Home జాతీయ national telgu రాత్రంతా ఆన్‌లోనే బైక్ ఇంజిన్.. పొగ పీల్చి కవలలు సహా నలుగురి మృతి

రాత్రంతా ఆన్‌లోనే బైక్ ఇంజిన్.. పొగ పీల్చి కవలలు సహా నలుగురి మృతి

7
0

SOURCE :- BBC NEWS

నలుగురు పిల్లల తల్లి రేవతి

(గమనిక:ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

‘‘ఇంకొన్ని రోజులయ్యుంటే వాడే మాకు అన్నం పెట్టుండేవాడు. అలాంటి కొడుకు చనిపోయాడు. ఆడపిల్లలు ఇద్దరూ కవలలు. వాళ్లు కూడా చనిపోయారు. వాళ్లతో పాటు మా నాన్నా చనిపోయాడు. నాకు తెలియక ఇంట్లో పెట్టాను. తెలిసి ఉంటే నా బిడ్డల్ని పోగొట్టుకునే వాడిని కాదు’’ అని మురళి ఆవేదన చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన మురళి తన బైక్‌ను ఇంట్లో ఉంచి రాత్రంతా ఆన్‌లోనే పెట్టడంతో , గదంతా పొగ కమ్ముకుని తన తండ్రితోపాటు ముగ్గురు పిల్లలను కోల్పోయారు.

పుంగనూరులోని త్యాగరాజ నగర్‌లోని ఓ ఇంట్లో రాత్రంతా ఆన్‌లోనే ఉంచిన మోటార్ బైక్ కారణంగా వెలువడిన పొగతో ఊపిరాడక అదే గదిలో నిద్రిస్తున్న ఒక వృద్ధుడితోపాటు ముగ్గురు పిల్లలు చనిపోయారని పోలీసులు చెప్పారు.

మురళి త్యాగరాజనగర్‌లో కాపురం ఉంటూ ఒక బార్బర్ షాప్ నడుపుతున్నారు.

తన పాత మోటారు బైక్‌ను అదే ఏరియాలో మెకానిక్‌కు రిపేరుకు ఇచ్చారు. దాన్ని బోర్ చేసిన మెకానిక్.. రాత్రంతా బైక్ ఆన్‌లో ఉంచాలని సలహా ఇవ్వడంతో మురళి తన ఇంట్లో బైక్‌ను ఆన్‌లోనే ఉంచినట్లు చెప్పారు.

ఆన్‌చేసిన బైక్‌ను కింది గదిలో ఉంచిన మురళీ, ఆయన భార్య పై గదిలో నిద్రించగా, బైక్ ఉన్న గదిలోనే మురళి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, ఆయన తండ్రి రామచంద్ర నిద్రించారు.

రాత్రంతా బైక్ నుంచి వచ్చిన పొగ బయటకు వెళ్లే దారిలేక కింద గదంతా కమ్మేయడంతో 70 ఏళ్ల రామచంద్ర సహా ముగ్గురు పిల్లలు చనిపోయారు.

అక్కడ పరిస్థితిని బీబీసీ పరిశీలించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
చిన్నగదిలో మరణాలు

చిన్న గదిలో మరణాలు

పుంగనూరులోని త్యాగరాజ నగర్‌కు బీబీసీ చేరుకున్నప్పుడు ఇంత విషాదానికి కారణమైన మోటార్ బైక్ ఇంటి ముందే పార్క్ చేసి కనిపించింది.

అది పాత కాలంనాటి ఇల్లు. ఇంటి ముందు ఒక చిన్న గేటు ఉంది. లోపలికి వెళితే చిన్న వరండా ఉంది. అందులో నుంచి కొంచెం లోపలికి గుమ్మం దాటుకుని వెళ్తే అక్కడ మరో చిన్న వరండా ఉంది. రాత్రి బైక్‌ను అక్కడే పార్క్ చేశారు. అక్కడే ఎడమవైపు వంటగది ఉంది. అందులో చిన్న కిటికీ ఉంది.

ఇంకాస్త లోపలికి వెళితే చిన్న వరండా ఆ తర్వాత చివర్లో మరో చిన్న గది ఉంది. ఆ గదిలోనే నలుగురూ చనిపోయారు.

మురళీ

మురళి కొడుకు కార్తీక్‌కు 16 ఏళ్లు , ఇద్దరు కూతుళ్లు చరణి, చందు కవలలు. వారికి ఏడేళ్లు.

