SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
మీ పక్కన పడుకున్న వ్యక్తి అకస్మాత్తుగా నిద్రలో మాట్లాడటాన్ని లేదా గొణగడాన్ని మీరు గమనించి ఉండొచ్చు. అలాంటి వ్యక్తులను ‘స్లీప్ టాకర్స్’ (నిద్రలో మాట్లాడేవారు) అంటుంటారు.
కొందరు నిద్రలో మాట్లాడే మాటలు చాలా వింతగా కూడా అనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఇవి అపార్ధాలకు కూడా దారి తీస్తుంటాయి. వైద్యపరిభాషలో దీన్ని సోమ్నిలోక్వీ అంటారు.
మన పక్కనున్న వ్యక్తి నిద్రలో గొణగడం అనేది నిద్రకు భంగం కలగించడమే కాదు, మాట్లాడే వ్యక్తి ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.
చాలా కేసుల్లో, నిద్రలో మాట్లాడటాన్ని ఒక సాధారణ పరిస్థితిగానే పరిగణిస్తారు. కానీ, తరచూ ఇలా గొణగడాన్ని పట్టించుకోకపోతే, అది పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు.
చాలామంది నిద్రలో గొణుగుతూ, చేతులు కాళ్లు కదపడం, అరవడంలాంటివి చేస్తుంటారు. మాట్లాడటమే కాకుండా, కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంటుంది. ఇది మాట్లాడటంకంటే ఎక్కువ ప్రమాదకరం కావచ్చు. అయితే, ఎందుకిలా జరుగుతుంది? దీన్నుంచి ఎలా బయటపడాలి?

నిద్రలో మాట్లాడటం
నిద్రపోయేటప్పుడు, మన మెదడు లోపల ఒక రక్షణాత్మక యంత్రాంగం పనిచేయడం ప్రారంభమవుతుంది. ఇది కలలతో అనుసంధానమై ఉన్న నాడీ కార్యకలాపాలను మాటలు లేదా శరీర కదలికలుగా మారకుండా నిరోధిస్తుంది.
కానీ, ఈ రక్షణాత్మక యంత్రాంగమంతా సరిగ్గా పనిచేస్తుందని కాదు. కొన్నిసార్లు మెదడు నుంచి విడుదలయ్యే సంకేతాలు లీకవుతూ ఉంటాయి.
ఇదే గొణుగుడుకు, అస్పష్టమైన మాటలకు, కొన్నిసార్లు నిద్రలో నడిచేందుకు కారణమవుతుంది.
నిపుణుల చెబుతున్న ప్రకారం.. ఇది ఎన్నో శారీరక, మానసిక కారణాలకు సంబంధించినది.
ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి, మద్యం సేవించడం, జ్వరం వంటివి కూడా నిద్రలో మాట్లాడే అవకాశాలను పెంచుతుంది.
నిద్రలో మాట్లాడటం సాధారణంగా ఏ తీవ్రమైన అనారోగ్య లక్షణం కాదని.. అయితే, అది ఒత్తిడికి సంబంధించినది కావచ్చని దిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ మోహ్సిన్ వలీ అన్నారు.
“ఒత్తిడితో నిద్రపోయే వారిలో లేదా రోజువారీ పనిని చాలా సీరియస్‌గా తీసుకునే వ్యక్తులలో నిద్రలో మాట్లాడటం కనిపిస్తుంటుంది. అలాంటి వ్యక్తులు తరచూ నిద్రలో అవే విషయాలు చెబుతుంటారు” అని చెప్పారు.
ఈ సమయంలో నిద్రపోయేటప్పుడు ఏదైనా మాట్లాడగలరు. కొన్నిసార్లు కలలో భయపడినప్పుడు కూడా మాట్లాడుతుంటారు.
ఫొటో సోర్స్, Getty Images
దీనికి ప్రత్యేక చికిత్స ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు. కానీ, దీని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు.
నిద్రలో మాట్లాడే అంశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు అవి వారు ఎదుర్కొన్న అనుభవాలు లేదా ఆమధ్య కాలంలో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించినవి కావొచ్చు. కానీ, కొన్నిసార్లు అవి వింతగా అనిపించవచ్చు.
