SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
9 గంటలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకోనున్నారు. ముస్లింలకు ఈద్ అత్యంత పెద్ద పండుగ.
ఈద్ ఉల్ ఫితర్ అంటే?
రంజాన్ మాసం చివర్లో ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. ఈ నెలంతా ముస్లింలు ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే ఉపవాసాలను ముగించడం అని అర్థం.
నెలవంకను చూడటంతో ఈద్ మొదలవుతుంది.
సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్ దేశాల్లో రంజాన్ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనట్లయింది.
మంగళవారం సాయంత్రం నెలవంకను చూసినట్లు పది ఇస్లామిక్ దేశాలు ప్రకటించాయని బీబీసీ అరబిక్ తెలిపింది. ఈ విషయాన్ని సౌదీ రాజకుటుంబం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
“ఈ రాత్రి పవిత్ర రంజాన్ మాసం నెలవంకను అనేక మంది చూశారు. బుధవారమే రంజాన్ మొదటి రోజు” అని రాయల్ కోర్టును ఉటంకిస్తూ సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది.

భారత్‌లో రంజాన్ నెల ప్రారంభం ఎప్పుడు?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్, యెమెన్ దేశాలలో ఈరోజు నుంచి రంజాన్ ప్రారంభం కానుంది.
మంగళవారం సాయంత్రం చంద్రుడు కనిపించకపోవడంతో, గురువారం రంజాన్ నెల మొదటి రోజుగా ప్రకటించిన వాటిలో సిరియా, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, జోర్డాన్, ఇరాన్, సింగపూర్ ఉన్నాయి.
సాధారణంగా సౌదీ అరేబియాలో నెలవంక కనిపించిన మరుసటి రోజే భారత్‌లో ఉపవాసాలు మొదలవుతాయి.
అయితే “రూయాత్-ఎ-హిలాల్ కమిటీ’ వంటి నెలవంక నిర్ధరణ కమిటీలు ఫిబ్రవరి 18 బుధవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో సమావేశమై భారతదేశంలో రంజాన్ ప్రారంభాన్ని నెలవంక దర్శనం బట్టి నిర్ణయిస్తుంది” అని సియాసత్ వార్తాసంస్థ తెలిపింది.
ఫొటో సోర్స్, PA Media
ఈద్‌లో ఏం చేస్తారు?
ముస్లింలు మసీదుల్లో జరిగే ఈద్ ప్రార్థనలకు హాజరవుతారు.
పశ్చిమాసియా దేశాల్లో ఉదయం ఫజర్ ప్రార్థనల తర్వాత వీటిని నిర్వహిస్తారు.
మసీదుకు కొత్త బట్టలు ధరించి వెళ్లడం ఈ పండుగ సంప్రదాయం. ఖర్జూరం లాంటి ఏదైనా తియ్యని పదార్థం తిన్న తర్వాత తక్బీర్ అనే చిన్న ప్రార్థన చేస్తారు.
ఈద్ ప్రార్థనలు మొదలు కావడానికి ముందు పేదలకు దానధర్మాలు చేస్తారు. దీని కోసం జకాత్ అల్ ఫితర్ పేరుతో కొంత మొత్తాన్ని దానధర్మాల కోసం కేటాయిస్తారు.
కుటుంబం, స్నేహితులతో కలిసి విందు భోజనం చేస్తారు. బహుమతులు, డబ్బు పంచుకుంటారు.
చాలా దేశాల్లో ఈద్ ఉల్ ఫితర్ నాడు సెలవు ఉంటుంది.
ఫొటో సోర్స్, PA Media
రంజాన్ అంటే ఏమిటి?
ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదో నెలకున్న అరబిక్ పేరే రంజాన్.
ఇస్లామిక్ నెలల్లోని పవిత్రమైన మాసాల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తారు.
రంజాన్ పండుగను ఇస్లాం అయిదు సూత్రాల్లో ఒక్కటిగా గుర్తిస్తారు. వీటిని ముస్లింలు తప్పనిసరిగా ఆచరించాలని ఆ దేవుడిచ్చిన ఆదేశాలుగా ముస్లింలు భావిస్తారు.
