SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, John Phillips – ECB/ECB via Getty Images
3 గంటలు క్రితం
చదివే సమయం: 5 నిమిషాలు
పురుషుల ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ దక్కించుకుంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఆ జట్టు యజమాని కావ్య మారన్‌పై అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు.
ఇంగ్లండ్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో భారతీయ యాజమాన్యంలోని నాలుగు జట్లు కూడా పాల్గొననున్నాయి.
నిజానికి, ది హండ్రెడ్ లీగ్ కోసం వేలంలో పాకిస్తానీ క్రికెటర్లను భారతీయ యాజమాన్యంలోని నాలుగు జట్లు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఫిబ్రవరిలో వార్తలొచ్చాయి. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ఈ వాదనలు వినిపించాయి.
దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, “మా అధికార పరిధి ఐపీఎల్ వరకు మాత్రమే. ఇతర లీగ్‌లలో ఎవరేం చేస్తున్నారనే దాని గురించి మాకు సంబంధం లేదు. అందులో మేమెలా జోక్యం చేసుకోగలం? ఏదైనా ఫ్రాంచైజీ విదేశాల్లో ఒక జట్టును కొనుగోలు చేసి, ఆ జట్టులోకి ఎవరైనా ఆటగాడిని తీసుకుంటే, దానితో మాకు ఎలాంటి సంబంధం ఉండదు” అని అన్నారు.
అనంతరం, ఆటగాళ్ల వేలంలో ఏ విధంగానూ వివక్ష చూపవద్దని 8 జట్లకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ తమ జట్టులోకి తీసుకోవడానికి ఈసీబీ చేసిన విజ్ఞప్తి ప్రధాన కారణం.

ఫొటో సోర్స్, ADEL SENNA/AFP via Getty Images
మార్చి 12న జరిగిన వేలంలో అబ్రార్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ గ్రూప్‌కు ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది.
దీంతో పాటు ‘ది హండ్రెడ్’ లీగ్‌లోని సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కూడా ఈ గ్రూప్ యాజమాన్యంలోనిదే.
మార్చి 12, గురువారం జరిగిన ‘ది హండ్రెడ్’ వేలంలో అబ్రార్ అహ్మద్ కోసం బిడ్ వేశారు సన్‌రైజర్స్ లీడ్స్ యజమాని కావ్య మారన్, కోచ్ డేనియల్ వెట్టోరి.
సన్‌రైజర్స్ లీడ్స్ అబ్రార్ అహ్మద్‌ను దాదాపు రూ.2 కోట్ల 30 లక్షలకు దక్కించుకుంది.
ఆ తర్వాత నుంచి కావ్య మారన్‌ను భారత సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తున్నారు.
వివాదం తీవ్రం కావడంతో, సన్‌రైజర్స్ లీడ్స్ ‘ఎక్స్’ హ్యాండిల్‌ను సస్పెండ్ చేశారు. కానీ, ఇప్పుడు పునరుద్ధరించారు.
అబ్రార్ కాకుండా, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ కూడా ‘ది హండ్రెడ్’ వేలంలో నమోదయ్యాడు. కానీ, అతని కోసం ఏ జట్టూ ఆసక్తి చూపలేదు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కారణంగా 2009 నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటం లేదు.
ఫొటో సోర్స్, ANI
సోషల్ మీడియాలో విమర్శలేంటి?
”భారతీయ యాజమాన్యంలోని ఫ్రాంచైజీ తన విదేశీ క్రికెట్ లీగ్ కోసం పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం భారత్‌ను బహిరంగంగా ఎగతాళి చేయడమే. కేవలం అనుమతి లేదు కాబట్టే వారు పాకిస్తానీయులను భారత్ లీగ్‌లోకి తీసుకోరు, నిషేధం ఎత్తేసిన మరుక్షణం మరో ఆలోచన లేకుండా వారిని తీసుకుంటారు” అని ది స్కిన్ డాక్టర్ అనే ఎక్స్ యూజర్ రాశారు.