చాలా కేసుల్లో నిద్రలో మాట్లాడటం అనేది ఆరోగ్య సమస్యకు సంబంధించినది కాదు. ఒత్తిడి, భావోద్వేగపరమైన ఆందోళన, లేదా మానసిక సమస్యల వల్ల కూడా ఇది సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
”నిద్రలో మాట్లాడటం సాధారణ సమస్యే, ముఖ్యంగా పిల్లల్లో. ఒకవేళ ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటే, అప్పుడు ఆందోళన చెందాలి” అని మెట్రో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, న్యూరాలజిస్ట్ డాక్టర్ సోనియా లాల్ గుప్తా తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
నిద్రలో నడవడం
నిద్రలో నడవడం కూడా ప్రమాదకరమే. 2024 సెప్టెంబర్ 14 రాత్రి అమెరికాలోని లూసియానాకు చెందిన పేటాన్ అనే అమ్మాయి నిద్రలో ఇంటి నుంచి బయటికి వచ్చి, అడవిలోకి వెళ్లిపోయింది.
ఆ అమ్మాయి కనిపించకపోయే సరికి, ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ అమ్మాయి ఎక్కడ కనిపించకపోయే సరికి, పోలీసులు డ్రోన్ కెమెరాలను వాడారు.
నిద్రలో నడవడం సాధారణంగా ఎలాంటి వ్యాధికి సంబంధించినది కాదు. కానీ, కొన్నిసార్లు అది ప్రమాదానికి దారితీయొచ్చని డాక్టర్ మోహ్సిన్ వలీ చెప్పారు.
”ఈ పరిస్థితిలో, కనీసం తెలియకుండానే ఆ వ్యక్తి లేచి, నిద్రలో నడవడం ప్రారంభిస్తారు. ఇలాంటి పరిస్థితిలో, పడిపోయే ప్రమాదం లేదా దేనినైనా గుద్దుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంటి పైకప్పుపై నిద్రిస్తుంటే, కిందకి పడిపోయే అవకాశం ఉంది” అని తెలిపారు.
విద్యార్థి రోజుల్లో తనకు ఎదురైన అనుభవాలను డాక్టర్ వలీ గుర్తు చేసుకున్నారు. ”1968లో హైస్కూల్‌లో ఉన్నప్పుడు సైన్స్ పరీక్షకు ముందు నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రలో నడవడం మొదలుపెట్టాను. ఆ సమయంలో నన్ను మానాన్న పట్టుకుని ఆపారు” అని వలీ చెప్పారు.
నిపుణులు చెబుతున్న ప్రకారం.. రాత్రి నిద్ర అనేక దశలలో ఉంటుంది.
నిద్రపోవాలనుకున్నప్పుడు, మనకి మొదట తేలికపాటి నిద్ర వస్తుంది. సుమారు 20 నిమిషాల తర్వాత మెల్లగా గాఢ నిద్రలోకి జారుకుంటాం.
ఆ తర్వాత.. కొంతసేపు ఆ నిద్ర తేలికపడి, ఆపై మరింత గాఢ నిద్రలోకి వెళ్తాం. దీన్నే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎం) అంటారు.
నిద్రకు సంబంధించిన ఈ దశలు రాత్రంతా పలుసార్లు రిపీట్ అవుతుంటాయి. ప్రతి సైకిల్‌లో.. ఆర్‌ఈఎం (చాలా గాఢ నిద్రలోకి జారుకోవడం) వ్యవధి పెరుగుతుంటుంది. ఉదయం మేల్కొనే వరకు ఇది కొనసాగుతుంది.
ఆర్‌ఈఎం నిద్రలో ఉన్నప్పుడు మనం తరచూ కలలు కంటుంటాం. ఈ స్థితిలో మీ శరీరం పూర్తిగా విశ్రాంతి దశలో ఉంటుంది.
మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం లోపించినప్పుడు నిద్రలో నడవడం లాంటిది జరుగుతుంది.
ఇది ఒక రకమైన గందరగోళ స్థితి. ఈ పరిస్థితిలో కదలమని శరీరానికి సంకేతాలు పంపడానికి మెదడు తగినంత చురుకుగా ఉంటుంది. కానీ వ్యక్తి పూర్తిగా మేల్కొనేందుకు తగినంత చురుకుగా శరీరం ఉండదు.
నిద్రలో నడిచే వ్యక్తుల మెదడు కార్యకలాపాలను పరిశీలించడానికి ఇటలీలోని మిలాన్‌లో ఉన్న నిగువార్డా ఆసుపత్రి ఒక అధ్యయనం నిర్వహించింది.
