Home జాతీయ national telgu Soulmate: ‘ఒకరు నిజంగా మనకోసమే పుట్టారు’ అనుకునే భావన సరైనదేనా?

Soulmate: ‘ఒకరు నిజంగా మనకోసమే పుట్టారు’ అనుకునే భావన సరైనదేనా?

6
0

SOURCE :- BBC NEWS

ప్రేమికులు

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కడో ఒకచోట మనకోసం పుట్టిన ‘ఒక స్పెషల్ పర్సన్’ ఉంటారన్న భావన కలగడం చాలామందికి అనుభవమే. ఆ వ్యక్తిని మన ‘సోల్‌మేట్’ అనుకుంటాం. అచ్చంగా మనకు సరిపోయే వ్యక్తి, మనతో ఉండడానికే పుట్టిన వ్యక్తి వంటి భావనలు కలుగుతాయి.

చరిత్ర అంతటా గమనిస్తే ప్రేమ అనేది దానంతట అదే పుట్టదనే భావన మనుషులు నమ్ముతూ వచ్చారు.

ప్రాచీన గ్రీకు దేశంలో ప్లేటో ఒక కథ చెప్తారు.

‘‘మొదట మనిషి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు , రెండు ముఖాలతో ఉండేవాడు. మనిషి చాలా శక్తిమంతంగా ఉండడంతో దేవుడు జ్యూస్ (ప్రాచీన గ్రీకు పురాణాల్లో దేవుళ్ల రాజు) మనిషిని రెండుగా విభజించాడు. అప్పటి నుంచి ప్రతి అర్ధభాగం తన కోల్పోయిన అర్ధభాగం కోసం వెతుకుతూ భూమి చుట్టూ తిరుగుతోంది’’ అన్నది ఆ కథ సారాంశం.

ఈ పురాణ గాథ ఇప్పటి ‘సోల్‌మేట్’ భావనకు కవితాత్మక అర్థం ఇస్తుంది. ఎక్కడో ఒకచోట మనల్ని పరిపూర్ణం చేసే వ్యక్తి ఉన్నారనే ఆశను కల్పిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ప్రేమ, సోల్‌మేట్, బంధం, దాంపత్యం, పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

మనం ఆ వ్యక్తిని ఎలా ఎంచుకుంటాం?

మధ్య యుగాల్లో ప్రేమకథలను ‘గౌరవప్రదమైనవి’గా అభివర్ణించేవారు. ప్రేమ కోసం త్యాగం చేయడం గొప్ప భావనగా చెప్పేవారు. ఉదాహరణకు లాన్సెలాట్ అనే వీరుడు గినివియర్‌పై ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ కోసం తనను తాను త్యాగం చేసుకున్నాడు. కనీసం ఆమె పేరు కూడా బయటకు చెప్పలేదు.

సాంస్కృతిక, కళ, విజ్ఞాన పునరుజ్జీవన కాలంలో షేక్‌స్పియర్ వంటి రచయితలు “విధి వల్ల విడిపోయిన ప్రేమికు”ల గురించి మాట్లాడటం ప్రారంభించారు – అంటే ప్రేమికుల మధ్య విడదీయలేని బంధం ఉన్నా, కుటుంబం, విధి లేదా పరిస్థితుల వల్ల వేరయ్యారు. లోకమే స్వయంగా వారి ప్రేమకథను రాసి, వారికి సుఖాంతం లభించకుండా అడ్డుకున్నట్టుగా ఆ ప్రేమకథలుండేవి.

ఆధునిక కాలంలో హాలీవుడ్ సినిమాలు, ప్రేమ నవలలు నిజజీవితానికి దూరంగా ఉండే అద్భుత ప్రేమకథలను చూపించాయి. కానీ సోల్‌మేట్స్ గురించి సైన్స్ ఏం చెబుతోంది? నిజంగా మన కోసమే పుట్టిన ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారా?

ప్రేమ, సోల్‌మేట్, బంధం, దాంపత్యం, పెళ్లి

మనం ఇప్పుడు ప్రేమను అర్ధం చేసుకునే విధానం మధ్యయుగం నాటి యూరప్ కథల నుంచి వచ్చినదని కేంబ్రిడ్జ్‌లోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయం (ఏఆర్‌యూ)లో సోషల్ సైకాలజీ ప్రొఫెసర్ వీరెన్ స్వామి చెప్పారు. కామ్లెట్, లాన్సెలాట్, గినివర్‌వంటివారి వీరయోధుల గాథలు యూరప్ అంతటా ప్రాచుర్యం పొందాయి. అవే మన రొమాంటిక్ ప్రేమ భావనకు మూలం.