అబ్రార్ భారత సైన్యాన్ని అవమానించాడని, అయినా కానీ కావ్య మారన్, సన్‌రైజర్స్ అతన్ని ‘ది హండ్రెడ్ లీగ్’లో దక్కించుకున్నారని చాలా మంది యూజర్లు పేర్కొంటున్నారు.
భారత్‌ను కించపరిచేలా తన సోషల్ మీడియాలో యుద్ధం, టీ సంకేతాలతో పోస్టులు చేసే పాకిస్తాన్ ఆటగాడిని తీసుకున్నందుకు సన్‌రైజర్స్ సిగ్గుపడాలని ఫైజ్ ఫజల్ అనే యూజర్ రాశారు.
అబ్రార్ అహ్మద్‌ను కావ్య మారన్ తమ జట్టులోకి తీసుకోవడం కంటే సిగ్గుచేటు మరోటి ఉండదని ఆనంద్ కృష్ణ అనే యూజర్ రాశారు.
ఫొటో సోర్స్, John Phillips – ECB/ECB via Getty Images
సన్‌రైజర్స్ కోచ్ డేనియల్ వెట్టోరి ఏమన్నాడు?
“అబ్రార్ బౌలింగ్‌లో చాలా వైవిధ్యం ఉంది. చాలామంది స్థానిక ఆటగాళ్లు అతన్ని ఇంతకు ముందు చూసి ఉండకపోవచ్చు” అని సన్‌రైజర్స్ లీడ్స్ కోచ్ డేనియల్ వెట్టోరీ బీబీసీ స్పోర్ట్స్‌తో అన్నారు.
పాకిస్తాన్ ఆటగాళ్లపై వస్తున్న ఊహాగానాల గురించి తనకు తెలుసని, కానీ వేలంలో ఫలానా ఆటగాడిని తీసుకోవద్దంటూ తనకు ఎలాంటి సూచనలూ రాలేదని వెట్టోరి అన్నారు.
“అందుబాటులో ఉన్న ప్రతి ఆటగాడినీ దృష్టిలో ఉంచుకుని మేం వేలానికి వచ్చాం. అంతర్జాతీయ జట్ల నుంచి చాలా మంచి స్పిన్నర్‌లు ఉన్నారు. కానీ అబ్రార్ మా మొదటి ప్రాధాన్యతగా ఉన్నాడు”అని వెటోరీ చెప్పాడు.
ఫొటో సోర్స్, Getty Images
వివాదం ఎప్పుడు మొదలైంది?
ది హండ్రెడ్’ లీగ్ కోసం వేలంలో పాకిస్తాన్ క్రికెటర్లను దక్కించుకోకూడదని భారతీయ యాజమాన్యంలోని జట్లు భావిస్తున్నట్టు ఫిబ్రవరి 21న వార్తలొచ్చాయి.
“అన్ని దేశాల నుంచి ఆటగాళ్లు” ది హండ్రెడ్‌లో చోటుదక్కించుకుంటారని తాను ఆశిస్తున్నానని, “వివక్ష వ్యతిరేక పాలసీల” గురించి చర్చించినట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ గత ఏడాది అన్నారు.
“ది హండ్రెడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లను, మహిళా క్రికెటర్లను స్వాగతిస్తోంది. ఎనిమిది జట్లు దీనిని పరిగణనలోకి తీసుకుంటాయని మేం భావిస్తున్నాం” అని ఈసీబీ ప్రతినిధి చెప్పారు.
భారతీయ యాజమాన్యంలోని జట్లు వేలంలో పాకిస్తాన్ క్రికెటర్లను దక్కించుకోరని వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించారు.
ఈ విషయంలో ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలా జరగడానికి అనుమతించకూడదని అన్నారు.
“దేశ ప్రజలందరినీ ఏకం చేసే ఆటల్లో ఇలాంటివి అనుమతించకూడదు” అని మైకేల్ వాన్ ‘ఎక్స్’ లో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



