Home జాతీయ national telgu భారత చమురు కొనుగోళ్లను అమెరికా నిర్ణయిస్తోందా? గణాంకాలు ఏం చెబుతున్నాయి?

భారత చమురు కొనుగోళ్లను అమెరికా నిర్ణయిస్తోందా? గణాంకాలు ఏం చెబుతున్నాయి?

12
0

SOURCE :- BBC NEWS

భారత్, అమెరికా, చమురు రంగం, మిడిల్ ఈస్ట్, ఇరాన్, రష్యా

ఫొటో సోర్స్, Reuters

రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని గత కొన్ని నెలలుగా అమెరికా భారత్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే, ఇప్పుడు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, భారత రిఫైనరీలు పరిమిత కాలం పాటు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి తమ దేశం ‘అనుమతి’ ఇస్తుందని తెలిపారు.

మార్చి 6న ‘ఫాక్స్ బిజినెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెంట్ మాట్లాడుతూ, ”భారతీయులు చాలా చక్కగా పనిచేశారు. ఆంక్షలు విధించిన రష్యా నుంచి చమురును కొనడం ఆపేయాలని వారిని కోరాం, వారు అలాగే చేశారు” అని పేర్కొన్నారు.

”వాస్తవానికి వారు రష్యా చమురుకు బదులుగా అమెరికా నుంచి చమురును తీసుకోవలసి ఉంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఏర్పడిన తాత్కాలిక కొరతను అధిగమించడానికి, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి వారికి అనుమతి ఇచ్చాం. రష్యా చమురుపై ఉన్న ఇతర ఆంక్షలను కూడా మేం తొలగించే అవకాశం ఉంది” అని ఆయన తెలిపారు.

అదే రోజు బెసెంట్ ‘X’ వేదికగా చేసిన ఒక పోస్టులో, సముద్ర మార్గంలో చమురు సరఫరాకు ఏర్పడే అంతరాయాల దృష్ట్యా భారతీయ రిఫైనరీలకు ఈ 30 రోజుల మినహాయింపు ఇచ్చామని, దీనివల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఏమీ ఉండదని రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ రష్యాకు.. యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆర్థికంగా సహాయం చేస్తోందని ట్రంప్ అధికార యంత్రాంగం ఆరోపణలు చేసింది.

అమెరికా విధించిన టారిఫ్‌ల ప్రభావంతో, గత కొద్ది నెలలుగా భారత్ తన చమురు అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంది. దీని తర్వాత, ఫిబ్రవరి ప్రారంభంలో భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత, ట్రంప్ ప్రభుత్వం రెసిప్రోకల్ టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించడమే కాకుండా, అదనంగా విధిస్తున్న 25 శాతం టారిఫ్‌ను కూడా పూర్తిగా తొలగించింది.

భారత్, అమెరికా, చమురు రంగం, మిడిల్ ఈస్ట్, ఇరాన్, రష్యా

ఫొటో సోర్స్, Abeer Khan/Bloomberg via Getty

అంతకుముందు రష్యా నుంచి భారత్ ఎంత చమురు కొనేది?

భారతదేశానికి ముడిచమురును సరఫరా చేయడంలో రష్యా ఎప్పుడూ ప్రధాన దేశంగా లేదు. 2022 జనవరిలో భారతదేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 1.8 శాతం మాత్రమే. అయితే, యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, రాయితీ ధరలపై లభిస్తున్నందున రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచింది.

ఫలితంగా, 2024 జూలై నాటికి భారతదేశ ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా 44.6 శాతానికి చేరుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 2న భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై కుదిరిన అంగీకారాన్ని ప్రకటించడానికి ముందు, ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికపై, ”వారు (భారత ప్రధాని నరేంద్ర మోదీ) రష్యా చమురు కొనుగోలును నిలిపివేయడానికి, అమెరికా నుంచి మరింత ఎక్కువగా చమురును కొనడానికి అంగీకరించారు” అని పోస్టు చేశారు.

ఈ వాదనను ఆ తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తోసిపుచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. భారతదేశపు చమురు దిగుమతుల నిర్ణయాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే, రష్యాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించడం ప్రారంభించినట్లు 2025 డిసెంబర్ నాటి గణాంకాలు చూపిస్తున్నాయి. అంతకుముందు నెల నవంబర్‌లో చమురు దిగుమతుల్లో రష్యా వాటా 35 శాతంగా ఉండగా, మరుసటి నెలలోనే అది 24.9 శాతానికి తగ్గింది.