“మీరు మీ భాగస్వామిగా ఒక వ్యక్తిని ఎంచుకోవాలి – ఆ భాగస్వామి జీవితాంతం ఉండాలి” అనే ఆలోచనను మొదటగా ప్రోత్సహించిన కథలివి” అని స్వామి తెలిపారు.

“అంతకు ముందు యూరప్‌లోని చాలా ప్రాంతాల్లో కావలసినంత మందిని ప్రేమించవచ్చు. ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉండేది. ప్రేమకు, సెక్స్‌కు పెద్దగా సంబంధం ఉండేది కాదు” అని స్వామి అన్నారు.

‘‘కాలక్రమేణా పారిశ్రామికీకరణ ప్రజలను వారి వ్యవసాయ ఆధారిత గ్రామాల నుంచి, సుపరిచితమైన సంబంధాల నుంచి దూరం చేయడం మొదలు కావడంతో వారు ఒంటరులైపోయారు. కఠినమైన, జీవన పరిస్థితుల నుంచి తమను రక్షించగల వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు’’ అంటారు స్వామి.

”ఇప్పటి డేటింగ్ యాప్‌లు ఆ ఆలోచనను ఒక అల్గారిథంగా మార్చేశాయి. అంటే షాపింగ్‌లో అనేక వస్తువులను చూసి ఒకదాన్ని ఎంచుకున్నట్టుగా చాలామందిని చూసి చివరికి ఒకరిని ఎంచుకుంటాం. దీనిని ‘రిలేషన్‌షిప్-షాపింగ్’ అనొచ్చు” అని వీరెన్ స్వామి తెలిపారు.

సోల్‌మేట్ కోసం అన్వేషణ చివరికి మనం వెతుకుతున్న దానికి వ్యతిరేకంగా ఉంటుంది. “చాలా మందికి ఇది చాలా నిస్తేజమైన అనుభవంగా మారుతోంది” అన్నారాయన.

“ఒక భాగస్వామిని ఎంచుకునేందుకు షాపింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. ‘చాలు, ఇక నేను ఆపాలి’ అని అనిపించేవరకు డేటింగ్ యాప్స్‌లో చాలామందిని చూస్తూ ఉంటారు” అని వీరెన్ స్వామి అన్నారు.

ప్రేమ, సోల్‌మేట్, బంధం, దాంపత్యం, పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

‘ఆ ప్రత్యేక వ్యక్తి’

ఆ ప్రత్యేక వ్యక్తి అన్న భావనలో ఉండే ఆరాటం గురించి అమెరికాలోని ప్రోవోలో ఉన్న బ్రిగ్‌హమ్ యంగ్ యూనివర్శిటీలో వివాహం, కుటుంబం అధ్యయనాల ప్రొఫెసర్ జాసన్ కారోల్ మాట్లాడారు.

“మనం అనుబంధాలపై ఆధారపడేవాళ్లం. బంధం కోసం పరితపించిపోతాం” అని ఆయన అంటున్నారు. కానీ ఆయన తన విద్యార్థులకు “ప్రత్యేక వ్యక్తి” అనే భావనపై కోరికను వదులుకోవద్దని, సోల్‌మేట్స్ అనే ఆలోచనను మాత్రం వదులుకోవాలని చెబుతారు.

ఇది పరస్పరం విరుద్ధ భావనలా కనిపించినప్పటికీ ఆయన దృష్టిలో మాత్రం అదృష్టానికి, కష్టపడి పనిచేయడాని మధ్య ఉన్న తేడాలాంటిది.

“ఒక సోల్‌మేట్ సులభంగా దొరుకుతారు. వాళ్లు అప్పటికే ఉంటారు. కానీ ‘ప్రత్యేక వ్యక్తి’ లేదా ‘ఒకే ఒక్కరు’ మాత్రం ఇద్దరు వ్యక్తులు సంవత్సరాల తరబడి సర్దుకోవడం, క్షమాపణలు చెప్పుకోవడం, కోపగించుకోవడం వంటివాటి ద్వారా ఏర్పడతారని అంటున్నారు.

“అయితే ఒక బంధాన్ని కొనసాగించడం అంత తేలికకాదు” అని ఆయన చెప్పారు.

