SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధంతో ఇంధన ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నాయి. వాహనాల వేగాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రం హోం చేయాలని కోరుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) ప్రయాణం, ఇళ్లు, ఆఫీసు అవసరాలకు సంబంధించి కొన్నిచర్యలు సూచించింది.
ప్రస్తుతం ప్రపంచం ”చరిత్రలోనే అంతర్జాతీయంగా అతితీవ్రమైన ఇంధన భద్రత ముప్పు” ఎదుర్కొంటోందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ బీబీసీతో చెప్పారు.
ఇంధన వినియోగంపై ప్రభుత్వాలు మరింత స్పష్టంగా మాట్లాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
ఈ సూచన రాజకీయంగా కష్టంగా ఉండవచ్చని అంగీకరించారు. అయితే ఇంధన ధరలు కొత్త విధానాలను ప్రజలు అనుసరించడానికి కావాల్సిన ప్రోత్సాహం ఇస్తాయని అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
తక్కువ పని గంటలు
వినియోగాన్ని పరిమితం చేయడానికి ఇప్పటికే చాలా ఆసియా దేశాలు కొన్ని విధానాలు ప్రవేశపెట్టాయి. ఎయిర్ కండీషనర్లు 25డిగ్రీల కంటే తక్కువ చల్లపరచకూడదని బంగ్లాదేశ్‌లో, 26 డిగ్రీల కంటే తక్కువ చల్లబర్చకూడదని థాయిలాండ్‌లో నిబంధన విధించారు.
కొన్ని ప్రభుత్వాలు స్కూళ్లు, యూనివర్శిటీల్లో తక్కువ పనిగంటలు అమలుచేస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల విమాన ప్రయాణాలను పరిమితం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాలు వారానికి నాలుగురోజుల పనిదినాలు అమలుచేస్తున్నాయి.
ఐఈఏలో 32 సభ్యదేశాలున్నాయి. 24 యూరప్ దేశాలతో పాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ అంతర్జాతీయ ఇంధన సమస్యలను విశ్లేషించడం, వాటికి పరిష్కారాలు సూచించడం ఈ సంస్థ బాధ్యత. ముఖ్యంగా ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధనాల వైపు మారడంపై సూచనలిస్తుంది.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఐఈఏ సూచనలు
- ప్రజా రవాణాను ప్రోత్సహించడం.
- నగరాల్లో ప్రైవేట్ కార్లకు రోజు విడిచి రోజు మాత్రమే అనుమతి ఇవ్వడం.
- కార్ షేరింగ్, ఇంధనాన్ని పొదుపు చేసే డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించడం.
- వీలయిన ప్రతిచోటా విమాన ప్రయాణాలను తగ్గించడం, ముఖ్యంగా విమానాల్లో వ్యాపార ప్రయాణాలను తగ్గించడం.
- వంటకు విద్యుత్ వినియోగించడం.
- వంటకు, ఇతర అవసరాలకు ఉపయోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌ను ఆదా చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టడం.
ఫొటో సోర్స్, EPA
‘ప్రపంచానికి సమస్య ఇంకా అర్ధం కావడం లేదు’
ఈ నెల ప్రారంభంలో ఐఈఏ సభ్యదేశాలు అత్యవసర నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల చేయడానికి అంగీకరించాయి. వాటితో పాటు ఇంధన పొదుపు కోసం ఈ ప్రతిపాదనలు చేస్తున్నామని బిరోల్ చెప్పారు.
అవసరం ఉందని భావిస్తే, ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించేందుకు మరిన్ని చమురు నిల్వలను విడుదల చేసే అవకాశముందని ఆయన చెప్పారు. దీనిపై ఇప్పటికే అనేక దేశాల అధినేతలు, ప్రభుత్వాధినేతలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
”మనం ఎదుర్కొంటున్న ఇంధన భద్రత సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచం అర్ధంచేసుకోలేదని నేను అనుకుంటున్నా” అని ఆయనన్నారు.
”1970ల్లో మనం ఎదుర్కొన్న సమస్యకన్నా ఇది ఎక్కువ. యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత న్యాచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ఈ సంక్షోభం దానికన్నాపెద్దది” అన్నారు.

ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టిపెట్టే అవకాశం
1970ల్లో ఇంధన ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు కొత్త వ్యూహాలు అమలుచేశాయి.
” ప్రపంచ వ్యాప్తంగా అణువిద్యుత్ కేంద్రాలు భారీగా నిర్మించడం వంటివి వాటిలో ఒకటి” బిరోల్ చెప్పారు.
”రెండోది కార్ల పరిశ్రమలో భారీ మార్పు జరిగింది. ఇప్పుడు వంద కిలోమీటర్లు డ్రైవ్ చేయడానికి ఉపయోగించే చమురు పరిమాణం సగానికి తగ్గింది. కార్ల ఇంధన వినియోగ సామర్థ్యం పెరగడం వల్ల ఈ మార్పు వచ్చింది” అని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల వల్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెరుగుతుందనిఆయన అంచనావేస్తున్నారు. బ్యాటరీ టెక్నాలజీ, అణు విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు.
”ఈ సమస్యకు హార్ముజ్ జలసంధిని తెరవడమే అత్యంత ముఖ్యమైన ఏకైక పరిష్కారం” అని బిరోల్ చెప్పారు.
అది తెరిచినప్పటికీ అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల సమస్యలు పూర్తిగా పరిష్కారం కావని, యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, పైప్‌లైన్‌లకు నష్టం కలిగిందని, యుద్ధానికి ముందు స్థాయిలోలా చమురు రవాణా చేయలేవని ఆయన చెప్పారు.
ఇంధన మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, పైప్‌లైన్‌ల పునురుద్ధరణ జరిగి యుద్ధం ముందు స్థాయిలో చమురు సరఫరా చేయడానికి చాలా నెలల సమయం పడుతుందని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



