SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
మనం నిత్యం వాడే వంట గ్యాస్ ధర పెరిగిందని ఒకరు, వాహనాలకు సీఎన్‌జీ వాడితే లాభమని మరొకరు.. ఇలా ప్రతిరోజూ ఇంధనాల గురించి ఏదో ఒక చర్చ వింటూనే ఉంటాం.
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా తగ్గడం ఈ చర్చను మరింత తీవ్రం చేసింది.
అయితే, ఈ గ్యాస్ రకాలన్నీ ఒకటేనా? వీటి తయారీలో ఉన్న తేడాలేంటి వంటి ఆసక్తికర అంశాలు ఇక్కడ చూద్దాం.
గ్యాస్ ఎక్కడ పుడుతుంది?
సహజ వాయువు అనేది బొగ్గు, చమురులాగే ఒక శిలాజ ఇంధనం. దీనిలో ప్రధానంగా మీథేన్(CH4) అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో ఒక కార్బన్, నాలుగు హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి.
వీటితో పాటు తక్కువ మొత్తంలో సహజ వాయు ద్రవాలు, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా కలిసి ఉంటాయి. దీనిని కేవలం ఇంధనంగానే కాకుండా, రసాయనాలు, వివిధ వస్తువుల తయారీలోనూ ఉపయోగిస్తారు.
సహజ వాయువు పుట్టుక వెనుక సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. పూర్వకాలంలో చనిపోయిన మొక్కలు, సూక్ష్మజీవుల (డయాటమ్స్ వంటివి) అవశేషాలు భూమిపై, సముద్ర గర్భంలో దట్టమైన పొరలుగా పేరుకుపోయాయి.
కాలక్రమేణా ఇవి ఇసుక, శిలల కింద కూరుకుపోయాయి. భూమి లోపల ఉండే విపరీతమైన పీడనం, ఉష్ణోగ్రత వల్ల ఈ పదార్థంలోని కార్బన్, హైడ్రోజన్‌లు రసాయన మార్పులకు లోనయ్యాయి. అలా కొన్ని బొగ్గుగా, మరికొన్ని చమురుగా, ఇంకొన్ని వాయు రూపంలో సహజ వాయువుగా రూపాంతరం చెందాయి.

ఫొటో సోర్స్, Getty Images
సహజ వాయువు నిల్వలు: రెండు రకాలు
భూగర్భంలో సహజ వాయువు దొరికే విధానాన్ని బట్టి దీనిని రెండు ప్రధాన రకాలుగా వర్గీకరిస్తారు:
- సంప్రదాయ నిల్వలు: ఇవి సాధారణంగా ముడి చమురు నిల్వలతో కలిసి ఉంటాయి. చమురుతో మిశ్రమమై లేదా దానిపై ఒక పొరలా తేలుతూ కనిపిస్తాయి. వీటిని వెలికితీయడం చాలా సులభం.
- సాంప్రదాయేతర నిల్వలు: ఇవి భూమి లోపల కఠినమైన శిలా పొరల మధ్య ఉంటాయి. ఉదాహరణకు షెల్ గ్యాస్, టైట్ గ్యాస్ సాండ్‌స్టోన్, బొగ్గు గనుల్లో లభించే కోల్‌బెడ్ మీథేన్. వీటిని వెలికితీయడానికి అత్యాధునిక సాంకేతికత అవసరమవుతుంది.
ఈ ప్రక్రియలోనే మనకు ఎల్‌పీజీ (ప్రొపేన్, బ్యూటేన్) కూడా ఉప-ఉత్పత్తిగా లభిస్తుంది. ఇలా శుద్ధి చేసిన గ్యాస్‌ను సీఎన్‌జీ, ఎల్ఎన్జీ, పీఎన్‌జీ రూపంలో వాడుకుంటాం.
ఫొటో సోర్స్, Getty Images
గ్యాస్ ఎన్ని రకాలు?
చాలామంది గ్యాస్ రకాల విషయంలో గందరగోళ పడుతుంటారు. వాటి తేడాలు ఇక్కడ తెలుసుకుందాం:
1. ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్):
ఎల్‌పీజీ అనేది ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఇది రెండు వేర్వేరు మార్గాల ద్వారా మనకు లభిస్తుంది.
- రిఫైనరీ టవర్‌లో ముడి చమురును మరిగించినప్పుడు, అన్నింటికంటే పైన తేలికపాటి వాయువులు విడిపోతాయి. అవే ప్రొపేన్, బ్యూటేన్. వీటినే సిలిండర్లలో నింపి ‘ఎల్‌పీజీ’గా వాడుతారు.
- భూమి లోపల నుంచి సహజ వాయువును వెలికితీసినప్పుడు, అందులో కేవలం మిథేన్ మాత్రమే ఉండదు. దాంతో పాటు కొంత ప్రొపేన్, బ్యూటేన్ కూడా కలిసి ఉంటాయి. ఈ గ్యాస్‌ను పైపుల ద్వారా పంపే ముందు, దానిని శుద్ధి చేస్తారు. ఆ ప్రక్రియలో మిథేన్ వేరు చేస్తారు. అదే సమయంలో అందులో కలిసి ఉన్న ప్రొపేన్, బ్యూటేన్‌లను కూడా వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన వాయువులే ఎల్‌పీజీ అవుతాయి.
వినియోగం: ప్రధానంగా వంట గ్యాస్‌గా. ఇది నీలం రంగు మంటతో స్వచ్ఛంగా మండుతుంది.
2. సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)
ఇది ప్రధానంగా మిథేన్ వాయువు. సహజ వాయువును అత్యంత అధిక పీడనం వద్ద కంప్రెస్ చేసి ట్యాంకుల్లో నింపుతారు.
వినియోగం: కార్లు, బస్సులు, ఆటోలు వంటి వాహనాల్లో ఇంధనంగా. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది.
3. ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్)
సహజ వాయువును -162°C వద్ద అతిగా చల్లబరిస్తే అది ద్రవంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది.
వినియోగం: గ్యాస్ పైప్‌లైన్లు లేని సుదూర దేశాలకు భారీ నౌకల ద్వారా గ్యాస్‌ను పంపాలంటే ఎల్‌ఎన్‌జీ రూపంలోనే రవాణా చేస్తారు.
4. పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్)
ఇది కూడా సహజ వాయువే. కానీ దీనికి సిలిండర్ల అవసరం ఉండదు. భూగర్భ పైపుల ద్వారా నేరుగా మీ వంటగది వరకు ఇది వస్తుంది.
వినియోగం: మెట్రో నగరాల్లో వంట గ్యాస్ సరఫరాకు. విద్యుత్ బిల్లు లాగానే మీరు ఎంత గ్యాస్ వాడారో దానికి మాత్రమే బిల్లు చెల్లించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
చమురు నుంచి గ్యాస్ ఎలా వస్తుంది?
ముడి చమురును వినియోగ రూపంలోకి మార్చడానికి రిఫైనరీలను వాడుతారు.
ఫొటో సోర్స్, Getty Images/eia.gov
ఆ ఆవిరి పైకి ప్రయాణించే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. ఈ క్రమంలో వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద వేర్వేరు పదార్థాలు ద్రవ రూపంలోకి మారి విడిపోతాయి.
- టవర్ పైభాగంలో (< 85°F): అత్యంత తేలికైన వంట గ్యాస్ (ఎల్‌పీజీ) లభిస్తుంది.
- మధ్య భాగంలో (85°F – 650°F): పెట్రోల్, నాఫ్తా, కిరోసిన్, డీజిల్ లభిస్తాయి.
- అడుగు భాగంలో (> 650°F): హెవీ గ్యాస్ ఆయిల్ (లూబ్రికెంట్స్), నౌకల ఇంధనం, తారు మిగిలిపోతాయి.
ఫొటో సోర్స్, Getty Images
బయో గ్యాస్ vs బయో-సీఎన్‌జీ
సహజ వాయువును భూగర్భం నుంచి వెలికితీస్తుంటే, ఇదే తరహా ఇంధనాన్ని పర్యావరణ వ్యర్థాల నుంచి కూడా సృష్టించవచ్చు. దీనినే బయో గ్యాస్ అంటాం. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడను గాలి తగలకుండా కుళ్ళింపజేయడం ద్వారా ఇది తయారవుతుంది.
అయితే, ఈ బయో గ్యాస్‌ను అధునాతన పద్ధతుల్లో శుద్ధి చేసి, అందులోని మలినాలను తొలగించినప్పుడు మిథేన్ శాతం 90 శాతం పైగా పెరుగుతుంది. ఇలా శుద్ధి చేసిన వాయువును అధిక పీడనం వద్ద కంప్రెస్ చేసి సిలిండర్లలో నింపితే దానిని బయో-సీఎన్‌జీ అంటారు. దీని లక్షణాలు సహజ వాయువుతో (సీఎన్‌జీ) సమానంగా ఉండటం వల్ల, వాహనాల్లో ఇంధనంగా వాడుతుంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



