SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Kate Grosmaire
15 మార్చి 2026, 12:20 IST
చదివే సమయం: 6 నిమిషాలు
అన్ గ్రాస్మైర్‌కు 19 ఏళ్లు నిండిన కొద్దికాలానికే తన బాయ్‌ఫ్రెండ్ జరిపిన కాల్పుల్లో మరణించారు.
తన కుమార్తె ప్రాణం తీసిన వ్యక్తిని క్షమించానని ఈ సంఘటన జరిగిన 16 ఏళ్ల తరువాత అన్ తల్లి కేట్ చెప్పారు.
‘‘క్షమించడం మమ్మల్ని ముందుకు సాగేలా చేసింది. మా గాయం మానడానికి సాయపడుతోంది’’ అని ఆమె చెప్పారు. ‘‘ఇంకా మనం దు:ఖాన్ని అనుభవిస్తూనే ఉందామా?’’ అని ప్రశ్నించారు.
‘‘దు:ఖం కచ్చితంగా ఉంటుంది. కానీ అందులోనే బందీలుగా ఉండిపోకూడదు’’ అంటారు.
బీబీసీ వరల్డ్ సర్వీస్ పాడ్‌కాస్ట్ ‘డియర్ డాటర్’ కోసం కేట్ తన కుమార్తెకు ఓ లేఖ రాశారు. అందులో బాధితులు, నేరస్తులు మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని తానెందుకు ప్రోత్సహిస్తోందీ, కూతురిని చంపిన వ్యక్తిని తాను ఎలా క్షమించగలిగారో రాశారు.

ఫొటో సోర్స్, Kate Grosmaire
‘పెళ్లిచేసుకోవాలనుకునేవారు’
తన ముగ్గురు కుమార్తెలలో చివరిదైన అన్ ”చాలా తెలివైనదని’, కానీ స్కూలుకు వెళ్లడం ఎప్పుడూ ఇష్టముండేదికాదని కేట్ చెప్పారు. ఆమెకు కళలంటే చాలా ఇష్టమని, స్కూల్‌లో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేదని కేట్ తెలిపారు.
వన్యప్రాణుల ఆశ్రయం ప్రారంభించాలని అన్ కలలుకనేదని ఆమె స్నేహితులు తెలిపారు.
అన్ తెలివైనది, దయ, ప్రేమ, కరుణ నిండిన వ్యక్తని స్నేహితులు అభివర్ణించేవారు.
అన్ 16ఏళ్ల వయసులో ఫ్లోరిడాలోని టల్లాహస్సీలోని స్కూల్‌లో తన బాయ్‌ఫ్రెండ్ కానర్ మెక్‌బ్రైడ్‌ను మొదటిసారి కలిశారు.
అతని ప్రవర్తన గౌరవంగా ఉందని అన్ తల్లిదండ్రులు భావించారు.
‘‘మాకు అతను చాలా నచ్చేవాడు’’ అని కేట్ చెప్పారు. తన తండ్రి ఇంటి నుంచి బయటకు పంపేసినప్పుడు కానర్ మూడునెలలు మా కుటుంబంతోనే ఉన్నాడు’’ అని కేట్ చెప్పారు.
”అన్, కానర్ కొన్నిసార్లు వాదులాడుకునేవారు. విడిపోతుండేవారు. మొత్తంగా చూస్తే వాళ్లు సంతోషంగా ఉన్నట్టే కనిపించినా, వాళ్ల బంధంలో అస్థిరత కనిపిచేది. భవిష్యత్తులో వాళ్లు పెళ్లిచేసుకోవాలనుకున్నారు” అని కేట్ చెప్పారు.
ఫొటో సోర్స్, Kate Grosmaire
హత్యకు ముందు ఏం జరిగింది?
చదువులో సాధించిన ఘనతలకు అన్‌కు 2010లో కళాశాలలో గుర్తింపు లభించింది. దీంతో ఆమె సంబరపడ్డారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లి సంతోషంగా గడపాలనుకున్నారు.
‘‘కానీ అన్ కోరుకున్నంత సంతోషంగా కానర్ లేరు. దీంతో వారి మధ్య వాదులాట మొదలైంది. వాళ్లిద్దరి వయసు అప్పుడు 19 ఏళ్లే. వాదన ఆపలేకపోవడానికి ఇదో కారణం కావొచ్చు. నిద్రపోయేవరకు ఇద్దరూ వాదించుకుంటూనే ఉన్నారు. తర్వాత రోజు కూడా అది కొనసాగింది” అని కేట్ చెప్పారు.
