SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
“మావోయిస్టు పార్టీలో ఆకులు రాలిపోయి చాలాసార్లు వచ్చాయి. ఈసారి మాత్రం మావోయిస్టు పార్టీ చెట్టు వాడిపోయినట్లు అనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి.
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలు ఫిబ్రవరి 24న తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు.
వీరిలో తిరుపతి మావోయిస్టు పార్టీలో కీలక నేత. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.
మల్ల రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, నూనె నర్సింహారెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
అయితే, మావోయిజం అనేది ఎప్పటికీ ముగిసిపోదని లొంగిపోయిన తర్వాత మల్ల రాజిరెడ్డి వ్యాఖ్యానించారు.
“మావోయిజం ముగిసిపోదు.. అభివృద్ధి చెందుతూనే ఉంటుంది” అని రాజిరెడ్డి అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘ఇక మిగిలింది 11 మందే.. ’
మావోయిస్టు పార్టీలో చివరిసారిగా 2019లో రిక్రూట్‌మెంట్ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత కొందరు నేరుగా వెళ్లి చేరినా.. పార్టీ తరఫున రిక్రూట్‌మెంట్ జరగలేదు.
“తర్వాత ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లినప్పటికీ వారు తిరిగి వచ్చేశారు. 2019లో రిక్రూట్ అయినవారిలో ఒక్కరే ఉన్నారు” అని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వెళ్లిన వారిలో ఇక 11 మంది మాత్రమే పార్టీలో ఉన్నారని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Getty Images
మిగిలి ఉన్నవారిలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి, ఆయన భార్య సహా పలువురు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
“ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ముగ్గురు రాష్ట్రాల కమిటీ సభ్యులు, ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు, నలుగురు ఏరియా కమిటీ సభ్యులున్నారు” అని డీజీపీ వివరించారు.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్నారని చెబుతున్న వారి పేర్లు, వివరాలను ఆయన వెల్లడించారు.
- ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి – కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి
- పసునూరి నరహరి అలియాస్ సంతోష్ – ఈస్ట్ డివిజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఇంచార్జ్ (ఝార్ఖండ్‌లో పనిచేస్తున్నారు)
- ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ – ఒడిశా రాష్ట్ర కమిటీ మెంబర్
- వార్దా శేఖర్ అలియాస్ మంతు – దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఇంజినీరింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ విభాగం ఇంచార్జ్‌గా ఉన్నారు.
- జోడే రత్నాబాయి అలియాస్ సుజాత – గణపతి భార్య, స్టేట్ జోనల్ కమిటీ మెంబర్.
- నక్కా సుశీల అలియాస్ రేలా – జిల్లా కమిటీ స్థాయి దండకారణ్య జోనల్ కమిటీ
- పుతిని అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ – డివిజనల్ కమిటీ మెంబర్, కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశారు
- రంగబోయిన భాగ్య అలియాస్ రూపి – ఏరియా కమిటీ సభ్యురాలు
- మడావి అడిమె అలియాస్ సంగీత – ఏరియా కమిటీ సభ్యురాలు (చర్ల విభాగం)
- కాశపోగు భవాని అలియాస్ సుగుణ – ఏరియా కమిటీ సభ్యురాలు
- కుంజం ఎడావల్ – ఇల్లెందు కమాండర్
“గణపతి అడవులలో లేరు, బయట షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం ఉంది. మాకున్న సమాచారం ప్రకారం ముప్పిడి సాంబయ్య ఒక్కరే యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన వారు చిన్న స్థాయిల్లో ఉన్నారు” అని డీజీపీ వివరించారు.

లొంగిపోయినవారు ఇప్పుడేం చేయబోతున్నారు?
లొంగిపోయిన తర్వాత దేవ్‌జీ మీడియా ముందు మాట్లాడారు.
“అనారోగ్యం కారణంగా రహస్య జీవితం వదిలి బహిరంగ జీవితంలోకి వచ్చాను. అది వ్యక్తిగత జీవితం కొనసాగించడానికి కాదు, ప్రజల సమస్యలపై చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేయాలని నిర్ణయించాం. అంటే నా రాజకీయ జీవితం కొనసాగించాలనుకుంటున్నా” అని దేవ్‌జీ వివరించారు.
