Home జాతీయ national telgu ‘బంగారం 4 కేజీలు దోచుకెళ్లారు..’ 2000 సీసీ కెమెరాలు శోధించి, దొంగల ముసుగులను ఎలా ఛేదించారంటే..

‘బంగారం 4 కేజీలు దోచుకెళ్లారు..’ 2000 సీసీ కెమెరాలు శోధించి, దొంగల ముసుగులను ఎలా ఛేదించారంటే..

6
0

SOURCE :- BBC NEWS

విల్లుపురం, బంగారం దోపిడీ, పోలీసులు

“సాధారణంగా కొన్ని కేసుల్లో దోపిడీ జరిగిందని అబద్ధాలు చెబుతుంటారు. కానీ, ఇది అలాంటి కేసు కాదు. ఇక్కడ నిజంగానే జరిగింది. మేం 48 గంటల్లోనే దాదాపుగా దొంగల్ని కనిపెట్టాం.”

మార్చి 3న నాలుగు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం విల్లుపురం జిల్లా ఎస్పీ సాయి ప్రణీత్ బీబీసీతో చెప్పిన మాటలివి.

దొంగలు తీసుకెళ్లిన 4 కేజీల బంగారు నగలు, రూ. 3 లక్షల సొమ్మును రికవరీ చేసినట్లు విల్లుపురం జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆభరణాల విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.5 కోట్లు ఉంటుందని చెప్పారు.

ఈ బంగారం దొంగతనం కేసులో పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
విల్లుపురం, బంగారం దోపిడీ, పోలీసులు

4 కేజీల బంగారం దోపిడీ

తమిళనాడులోని విల్లుపురం జిల్లా, విరాటికుప్పంలోని పాత కనగరాజ్ గార్డెన్‌లో నివసించే రాజ మాణిక్యం బంగారు ఆభరణాలు తయారు చేస్తారు.

ఆయన 10 మందితో తన ఇంట్లోనే బంగారు చెవిపోగులు, ఉంగరాలు తయారు చేయించి చెన్నైలోని నగల దుకాణ యజమానులకు అమ్ముతుంటారు.

“ఆయన ప్రతి నెలా మొదటి మంగళవారం లేదా శుక్రవారం నగలు తీసుకుని రైల్లో చెన్నైకి వెళ్లేవారు. ఈ విషయం బాగా తెలిసిన ముఠా ప్లాన్ చేసి ఆయన దగ్గరి నుంచి నగలు దోచుకుంది” అని విల్లుపురం పోలీస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి చెప్పారు.

మార్చి 3న రాజ మాణిక్యం ఒక బ్యాగ్‌లో 4 కిలోల నగలతో చెన్నై బయల్దేరారు. ఆయన దగ్గర పనిచేసే మురళి అనే వ్యక్తి బైక్ మీద మాణిక్యం విల్లుపురం రైల్వే స్టేషన్‌‌కు బయలుదేరారు.

“ఉదయం 11.15 గంటల ప్రాంతంలో రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు, కోట వినాయక ఆలయం వద్ద బైకును ఆపారు. ఆయుధాలతో బెదిరించి తన బ్యాగు లాక్కెళ్లారు” అని రాజమాణిక్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విల్లుపురం, బంగారం దోపిడీ, పోలీసులు

‘ముఖాలకు ముసుగులు.. ‘

“ఆ నలుగురు వ్యక్తులు వచ్చిన వాహనాల నంబర్లు మాకు దొరకలేదు. బైకుల నంబర్ ప్లేట్లు కనిపించకుండా కవర్ చేశారు. దీంతో వారిని గుర్తించడం కష్టమైంది” అని ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి చెప్పారు.

నాలుగు కేజీల బంగారం దోపిడీ జరిగిందని తెలుసుకున్న జిల్లా ఎస్పీ సాయి ప్రణీత్, ఏఎస్పీ రవీంద్రనాధ్ గుప్తా సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు.

ఆ ప్రాంతంలో నిఘా కెమెరాలను పరిశీలించినా నేరస్తులను గుర్తించలేకపోయారు. దీంతో ముగ్గురు ఎస్‌ఐలు, ఐదుగురు ఏఎస్‌ఐలతో కలిపి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

“సంఘటన జరిగిన రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజమాణిక్యం ఎక్కిన బైకును కొంతమంది వెంబడించారు. వాళ్లు 11.15 ప్రాంతంలో నగలు దోచుకెళ్లారు” అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి చెప్పారు.

