SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, X/TelanganaCMO
-
3 గంటలు క్రితం
-
చదివే సమయం: 6 నిమిషాలు
తెలంగాణ ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పేరుతో 99 రోజుల కార్యక్రమం తలపెట్టింది.
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కలెక్టర్లతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
వివిధ శాఖలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ‘పరిశుభ్రత’ ఈ కార్యక్రమ ఉద్దేశాల్లో ఒకటిగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
అందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు ఆదేశాలిస్తోంది. ఈ కార్యక్రమ అమలు బాధ్యత అధికారులపై పెట్టారు సీఎం.
”కలెక్టర్లు నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి” అని సీఎం ఆదేశించారు.
గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. అందరినీ సమన్వయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకోసం కొత్తగా ఎన్నికైన వారి కోసం మార్చి 12న, జిల్లా కేంద్రాల్లో ఒకరోజు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించారు.
అయితే, ఇది ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్షన్ చేసేందుకు వేసిన మరో ప్లాన్ అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది.

మార్చి 6 నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముఖ్యంగా పౌర సేవలతో ముడిపడిన అన్ని శాఖలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను పరిష్కరిస్తామని చెబుతోంది ప్రభుత్వం.
”పరిశుభ్రత కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌కు ప్రాధాన్యమిస్తూ.. పాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయడం ద్వారా ప్రజా సేవల వేగం పెరుగుతుంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది మా ప్రభుత్వం” అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, IPR TG
కాంగ్రెస్ గతంలోనూ రెండుసార్లు ఇదే తరహాలో కార్యక్రమాలు చేసినా.. అవి కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో చేసినవే. కానీ, ఈసారి మాత్రం సుదీర్ఘంగా మూడు నెలలకు పైగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకూ నిర్వహిస్తోంది.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జన్మభూమి నుంచి, విభజన తరువాత కూడా ఈ తరహాలో అనేక కార్యక్రమాలు వివిధ ప్రభుత్వాల్లో జరిగాయి.
ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను పరిష్కరించడానికి వివిధ పేర్లతో ప్రయత్నాలు జరిగాయి.
పచ్చదనం పరిశుభ్రత మొదలు, స్వచ్ఛ భారత్ వరకూ పరిశుభ్రత మీద కూడా ఎన్నో కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగాయి.
ఆ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలు ఎంతమేరకు సఫలం అవుతాయనే చర్చ నడుస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్య రంగం, రోడ్డు భద్రత, సంక్షేమ పథకాల అమలు, డ్రగ్స్ నియంత్రణ, విద్యా రంగం, వ్యవసాయ రంగం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలను చేపట్టనున్నారు.
- గ్రామ సభలు, వార్డు సభల్లో సంక్షేమ పథకాల అమలు
- మధ్యాహ్న భోజన పర్యవేక్షణ
- విద్యా సంవత్సరం మొదటిరోజే పుస్తకాలు, దుస్తులు అందించే ఏర్పాటు
- ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శన
- మిల్లర్ల దగ్గర ధాన్యం నియంత్రణ, ఇసుక నియంత్రణ, భూ సమస్యల పరిష్కారం
- సోలార్ విద్యుత్ పెంపుదల, రైతులు సోలార్ సెట్లు వాడేలా అవగాహన
- రహదారులు, రవాణా శాఖ సమస్యల ఆన్లైన్ పరిష్కారాలు
- వ్యవసాయ శాఖ సమస్యల పరిష్కారాలు
ఇలాంటి మరెన్నో అంశాలను ఇందులో పొందుపరిచింది ప్రభుత్వం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
‘కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ ఇది’
అయితే, కార్యక్రమ లక్ష్యాల కంటే వాటి అమలుపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి.
”ఏం చేయాలన్నా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఏం చేయగలరు? గతంలో కేసీఆర్ పెద్దయెత్తున మరుగుదొడ్లు కట్టించారు. కానీ, నిర్వహణ లేకుండా పోయాయి. పనులు చేయించడం వేరు, వాటిని వాడేలా చేయడం వేరు. ప్రస్తుతం ప్రతి ఊరి చివరా ఒక చెత్త కుప్ప కనిపిస్తోంది. అప్పట్లో కేంద్ర నిధులతో చెత్త సేకరణ – తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవీ మూలనపడ్డాయి. పాత సర్పంచుల బిల్లులే రానందున కొత్త సర్పంచులు డబ్బులు తీయడానికే తటపటాయిస్తున్నారు” అన్నారు స్థానిక ప్రభుత్వాల సాధికారిక సమాఖ్య తెలంగాణ అధ్యక్షుడు బండారు రామ్మోహన రావు.