ప్రేమ, సోల్‌మేట్, బంధం, దాంపత్యం, పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

సోల్‌మేట్ భావన కలిగించే ప్రతికూల ప్రభావమేంటంటే..

కారోల్ వాదన దశాబ్దాల పరిశోధనపై ఆధారపడి ఉంది. దీనిని తన రిపోర్ట్ “ది సోల్‌మేట్ ట్రాప్”లో ఆయన సమర్పించారు. సంబంధాలపై మనుషుల్లో ఉండే రెండు రకాల ఆలోచనల మధ్య తేడాను ఈ పరిశోధన వివరిస్తుంది.

మనస్తత్వవేత్తలు “అదృష్టం” అని పిలిచే సంబంధం ఎలా ఉంటుందంటే – సరైన సంబంధం ఎలాంటి ప్రయత్నం లేకుండా దానంతటదే బాగుంటుంది. “ప్రయత్నం” ఎలా ఉంటుందంటే సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి భాగస్వాములు చేయాల్సిన విషయాలను తెలియజేస్తుంది.

1990ల చివర్లో, 2000ల ప్రారంభంలో హ్యూస్టన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సి. రేమండ్ నై వరుసగా అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనాలు బాగా ప్రాచుర్యం పొందాయి.

ఎలాంటి ప్రయత్నం లేకుండా సంబంధాలు ”సిద్ధంగా” ఉన్నాయని నమ్మే వ్యక్తులు ఘర్షణ తర్వాత తమ నిబద్ధతను అనుమానించే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో తేలింది. అయితే ”ప్రయత్నం” ద్వారా సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భావించేవారు వాదోపవాదాల తర్వాత కూడా బంధంలో స్థిరంగా ఉంటారని వెల్లడయింది.

ప్రయత్నం ద్వారా బంధాన్ని మెరుగుపరుచుకోవచ్చని భావించేవారు కూడా ప్రత్యేకమైనదేదో కావాలని కోరుకుంటారు. అయితే కష్టకాలాలుంటాయని కూడా వారు నమ్ముతారు. ” మా బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి, మరింత దగ్గరగా ఉండడానికి నేనేం చేయగలను? అని వారు ఆలోచిస్తుంటారు”

”సమస్య సోల్‌మేట్స్ అనే భావనలో లేదు. ప్రేమలో ఎప్పుడూ కష్టాలుండకూడదు అనే అంచనాల్లో ఉంటుంది” అని ఆయన చెప్పారు. దీర్ఘకాలిక సంబంధంలో అత్యంత ఆత్మీయమైన విషయం సినిమాల్లో ఉండేల్లాంటి క్షణాలు కాదు. వారి బలాలు, బలహీనతలు, సవాళ్లు వంటివాటన్నింటిలో వెన్నంటి ఉండడం.

”ఇది చాలా ముఖ్యమైన స్థానం”. ”వాళ్లు మనల్ని తమ జీవితంలో ఉండనివ్వడం వల్లే అవన్నీ మనకు తెలుస్తాయి” అని ఆయన చెప్పారు.

ప్రేమను విధితో ముడిపెట్టిచూసేవాళ్లు బంధాన్ని సజీవంగా ఉంచగల చిన్నపాటి పనులను కూడా తక్కువ అంచనావేస్తారని కరోల్ అన్నారు. ”బంధంలో తొలిసారి పెద్ద సమస్య వచ్చినప్పుడు సోల్‌మేట్” అన్న భావన పరిస్థితులను మరింత కష్టంగా మారుస్తుందని చెప్పారు.

“మొదటిసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వచ్చే ఆలోచన ‘నువ్వు నా సోల్‌మేట్ అనుకున్నాను. బహుశా కాకపోవచ్చు. ఎందుకంటే సోల్‌మేట్ అయ్యుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు” అని అనుకుంటారు.

“అయితే ఒక బంధాన్ని కొనసాగించడం అంత తేలికకాదు” అని ఆయన చెప్పారు.

ప్రేమ, సోల్‌మేట్, బంధం, దాంపత్యం, పెళ్లి

ఫొటో సోర్స్, Vicki Pavitt

గత జీవితపు ప్రభావాలు

వికీ పావిట్ లండన్‌కు చెందిన లవ్ కోచ్. తమ సోల్‌మేట్‌ని గుర్తించామని భావించే వ్యక్తులకు ఆమె సాయం చేస్తుంటారు. ఆ అద్భుత కథ భావోద్వేగ మాయాజాలం, అస్థిరత, నిరంతర ఆందోళనతో కూడుకున్నది మాత్రమేనని తర్వాత తెలుస్తుందన్నది ఆమె అభిప్రాయం.