మహమ్మద్ ప్రవక్త ఇస్లాం పవిత్ర గ్రంధం ఖురాన్‌లోని తొలి సూత్రాలను రంజాన్ నెలలోనే వెల్లడి చేసినట్లు ముస్లింలు విశ్వసిస్తారు. అందుకే ఈ నెలలో ఖురాన్ పఠనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.
ఈ నెలలో చేసే పూజలో ఉపవాసం కూడా భాగం. ఉపవాసం ద్వారా వారు దేవుడికి దగ్గరగా ఉన్నట్లు భావించి వారి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని, స్వీయ క్రమశిక్షణను మెరుగు పరుచుకుంటారు.
ఫొటో సోర్స్, Getty Images
ఈ నెలంతా ఏం చేస్తారు?
ఈ నెలంతా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి భోజనం ముగిస్తారు. దీనినే సుహుర్ లేదా సెహ్రి అంటారు.
సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగిస్తారు. అప్పుడు చేసే విందునే ఇఫ్తార్ లేదా ఫితూర్ అంటారు.
ఈ సమయంలో ముస్లింలు దాన ధర్మాలు చేయడానికి, దైవంతో తమ అనుబంధాన్ని బలపర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
దయ, సహనంతో ఉంటారు.
కొంత మంది మసీదులో రాత్రి పూట జరిగే తరావీహ్ ప్రార్థనలకు కూడా హాజరవుతారు.
ఈ ప్రార్ధనలు కేవలం రంజాన్ మాసంలోనే జరుగుతాయి.
ఫొటో సోర్స్, Reuters
నెలవంక దర్శనంతోనే…
చంద్రమానం ప్రకారం 12 నెలల క్యాలెండర్‌ను ఇస్లామిక్ క్యాలెండర్ అనుసరిస్తుంది. ఇందులో తొమ్మిదో నెల రంజాన్. పదో నెల షవ్వల్ మొదట్లో ఈద్‌ను జరుపుకుంటారు.
నెలవంక దర్శనంతోనే ప్రతి నెలా మొదలవుతుంది. ఇది 29-30 రోజులుంటుంది.
గతంలో దీన్ని మామూలు కంటితోనే నేరుగా చూసి నిర్ణయించేవారు. అయితే, ఇటీవల కాలంలో దీన్ని గుర్తించేందుకు టెలీస్కోపులు, సాంకేతికతను వాడుతున్నారు.
ఇండొనేసియా నుంచి మొరాకో వరకు భౌగోళికంగా చాలా విస్తీర్ణంలో ముస్లిం దేశాలున్నాయి. అంటే నెలవంక ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో కనిపించే అవకాశం ఉంది.
“సంప్రదాయ పరంగా మక్కాలో నెలవంక కనిపించే సమయాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు” అని లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో సెంటర్ ఆఫ్ ఇస్లామిక్ స్టడీస్‌లో పని చేస్తున్న ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దేల్ హలీం అన్నారు.
“కొన్నిసార్లు పశ్చిమాసియా దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో నెలవంకను వేర్వేరు రోజుల్లో చూసినట్లు చెబుతారు” అని ఆయన చెప్పారు.
పాశ్చాత్య క్యాలెండర్ కన్నా చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్ క్యాలెండర్ 10 రోజులు తక్కువ ఉంటుంది. అంటే, ప్రతి సంవత్సరం రంజాన్ 10 రోజులు ముందుగా వస్తుంది.
రంజాన్‌లో ఉపవాసం ఎవరుంటారు?
ఆరోగ్యవంతులు మాత్రమే ఉపవాసం ఉండాలి.
అనారోగ్యంతో బాధపడుతున్నవారు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు, నెలసరిలో ఉన్నవారు ప్రయాణాలు చేసేవారు ఉపవాసం చేయనక్కరలేదు.
ఈద్ ఉల్ అదా అంటే ఏమిటి?
ఇస్లామిక్ క్యాలండర్‌లో ఈద్ ఉల్ ఫితర్ మాత్రమే పండగ కాదు. ఈద్ ఉల్ అదా పండగను ధుల్ హిజా మాసంలో జరుపుకుంటారు. ఈ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కా వెళ్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



