SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
39 నిమిషాలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
అఫ్గాన్ తాలిబాన్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ యుద్ధం ప్రకటించారు.
“మా ఓపిక నశించింది, ఇకపై ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది” అని ఆయన హెచ్చరించారు.
బీబీసీ ఉర్దూ కథనం ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో చేసిన ఒక ప్రకటనలో ఖవాజా ఆసిఫ్ ఈ కీలక విషయం ప్రకటించారు. అఫ్గాన్ తాలిబాన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులను అఫ్గానిస్తాన్‌లో పోగుచేస్తున్నారని, కాబూల్‌లోని తాత్కాలిక ప్రభుత్వం “ఉగ్రవాదాన్ని ఎక్స్‌పోర్ట్” చేస్తోందని ఆయన విమర్శించారు.
మరోవైపు, రాజధాని కాబూల్, పక్తికా, కాందహార్‌లోని కొన్ని ప్రాంతాలపై పాకిస్తాన్ బాంబు దాడులు చేసినట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ధ్రువీకరించారు. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ తన ప్రకటనలో మరిన్ని ఆరోపణలు చేస్తూ, అఫ్గాన్ తాలిబాన్లు తమ సొంత ప్రజలకు ప్రాథమిక మానవ హక్కులను నిరాకరిస్తున్నారని, ముఖ్యంగా ఇస్లాం మహిళలకు కల్పించిన హక్కులను కూడా వారు కాలరాస్తున్నారని విమర్శించారు.

బీబీసీ ఉర్దూ కథనం ప్రకారం.. ఇప్పటివరకు జరిగిన సైనిక చర్యల్లో 133 మంది అఫ్గాన్ తాలిబాన్ సభ్యులు మరణించారని, మరో 200 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.
అఫ్గానిస్తాన్‌లోని కాబూల్, పక్తికా, కాందహార్‌లలో ఉన్న అఫ్గాన్ తాలిబాన్ల రక్షణ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసిందని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
ఈ దాడుల్లో అఫ్గాన్ తాలిబాన్లకు చెందిన రెండు సైనిక ప్రధాన కార్యాలయాలు, రెండు ఆయుధ డిపోలు, ఒక లాజిస్టిక్స్ గోదాం, మూడు బెటాలియన్ హెడ్ క్వార్టర్స్, రెండు సెక్టార్ హెడ్ క్వార్టర్స్, 80కి పైగా ట్యాంకులు ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, దీన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
పాకిస్తాన్ వైపు నుంచి ఈ సైనిక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచార మంత్రి అతావుల్లా తరార్ స్పష్టం చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
“అర్ధరాత్రి నుంచి భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి”
వార్తా సంస్థ ఏఎఫ్‌పీ న్యూస్ టీమ్ ప్రకారం.. తెల్లవారుజామున అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
అర్ధరాత్రి దాటాక సుమారు 1:50 గంటలకు నగరం అంతటా యుద్ధ విమానాల హోరుతో పాటు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని వారు తెలిపారు. అలాగే, సెంట్రల్ కాబూల్‌లో తెల్లవారుజామున 2:30 గంటల వరకు కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.
2025 అక్టోబర్‌లో ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినప్పటికీ, గత కొంతకాలంగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల పరంపరలో కాబూల్, కాందహార్‌లపై జరిగిన ఈ దాడులు అత్యంత తాజావి.
గత వారం, పాకిస్తాన్ అఫ్గానిస్తాన్‌పై రాత్రంతా వరుసగా అనేక వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా కనీసం 18 మంది మరణించారని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది.
పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఏడు ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఇటీవల పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడులకు ప్రతిచర్యగానే ఈ దాడులు చేపట్టినట్లు వెల్లడించింది.
అయితే, పాకిస్తాన్ సామాన్య ప్రజల ఇళ్లను, ఒక మదర్సాను లక్ష్యంగా చేసుకుందని, మరణించిన వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారని తాలిబాన్ పాలకులు ఆరోపించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సైన్యాల మధ్య గతంలో జరిగిన ఘర్షణల తరహాలోనే, ఈసారి కూడా రెండు పక్షాలు ఒకరిపై ఒకరు ముందస్తు దాడి చేసుకున్నట్లు ఆరోపణలు చేసుకున్నాయి. పరస్పరం భారీ నష్టాన్ని కలిగించినట్లు రెండు దేశాలూ చెబుతున్నాయి.
శుక్రవారం పాకిస్తాన్ అధికారులు మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్ వైపు నుంచి దాడులు జరిగాయని, వాటికి ప్రతిస్పందనగా తాము కాబూల్, కాందహార్ వంటి నగరాలపై “కౌంటర్ స్ట్రైక్” చేసినట్లు తెలిపారు.
అయితే, అఫ్గాన్ తాలిబాన్లు ఈ వాదనను తిరస్కరించారు. ఈ వారం ప్రారంభంలో జరిగిన దాడుల్లో కనీసం 18 మంది మరణించారని, ఆ దాడులకు సమాధానంగా తాము పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు.
తాలిబాన్ సైనిక ప్రతినిధి వహిదుల్లా మొహమ్మదీ మాట్లాడుతూ, ఈ “ప్రతీకార చర్య” గురువారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైందని చెప్పారు.
ఈ దాడుల్లో అనేకమంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, మరికొందరిని బందీలుగా పట్టుకున్నామని తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.
అయితే, పాకిస్తాన్ అధికారులు ఈ వాదనలను తోసిపుచ్చారు. గురువారం అర్ధరాత్రి అఫ్గాన్ తాలిబాన్లు ఉమ్మడి సరిహద్దులోని సైనిక స్థావరాలపై ఆపరేషన్ ప్రారంభించారని, ఇందులో తమ ఇద్దరు సైనికులు మరణించారని వారు తెలిపారు.
తాము కేవలం ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని పాకిస్తాన్ పునరుద్ఘాటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



