Home LATEST NEWS telugu తాజా వార్తలు ఏఐ సమ్మిట్‌లో రోబో డాగ్, సాకర్ డ్రోన్‌‌లపై వివాదం: గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?

ఏఐ సమ్మిట్‌లో రోబో డాగ్, సాకర్ డ్రోన్‌‌లపై వివాదం: గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?

17
0

SOURCE :- BBC NEWS

గల్గోటియాస్ విశ్వవిద్యాలయం, ఏఐ సమ్మిట్

ఫొటో సోర్స్, ANI

8 నిమిషాలు క్రితం

చదివే సమయం: 5 నిమిషాలు

దిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వార్తల్లో నిలుస్తోంది. ఓవైపు నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తుండగా, మరోవైపు ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం దాని భాగస్వామ్యంపై విమర్శలు ఎదుర్కొంటోంది.

చైనాలో తయారైన ఒక రోబో డాగ్‌ను గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ఏఐ సమ్మిట్‌లో ప్రదర్శించిందని, అది తమది అని చెప్పుకొందని ఆరోపణలు వచ్చాయి.

ఇది సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది, ఆ తర్వాత గల్గోటియాస్ విశ్వవిద్యాలయం క్షమాపణలు చెబుతూ బుధవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

ఆ ఘటన సమాచార లోపం కారణంగా జరిగిందని పేర్కొంది. సమ్మిట్‌లోని తన స్టాల్‌ను ఖాళీ చేసినట్లు కూడా ప్రకటించింది.

“స్టాల్‌లోని మా ప్రతినిధులలో ఒకరికి ప్రోడక్ట్ సాంకేతిక సమాచారం సరిగ్గా అందలేదు. కెమెరాలో కనిపించాలనే ఉత్సాహంలో, ఆమెకు మీడియాతో మాట్లాడటానికి అనుమతి లేనప్పటికీ, ప్రోడక్ట్ గురించి కొంత తప్పుడు సమాచారం ఇచ్చారు” అని గల్గోటియాస్ విశ్వవిద్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో తెలిపింది.

“ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం, ఎందుకంటే ఈ ఆవిష్కరణను తప్పుగా సూచించడం మా ఉద్దేశం కాదు. గల్గోటియాస్ విశ్వవిద్యాలయం విద్యా సమగ్రత, పారదర్శకత, దాని పనిని బాధ్యతాయుతంగా ప్రదర్శించడానికి కట్టుబడి ఉంది. నిర్వాహకుల మనోభావాలను గౌరవిస్తూ, మేం వేదికను ఖాళీ చేశాం” అని తెలిపింది.

ఈ రోబోను గల్గోటియాస్ విశ్వవిద్యాలయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అభివృద్ధి చేస్తున్నామని, దీనిని తయారు చేయలేదనీ, నిర్మించడం, అభివృద్ధి చేయడం మధ్య తేడా ఉందని గల్గోటియాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్ మంగళవారం బీబీసీ న్యూస్ హిందీతో చెప్పారు.

ఇదే రోబో డాగ్ గురించి అంతకుముందు మరో మీడియాతో మాట్లాడిన ప్రొఫెసర్ నేహా సింగ్, దీనిని గల్గోటియాస్ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో, వర్సిటీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
న్యూదిల్లీ ఏఐ సమ్మిట్, గల్గోటియాస్ విశ్వవిద్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

సాకర్ డ్రోన్లదీ అదేతీరు

ప్రొఫెసర్ నేహా సింగ్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ‘సాకర్ డ్రోన్’ ఎండ్-టు-ఎండ్ ఇంజనీరింగ్ నుంచి దాని అప్లికేషన్ వరకు ప్రతిదీ విశ్వవిద్యాలయంలో వర్క్ చేసినట్లు ఆమె చెప్పారు.

గల్గోటియాస్ క్యాంపస్‌లో ‘భారతదేశంలోని మొట్టమొదటి డ్రోన్ సాకర్ అరేనా’ ఉందని, ఇక్కడ విద్యార్థులు ఆటలు ఆడతారు, ఎగురవేస్తారు, కొత్త, మెరుగైన లక్షణాలతో దానిని అభివృద్ధి చేస్తున్నారని వ్యాఖ్యానించారు నేహా సింగ్.

ఈ వీడియోను ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, “మొదట చైనా, ఇప్పుడు కొరియా. గల్గోటియా ‘అరువుగా తీసుకున్న’ ఆవిష్కరణలు ప్రపంచ పర్యటనలో ఉన్నాయి. క్యాంపస్‌లో భారత మొట్టమొదటి డ్రోన్ సాకర్‌ను నిర్మించామని ఆమె అంటున్నారు. కానీ, ఇది వాస్తవానికి కొరియా నుంచి తెచ్చిన స్ట్రైకర్ వీ3 ఏఆర్ఎఫ్” అని రాశారు.

డ్రోన్ సాకర్ , గల్గోటియాస్ విశ్వవిద్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఈ వీడియోలో ప్రొఫెసర్ చూపించే డ్రోన్‌.. దక్షిణ కొరియా కంపెనీ హెల్సెల్ తయారు చేసిన ప్రోడక్ట్ మాదిరే ఉంది. హెల్సెల్ వెబ్‌సైట్ ప్రకారం, ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ, దీనిని దృష్టిలో ఉంచుకుని, సాకర్, డ్రోన్‌లను కలిపి ఒక కొత్త రకం ఆటను తీసుకొచ్చాం.

