Home జాతీయ national telgu కోటి రూపాయల చెట్టు కేసులో కొత్త మలుపు, 50 లక్షలు విత్‌డ్రా చేసిన రైతు మృతి.....

కోటి రూపాయల చెట్టు కేసులో కొత్త మలుపు, 50 లక్షలు విత్‌డ్రా చేసిన రైతు మృతి.. ఇంతకీ అది ఏ చెట్టు?

15
0

SOURCE :- BBC NEWS

కేశవ్ శిందే, ఆయన పొలంలోని చెట్టు

ఫొటో సోర్స్, Bhagyashree Raut

    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం
  • 17 మార్చి 2026, 12:15 IST

  • చదివే సమయం: 5 నిమిషాలు

ఓ రైతుకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ ముంబయి హైకోర్టు రైల్వే శాఖను ఆదేశించింది. రైల్వే లైను నిర్మాణానికి ఆ రైతు నుంచి సేకరించిన భూమిలో ‘ఎర్ర చందనం’ చెట్టు ఉండటమే దీనికి కారణం.

ఈ మేరకు రైల్వేశాఖ కోటి రూపాయల నష్టపరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసింది.

కానీ ఇప్పుడీ కేసు మలుపు తిరిగింది.

అసలు ఆ రైతు పొలంలో ఉన్నది ఎర్రచందనం చెట్టు కాదని, దాని విలువ 10 వేల రూపాయలేనంటూ రైల్వే శాఖ కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది.

తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

డిపాజిట్ చేసిన రూ. కోటి నుంచి 50 లక్షల రూపాయలు విత్ డ్రా చేసిన తరువాత రైతు కేశవ్ శిందే చనిపోయారు. ఆయనకు డయాబెటిస్ ఉంది.

మరో రూ. 50 లక్షలు కోర్టులోనే డిపాజిట్ రూపంలో ఉన్నాయి. ఇప్పుడు శిందే మరణంతో ఆయన విత్ డ్రా చేసిన 50 లక్షల రూపాయల పరిస్థితేంటనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆయన వారసులు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రైల్వేశాఖ కోర్టును కోరుతోంది.

”ఈ కేసును దిగువ సివిల్ కోర్టులో తేల్చుకోమని హైకోర్టు చెప్పింది. ఆ చెట్టు ఎర్రచందనం కాదని బెంగళూరులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ చెట్టు బిజ్సాల్ అని తెలిపింది.

దీంతో కేశవ్ శిందే వారసులు అది ఎర్రచందనం చెట్టో కాదో నిరూపించాలి. వారు అలా నిరూపించలేకపోతే, ఆ చెట్టు విలువ రూ. 10 వేలు పోను మిగిలిన మొత్తాన్ని వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది” అని రైల్వే న్యాయవాది నీరజ్ చౌబే చెప్పారు.

అయితే చెట్టు విలువ 10 వేల రూపాయలంటూ తప్పుగా లెక్కించారని రైతులు చెబుతున్నారు.

రైతు తరఫున వాదించిన న్యాయవాది అంజనా రావత్ మాట్లాడుతూ ”రైల్వేలు కోర్టుకు సమర్పించిన నివేదికలో చెట్టును అక్రమంగా నరికిన కలప విలువ ఆధారంగా అంచనా వేశారు. కానీ ఆ చెట్టు ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది. ఆ చెట్టు బరువు సుమారు 400 టన్నులు ఉంటుంది. దానికి తగిన విధంగా విలువ నిర్ణయించాలి” అన్నారు.

”చెట్టుకు మళ్లీ అంచనా వేయాలి. ఆ అంచనా రైతు కోరిన రూ.50 లక్షల కంటే ఎక్కువగా ఉంటే రైల్వేలు చెల్లించాలి. తక్కువగా ఉంటే రైతు డబ్బు తిరిగి ఇవ్వాలి” అని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించిందని ఆయన వివరించారు. దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదన్నారు.

ఈ కేసు ప్రస్తుతం యావత్మాల్ సివిల్ కోర్టులో విచారణకు రానుంది.

Keshav Shinde and Punjab Shinde
కేశవ్ శిందే, పంజాబ్ శిందే

రైతు వారసులు ఏం చెబుతున్నారు?

కేశవ్ శిందే తనకు లభించిన కోటిరూపాయల పరిహారంలో ఆయన 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. మిగిలిన 50 లక్షలు రూపాయలు ఇంకా హైకోర్టులోనే డిపాజిట్‌ రూపంలో ఉన్నాయి.

ఆయన విత్ డ్రా చేసిన 50 లక్షలరూపాయలను తన పిల్లలకు పంచిపెట్టారు. ఇప్పుడు చెట్టు విలువ తక్కువగా నిర్ణయిస్తే మిగతా డబ్బును వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

అయితే తాజా అంచనాకు అనుగుణంగా డబ్బును తిరిగివ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేశవ్ శిందే పెద్ద కుమారుడు పంజాబ్ శిందే బీబీసీ మరాఠీకి తెలిపారు.

కేశవ్ శిందే పిల్లల్లో పంజాబ్ శిందే మాత్రమే చదువుకున్నారు. ఈ వ్యవహారాన్ని ఆయనే చూసుకుంటున్నారు.

