Home జాతీయ national telgu అఫ్గానిస్తాన్‌లోని ఆసుపత్రిపై వైమానిక దాడిలో వందల మంది మృతి.. పాకిస్తానే కారణమంటున్న తాలిబన్ ప్రభుత్వం

అఫ్గానిస్తాన్‌లోని ఆసుపత్రిపై వైమానిక దాడిలో వందల మంది మృతి.. పాకిస్తానే కారణమంటున్న తాలిబన్ ప్రభుత్వం

15
0

SOURCE :- BBC NEWS

అఫ్గానిస్తాన్, కాబూల్ దాడి, పాకిస్తాన్

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఒక డ్రగ్ ట్రీట్మెంట్ సెంటర్‌పై జరిగిన వైమానిక దాడిలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించినట్లు లేదా గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ దాడికి పాకిస్తాన్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

సోమవారం ఆసుపత్రిపై దాడి జరిగిందని, ఇందులో కొంతమంది మరణించగా, మరికొందరు గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

అయితే, ఈ కేంద్రాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నామనే ఆరోపణలను పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. కాబుల్, తూర్పు అఫ్గాన్ ప్రావిన్స్ అయిన నంగర్హార్‌లోని సైనిక స్థావరాలు, “ఉగ్రవాద మద్దతు మౌలిక సదుపాయాలనే” లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది.

బీబీసీ ఈ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో అక్కడ ఇంకా మంటలు కనిపించాయి. 30కు పైగా మృతదేహాలను స్ట్రెచర్లపై బయటకు తేవడాన్ని బీబీసీ గమనించింది.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్

ఆసుపత్రిలో రెండు వేల మంది

ఆసుపత్రి అధికారుల కథనం ప్రకారం.. అక్కడ సుమారు 2,000 మంది చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనలో వందలాది మంది బాధితులు ఉండవచ్చని అధికారులు చెప్పారు. ఆసుపత్రి సమీపంలో ఎటువంటి సైనిక స్థావరాలు లేవని అఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ అమర్ఖైల్ బీబీసీతో చెప్పారు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:50 గంటలకు కాబుల్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఆ తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శబ్దాలు వచ్చాయని నివాసితులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులు తమ వారి సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఫిబ్రవరి 26 నుంచి..

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య చాలారోజులుగా వివాదాలున్నాయి. గత నెలలో ఇవి మళ్లీ రాజుకున్నాయి. అఫ్గానిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తుండగా, తాలిబన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది.

ఫిబ్రవరి 26 నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న సరిహద్దు ఘర్షణల కారణంగా అఫ్గానిస్తాన్‌లో కనీసం 75 మంది మరణించగా, 193 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ తెలిపింది.

అక్టోబర్‌లో రెండు పక్షాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, నెలల తరబడి ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)