“డ్రోన్ సాకర్ అనేది అభివృద్ధి చెందుతున్న భవిష్యత్ క్రీడ, ఇది అధునాతన కార్బన్ పదార్థాలు, డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి సృష్టించినది. ఇందులో రెండు జట్లు ఉంటాయి, ఒక్కొ దానిలో ఐదుగురు ప్లేయర్స్ ఉంటారు” అని పేర్కొంది.

ఈ డ్రోన్ సాకర్ స్ట్రైకర్ గ్రూప్‌లో దాదాపు 11 వేర్వేరు డ్రోన్‌లు ఉంటాయి. వీడియోలో పేర్కొన్న స్ట్రైకర్ వీ3 ఏఆర్ఎఫ్ ధర సుమారు రూ. 41,000.

సునీల్ గల్గోటియా

ఫొటో సోర్స్, Getty Images

వర్సిటీ చరిత్ర ఏంటి?

గల్గోటియాస్ వర్సిటీ 2011లో ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో స్థాపించారు. దీని ఫౌండర్ గల్గోటియా పబ్లికేషన్స్ యజమాని సునీల్ గల్గోటియా.

విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ప్రకారం, సునీల్ గల్గోటియా దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో తన ఫ్యామిలీ బుక్ స్టోర్ అయిన ఈడీ గల్గోటియా & సన్స్‌లో పనిచేసేవారు. 1980లో, ఆయన ఒక ప్రచురణ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. గల్గోటియా పబ్లికేషన్స్ పేరుతో ప్రచురణ సంస్థను ప్రారంభించారు. సునీల్ తన మొదటి పుస్తకాన్ని ముద్రించడానికి ప్రారంభ రోజుల్లో రూ. 9,000 రుణం తీసుకున్నారు.

విదేశాలలో చదువుకోవడానికి నిర్వహించే శాట్, టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్ పరీక్షలకు బారన్ పుస్తకాల ప్రచురణ హక్కులను పొందడం ద్వారా ఈ ప్రచురణ సంస్థ దూసుకెళ్లింది.

ఆ తర్వాత, పుస్తకాలను వదిలి విద్యారంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు సునీల్ గల్గోటియా. 2000లో 40 మంది విద్యార్థులతో గల్గోటియాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీని ప్రారంభించారు. అదే సంవత్సరం గల్గోటియాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రారంభమైంది.

గల్గోటియాస్ విశ్వవిద్యాలయం, మెక్సికన్-అమెరికన్ గిటారిస్ట్ కార్లోస్ సాంటానా

ఫొటో సోర్స్, Getty Images

52 ఎకరాల క్యాంపస్

ఈ రెండు సంస్థలు 2011లో గల్గోటియాస్ విశ్వవిద్యాలయ స్థాపనకు దారితీశాయి. నేడు వర్సిటీకి గ్రేటర్ నోయిడాలో 52 ఎకరాల క్యాంపస్ ఉంది.

గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ప్రకారం, ఒక విద్యా సంవత్సరంలో సుమారు 40 దేశాల నుంచి 40,000 మంది విద్యార్థుల వరకు వర్సిటీలో చదువుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 96 దేశాలలో 1,00,000 మందికి పైగా పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు.

యూజీసీ గుర్తింపు పొందిన ఈ విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు పీహెచ్డీని అందిస్తుంది. తన 20 విద్యాసంస్థల్లో 200 ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పేర్కొంది.

దీంతో పాటు, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ నార్మ్స్ విశ్వవిద్యాలయాన్ని గుర్తించాయి.

సునీల్ గల్గోటియా విశ్వవిద్యాలయ ఛాన్సలర్, ఆయన కుమారుడు ధ్రువ్ గల్గోటియా దాని సీఈవో. ఆయన కుమార్తె ఆరాధన గల్గోటియా విశ్వవిద్యాలయ కార్యకలాపాల డైరెక్టర్.

న్యూదిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్

ఫొటో సోర్స్, Getty Images

గతంలోనూ వివాదాలు

మల్టీడిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ విద్య, పరిశోధన, ఆవిష్కరణలలో రాణిస్తూ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థగా మారడమే తమ దార్శనికత అని గల్గోటియాస్ విశ్వవిద్యాలయం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం కలిగిన, వారి రంగాలలో నాయకులుగా మారడానికి సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్‌లను తయారు చేయడం లక్ష్యం అని కూడా చెబుతోంది.

అయితే, గల్గోటియాస్ విశ్వవిద్యాలయం వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు.

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సంపద పంపిణీ, వారసత్వ పన్ను అంశంపై న్యూదిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల ఒక విద్యార్థుల బృందం నిరసన వ్యక్తం చేసింది.

ఈ నిరసనలో, చాలామంది విద్యార్థులు తాము గల్గోటియాస్ విశ్వవిద్యాలయానికి చెందిన వారిమని చెప్పుకున్నారు. నిరసన ఎందుకు చేస్తున్నారని మీడియా వారిని అడిగితే, సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS