SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Hina Durrani
లాహోర్‌కు చెందిన ‘ఇమ్రోజ్’ అనే దినపత్రిక ప్రముఖ నటి-గాయని నూర్జహాన్, క్రికెటర్ నజర్ మొహమ్మద్ గురించి 1953, జూన్ 24న ఒక వార్తను ప్రచురించింది.
నజర్ మొహమ్మద్‌ను కలవడానికి నూర్జహాన్ ఒకచోటకు వెళ్లినప్పుడు ఆమె భర్త షౌకత్ హుస్సేన్ రిజ్వీ అకస్మాత్తుగా అక్కడికి వచ్చారు.
షౌకత్ హుస్సేన్ రిజ్వీని చూసి నజర్ మొహమ్మద్ భవనం మొదటి అంతస్తు నుంచి దూకేశారు. దీంతో ఆయన చేయి విరిగింది.
నూర్జహాన్, నజర్ మొహమ్మద్‌ల ప్రేమకథ పాకిస్తానీ సినిమా చరిత్రలో ఒక ఆసక్తికరమైన, అలాగే విషాదకరమైన ఘట్టం.
ఆ ప్రేమకథ విషాదంగా ముగిసింది. ఆ ప్రమాదంలో నజర్ మొహమ్మద్ చేయి విరగడంతో ఆయన క్రికెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది.

నూర్జహాన్, నజర్ ఎక్కడ కలుసుకున్నారు?
నజర్ మొహమ్మద్ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడైన ఫిరోజ్ నిజామీకి తమ్ముడు. ఆయనకు పాటలు పాడటం అంటే ఎంతో ఆసక్తి. స్వరం చాలా మధురంగా ఉండేదని చెబుతారు.
నూర్జహాన్, నజర్ మొహమ్మద్‌ల మధ్య ప్రేమ వ్యవహారం ఎప్పుడు, ఎక్కడ మొదలైందనే విషయంపై నూర్జహాన్, నజర్ మొహమ్మద్, షౌకత్ హుస్సేన్ రిజ్వీలు చెప్పే మాటల్లో అనేక తేడాలుంటాయి.
తన 11 లేదా 12 ఏళ్ల వయసులో నూర్జహాన్ మొదటిసారి ముంబైలో నజర్ మొహమ్మద్‌ను కలిశారు.
సంగీతం, గానం నేర్చుకోవడానికి నూర్జహాన్ ముంబైలోని ఫిరోజ్ నిజామీ ఇంటికి వెళ్లేవారు. ఆ రోజుల్లో నజర్ మొహమ్మద్ కూడా పంజాబ్ క్రికెట్ జట్టుతో కలిసి ముంబైకి వచ్చేవారు.
1972లో వసీం అక్బర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నూర్జహాన్ ఇలా అన్నారు.
“అది సాయంత్రం సమయం. నేను పాట పాడుతుండగా సన్నగా ఉన్న ఒక యువకుడు నా గదిలోకి ప్రవేశించి నన్ను అదేపనిగా చూడటం మొదలుపెట్టాడు
నేను మొదట ఆయన్ను పట్టించుకోలేదు. కానీ ఆయన నావైపు చూడటం ఆపలేదు. అందుకే నేను ఫిరోజ్ సాహిబ్‌ని ఈ అబ్బాయి ఎవరు? నావైపు అలా ఎందుకు చూస్తున్నాడు? అని అడిగాను. నేను కోపంగా ఉండటం చూసి ఆయన ముఖం చిట్లించాడు. కానీ ఫిరోజ్ సాహిబ్ ఆయన్ను ఏమీ అనలేదు. అతను తన తమ్ముడని నాతో చెప్పారు” అని నూర్జహాన్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు.
”ఆయన చాలా మంచి క్రికెటర్. మంచి గాయకుడు కూడా. కానీ ఆయన గజల్స్‌ను నేను రేడియోలో ఎప్పుడూ వినలేదు” అని నూర్జహాన్ అన్నారు.
గజల్స్ పాడాలని నజర్ మొహమ్మద్‌ను పట్టుబట్టానని నూర్జహాన్ చెప్పారు.
‘‘ఆయన మొదట సంకోచించినా తర్వాత కేఎల్ సైగల్ రచించిన ఒక గజల్‌ను పాడారు. నజర్ శైలి శాస్త్రీయంగా ఉండేది. ఆయన స్వరంలో గొప్ప భావోద్వేగం ఉండేది.
అంత మంచి స్వరంతో పాడే గాయకులను నేను చాలా తక్కువ మందిని చూశా. నజర్ మొహమ్మద్ స్వరంలో పురుషత్వం ఉట్టిపడింది.’’ అని ఆమె చెప్పారు.