”ఒక దశలో కానర్ తన తండ్రి షాట్‌గన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్నారు. కానర్‌కు బతకాలని లేకపోతే, తాను కూడా బతకనని అన్ చెప్పారు. అతను గన్‌ను ఆమెకు గురిపెట్టి ‘ఇదేనా నువ్వు కోరుకుంది’ అని అడిగారు. ‘నేను కోరుకుంది ఇది కాదు’ అని అన్ స్పష్టంగా బదులిచ్చారు. కానీ అప్పటికే వాదనతో అలిసిపోయిన కానర్ ట్రిగ్గర్ నొక్కారు” అని తన కూతురును బాయ్‌ఫ్రెండ్ ఎలా హత్యచేశాడో కేట్ వివరించారు.
కానర్ తనంతటతానే పోలీసుల దగ్గరకు వెళ్లారు.
పోలీసులు అక్కడికి వచ్చేసరికి అన్ తీవ్రగాయాలతో బతికే ఉన్నారు.
అన్ ఆస్పత్రిలో లైఫ్ సపోర్ట్‌తో ఉన్నప్పుడే జైల్లో కానర్‌ను కలవాలని కేట్ నిర్ణయించుకున్నారు.
తాను, తన భర్త అండీ కానర్‌ను ప్రేమిస్తున్నామని, అతన్ని క్షమించాలనుకుంటున్నామని కేట్ కానర్‌కు చెప్పారు.
‘‘ఆ మాటలు చెప్పినప్పుడు ప్రశాంతత నా మనసును తాకినట్టనిపించింది’’ అన్నారు కేట్.
ఫొటో సోర్స్, Kate Grosmaire
‘క్షమిస్తున్నానని చెప్పాక ప్రశాంతత కలిగింది’
కొన్నిరోజుల తర్వాత అన్‌కు లైఫ్ సపోర్ట్ నిలిపివేయాలనే బాధాకరమైన నిర్ణయాన్ని కేట్, ఆండీ తీసుకున్నారు.
”క్షమించడం ద్వారానే ప్రశాంతత వస్తుందని నాకు అర్ధమైంది. అవును, నీపై షాట్‌గన్‌ను గురిపెట్టిన కానర్‌ను కూడా క్షమించడం” అని అన్‌కు రాసిన లేఖలో కేట్ చెప్పారు.
హత్యకు గురైన బాధితురాలిగా తన కుమార్తెను గుర్తుంచుకోవాలనుకోవడం లేదని మరణానంతరం కూతురికి రాసిన లేఖలో కేట్ అన్నారు.
”నువ్వు అంతకన్నా చాలా చాలా ఎక్కువ. కానీ కానర్‌ను హంతకుడిగా మాత్రమే నేను చూడాలనుకుంటే.. అప్పుడు నీపై హత్యా బాధితురాలనే ముద్రపడుతుంది ” అని కేట్ రాశారు.
రెస్టోరేటివ్ జస్టిస్ అనే పద్ధతిలో బాధితులు, నేరం చేసిన వారితో మాట్లాడటానికి అనుమతిస్తారు . నేర ప్రభావం, నేరం చేసిన వారు తాము చేసిన పనికి బాధ్యత తీసుకోవడం, ఎందుకు చేయాల్సివచ్చిందో వివరణ ఇవ్వడం వంటివాటికి ఈ విధానంలో అవకాశముంటుంది. ఆండీకి మొదటిసారి ఈ విషయం తెలిసినప్పుడు ఇది తమకు సరైన ఆప్షన్ అని ఆయన, కేట్ అనుకున్నారు.
కానర్‌తో 2011 వేసవిలో వారికి రెస్టోరేటివ్ జస్టిస్ సమావేశం జరిగింది. ”మా హృదయాల్లోని బాధను చెప్పాం. అన్‌ను కోల్పోవడం మాకు ఎంత కష్టమైన విషయమన్నది కానర్‌కు వివరించాం” అని కేట్ చెప్పారు.
అన్ మరణానికి దారితీసిన వాదన వివరాలను కానర్ చెప్పారు.
కానర్‌కు ఎలాంటి శిక్ష పడాలని తాముకోరుకుంటున్నామో చెప్పే అవకాశం కేట్, ఆండీకి లభించింది. కేట్, ఆండీ చెప్పిన వాటిని స్టేట్ అటార్నీ పరిగణనలోకి తీసుకున్నారు.