”ఇలాంటి కార్యక్రమాలు ప్రజలను, అధికారులను ఎంగేజ్ చేయడానికి మాత్రమే సరిపోతాయి” అన్నారాయన.
అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కార్యక్రమాన్ని డైవర్షన్‌గా అభివర్ణించింది.
”యాక్షన్ ప్లాన్ పేరిట పాలనా వైఫల్యాల నుంచి దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ ప్లాన్ డ్రామాకు తెరతీశారు. 800 రోజుల పాలనలో చేసిందేం లేక, 99 రోజుల ప్రణాళిక పేరిట మరో డ్రామాకు తెరతీశారు రేవంత్ రెడ్డి. అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, పాలనా వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కాంలు, ప్రజల ఛీత్కారాల నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ ఇది” అని విమర్శించారు బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు.
”గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయి. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ, మళ్లీ ఇప్పుడు పది వారాల పాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం కావడం సిగ్గుచేటు” అని ఆయన విమర్శించారు.
ఫొటో సోర్స్, IPR TG
అయితే, విపక్షాల ఆరోపణలను కాంగ్రెస్ ఖండిస్తోంది.
”రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా తెలుసుకోనున్నాం. కానీ, హరీశ్ రావు, కేటీఆర్ యథావిధిగా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లవద్దని భావిస్తున్నారు.
ఫామ్ హౌస్‌లో మీరు, మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం తప్ప ఎప్పుడైనా మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయే నాటికి జీతభత్యాలు,పెన్షన్లు బకాయిలు పెట్టి వెళ్లారు. ఓడిపోయినంత మాత్రాన దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. జిల్లా సభలు, గ్రామ సభల్లో మీరూ పాల్గొనాలి. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలి” అని హరీశ్‌కి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
అయితే, ఇలాంటి కార్యక్రమాల వల్ల మొత్తం మారకపోయినా, ఎంతో కొంత మేలు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్.
”ఇలాంటి కార్యక్రమాలకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి ఏదో చేస్తున్నాం అని చెప్పుకోవడం కోసం హడావిడి చేయడం. రెండు, ఎప్పటి నుంచో జరగని పనులు ఈ వంకన చకచకా చేసుకుపోవడం. కొంత మంచి జరగవచ్చు. అలాగని మొత్తం మారిపోతుందని చెప్పలేం” అన్నారు దుర్గం రవీందర్.
”దీని కోసం కొత్తగా రూల్స్ ఏమీ తేవడం లేదు. అయితే, ఏదైనా చేయాలన్నా ట్రాక్టర్లలో పోయడానికి డీజిల్‌కు కూడా పంచాయతీల దగ్గర డబ్బు లేదు. ఇక శుభ్రత ఎక్కడ నుంచి తెస్తారు? కొన్ని ఆఫీసులు శుభ్రం చేస్తే చాలదు కదా! అదే సమయంలో ఇలాంటి వాటి వల్ల ఏమీ జరగదు అని కూడా అనలేం. ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకుని తెలివైన నాయకులు తమ ప్రాంతాల్లో పనులు చేయించుకుంటారు. అధికారులకు కూడా 99 రోజుల చివర్న ఏదో చేశాం అని చూపించుకోవాలి కదా! అందుకోసం వాళ్లు కొన్ని పనులు చేస్తారు” అన్నారు దుర్గం రవీందర్.
“మిగిలినవన్నీ ఎలా ఉన్నా శుభ్రత మాత్రం అంత తేలిక కాదు, అది చిన్నతనం నుంచే రావాలి. బడి నుంచే శుభ్రత మొదలుకావాలి. పాఠాల కంటే ముందు అది జరగాలి. పిల్లలు శుభ్రతను పాటించి, కొనసాగించేలా చేయాలి.”
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



