తగిలించారు.

అనిల్ వర్మ ఇలా రాశారు. “చంద్రశేఖర్ ఆజాద్ ఆ గదిలోకి వచ్చినప్పుడు అక్కడ క్యాలెండర్ కనిపించింది. ఆయన దాన్ని అక్కడినుంచి తీసేసి, ముక్కలు ముక్కలుగా చించి చెత్తబుట్టలో పడేశారు. రాజ్‌గురు వచ్చిన తర్వాత అక్కడ క్యాలెండర్ లేకపోవడం తీసి దాన్నెవరు చించేశారు అని గట్టిగా అరిచారు. ఆజాద్ కూడా అంతే గట్టి స్వరంతో ‘నేనే’ అని జవాబిచ్చారు”

‘ఎందుకు ఇలా చేశావు? అది నాకు చాలా నచ్చింది’ అని రాజ్‌గురు అన్నారు. దానికి ఆజాద్ కోపంగా

‘ఈ చిత్రంతో నీకేం పని?’ అని అడిగారు. దానికి రాజ్‌గురు ‘అది ఒక అందమైన చిత్రం. నువ్వు ప్రతి అందమైనదాన్ని నాశనం చేస్తావా?’ అని బదులిచ్చారు.

‘నాకు అందుబాటులో ఉంటే చేస్తా’ అని ఆజాద్ అన్నారు.

అప్పుడు రాజ్‌గురు ఆయనతో ‘అయితే వెళ్లి తాజ్ మహల్‌ను కూడా నాశనం చెయ్యి’ అని అన్నారు.

“మనం మన కుటుంబాలను విడిచిపెట్టి కేవలం మన దేశానికి విముక్తి కల్పించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడకు వచ్చాం. మనమందరం దానిపైనే దృష్టి పెట్టాలి. సౌందర్యం పట్ల నీకున్న ప్రేమ మనల్ని మన మార్గం నుంచి పక్కకు మళ్లించి మన బలహీనతగా మారుతుందేమోనని నాకు భయంగా ఉంది” అని రాజ్‌గురుతో ఆజాద్ చెప్పారు. ఈ మాటలు విన్న తర్వాత రాజ్‌గురు ప్రశాంతంగా ఉన్నారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, Harper Collins

వేడి పటకారుతో పొట్టపై వాతలు

పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నించమని, కానీ అలాంటి పరిస్థితి ఎదురైతే పోరాడి ప్రాణత్యాగం చేయాలని చంద్రశేఖర్ ఆజాద్ తన సహచరులకు ఎప్పుడూ చెబుతుండేవారు. ఆజాద్ మాటలు విన్న రాజ్‌గురు తనకు అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తానో అని ఆలోచించడం మొదలుపెట్టారు.

“ఆయన ఒక పటకారును తీసుకుని నిప్పుల్లో వేడి చేశారు. అది బాగా వేడెక్కాక దాన్ని తన ఛాతీకి తాకించుకున్నారు. ఆయనకు విపరీతమైన నొప్పి కలిగింది. ఆయన చర్మమంతా కాలిపోయింది. ఆయన ఇలా ఏడుసార్లు చేశారు. తన ఓర్పును ఆయన పరీక్షించుకున్నారు. రాత్రి వేళ నిద్రపోతూ నొప్పితో మూలిగారు”

అప్పుడు రాజ్‌గురు పక్కనే ఆజాద్ నిద్రపోతున్నారు. మూలుగుల శబ్దానికి ఆయన మేల్కొన్నారు. ఎందుకలా మూలుగుతున్నావని ఆజాద్ అడగ్గా మొదట చెప్పకుండా తప్పించుకునేందుకు రాజ్‌గురు ప్రయత్నించారు. కానీ ఆజాద్ పదే పదే అడగడంతో రాజ్‌గురుకు అంతా చెప్పక తప్పలేదు. రాజ్‌గురు చేత ఆజాద్ చొక్కా విప్పించారు. కొవ్వొత్తి వెలుగులో అంతా బొబ్బలతో నిండి ఉన్న రాజ్‌గురు ఛాతీని చూసి ఆజాద్ నిశ్చేష్టుడయ్యారు. ఆజాద్ కళ్లలో నీళ్లు నిండిపోయాయి” అని అనిల్ వర్మ రాశారు.