మెదడులోని కొన్ని భాగాలు నిష్క్రియంగా ఉన్నప్పటికీ, మరికొన్ని చురుకుగా ఉంటాయని ఈ పరిశోధనలో తేలింది.
నిద్రకు, మేల్కొనడానికి మధ్య ఉన్న అసమతుల్యత కారణంగానే నిద్రలో నడుస్తుంటారని ఈ అధ్యయనం సూచించింది.
ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు ఆందోళన చెందాలి?
నిద్రలో మాట్లాడటం అంత పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం కాదని డాక్టర్ సోనియా లాల్ గుప్తా తెలిపారు.
”నిద్రలో మాట్లాడే వాళ్లకి, గొణిగే వాళ్లకి రాత్రి వారేం మాట్లాడారో గుర్తుండదు. చాలా కేసుల్లో ముఖ్యంగా పిల్లలకి చికిత్స అవసరం లేదు. ఎందుకంటే, వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య పరిష్కారమవుతుంది” అని చెప్పారు.
పెద్దలు నిద్రలో మాట్లాడేందుకు కారణమేంటో, వారి నిద్ర క్వాలిటీని ప్రభావితం చేస్తుందా లేదా? అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ గుప్తా తెలిపారు.
నిద్రలో పదేపదే మాట్లాడటం, అరవడం లేదా హింసాత్మక చర్యలకు పాల్పడటం చేసినప్పుడు, ఇది వారి నిద్రకు భంగం కలిగిస్తుంది. అప్పుడు, దాని వెనుకాలనున్న కారణమేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు.
”నేటి సమాజంలో చాలామంది నిద్రలేమితో ఇబ్బందిపడుతుంటారు. కొంతమంది వ్యక్తులు అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సమస్యతో కూడా బాధపడుతుంటారు. ఈ పరిస్థితిలో నిద్రపోయేటప్పుడు మెదడుకు సరిపడ ఆక్సిజన్ సరఫరా అందక ఒత్తిడికి గురవుతారు” అని డాక్టర్ వలీ వివరించారు.
ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన లేదా ఏదైనా వ్యాధి కారణంగా కూడా నిద్రలో నడవడం లేదా నిద్రలో మాట్లాడటం వంటి సమస్య తలెత్తవచ్చని ఆయన అంటున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
చికిత్స
నిద్రవేళలు సరిగ్గా లేకపోవడం లేదా ఒత్తిడితో మీరు దీనివల్ల ఇబ్బంది పడుతుండొచ్చు. వీటిని సరిదిద్దుకుంటే, ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
నాణ్యమైన నిద్రను పొందేందుకు డాక్టర్ సోనియా లాల్ గుప్తా కొన్ని మార్గాలు సూచించారు.
‘‘నిద్రపోయేందుకు, లేచేందుకు ఒక నిర్దిష్ట సమయం ఉండాలి. సాయంత్రం 3 తర్వాత కెఫిన్ తీసుకోవద్దు. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ కూడా వాడొద్దు” అని చెప్పారు.
”తీవ్రమైన ఒత్తిడితో వ్యక్తి నిద్రపోతూ, ఈ సమస్య పెరుగుతుంటే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం”అని సూచించారు.
నిద్రపోయేటప్పుడు తమ భాగస్వామిని తన్నడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడితే, అది ఏదైనా నాడీ సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చని డాక్టర్ గుప్తా అన్నారు.
”పిల్లల్లో నిద్ర సంబంధిత సమస్యలు సాధారణం. ఎందుకంటే, అప్పుడే వారి మెదడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రోజులో పిల్లలు ఎక్కువసేపు నిద్రపోయినా లేదా స్కూల్‌లో తరచూ నిద్రపోయినా, అది ఆలోచించాల్సిన విషయం. వెంటనే వైద్యుడికి చూపించి, పరీక్షించాలి” అని డాక్టర్ గుప్తా తెలిపారు.
దీనికి నేరుగా ఎలాంటి చికిత్స లేదని డాక్టర్ వలీ చెప్పారు. సైకాలజిస్ట్ ఇచ్చే కౌన్సిలింగ్ సాయపడుతుండొచ్చు. తగినంత నిద్రపోయేందుకు ఇది చాలా ముఖ్యం.
రాత్రిపూట మాత్రమే శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. అవసరమైతే, వైద్యుని సలహా మేరకు మెలటోనిన్ ఇస్తారు.
ఈ పరిస్థితుల్లో సాధారణంగా జ్ఞాపక శక్తికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవని డాక్టర్ గుప్తా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