తర్వాత, 2026 జనవరి నాటికి రష్యా చమురు వాటా మరింత తగ్గి 20.6 శాతమైంది. 2022 ఆగస్టు తర్వాత ఇదే అత్యల్ప స్థాయి. ఆ సమయంలో రష్యా చమురు వాటా 16.5 శాతంగా ఉండేది. 2026 జనవరి తర్వాత గణాంకాలు ఇంకా అందుబాటులో లేవు.

సౌదీ, యూఏఈ నుంచి పెరిగిన కొనుగోళ్లు

రష్యా నుంచి ముడిచమురు ఆర్డర్లను భారతీయ రిఫైనరీలు తగ్గించగా.. మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి చమురు కొనుగోళ్లు పెరిగాయి.

2026 జనవరిలో, భారతదేశం తన ముడిచమురులో 17 శాతం సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుంది. ఏడాది క్రితం ఇదే సమయానికి ఆ దేశ వాటా 12 శాతంగా ఉండేది.

అలాగే, భారతదేశ ముడిచమురు దిగుమతుల్లో 2025 జనవరి 7.3 శాతంగా ఉన్న యూఏఈ వాటా, ఈ ఏడాది జనవరిలో 9.3 శాతానికి పెరిగింది.

భారత్, అమెరికా, చమురు రంగం, మిడిల్ ఈస్ట్, ఇరాన్, రష్యా

ఫొటో సోర్స్, Stringer/Anadolu via Getty

హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం…

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ కారణంగానే ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు రష్యా చమురు కొనుగోలుపై మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు సముద్ర రవాణా మార్గాలలో హార్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచంలోని సుమారు 20 శాతం చమురు, సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది.

లక్షలాది బారెళ్ల చమురు, గ్యాస్ హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయాయని బీబీసీ గతంలోనే నివేదించింది.

భారతదేశపు ముడిచమురు, గ్యాస్ దిగుమతులలో సుమారు సగం వాటా ఇరుకైన ఈ సముద్ర మార్గం మీదుగానే రవాణా అవుతుంది.

భారత్, అమెరికా, చమురు రంగం, మిడిల్ ఈస్ట్, ఇరాన్, రష్యా

ఫొటో సోర్స్, Getty Images

‘మినహాయింపు’పై నిపుణులు ఏమంటున్నారంటే…

రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్‌కు అమెరికా ఇచ్చిన ‘మినహాయింపు’పై నిపుణులు భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు.

అమెరికా తన సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకుందని ఇంధన రంగ నిపుణుడు నరేంద్ర తనేజా భావిస్తున్నారు.

”మనం ఈ మొత్తం పరిస్థితిని ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ కోణంలో చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ రష్యా నుంచి ఎక్కువ చమురును కొనకపోతే, రష్యన్ చమురు ప్రపంచ సరఫరా వ్యవస్థలోకి చేరదు. దీనివల్ల చమురు ధరలు పెరుగుతాయి, దీనివల్ల అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకే, ట్రంప్ యంత్రాంగం తీసుకున్న ‘మినహాయింపు’ నిర్ణయం అమెరికా సొంత ప్రయోజనాల కోసమే” అని ఆయన విశ్లేషించారు.

”ఇక భారత్ విషయానికొస్తే సౌదీ అరేబియా, కువైట్, పర్షియన్ గల్ఫ్ దేశాల నుంచి చమురును తీసుకురాలేని ప్రస్తుత పరిస్థితుల్లో, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి చమురు కొనాల్సిందే. ఈ విషయంలో రష్యా కూడా ఒక ఎంపికగా ఉంటుంది” అని నరేంద్ర తనేజా అన్నారు.

ప్రపంచ రాజకీయ విశ్లేషకులు బ్రహ్మ చెల్లానీ విశ్లేషణ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇంధన దిగుమతి విషయంలో మోదీ ప్రభుత్వ విధానంపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.

”భారత్ ఏమీ చెప్పడం లేదు, కానీ ఈ మినహాయింపు చాలా విషయాలను తెలియజేస్తోంది. అమెరికా ఒత్తిడిలో భారత్ తన ఇంధన దిగుమతి విధానాన్ని నిశ్శబ్దంగా మార్చుకుంది” అని ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

”ఒకవేళ భారత్ ఇప్పుడు కూడా తనకు నచ్చిన చోట, మెరుగైన ధరకు చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛను కలిగి ఉంటే, రష్యా చమురు కోసం అమెరికా ట్రెజరీ నుంచి 30 రోజుల లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు” అని ఆ పోస్టులో రాశారు.

”ఈ మినహాయింపును కోరడం ద్వారా, మోదీ ప్రభుత్వం అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం కింద రూపొందించిన కొత్త పరిమితులను నిశ్శబ్దంగా అంగీకరిస్తోంది” అని బ్రహ్మ చెల్లానీ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)