ఇదే అంశంపై మల్ల రాజిరెడ్డి మాట్లాడారు.
“ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి, వాటన్నింటినీ సంఘటితం చేయడానికి ప్రజాస్వామికంగా, చట్టపరిధిలో పనిచేస్తాం” అని చెప్పారు.
అయితే, ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా? పార్టీ పెడతారా? ప్రజాసంఘాన్ని ప్రారంభిస్తారా? అన్నది వారు స్పష్టం చేయలేదు.
కానీ తమ సిద్ధాంతాన్ని వదలకుండా ప్రజా సమస్యలపై పోరాడతామని చెబుతున్నారు.
అయితే, మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయిన లేదా అరెస్టు అయి బయటకు వచ్చిన ఎందరో తమ వ్యక్తిగత జీవితాల్లో మునిగిపోయారని, దేవ్‌జీ, రాజిరెడ్డి పంథా ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉందని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ బీబీసీతో చెప్పారు.
“సమాజం అందర్నీ ఆహ్వానిస్తుంది. రాజకీయంగా ముందుకు వెళ్తామంటే పార్టీ పెట్టడమో, ఏదైనా రాజకీయ పార్టీలో చేరడమో చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన పార్టీ ఆవిర్భావానికి చోటు (స్పేస్) లేదని చెప్పాలి” అని అన్నారు.
సహజంగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన వారి మాటలు ముక్కుసూటిగా ఉంటాయని, వేరే పార్టీలో చేరితే ఆ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా పనిచేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ వివరించారు.
“ఇప్పటికిప్పుడు వారి నిర్ణయాలు చెప్పలేకపోవచ్చు. మూడు లేదా ఆరు నెలలపాటు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటారు కనుక ఆ తర్వాత వారి వ్యూహాలు వెల్లడించే వీలుంది” అని చెప్పారాయన

‘దేవ్‌జీ కార్యదర్శిగా ఎన్నికవ్వలేదు’
తిపిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికవ్వలేదని పోలీసులు గుర్తించారు.
గణపతి తర్వాత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. బసవరాజ్ మరణం తర్వాత దేవ్‌జీ ఆ స్థానంలో ఉన్నారనే ప్రచారం జరిగింది.
అయితే, దేవ్‌జీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికవ్వలేదని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెబుతున్నారు. ఆయన సెంట్రల్ కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడిగానే ఉన్నారని చెబుతున్నారు.
“ఇప్పుడున్న మావోయిస్టు పార్టీ పరిస్థితి నేపథ్యంలో సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగే పరిస్థితి లేదు కాబట్టి దేవ్‌జీ కార్యదర్శి అయ్యారని చెప్పలేం. కానీ, మీటింగ్ జరిగి ఉంటే, ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది” అని డీజీపీ చెప్పారు.
అలాగే పోలీసుల సమక్షంలో ఫిబ్రవరి 24న దేవ్‌జీ మాట్లాడిన సమయంలోనూ పార్టీలో తన హోదాపై ఆయన కూడా స్పష్టత ఇవ్వలేదు.
ఫొటో సోర్స్, ANI/ CG KHABAR
అభయ్ పేరుతో లేఖలు
గత కొంతకాలంగా సీపీఐ (మావోయిస్టు) పార్టీ పేరుతో లేఖలు విడుదలవుతూ వచ్చాయి. ఇవి ‘అభయ్’ పేరుతో విడుదలయ్యాయి.
అయితే, ఈ అభయ్ ఎవరనే విషయంపై బాగా చర్చ జరిగింది.
ముఖ్యంగా మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగిపోయిన తర్వాత అభయ్ పేరుతో లేఖలు విడుదలయ్యాయి.
అయితే దేవ్‌జీనే అభయ్ పేరుతో లేఖలు రాసినట్లు పోలీసులు వెల్లడించారు.
మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ, ‘అభయ్’ పేరుతో దేవ్‌జీ లేఖలు రాశారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