రాజ్‌గురును ఉరితీయబోతున్నప్పుడు స్వాతంత్ర్య సమరయోధురాలు సుశీలా దీదీ లాహోర్ జైలులో ఆయనను కలవడానికి వెళ్లారని వర్మ రాశారు. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ‘‘కాలిన గాయాల వల్ల ఛాతీపై ఏర్పడిన మచ్చలను చూపిస్తారా’’ అని ఆమె రాజ్‌గురును కోరారు.

రాజ్‌గురు చిరునవ్వు నవ్వి తన చొక్కా గుండీలు విప్పారు. ఒక నిజమైన దేశభక్తుని సంకల్పాన్ని సుశీలా దీదీ చూశారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, Getty Images

రాజ్‌గురు, భగత్ సింగ్ ఎందులో ప్రత్యర్థులంటే…

భగత్ సింగ్‌ను రాజ్‌గురు ఒక ప్రత్యర్థిగా భావించారు. దేశం కోసం మొదట ఎవరు తమ ప్రాణాలను త్యాగం చేస్తారనే దాని గురించే వారిద్దరి మధ్య పోటీ ఉండేది. మొదటి తూటా కాల్చే అవకాశం తనకు ఇవ్వాలన్నదే పార్టీని ఆయన కోరిన ఏకైక డిమాండ్.

“సెంట్రల్ అసెంబ్లీలో బాంబువేయడానికి భగత్ సింగ్‌తో పాటు బటుకేశ్వర్ దత్‌ను గానీ, మరెవరినీ గానీ పంపవద్దని రాజ్‌గురు పట్టుబట్టారు. ఆ పనిని రాజ్‌గురు చేయాలనుకున్నారు” అని శివ్‌ వర్మ రాశారు.

అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ “ఒకవేళ మీరు పట్టుబడితే కోర్టులో స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. నీకు ఇంగ్లీష్ రాదు. నువ్వు సరైన వాంగ్మూలం ఇవ్వలేకపోతే ఈ పని రాజకీయ లక్ష్యం విఫలమవుతుంది. మీ ప్రయత్నాలన్నీ వృథా అవుతాయి” అని అన్నారు.

”అప్పుడు రాజ్‌గురు “నా కోసం ఇంగ్లీష్‌లో ఒక స్టేట్‌మెంట్ తయారు చేయమని భగత్ సింగ్‌ను అడగండి. నేను దాన్ని కంఠస్థం చేస్తాను” అన్నారు. అయినా రాజ్‌గురు మాట వినడానికి ఆజాద్ నిరాకరించడంతో ఆయన కోపంతో పుణెకు బయలుదేరారు” అని శివ్‌వర్మ రాశారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, Harper Collins

రాజ్‌గురుకు మరణశిక్ష

శాండర్స్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత పుణెలో రాజ్‌గురును అరెస్టు చేశారు. ఆయన దగ్గర నుంచి ఒక రివాల్వర్, 14 తూటాలు ఉన్న చిన్న పెట్టెను స్వాధీనం చేసుకున్నారు.

ఆయన్ను రైలులో లాహోర్‌కు తీసుకువెళ్లారు. రైలు వెళ్లే ప్రతి స్టేషన్‌లోనూ వేలాదిగా ప్రజలు గుమిగూడారు. గ్వాలియర్ దగ్గరలోని అశోక్ నగర్ రైల్వే స్టేషన్‌లో రాజ్‌గురు రైలు కిటికీలోంచి తల బయటకు పెట్టినప్పుడు ఒక బ్రిటిష్ అధికారి ఆయన్ను బెత్తంతో కొట్టారు.

“ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న 12 ఏళ్ల బాలుడికి తీవ్ర ఆగ్రహం వచ్చి ఒక రాయి తీసుకుని అధికారిపై విసిరాడు. పోలీసులు అతడిని కొట్టారు. ఆ బాలుడి పేరు కృష్ణ సరళ్. ఆయన ఆ తర్వాత భారత విప్లవకారులపై అనేక పుస్తకాలు రాశారు” అనిల్ వర్మ తెలిపారు.

శాండర్స్ హత్య కేసులో అరెస్టయిన వారిని కలవడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్టోబర్ 19న లాహోర్ జైలును సందర్శించారు. విచారణ సమయంలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు మనోధైర్యం కలిగించడానికి మోతీలాల్ నెహ్రూ, రఫీ అహ్మద్ కిద్వాయ్, మోహన్‌లాల్ సక్సేనా కోర్టుకు వచ్చారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, The Tribune

నిర్ణయించిన తేదీకన్నా ముందే ఉరి అమలు

కోర్టు ఆ ముగ్గురికీ మరణశిక్ష విధించింది. వారి మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరుతూ వైస్రాయ్‌కి మదన్ మోహన్ మాలవీయ ఒక టెలిగ్రామ్ పంపారు. కానీ వైస్రాయ్ ఆయన అభ్యర్థనను తిరస్కరించారు.