“ముసుగులేసుకొచ్చిన కొందరు నగలను దోచుకెళ్లారు. వాళ్ల ముఖాలు కనిపించకపోవడంతో గుర్తించడం కష్టమైంది. దీంతో దోపిడీకి ముందు సీసీ ఫుటేజ్ పరిశీలించాలని నిర్ణయించుకున్నాం” అని ఆయన చెప్పారు.

విల్లుపురం, బంగారం దోపిడీ, పోలీసులు

2 వేల సీసీ కెమెరాల్లో ఫుటేజ్

ఈ కేసులో దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పెద్దసంఖ్యలో సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించింది.

“గ్రామాలు, నగరాల నుంచి 2 వేలకు పైగా సీసీ కెమెరాల నుంచి ఫుటేజ్ సేకరించాం” అని ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి చెప్పారు.

ఈ కేసులో సీసీ కెమెరాలే కీలక సాక్ష్యమని ఆయన అన్నారు.

పుదుచ్చేరి పోలీసుల సాయం

సీసీ ఫుటేజ్ సేకరిస్తూనే, పుదుచ్చేరి రాష్ట్ర పోలీసుల సహాయం కోరారు.

“దొంగల ముఠా పుదుచ్చేరి నుంచి వస్తున్న దృశ్యాలను మేం గుర్తించాం. దీంతో దొంగలను గుర్తించగలిగాం” అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

“సీసీ కెమెరాల ఫుటేజ్‌ను జల్లెడ పట్టాం. పాత నేరస్తులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసులను పరిశీలించాం. పుదుచ్చేరిలో క్రిమినల్ కేసులు ఉన్న వారిపై దృష్టి పెట్టినప్పుడు, వారే ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిసింది” అని జిల్లా ఎస్పీ సాయి ప్రణీత్ చెప్పారు.

అలాగే తిరుచ్చి, సేలం, కోయంబత్తూర్, కుంభకోణంలోనూ విల్లుపురం పోలీసులు దర్యాప్తు సాగించారు.

“దర్యాప్తులో తేలిన వివరాల మేరకు, దోపిడీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేశాం” అని జిల్లా ఎస్పీ చెప్పారు.

“ఈ కేసు గురించి పుదుచ్చేరి పోలీసులను అడిగినప్పుడు కొంతమంది పేర్లు, చిరునామాలు ఇచ్చారు. వారిలో కొంతమంది మీద పుదుచ్చేరిలో కేసులు ఉన్నాయి. కానీ, విల్లుపురంలో వారి మీద ఎలాంటి కేసుల్లేవు” అని ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి చెప్పారు.

నగరాలు, గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలు ఉండటం వల్ల దోపిడీకి పాల్పడిన వారిని గుర్తించడం సాధ్యమైందని ఆయన తెలిపారు.

విల్లుపురం, బంగారం దోపిడీ, పోలీసులు

సమాచారం ఇచ్చిన ఆ ‘అజ్ఞాత వ్యక్తి’ ఎవరు?

బంగారం దోపిడీ కేసులో పుదుచ్చేరికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వారు దోచుకెళ్లిన 4 కేజీల బంగారు ఆభరణాలు, 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు విల్లుపురం జిల్లా పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మరి కొంతమందిని అరెస్ట్ చేయనున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

“రాజ మాణిక్యానికి బాగా తెలిసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దొంగతనం జరిగింది. దొంగతనం చేసిన వ్యక్తులెవరూ వాళ్లకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని చూడలేదు. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాం” అని ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి వివరించారు.

“సాధారణంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది బంగారం దోపిడీ పేరుతో నాటకం ఆడతారు. కానీ, ఇది నిజమైన దోపిడీ” అని విల్లుపురం జిల్లా ఎస్పీ సాయి ప్రణీత్ బీబీసీతో చెప్పారు.

దోపిడీ జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని, సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు.

పోలీసులేం చెప్పారు?

విల్లుపురం ఘటన తర్వాత, రైళ్లు, బస్సుల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని రవాణా చేసేటప్పుడు అనుసరించాల్సిన విధానాలపై పోలీసులు కొన్ని సూచనలు చేశారు.

“బంగారం తీసుకెళ్లేప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను వ్యాపారులకు సూచించాం. ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తే, రైల్వే స్టేషన్ వరకు భద్రత కల్పిస్తాం” అని విల్లుపురం ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి చెప్పారు.

“మీ దగ్గర బంగారం పెద్దమొత్తంలో ఉంటే, కారులో వెళ్లడం మంచిది. ఇలాంటి విషయాలు ప్రజలకు సూచిస్తూనే ఉంటాం. కానీ, చాలామంది పట్టించుకోరు” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)