బైక్ ఇంటిబయట పెడితే ఎవరైనా ఎత్తుకుపోతారని, ఇంట్లోనే ఉంచి ఆన్‌‌లో పెట్టామని ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని మురళి చెప్పారు.

”ఉదయం ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే నలుగురు చనిపోయి ఉన్నారు’’ అని తెలిపారు మురళి.

‘‘బోర్‌కు వచ్చిన బండికి రిపేరు చేయించి తీసుకొచ్చి ఇంట్లో ఆన్‌లో పెట్టాను. బయటపెడితే దొంగలు ఎత్తుకెళ్తారేమో అని ఇంట్లో పెట్టా. అయితే మేం కూడా మామూలుగా ఆ గదిలోనే పడుకునే వాళ్ళం. కానీ బండి సౌండ్ వస్తుండడంతో పైన చిన్న గదిలో నేను, నా భార్య నిద్రించాం’’ అని మురళి చెప్పారు.

‘‘మా నాన్నతోపాటు నా ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆ గదిలో పడుకున్నారు. నా కొడుకు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆడపిల్లలిద్దరూ కవలలు . వారికి ఏడేళ్లు. రెండో తరగతి చదువుతున్నారు. వాళ్లు కూడా చనిపోయారు. వాళ్లతో పాటు 70 ఏళ్ల మా నాన్న రామచంద్ర కూడా చనిపోయాడు’’ అని మురళి చెప్పారు.

అమ్మమ్మ కళావతి

నలుగురిలో ఒక్క బిడ్డే దక్కింది

తన మొత్తం నలుగురు పిల్లల్లో ఇప్పుడు ఒక్క బిడ్డ మాత్రమే దక్కిందని తల్లి రేవతి కన్నీళ్లు పెట్టారు.

“రాత్రంతా ఆన్ చేసి ఉంచాలని చెప్పారంట. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో స్టార్ట్ చేసి పెట్టాడు’’ అని రేవతి చెప్పారు.

‘‘మా పిల్లలు ఇంట్లోనే పడుకొన్నారు. ఉదయం 4 గంటలకు వచ్చి ఎంత కొట్టినా డోర్ తీయలేదు. తలుపులు పగలగొట్టి చూస్తే నా పిల్లలు శవాలై కనిపించారు’’ అని రేవతి తెలిపారు.

‘‘నా పెద్ద కూతురు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఆ ఒక్క బిడ్డ మాత్రమే మాకు దక్కింది. మిగిలిన అందరూ చనిపోయారు. మేంకూడా ఇంట్లోనే పడుకొని ఉండాల్సింది. బండి శబ్దం కారణంగా మేం మిద్దె పైన పడుకున్నాం. ఉదయం చూసేసరికి ఇలా జరిగింది’’ అని రేవతి వివరించారు.

పెద్ద పాపను నాతో తీసుకెళ్లాను కాబట్టి తనైనా ప్రాణాలతో బతికింది’’ అని అమ్మమ్మ కళావతి అన్నారు.

”మేం వేరే ఊళ్లో ఉంటాం. అయితే పెద్ద పాపని నేను మా ఊరికి తీసుకెళ్లాను. ఉదయం ఇలా జరిగిందని తెలుసుకొని వచ్చి చూసేసరికి ఇల్లంతా వాసన వస్తోంది. బిడ్డలు బయట శవాలై పడి ఉన్నారు. నాకు చాలా బాధ కలిగింది. పెద్ద బిడ్డ నాతో వచ్చింది కాబట్టి ఆ బిడ్డైనా బతికింది. మిగిలిన ముగ్గురు పిల్లలు చనిపోయారు” అన్నారు.

సీఐ సుబ్బరాయుడు

దర్యాప్తు చేస్తున్నాం – పోలీసులు

ఇది తెలియని తనంతో జరిగిన విషాదమని పుంగనూరు సీఐ సుబ్బారాయుడు బీబీసీతో చెప్పారు.

పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

”విషయం తెలిసిన వెంటనే మేం ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిశీలించాం. నాలుగు మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత వారికి అప్పగించాం. కొన్ని అవయవాలను అనంతపురంలోని ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపిస్తాం. దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని సుబ్బరాయుడు చెప్పారు.

మురళి భార్య రేవతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

‘‘ఊపిరాడక జరిగిన అసహజ మరణాలు’’గా కేసు నమోదు చేశామన్నారు.