“ఇరువురి మధ్య చాలా ఆకర్షణ ఉన్నట్టు అనిపించినప్పటికీ దానికి కారణం కొన్నిసార్లు గత జీవితంలోని బాధాకరమైన అనుభవాలు, పాత గాయాల్లా గుర్తురావడం వల్ల కావొచ్చు” అని ఆమె చెప్పారు.

కొందరి ప్రవర్తన నిరంతరం మారుతుంటుంది. కొన్నిసార్లు ప్రేమగా, దగ్గరితనంతో అనిపిస్తారు. ఇంకొన్నిసార్లు దూరమవుతున్న భావన కలిగిస్తారు. వాళ్లతో మన బంధం ఎలా సాగుతుందంటే ‘మళ్లీ తనను చూడడానికి ఎదురుచూస్తూ ఉండలేను’ అనిపిస్తుంది. కానీ వాస్తవంగా జరుగుతోందేంటంటే వాళ్లు మనల్ని చాలా ఆందోళనకు గురిచేస్తున్నారు. ఆ ఆందోళన మనల్నిగా మరింతగా వారి వైపు లాగుతుంది.

మనం విధి అనుకునేది వాస్తవానికి మన నాడీ వ్యవస్థ నుంచి కలిగే స్పందన కావొచ్చు- గతంలో మనల్ని బాధపెట్టిన విషయం గుర్తొచ్చి ఆ బాధకు ఇప్పుడు ఉపశమనం కావాలన్న కోరిక అంతర్గతంగా ఏర్పడుతుంది. థెరపిస్టులు దీనిని “ట్రామా బాండ్” అని పిలుస్తారు.

ప్రేమ, సోల్‌మేట్, బంధం, దాంపత్యం, పెళ్లి

ఫొటో సోర్స్, PA Wire

అనారోగ్యకరమైన బంధాలవైపు ఎలా ఆకర్షితులవుతారంటే…

ఈ బంధం ప్రేమలా అనిపించవచ్చు- అలా అనారోగ్యకరమైన సంబంధాల వైపు అయస్కాంతం తరహాలో ఆకర్షితులవుతారు. దీనికి కారణం వాళ్లు సరైన వ్యక్తి అని భావించడం కాదు. వారు దగ్గరివారన్న అనుభూతి కలగడం.

కెనడా మనస్తత్వవేత్తలు డోనల్డ్ డట్టన్, సుసాన్ పెయింటర్ చేసిన అధ్యయనం కూడా బాగా ఆదరణ పొందింది. 1993లో బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు వారు తమ హింసాత్మక భాగస్వాములను ఒకేసారి విడిచిపెట్టిన 75 మంది మహిళలపై అధ్యయనం జరిపారు.

ఆ మహిళలు తమ మాజీ భాగస్వాములతో అనుబంధంపై ఎలాంటి భావనతో ఉన్నారో అధ్యయనం గమనించింది – దానిని వారి ప్రస్తుత సంబంధాల వాస్తవిక పరిస్థితులతో పోల్చింది.

నిరంతరం వేధింపులకు గురవుతున్న మహిళల్లో బలమైన అనుబంధం కనిపించలేదు. కొన్నిసార్లు మంచిగా, కొన్నిసార్లు క్రూరంగా ఉండే భాగస్వాములున్న మహిళల్లోనే గట్టి అనుబంధం ఉందని వారు గుర్తించారు.

తమకు చెడు మాత్రమే కలిగించే సంబంధాల వైపు మనుషులకు ఎందుకు ఆకర్షితులవుతారో ఈ బాధాకరమైన బంధం వివరిస్తుందని డట్టన్, పెయింటర్ చెప్పారు – ఎందుకంటే ఇధి ఆరోగ్యకరమైన సంబంధం కాదు. ప్రేమ, క్రూరత్వం మిశ్రమ భావన.

పావిట్ ఈ వ్యత్యాసాన్ని వివరించడానికి ప్రయత్నిస్తారు.

“ఈ కెమిస్ట్రీని మీరు ఎలా అర్ధం చేసుకుంటారు? – ఈ వ్యక్తి నాకు సరైనవారనా? లేక ఇది నాకు అలవాటైపోయిన అసౌకర్యమనా?”