పాతికేళ్ల జైలుశిక్షను అనుభవించడం లేదా కోప నియంత్రణ తరగతులకు హాజరవుతూ టీనేజ్ డేటింగ్‌లో హింస గురించి బహిరంగంగా మాట్లాడటం, అన్‌కు ఆసక్తి ఉన్న రంగాల్లో స్వచ్ఛంద సేవ చేయడం వంటి షరతులతో 20 సంవత్సరాల శిక్షతోపాటు మరో 10 సంవత్సరాల ప్రొబేషన్‌ను అంగీకరించడం అనే రెండు అవకాశాలను స్టేట్ అటార్నీ కానర్‌కు కల్పించారు.
కానర్ రెండోదాన్ని ఎంచుకున్నారు.
‘అతని జైలు జీవితం నిన్ను మాకు తిరిగివ్వదు’
”నీ జీవితాన్ని ఏవీ తిరిగి తీసుకురాలేవు. నిన్ను మా దగ్గరకు తీసుకురాలేవు. కానీ కానర్ చర్యలు మాపై ఎలాంటి ప్రభావం చూపాయో మేం చెప్పగలిగాం. అతనికి అర్ధవంతమైన శిక్షపడేలా చేయగలిగాం. అతను తన మిగిలిన జీవితాన్ని జైల్లో గడపడం నీ జీవితాన్ని తిరిగివ్వదు” అని కేట్ రాశారు.
క్షమించడమే ప్రశాంతతకు సరైన మార్గమని కేట్ నమ్ముతున్నారు.
అన్‌ను కోల్పోయిన బాధను దిగమింగుకుని తన ఇతర కూతుళ్ల కోసం మరింత సమయం వెచ్చించడానికి ఈ క్షమాగుణం కేట్‌కు అవకాశం కల్పించింది.
అన్ చనిపోయినప్పుడు ఆమె ఇద్దరు అక్కల్లో ఒకరికి 21 ఏళ్లు. మరొకరికి 25.
”ప్రతిరోజూ నేను అన్ గురించి, ఆమె నా దగ్గర లేదనేవిషయం ఆలోచిస్తూ ఉంటే మిగతా కూతుళ్లతో నా అనుబంధంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఊహించుకోగలరు” అని కేట్ చెప్పారు.
కేట్, ఆండీ కానర్‌తో కాంటాక్ట్‌లోనే ఉన్నారు. ఇప్పుడతనికి 35ఏళ్లు వచ్చాయి. ఫోన్, ఈ మెయిల్, జైలుకు వెళ్లి కలవడం వంటి మార్గాల్లో మొదట్లో వాళ్లు అతనితో వారానికోసారి మాట్లాడేవారు.
”అతనికిది చాలా అవసరం. మరీ ముఖ్యంగా అన్ చనిపోయిన తర్వాత తొలి సంవత్సరాలలో. మేం క్షమించామని, అతనితో మాట్లాడాలనుకుంటున్నామని అతను తెలుసుకోవడం. ఇప్పుడు నేను అతనితో మాట్లాడి కొన్నినెలలైంది” అని కేట్ చెప్పారు.
ఫొటో సోర్స్, Kate Grosmaire
‘క్షమించడం అంటే సమర్థించడం కాదు’
జైల్లోఉంటూ కానర్ లా క్లర్క్‌గా స్వచ్ఛందంగా పనిచేశాడు. బాధ్యత, రెస్టోరేటివ్ జస్టిస్ గురించి క్లాసులు చెప్పారు. టీన్ డేటింగ్ హింస గురించి వీడియోలో మాట్లాడారు.
”ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల విషయాల్లో అతను మంచిపనులు చేయాల్సిఉందని నేను కానర్‌తో చెప్పాను” అని కూతురికి రాసిన లేఖలో కేట్ అన్నారు.
కేట్, ఆండీ ఇప్పటికీ అన్ పుట్టినరోజున కేక్ కట్ చేస్తారు.
”నేను అలా చేయకుండా ఉండలేను. తను లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తుంది” అని ఆమె చెప్పారు.
క్షమించడం, రెస్టోరేటివ్ జస్టిస్ తన కూతురి కొనసాగింపుగా భావిస్తానని ఆమె అన్నారు.
”క్షమించడం అంటే పూర్తిగా మన్నించడం కాదు. వాళ్లు చేసినదంతా సరైనదే అనుకోవడం కాదు. తప్పును సరిచేయాలని మనం నిరీక్షిస్తూ కూర్చోం. క్షమాగుణంతో మనం మనదారిలో ముందుకెళ్లడానికి వీలు కలుగుతుంది. దానివల్ల ప్రశాంతత ఏర్పడుతుంది” అని కేట్ ముగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