‘‘ఆ మోటర్ బైక్ రిపేర్ చేసిన మెకానిక్‌ను, సాక్షులను విచారించాక, ఓ అభిప్రాయానికి వస్తాం” అని సుబ్బరాయుడు చెప్పారు.

మెకానిక్ ఏం చెబుతున్నారు?

బండిని రాత్రంతా ఇంజిన్ ఆన్‌లోనే ఎందుకు ఉంచమన్నారో తెలుసుకుందామని మురళి బైక్‌ను రిపేర్ చేసిన మెకానిక్‌ను కలిసేందుకు బీబీసీ ప్రయత్నించింది.

మెకానిక్ షాపు తెరిచే ఉన్నప్పటికీ ఆయన అక్కడ లేరు.

దీంతో బీబీసీ ఆయనను ఫోన్‌లో సంప్రదించింది.

‘‘బైక్ రాత్రంతా స్టార్టింగ్‌లో ఉంచమని చెప్పలేదని’’ ఆయన స్పష్టం చేశాడు.

”నేను వాహనాన్నిఆన్‌లోనే ఉంచమని చెప్పలేదు. నేను ఆల్రెడీ 2 గంటలు స్టార్టింగ్‌లో పెట్టి ఆయనకు అప్పగించాను. కొన్ని రోజులు లోకల్‌గా మాత్రమే తిరుగు అని చెప్పాను. అతను ఇంకా చాలా మంది సలహాలు తీసుకుంటాడు కాబట్టి, ఎవరి సలహాతో అలా రాత్రంతా బండి ఆన్‌లో పెట్టాడో నాకు తెలీదు” అని మెకానిక్ తెలిపారు.

మోటారు బైక్

మోటారు బైక్ పొగ ప్రమాదకరమా?

ఆన్‌లో ఉంచిన మోటారుబైక్ ద్వారా వచ్చే పొగ పీల్చడం వల్ల మరణిస్తారా? అలా ఎందుకు జరుగుతుంది? అనే విషయంపై తిరుపతి రుయా హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు బీబీసీతో మాట్లాడారు.

“పొగ కమ్మేసిన గదిలో హ్యుమిడిటీ ఉంటే కార్బన్ మొనాక్సైడ్ తయారవుతుంది. వాళ్లు నిద్రలో ఉన్నారు కాబట్టి అది మెల్లిగా హిమోగ్లోబిన్‌ని ఆక్రమించి, ఊపిరాడకుండాచేస్తుంది. దీంతో శరీరం పారలైజ్ అయిపోతుంది’’ అన్నారు డాక్టర్ సుబ్బారావు.

‘‘పొగ పీల్చినవారు లేవలేని స్థితిలోకి వెళ్లిపోయింటారు. గది మూసి ఉండడం వల్ల ఆ గదిలో, నైట్రోజన్, నీటి ఆవిరి, నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రో కార్బన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కలగలసినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ తయారవుతుంది’’ అని చెప్పారు డాక్టర్ సుబ్బారావు.

‘‘ఈ కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్ల అది హిమోగ్లోబిన్‌లోకి చేరింది. ఆ గదిలో ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోయి ఉంటుంది. మూసిన గదిలో ఇవన్నీ వ్యాపించడం వల్ల నలుగురూ బయటకు రాలేక చనిపోయి ఉంటారు’అని అన్నారు.

పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాక మరణాలకు అసలు కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

” ఇంట్లో గ్యాస్, ఫ్రిజ్, ఓవెన్స్, హీటర్స్ అన్నింటికీ తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వాటి నుంచి ఉత్పత్తి అయ్యే వాయువులు సజావుగా బయటకు వెళ్లే మార్గం ఉండాలి. ఇవ్వన్నీ మూసిఉన్న గదుల్లో ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి’’ అని సుబ్బారావు తెలిపారు.

‘‘ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు వాడేటప్పుడు దానికి వెంటిలేషన్ ఉండడం తప్పనిసరి. బ్యాటరీల్లాంటివి ఇంటిలోపల పెట్టుకోకూడదు. వీటన్నిటి నుంచి ప్రమాదకర వాయువులు విడుదలవుతూ ఉంటాయి. గాలి వెలుపులకు పోయే దారి తగినంతగా ఉంటే అలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు” అని డాక్టర్ సుబ్బారావు వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)