Home జాతీయ national telgu అడల్ట్ కంటెంట్ చూడాలంటే ఆ ఆధారాలు సమర్పించాల్సిందే.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్

అడల్ట్ కంటెంట్ చూడాలంటే ఆ ఆధారాలు సమర్పించాల్సిందే.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్

3
0

SOURCE :- BBC NEWS

పోర్న్ సైట్లు ఇక నుంచి వినియోగదారుల వయస్సును ధ్రువీకరించాలి. లేకపోతే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియన్లు అడల్డ్ కంటెంట్‌ను చూడాలంటే తమ వయస్సు 18 ఏళ్ల కంటే ఎక్కువని కచ్చితంగా నిరూపించుకోవాలి.

అక్కడ తీసుకొచ్చిన కొత్త చట్టాల ప్రకారం పోర్న్, ఆర్-రేటెడ్ వీడియో గేమ్‌లు, లైంగిక అంశాలతో కూడిన ఏఐ చాట్‌బాట్‌ల అడల్ట్ కంటెంట్‌ను చూడాలంటే, తమకు 18 ఏళ్లు నిండినట్లు ఆధారాలు చూపడం తప్పనిసరి చేశారు.

పిల్లలు అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా ఇటువంటి కంటెంట్ బారిన పడకుండా చూడటమే ఈ మార్పుల వెనుక ఉద్దేశమని ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత నియంత్రణ సంస్థ తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే ప్లాట్‌ఫారమ్‌లకు జరిమానాలు విధిస్తామని తెలిపింది.

”పిల్లల్ని మనం మద్యం దుకాణాలు, అడల్ట్ స్టోర్లు, క్యాసినోల్లోకి వెళ్ళడానికి అనుమతించం. కానీ ఆన్‌లైన్ విషయానికి వస్తే, అక్కడ అటువంటి రక్షణలు లేవు” అని ఆన్‌లైన్ భద్రతా నియంత్రణ సంస్థ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అన్నారు.

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించిన మూడు నెలలకే ఈ కొత్త చట్టాలు వచ్చాయి. ఈ కొత్త చట్టాలు కూడా డేటా ప్రైవసీ విషయంలో సవాళ్లను ఎదుర్కొంటాయని, అలాగే వినియోగదారులు తమ వయస్సును తప్పుగా చూపి మోసం చేసే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

చాలా దేశాల తరహాలోనే ఆస్ట్రేలియాలో కూడా ఇప్పటివరకు అడల్ట్ సైట్లను చూసే వినియోగదారులంతా ‘నాకు 18 ఏళ్లు నిండాయి’ అనే బాక్స్‌పై క్లిక్ చేస్తే సరిపోయేది.

కానీ, కొత్త చట్టాల ప్రకారం సోమవారం నుంచి సదరు ఫ్లాట్‌ఫారమ్‌లు వయస్సును నిర్ధరించే కఠినమైన పద్ధతులను అమలు చేయాలి.

అంటే ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, డిజిటల్ ఐడీలు, క్రెడిట్ కార్డ్ వివరాలను వయస్సు ధ్రువీకరణ కోసం తీసుకోవాల్సి ఉండొచ్చు.

కొత్త నిబంధనల ప్రకారం, పిల్లలు అడల్డ్ కంటెంట్ బారిన పడకుండా సెర్చ్ ఇంజిన్లు, యాప్ స్టోర్లు, సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, పోర్న్ సైట్లు, ఏఐ వ్యవస్థల వెనుక ఉన్న కంపెనీలు అర్థవంతమైన చర్యలు తీసుకోవాలి.

”యవ్వనంలో ఉన్న ఒక వ్యక్తి ఇంటర్నెట్‌లో ఆత్మహత్య లేదా స్వయంగా హాని చేసుకునే కంటెంట్ కోసం వెతికితే వారికి హానికరమైన సమాచారానికి బదులు ముందుగా ‘హెల్ప్‌లైన్’ నంబర్లు కనిపించేలా మార్పులు చేస్తున్నాం’ అని ఈ కొత్త నిబంధనల ప్రకటనకు ముందు ఆస్ట్రేలియా ఈసేఫ్టీ కమిషనర్ ఇన్మాన్ గ్రాంట్ తెలిపారు.