నూర్జహాన్, నజర్‌ల మధ్య క్రమంగా ప్రేమ చిగురించింది.
ఇద్దరూ ఎప్పటికీ విడిపోకూడదని ప్రమాణం చేసుకున్నారు. ఒకరికొకరు వాగ్దానాలు చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఫొటో సోర్స్, Pakistan Chronicle
వారు రెండు మూడు సంవత్సరాల పాటు నిరంతంరం కలుస్తూనే ఉన్నారు. తన తల్లిదండ్రుల ఒత్తిడిని కాదనలేకపోయానని, తన బంధువుల్లో ఒక అమ్మాయితో తనకు నిశ్చితార్థం జరిగిందని నజర్ ఒకరోజు నూర్జహాన్‌తో చెప్పారు.
నిశ్చితార్థం జరగడానికి గల కారణాన్ని వివరిస్తూ నూర్జహాన్‌కు నజర్ ఒక సుదీర్ఘ లేఖ రాశారు.
“ప్రియమైన నూర్జహాన్.. నేను నా ఇష్ట ప్రకారమే ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని నీకు ద్రోహం చేశానని నువ్వు అనుకుంటూ ఉండాలి
నువ్వు అలా అనుకుంటే నన్ను అపార్థం చేసుకున్నట్టు. నేను మోసగాణ్ని కాదని అల్లా మీద ప్రమాణం చేస్తున్నాను. నేను ఈ రోజుకి కూడా నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. నా జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆ ప్రేమను తగ్గించలేదు.
నేను నిశ్చితార్థాన్ని రద్దు చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. నాకు నిశ్చితార్థం అయిన అమ్మాయి కథ చాలా బాధాకరమైనది. నిశ్చితార్థం రద్దు కావడం వల్ల కలిగే షాక్‌ను ఆమె తట్టుకోలేదు. ఆమె భవిష్యత్తు అంధకారమయం అవుతుంది.
ఆ అమ్మాయి ఈ ప్రపంచంలో పూర్తిగా ఒంటరిది. ఆమె తల్లిదండ్రులు చాలా చిన్న వయసులోనే చనిపోయారు. తోబుట్టువులు లేరు. పైగా ఆమె మాకు బంధువు కూడా.
అందుకే మా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు ఈ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెంచుకోవడానికి సిద్ధంగా లేరు.
నేను నిన్ను మునుపటిలాగే ప్రేమిస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా నా ప్రేమ మారదు. నేను మరణించినా.. నా ఆత్మ నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది” అని ఆ లేఖలో తన ప్రేమను వివరించారు నజర్.
నూర్జహాన్, నజర్ మొహమ్మద్‌ల ప్రేమకథలోని మొదటి అధ్యాయం ఇలా ముగిసింది.
ఆ తర్వాత నూర్జహాన్ జీవితంలోకి షౌకత్ హుస్సేన్ రిజ్వీ వచ్చారు. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
నూర్జహాన్, షౌకత్ హుస్సేన్ రిజ్వీల వివాహం జరిగిన ఎనిమిది నుంచి పది రోజుల తర్వాత నజర్ మొహమ్మద్‌కు కూడా వివాహం జరిగింది.
ఫొటో సోర్స్, Pakistan Chronicle
నూర్జహాన్, నజర్ వివాహేతర సంబంధం కథ
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత నూర్జహాన్, షౌకత్ హుస్సేన్ రిజ్వీ పాకిస్తాన్‌కు వచ్చారు.
ఆయనకు లాహోర్‌లోని షా నూర్ స్టూడియో కేటాయించడంతో అక్కడ సినిమాలు తీయడం ప్రారంభించారు.
షౌకత్ హుస్సేన్ రిజ్వీకి వివాహేతర సంబంధాలు పెట్టుకునే వ్యక్తిగా పేరుంది. అనేకమంది నటీమణులతో శృంగారం జరుపుతుండగా నూర్జహాన్ ఆయన్ను పట్టుకున్నట్టు ఆరోపణలున్నాయి.
తన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకోవడానికి నజర్ మొహమ్మద్‌ను తిరిగి కాంటాక్ట్ అవ్వాలని నూర్జహాన్ అనుకున్నారు. అనుకున్నట్టే ఒకరోజు నజర్ ఎక్కడున్నారో తెలుసుకున్నారు.
నజర్ మొహమ్మద్ ఆ రోజుల్లో టెస్ట్ క్రికెట్ ఆడటం ప్రారంభించారు. భారత్‌తో జరిగిన లఖ్‌నవూ టెస్టులో సెంచరీ సాధించి సూపర్‌స్టార్ అయ్యారు.