“నా భాషలో చెప్పాలంటే నేనెప్పుడూ సోల్‌మేట్‌ల గురించి మాట్లాడను. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి ఉంటారని నేను నమ్మను… కానీ మనం ఎవరికైనా ‘ఆ ప్రత్యేక వ్యక్తి’ కాగలమని నమ్ముతాను” అని ఆమె చెప్పారు.

ప్రేమ, సోల్‌మేట్, బంధం, దాంపత్యం, పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

నిజమైన కెమిస్ట్రీ

సోల్‌మేట్‌లు ఉంటారని నమ్మకపోవడం రొమాంటిక్ భావన కాదనిపిస్తే, ఆకర్షణ అన్న భావనపై జీవశాస్త్రం(బయాలజీ) కూడా అదే చెబుతుంది.

భాగస్వాములకు ఒకరిపై ఒకరికి ఉండే భావనను హార్మోనల్ గర్భనిరోధకాలు స్వల్పంగా మార్చగలవు. పునరుత్పత్తిని ప్రభావితం చేసే ఈ పిల్స్ సాధారణంగా రుతుచక్రం సమయంలో ఆకర్షణలో కలిగే మార్పులను తగ్గిస్తుంది. ఇది భాగస్వామి ఎంపికపై ప్రభావం చూపవచ్చు.

స్త్రీల ప్రస్తుత గర్భనిరోధక స్థితి వారు మొదటిసారి తమ భాగస్వామిని కలిసినప్పుడు ఉన్నట్టే ఉంటే వాళ్ల లైంగిక సంతృప్తి ఎక్కువగా ఉందని 365 జంటలపై జరిపిన ఒక భారీ అధ్యయనంలో తేలింది. ఔషధ వినియోగంలో మార్పులు భాగస్వామి భావనల్లో మార్పును తీసుకురావొచ్చు.

ఈ ప్రభావాలు స్వల్పమైనవే అనిపిస్తాయి కానీ కాలక్రమేణా జంటల మధ్య వచ్చే ఆశ్చర్యకరమైన మార్పులను అర్ధం చేసుకోవడంలో ఇవి సాయపడవచ్చు.

హార్మోన్లు, ఔషధాలు ‘ప్రత్యేక వ్యక్తి ‘ అని అనిపించే వ్యక్తిపై అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగితే, ఎవరినైనా మనకోసం పుట్టిన వ్యక్తి అని నమ్మడం కష్టమవుతుంది.

ప్రేమ, సోల్‌మేట్, బంధం, దాంపత్యం, పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రేమ వ్యక్తీకరణ ఎప్పుడు సంతోషం కలిగిస్తుందంటే’

మరి ఒక జంట ఒకరికొకరు ”ఆ ప్రత్యేక వ్యక్తి” ఎలా కాగలరు?

ది ఓపెన్ యూనివర్శిటీలో సోషియాలజీ, ఇంటిమసీ ప్రొఫెసర్ జాకీ గబ్ 2015లో సోషియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన తన ఎండ్యూరింగ్ లవ్ ప్రాజెక్ట్‌లో దీనిని పరిశీలించారు.

ఈ ప్రాజెక్ట్ దాదాపు 5,000 మందిని సర్వే చేసింది. ఆపై 50 జంటలను చాలా దగ్గరగా గమనించింది. కొన్ని వ్యక్తిగత వివరాలు కూడా అధ్యయనం చేసింది. సంఖ్యాపరమైన సమాచారంతో పాటు డైరీలు, ఇంటర్వ్యూలు, ఇంట్లో జరిగే విషయాలను పరిశీలించింది.

మీకు సంతోషం కలిగించినవేంటన్న ప్రశ్నకు వారిచ్చిన సమాధానాలు సూర్యాస్తమయంలో చేసిన ప్రపోజల్స్ గానీ, పారిస్ టూర్లుగానీ కాదు.

“బహుమతులతో ఆశ్చర్యపరచడం, ప్రేమగా ఉండడం, బెడ్ దగ్గరకు టీ తెచ్చివ్వడం” లాంటివి.

చల్లని ఉదయం పూట కారులో వేడి ఉండేలా చేయడం, దారిలో పువ్వులను కోసి ఫ్లవర్ వాజ్‌లో ఉంచడం, పార్టీలో మిమ్మల్ని చూసి నిశ్శబ్దంగా నవ్వడం.

ఈ “రోజువారీ శ్రద్ద చూపించే పనులు” గొప్పగొప్ప ప్రేమ భావాల కంటే ఎక్కువ ప్రభావం చూపాయని గాబ్ తెలిపారు.