10-17 ఏళ్ల వయస్సున్న ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆన్‌లైన్‌లో లైంగిక చిత్రాలు లేదా వీడియోలను చూసినట్లు ఆమె ఏజెన్సీ చేసిన పరిశోధనలో తేలింది.

అలాగే 70 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు ఆన్‌లైన్‌లో తీవ్రమైన హింస, ఆత్మహత్యకు సంబంధించిన కంటెంట్, ఆహారపు అలవాట్లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని చూస్తున్నారని కూడా వెల్లడైంది.

యూకేలో సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

కెనడియన్ పోర్న్ దిగ్గజం అయ్లో యాజమాన్యంలోని రెడ్‌ట్యూబ్, యూపోర్న్, ట్యూబ్8 వంటి సైట్లు ఆస్ట్రేలియన్లకు తమ సేవలను నిలిపేసినట్లు ఈ కొత్త చట్టాలు అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందు ఆస్ట్రేలియా వార్త సంస్థ క్రికీ రిపోర్ట్ చేసింది.

‘మేం ఈ నిబంధనలకు లోబడి ఉంటాం. కానీ, వీటివల్ల పిల్లలకు రక్షణ కలుగుతుందని మేం అనుకోవట్లేదు. దీనికి బదులుగా డేటా ప్రైవసీకి హాని కలగడంతో పాటు ఎలాంటి నిబంధనలు పాటించని ఫ్లాట్ ఫారమ్‌లలో చట్టవిరుద్ధమైన కంటెంట్ మరింత పెరుగుతుంది’ అని అయ్లో అధికార ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు.

‘ఈ కొత్త చట్టాలు కంటెంట్‌ యాక్సెస్ విషయంలో అడ్డంకుల్ని పెంచవచ్చు. కానీ, దానిని యాక్సెస్ చేయకుండా పూర్తిగా నివారించలేదు’ అని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ బోధించే డాక్టర్ రాహత్ మసూద్ అన్నారు.

చాలామంది యువకులకు డిజిటల్ పరిజ్ఞానం అధికంగా ఉందని, వారు వీపీఎన్‌లు లేదా ఇతర సాధనాల ద్వారా కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరని చెప్పారు. తమ తల్లిదండ్రుల క్రెడిట్ కార్డులు, ఐడీలు ఉపయోగించే అవకాశం లేకపోలేదని అన్నారు.

టెలిగ్రామ్, డిస్కార్డ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అడల్ట్ కంటెంట్‌ను పొందడం వంటి ఇతర మార్గాల వైపు యువకులు వెళ్లే అవకాశం ఉందని మసూద్ ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనల్లో లోపాలు ఉన్నాయని యూఎన్‌ఎస్‌డబ్ల్యూలో ఎథిక్స్ ఇన్ టెక్నాలజీ నిపుణురాలు సబ్రినా కాల్డ్‌వెల్ అంగీకరించారు.

అయితే ఇవి పిల్లలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

అనుకోకుండా లేదా అకస్మాత్తుగా కనిపించే ఇబ్బందికర ఫోటోలు, సమాచారం వారి కంటపడకుండా ఈ అడ్డంకులు ఉపయోగపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ వయస్సు ధ్రువీకరణ నిబంధనల పట్ల ఆస్ట్రేలియా భవిష్యత్తులో కచ్చితంగా పశ్చాత్తాపం చెందుతుందని విమర్శకులు అంటున్నారు.

ఈ చర్యలు సాంకేతికంగానూ, ఉదారవాద విలువల పరంగానూ తప్పుదోవ పట్టించేవని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ సేథ్ లాజర్ అన్నారు.

యూకే కూడా గత జులైలో పోర్న్ సైట్ల కోసం కొత్త చట్టాలను ప్రవేశపెట్టింది.

వీటి ప్రకారం, వినియోగదారుల వయస్సును కచ్చితంగా తనిఖీ చేయాలి. ఇలా చేయని పక్షంలో 18 మిలియన్ పౌండ్లు(సుమారు రూ. 220 కోట్లు) లేదా వరల్డ్ వైడ్ రెవెన్యూలో 10 శాతం జరిమానా చెల్లించాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)