రైల్వేశాఖ కోర్టుకు సమర్పించిన నివేదికలో చెట్టు విలువ 10వేల రూపాయలుగా పేర్కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

”మా చెట్టు వయసు 100 ఏళ్లు. అది ఉత్పత్తి చేసే ఆక్సిజన్, పర్యావరణ విలువలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వారు వేసిన అంచనా సరైంది కాదు. 100 ఏళ్ల చెట్టుకు సరైన విలువ కడితే అది మేం కోరిన రూ.50 లక్షల కంటే ఎక్కువగానే ఉంటుంది” అని పంజాబ్ శిందే తెలిపారు.

”భూగర్భ పైప్‌లైన్, బావికి పెరిగిన పరిహారం, మా పొలంలో ఉన్న మరో 31 చెట్ల విలువలను పరిగణలోకి తీసుకుని మాకు ఇప్పటివరకు సరైన పరిహారం అందలేదు. ఇవన్నీ కలిపి మొత్తం పరిహారం కోటి రూపాయలకుపైగానే ఉంటుంది. అయితే ఆ చెట్టుకు మాత్రం సరైన విలువ కట్టాలి. అది నిర్ధరించాకే, నిబంధనల ప్రకారం డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు.

రైతు పొలంలోని చెట్టు

ఫొటో సోర్స్, Bhagyashree Raut

అసలేం జరిగింది?

తమ పొలంలోని ఎర్రచందనం చెట్టుకు పరిహారం కోరుతూ యవత్మాల్ జిల్లాలోని ఖర్షీకి చెందిన రైతు కేశవ్ శిందే, ఆయన ఐదుగురు కుమారులు 2024 అక్టోబర్ 7న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పుసద్ తాలూకాలోని ఖర్షీ గ్రామంలో కేశవ్ శిందేకు 2.29 హెక్టార్ల భూమి ఉంది. వార్దా – యావత్మాల్ – పుసద్ – నాందేడ్ రైల్వే లైన్ ఆయన పొలంలో నుంచి వెళ్తుండడంతో, భూ సేకరణలో భాగంగా సెంట్రల్ రైల్వే ఆయన భూమిని సేకరించింది.

సెంట్రల్ రైల్వే స్వాధీనం చేసుకున్న భూమికి సంబంధించి శిందే పరిహారం అందుకున్నారు. అలాగే, పొలంలో ఉన్న ఎర్రచందనం చెట్టు సహా ఇతర పది రకాల చెట్లకు, భూగర్భ పైప్‌లైన్‌కు కూడా అధికారులు పరిహారం చెల్లించాలని శిందే డిమాండ్ చేశారు.

అయితే, ముందుగా ఎర్రచందనం చెట్టు ఎంత ధర పలుకుతుందో లెక్కించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. దాని ధర తేల్చేందుకు అటవీ శాఖకు లేఖ కూడా రాశారు.

కేశవ్ శిందే కుమారుడు, పిటిషనర్ పంజాబ్ శిందే ఇచ్చిన సమాచారం మేరకు వారి వ్యవసాయ భూమిలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి, వాటికి కూడా పరిహారం వచ్చింది.

బావికి రూ.8 లక్షలు కూడా చెల్లించారు. అయితే పైప్‌లైన్, ఎర్రచందనం చెట్టు సహా ఇతర చెట్లకు పరిహారం ఇవ్వలేదు.

దీనిపై 2014 నుంచి జిల్లా కలెక్టర్, అటవీ శాఖ, రైల్వేలు, నీటిపారుదల శాఖలకు పలుమార్లు లేఖలు రాశామని, అయినా స్పందన రాలేదని తెలిపారు. చివరకు ఎనిమిదేళ్ల తర్వాత హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

శిందే పొలంలోని చెట్టు కొమ్మ

ఇప్పుడేం చేస్తారు?

గత ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టు.. రైతుకు కోటి రూపాయలను పరిహారం చెల్లించాలని ఆదేశించడంతో సెంట్రల్ రైల్వే విభాగం ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసింది. అందులో నుంచి 50 లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి కోర్టు అనుమతించగా, రైతు ఆ మొత్తాన్ని తీసుకున్నారు.

అయితే అప్పటికి చెట్టు విలువ పూర్తిగా నిర్ధరణ జరగలేదు. చెట్టుకు అంచనా వేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆ అంచనాతో పరిహారం పెరిగితే అదనపు మొత్తాన్ని రైల్వేలు చెల్లించాలని కూడా అప్పట్లో కోర్టు పేర్కొంది.

తర్వాత పుసాద్ అటవీ శాఖ చెట్టు అంచనా బాధ్యతను బెంగళూరులోని ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు అప్పగించింది.

ఆ సంస్థ సమర్పించిన నివేదికలో ఆ చెట్టు ఎర్రచందనం కాకుండా ‘బీజాల్సా అని పేర్కొన్నారు. దీనికి శాస్త్రీయ నామం ప్టర్‌కార్పస్ మార్సుపియం అని తెలిపింది.

దీని ఆధారంగా రైల్వే శాఖ కోర్టును ఆశ్రయించి, ఆ చెట్టు విలువ కేవలం రూ.10 వేలేనని పేర్కొంది.

ఈ కేసు ఇప్పుడు లోయర్ కోర్టులో కొనసాగుతుందని, చెట్టుకు మళ్లీ అంచనా వేయనున్నట్లు న్యాయవాది అంజనా రావత్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)