22శాతం తల్లులు, పిల్లలు లేని 20శాతం మహిళలు ఈ చిన్న ప్రేమ వ్యక్తీకరణ భావనలను పెద్ద పార్టీలు లేదా ఖరీదైన బహుమతుల కంటే ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే మొదటి రెండు విషయాలలో ఒకటిగా పేర్కొన్నారు.

సంబంధాల సంతృప్తికి ప్రధాన కారణం డబ్బు లేదా రొమాన్స్ కాదు. ఒకరి గురించి ఒకరికి తెలిసిన విషయాలు.

జంట ‘ఒకరి గురించి ఒకరు లోతుగా తెలుసుకోవడం, రోజువారీ జీవితంలో దీనిని వ్యక్తపరచడం.

ఈ ప్రాజెక్ట్ కోసం రాసిన ఒక యువ జంట డైరీని పరిశీలించారు.

”తన భాగస్వామి ఇంటికి తిరిగి రావడం, తాను తయారుచేసిన భోజనం గురించి మాట్లాడుకోవడం, హాలులో కౌగిలించుకోవడం, వారిద్దరూ టేబుల్ దగ్గర కలిసి తినడం గురించి ఆమె వివరించారు”

ఆమె తన పరిశోధన డైరీలో ఇలా రాసుకున్నారు,

“ఇది చాలా బాగుంది. మేము, ఆహారం మాత్రమే. నాకు ఇంకేం కావాలి?”

లివింగ్ రూమ్‌లో కలిసి డ్యాన్స్ చేయడం, చీకటిని చూసి ఆమె భయపడుతూనే గడ్డిలో ఎక్కువదూరం కలిసి నడవడం, ఆమె భాగస్వామికి ఎంతో నచ్చిన ఫోటోను ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకోవడంవంటివి ఉన్నాయి.

ఇది ఒక మధురమైన, రోజువారీ కథలా అనిపిస్తుంది—కల్పిత కథ కాదు.

ఈ తియ్యనిబంధంలో డబ్బు బాధలు, కుటుంబ బాధ్యతలు, నిరాశ కూడా ఉంటాయని, వాటన్నింటినీ దంపతులు కలిసి ఎదుర్కోవడం నేర్చుకుంటున్నారని గాబ్ వివరించారు.

“ఇక్కడ, సోల్‌మేట్ అన్న భావన ఊహలకు సంబంధించింది కాదు. అది జీవితం నుంచే దానంతటదే నెమ్మదిగా, అడుగు వెంట అడుగుగా- వారిద్దరూ ఆ ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటారనే దానితో నిర్మితమైంది” అని గాబ్ చెప్పారు.

ప్రేమ, సోల్‌మేట్, బంధం, దాంపత్యం, పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రత్యేక వ్యక్తిగా మనం మారాలంటే’

ఏదైనా తెలుసుకోవడం ప్రేమ భావనను దూరం చేయదు – వాస్తవానికి, ఇది మంచి, చెడు సమయాల్లో ప్రేమ పెరగడానికి సాయపడుతుందని కారోల్ చెప్పారు.

“ఆ ప్రత్యేకమైన సంబంధాన్ని కోరుకోవడంలో నేను పూర్తిగా సంతోషంగా ఉన్నాను అనుకోవాలి. దానిని మనకు మనమే సృష్టించుకోవాలని గుర్తుంచుకోవాలి” అని అన్నారు.

”మీ ప్రత్యేకమైన వ్యక్తి ఎక్కడో ఉన్నారని నమ్మడం మంచిదే. కాకపోతే అద్భుతమైన అనుబంధాన్ని మీరు ఏర్పరచుకోగలమని తెలుసుకోవాలి. ఎదుటివ్యక్తి పరిపూర్ణంగా ఉండాలని ఆశించడం మానేయాలి”అని పావిట్ చెప్పారు.

సోల్‌మేట్ విషయానికొస్తే సైన్స్ ఒక వైరుధ్యాన్ని వెల్లడిస్తుంది. చివరికి “విధి నిర్ణయించిన వ్యక్తి”ని తమ జీవితంలో పొందినవారు అలాంటి వ్యక్తి కోసం ఎదురుచూడడం మానేసి తమ ముందున్న అసంపూర్ణ వ్యక్తి వైపు తిరిగి ఇలా అడుగుతారు. ‘‘మనిద్దరం కలిసి మనకోసం మనం ఏదైనా ఎందుకు సృష్టించుకోకూడదు?” అని.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)