“నేను నజర్‌ను ఒక స్నేహితుడిలా, సోదరుడిలా కలవాలని అనుకున్నాను. తద్వారా మా సమావేశాల గురించి షౌకత్‌కు తెలిస్తే ఆయన బుద్ధి తెచ్చుకుని తన చెడ్డపనులు మానుకుంటారనుకున్నా” అని నూర్జహాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
“పెళ్లి తర్వాత కూడా నేను నజర్‌ను కలుస్తున్నానని షౌకత్‌కు అప్పటికే అనుమానం ఉండేది. కానీ పెళ్లి తర్వాత నేను నజర్‌ను కలవడం పూర్తిగా మానేశానని అల్లాకు తెలుసని నేను చెప్పాను
యాస్మిన్‌ను షౌకత్ విడిచిపెట్టడని నాకు అనిపించిన తర్వాత నేను నజర్‌ను మళ్ళీ కలిశాను’’ అని నూర్జహాన్ చెప్పారు.
ఇలా నూర్జహాన్, నజర్ మొహమ్మద్ మళ్లీ కలుసుకోవడం మొదలయింది.
దీనిపై ప్రముఖ పాత్రికేయుడు మునీర్ అహ్మద్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షౌకత్ హుస్సేన్ రిజ్వీ కొన్ని విషయాలు చెప్పారు.
“నూర్జహాన్, నజర్‌ల మధ్య వ్యవహారం ఎంతగా ముదిరిపోయిందంటే నా డ్రైవర్, ఇతర వ్యక్తులు కూడా నాతో దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. నా డ్రైవర్ ఆమిర్ హసన్ నాతో ‘సార్, చాలా పరువు నష్టం జరుగుతోంది’ అని చెప్పారు” అని ఆ ఇంటర్వ్యూలో షౌకత్ తెలిపారు.
ఫొటో సోర్స్, Hina Durrani
నజర్, నూర్జహాన్ కలిసి ఉండగా….
ఒక రోజు ఆమిర్ హసన్ తాను గంటన్నర క్రితం నూర్జహాన్‌ను ఇస్లామియా పార్క్ వద్ద కారులో దింపినట్టు షౌకత్ హుస్సేన్ రిజ్వీకి చెప్పారు.
దాని గురించి వివరిస్తూ…
“అక్కడ ఒక బాబా నివసించేవారు. ఆయనకు ఒక మందుల దుకాణం ఉండేది. వాళ్లిద్దరూ ఆయన ఇంట్లో కలుసుకునేవారు
నేను నా స్నేహితులను రెండు కార్లలో ఎక్కించుకుని వెంటనే ఇస్లామియా పార్క్ వైపు వెళ్లాము. మేము బాబా ఇంటిని చుట్టుముట్టాము. నేను బాబా దగ్గరకు వెళ్లి నూర్జహాన్ ఎక్కడుందని అడిగాను.
నూర్జహాన్ ఎక్కడుంది అని బాబా నన్ను అడిగారు. నేను ఆయనతో కోపంగా ‘మీకు నూర్జహాన్ తెలియదా? నాకు అంతా తెలుసు’ అని చెప్పి బాబా ఇంట్లో మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను.
ఆ ముసలాయన నన్ను ఆపలేకపోయారు. నా బలం చాలా ఎక్కువ. ఆ ముసలాయన కోపంతో అరవడం మొదలుపెట్టారు.
అక్కడ వరండాలో నూర్జహాన్, నజర్ ఒకే మంచం మీద కలిసి పడుకుని ఉన్నారు. ఆ సమయంలో నా దగ్గర తుపాకీ ఉండి ఉంటే నేను నూర్జహాన్, నజర్ ఇద్దరినీ కలిపి కాల్చి చంపి ఉండేవాడిని.
నజర్ భయంతో లేచి కూర్చుని 25 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకాడు. అంత ఎత్తునుంచి దూకడంతో ఆయన చేయి విరిగింది.
నూర్జహాన్ కిందకు వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె పెద్దగా అరుస్తూ ‘వీళ్లు నా అత్తమామలు. నన్ను తిడుతున్నారు. వీళ్ళు పనికిమాలిన వెధవలు. నా ద్వారా డబ్బు సంపాదిస్తారు. వాళ్లే అమ్మాయిలను అమ్ముతారు. నాకు నజర్ అంటే చాలా ఇష్టం’ అని అరవడం ప్రారంభించింది. నూర్జహాన్ రెండు గంటల పాటు అలా అరుస్తూనే ఉంది. ఆ తర్వాత స్థానికులు వచ్చారు. అక్కడ సుమారు 200 మంది గుమిగూడారు.
నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు.
క్రెసెంట్ ఫిల్మ్స్‌కు చెందిన మియాన్ రెహమాన్ కూడా అక్కడికి వచ్చారు. ఆయన నూర్జహాన్‌ను తనతో పాటు తీసుకువెళ్లారు.
వారికి నజర్ కూడా తెలుసు. నజర్ అక్కడ పడిఉన్నాడు. కాస్త స్పృహలో ఉన్నాడు. అతను చాలా మంచి ఆటగాడు. చేయి విరగడంతో అతను పనికిరాకుండా పోయాడు” అని షౌకత్ వివరించారు.
”తన భర్తను సరైన మార్గంలోకి తీసుకురావడానికి ఇది తప్పక చేయాలి’ అని నూర్జహాన్ నమ్మింది. కానీ నేను అడుగుతున్నాను. నీ భర్త హిరామండీకి వెళ్తే (లాహోర్‌లోని వ్యభిచారిణుల ప్రదేశం) వెళితే నువ్వు కూడా అక్కడికి వెళ్తావా? నువ్వు నాకు చేసినదాన్ని ఏమనాలి?” అని షౌకత్ ప్రశ్నించారు.
ఫొటో సోర్స్, Hina Durrani
నజర్ మొహమ్మద్ ఏం చెప్పారంటే…
నూర్జహాన్‌తో తన సంబంధంపై నజర్ మొహమ్మద్ తన జీవితాంతం మౌనంగా ఉన్నారు. కానీ తన జీవిత చరమాంకంలో ఆయన పాత్రికేయుడు ఇబన్ యూనుస్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
పై సంఘటనకు సంబంధించిన కొన్ని వివరాలు ఆ ఇంటర్వ్యూలో వెల్లడయ్యాయి. ఆ ఇంటర్వ్యూను తుఫైల్ అక్తర్ రచించిన ‘నూర్జహాన్, ఫితర్ జహాన్’ అనే పుస్తకంలో చేర్చారు.
ఆ కథనంలో నజర్ చెప్పిన వివరాల ప్రకారం…
“నా సోదరుడు ఫిరోజ్ నిజామీ వల్ల నేను నూర్జహాన్‌ను కలిశాను. ఆయన ప్రసిద్ధ సంగీత దర్శకులు. నూర్జహాన్‌కు గానం నేర్పించేవారు
నేను ఒక ప్రసిద్ధ క్రికెటర్ అని నూర్జహాన్‌కు తెలుసు. నేను జాతీయ క్రికెట్ జట్టులో సభ్యుడిని. కానీ ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి లేదు. ఆమె నాపట్ల ఆకర్షితురాలు కావడానికి క్రికెట్ కారణం కాదు.
నా పురుషత్వం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వల్ల కాదు. గానంపై నాకున్న అవగాహన, సంగీత స్వరకల్పనలపై నాకున్న పరిజ్ఞానం, నా మధురమైన స్వరం వల్ల ఆమె నా పట్ల ఆకర్షితురాలైంది.
నేను చాలా మంచి గాయకుడినని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నూర్జహాన్ నన్ను ఇష్టపడటానికి అదే ప్రధాన కారణం.
నూర్జహాన్ నా పక్కన కూర్చుని గంటల తరబడి పాటలు పాడేవారు. నేను ఆమె పాటలు వింటూ ఉండేవాణ్ని.
నేను విన్నట్టుగా నూర్జహాన్ పాడటం ఎవరూ ఎప్పుడూ వినలేదు. ఆమె నా కోసమే పాడారు.
ఆ రోజుల్లో ఆమె షౌకత్ హుస్సేన్ రిజ్వీ భార్య. కానీ నేను ఆమెను షౌకత్ హుస్సేన్ రిజ్వీ భార్య అనడం కన్నా, వారి పాలిట బంగారు పిచ్చుక అని అంటాను. నూర్జహాన్‌ను ఆయన చాలా దోచుకున్నారు. చాలా వేధించారు.
నిజానికి షౌకత్ హుస్సేన్ రిజ్వీకి ఈ విషయం తెలియదు. ఆ సమయంలో షౌకత్, నూర్జహాన్ పూంచ్ రోడ్‌లోని ఇస్లామియా పార్క్‌లో నివసిస్తున్నారు.
మేము చిరాగ్దిన్ దుకాణం దగ్గర కలుసుకునేవాళ్ళం. నూర్జహాన్ పనిమనిషి మా రహస్య ఏజెంట్‌గా ఉండేవారు.