1931 మార్చి 24న ఆ ముగ్గురినీ ఉరితీయాలని నిర్ణయించారు. మార్చి 23న వారి న్యాయవాది ప్రాణ్‌నాథ్ మెహతా జైలులో ఉన్న రాజ్‌గురును కలవడానికి వెళ్లారు. రాజ్‌గురు ముఖంలో ఏమాత్రం భయంగానీ, ఆందోళనగానీ లేకపోవడం చూసి లాయర్ ప్రాణ్‌నాథ్ ఆశ్చర్యపోయారు.

నిర్ణీత సమయానికి 11గంటల ముందే ఈ ముగ్గురినీ ఉరితీయబోతున్నారని జైల్ బార్బర్ అయిన బర్కత్ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఖైదీలకు చెప్పారు.

భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్

ఫొటో సోర్స్, Rajkamal Publications

కుల్దీప్ నయ్యర్ తన ‘వితౌట్ ఫియర్’ అనే పుస్తకంలో ఇలా రాశారు.

“జైలులోని ఖైదీలందరినీ నాలుగు గంటలకు వారి బ్యారక్‌లకు వెళ్ళమని కోరారు. భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు తమ చివరి స్నానం చేసి నల్లని దుస్తులు ధరించారు. డాక్టర్ వారి బరువును తూచారు”

తమకు సంకెళ్లు వేయవద్దని వారు కోరారు. దానికి అధికారులు అంగీకరించారు. ఆ మూడు సింహాలు(భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్) తమ గదుల నుంచి బయటకు వచ్చి ఒకరినొకరు కౌగిలించుకున్నాయి. భగత్ సింగ్ మధ్యలో, సుఖ్‌దేవ్ ఆయన ఎడమవైపు, రాజ్‌గురు ఆయన కుడివైపు నడిచారు. ముగ్గురూ చేతులు చేతులు పట్టుకుని నడిచారు.

అప్పుడు హఠాత్తుగా భగత్ సింగ్ పాడటం మొదలుపెట్టారు – ‘మరణం తర్వాత కూడా నా హృదయంలోని దేశభక్తి తొలగిపోదు. నా దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా దేశం పరిమళమే వెలువడుతుంది’ అని పాడారు.

బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ ఆ దృశ్యాన్ని నిశ్చేష్టుడై చూశారు. అప్పుడు భగత్ సింగ్ ఆయన వైపు తిరిగి “భారత విప్లవకారులు మృత్యువును ఎంత ఆనందంగా స్వీకరిస్తారో చూసే అదృష్టం మీకు దక్కింది” అని అన్నారు. ఆ ముగ్గురూ మెట్లు ఎక్కి ఉరికంబం దగ్గరకు చేరుకున్నారు.

“అక్కడ ఉన్న ప్రతిఒక్కరూ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినాదాలు చేశారు. ఉరివేసే వ్యక్తి వణుకుతున్న చేతులతో వారి చేతులు, కాళ్లు కట్టి ముఖాలను నల్లటి వస్త్రంతో కప్పారు. దీనికి ముందు వారు ఉరితాళ్లను ముద్దుపెట్టుకున్నారు. సరిగ్గా 7గంటల33నిమిషాలకు న్యాయాధికారి తన గడియారం వైపు చూసి చేయి ఊపారు” అని అనిల్ వర్మ రాశారు.

క్షణాల్లో వారి శరీరాలు నిర్జీవంగా మారాయి. వైద్యులు వారిని పరీక్షించి మరణించినట్టు ప్రకటించారు.

జైలు లోపల వాతావరణం ఎంత ఉద్విగ్నంగా ఉందంటే, ఒక భారతీయ అధికారి మృతదేహాలను గుర్తించడానికి నిరాకరించారు.

ఆయన్ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి అదుపులోకి తీసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు చంపాలనుకున్న జెస్సీ స్కాట్ లాహోర్ రేంజ్ డీఐజీగా ఉన్నారు.

భారత్‌లో తన సేవలను కొనసాగించడానికి అనుమతించాలని ఆయన అభ్యర్థించగా ఆయన గత రికార్డును పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం ఆ అభ్యర్థనను తిరస్కరించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)