యాదృచ్ఛికంగా, ఆ పనిమనిషి స్థానంలో ఒక కొత్త పనిమనిషిని పెట్టుకున్నారు. ఆ సమయంలో నూర్జహాన్ నన్ను తన ఇంటికి ఆహ్వానించారు.
మేం ఒక గదిలో మాట్లాడుకుంటున్నాము. షౌకత్ హుస్సేన్ రిజ్వీ ఎప్పుడు అక్కడికి వచ్చాడో మాకు తెలియదు. మేము ఏ గదిలో ఉన్నామో పనిమనిషి ఆయనకు చెప్పారు’’ అని ఆ సంఘటనను వివరిస్తూ నజర్ మొహమ్మద్ ఇలా చెప్పారు.
“అతను గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే నేను పారిపోయాను. నా ముందు ఒక గోడ ఉంది.
నేను గోడ ఎక్కి అవతలి వైపుకు దూకాను. దురదృష్టవశాత్తూ నేను కింద పడినప్పుడు నా చేయి కిందికి ఉంది. నా చేయి విరిగి పనికిరాకుండా పోయింది. నేను మళ్లీ ఎప్పటికీ క్రికెట్ ఆడలేకపోయాను. నూర్జహాన్ ప్రేమ కోసం నా చేతిని త్యాగం చేశాను. దానితో నా టెస్ట్ క్రికెట్ కెరీర్ కూడా ముగిసిపోయింది.
షౌకత్ హుస్సేన్ రిజ్వీ, నూర్జహాన్‌కు విడాకులు ఇవ్వడానికి ఆ సంఘటనను ఒక కారణంగా ఉపయోగించుకున్నాడు.
వాస్తవానికి షౌకత్, యాస్మిన్‌ల ప్రేమ అప్పటికి తీవ్రస్థాయిలో ఉంది. నూర్జహాన్‌ను వదిలించుకోవడానికి ఒక కారణం కోసం షౌకత్ చూస్తున్నాడు” అని నజర్ చెప్పారు.
ఫొటో సోర్స్, Social Media
నూర్జహాన్ మరో వివాహం
విడాకుల తర్వాత నజర్ మొహమ్మద్‌ను పెళ్లి చేసుకోవాలనే తన కోరికను నూర్జహాన్ వ్యక్తం చేశారు. కానీ అప్పటికే నజర్ మొహమ్మద్ ముబషీర్ నజర్, ముదస్సర్ నజర్ అనే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.
“పిల్లలను మనం కలిసి పెంచుదాం. మీరు మీ భార్యకు విడాకులు ఇవ్వండి’’ అని నూర్జహాన్ అడిగినట్లు నజర్ మొహమ్మద్ వెల్లడించారు.
ఒక ఇంటర్వ్యూలో నజర్ మొహమ్మద్ ఇలా అన్నారు.
“ముబషీర్, ముదస్సర్ పెద్దయ్యాక ‘మీరు మా అమ్మకు ఎందుకు విడాకులు ఇచ్చారు? అని నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తానని నూర్జహాన్‌ని అడిగాను.
నాకు నేను అన్యాయం చేసుకోవచ్చు. కానీ నా అమాయక భార్యకు, పిల్లలకు అన్యాయం చేయనని చెప్పా . నా మీద నిరాశతో నూర్జహాన్ అజాజ్‌అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు..
నాకు చెప్పిన తర్వాతనే ఆమె అజాజ్‌ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ఒక రోజు ముందు వరకు మేం కలిసి ఉన్నాం. పెళ్లి తర్వాత ఆమె వేరొకరితో ఉన్నారు.
ఆమె మోసగాళ్లను ఎన్నడూ క్షమించేవారు కాదు. ప్రతీకారం తీర్చుకునేవారు. కానీ నన్ను ఎంతగానో ప్రేమించడం వల్ల ఆ విషయం నాకు చెప్పలేదు.
ఆమె సంపదపై నాకు ఆసక్తి లేదని, ఆమెకున్న ప్రజాదరణ నాకు ఏమాత్రం లెక్క కాదని ఆమెకు తెలుసు” అని నజర్ అన్నారు.
ఆ రోజుల్లో నజర్ మొహమ్మద్ ఎంతగా ప్రసిద్ధి చెందారంటే, ఆయన చేయి విరిగిందన్న వార్త ఇంగ్లండ్‌కు చేరేసరికి, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
ఇరు జట్ల కెప్టెన్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని నజర్ మొహమ్మద్ టెస్ట్ కెరీర్ విషాదకరంగా ముగిసినందుకు సంతాపం వ్యక్తం చేసి, ఒక నిమిషంపాటు మౌనం పాటించడానికి ఆటను నిలిపివేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



