Home జాతీయ national telgu పేరెంటింగ్: పిల్లలను భయభక్తులతో పెంచాలా లేక బుజ్జగిస్తూ పెంచాలా? ఏది బెటర్..

పేరెంటింగ్: పిల్లలను భయభక్తులతో పెంచాలా లేక బుజ్జగిస్తూ పెంచాలా? ఏది బెటర్..

16
0

SOURCE :- BBC NEWS

పేరెంటింగ్, చిన్నారులు, ప్రవర్తన, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

రోజులు మారే కొద్దీ పిల్లలను పెంచుతున్న విధానం, పెరిగే విధానం రెండూ మారుతూ వస్తున్నాయి.

పెద్దల మాట జవదాటకూడదు, కాస్త కళ్లు పెద్దవి చేసి చూస్తే.. ఇక నోరెత్తకూడదనే రోజులు పోయి.. అమ్మనాన్నలు కూడా మంచి స్నేహితులని, ఏ విషయమైనా వాళ్లతో హాయిగా మాట్లాడవచ్చనే రోజులలో ఉన్నాం.

ఈ క్రమంలో తల్లిదండ్రులు వారి పిల్లలను పెంచే విధానంలో కూడా చాలా మార్పులొచ్చాయి. పిల్లలకు కూడా హక్కులుంటాయనే చర్చ మొదలైంది.

చీటికీమాటికీ వాళ్లని కొట్టడమో, తిట్టడమో చేస్తే.. వాళ్లు మరింత మొండిగా తయారవుతారు తప్ప మాటవినరనే జెంటిల్ పేరెంటింగ్ విధానం ముందుకొచ్చింది.

కానీ, ఇప్పుడు ఈ జెంటిల్ పేరెంటింగ్ కన్నా ఫాఫో పేరెంటింగ్ బెటర్ అంటున్నారు మరికొందరు. అసలేమిటీ పేరెంటింగ్ విధానాలు? ఇవి పిల్లలకు, తల్లిదండ్రులకు ఉపయోగపడుతున్నాయా? లేక ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
పేరెంటింగ్, చిన్నారులు, ప్రవర్తన, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

జెంటిల్ పేరెంటింగ్..

ఈమధ్య ఓ వీడియో వైరల్ అయింది.

ఓ షోరూంలో ఓ పాప చేతి నుంచి విలువైన వస్తువు పొరపాటున జారి పగిలిపోతుంది. వెంటనే వాళ్ల అమ్మ ఆ వస్తువు పగిలినందుకు తిట్టకుండా ‘ఇట్స్ ఓకే, నీకేం దెబ్బ తగలలేదు కదా’ అంటుంది. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఫాలో అవుతున్నది ఇదే.. జెంటిల్ పేరెంటింగ్.

పిల్లలతో వీలైనంత మృదువుగా వ్యవహరించడం, వారిపట్ల ఎంపథెటిక్‌గా అంటే సానుభూతితో వ్యవహరించడం, వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం, వారి ఇష్టాయిష్టాలకు విలువనిస్తూ ఏది మంచి.. ఏది చెడు అన్నది చర్చించడంలాంటివి జెంటిల్ పేరెంటింగ్‌లో ఉంటాయి.

పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఓ మంచి స్నేహ బంధం ఏర్పడటానికి జెంటిల్ పేరెంటింగ్ చాలా ఉపయోగపడుతుంది.

అమ్మానాన్నలు పిల్లలను భయభక్తుల మధ్య కాకుండా, అన్ని విషయాలు ఓపికగా వివరిస్తూ వాళ్ల ఇష్టాఇష్టాలు తెలుసుకుంటూ పెంచుతారు.

‘‘ఇది పిల్లలు స్వతంత్రంగా ఆలోచించడానికి, వారి మానసిక ఆరోగ్యానికి సాయపడుతుంది. అమ్మానాన్నలతో ఎక్కువ సమయం గడపడం, మాట్లాడటం వల్ల వారిలో పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది’’ అని హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్ట్ విశేష్ అన్నారు.

పిల్లలకు పనిష్మెంట్లు ఇవ్వడం కన్నా వాళ్లకు కూడా గౌరవం ఇవ్వడం, ప్రేమగా మాట్లాడటం, వాళ్లతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉండటం అవసరమన్నారు సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ ఆడ్లర్.

1920లలోనే జెంటిల్ పేరెంటింగ్ గురించి డాక్టర్ ఆడ్లర్ మాట్లాడారు.

చైల్డ్ కేర్, పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్ సారా ఓక్వెల్ స్మిత్ వంటి వారు కూడా జెంటిల్ పేరెంటింగ్ గురించి అనేకసార్లు మాట్లాడారు. ముఖ్యంగా మిలీనియల్స్ .. పాత పేరెంటింగ్ విధానాలు పక్కన పెట్టి జెంటిల్ పేరెంటింగ్ బాట పట్టారు.

పేరెంటింగ్, చిన్నారులు, ప్రవర్తన, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల హక్కులు సరే.. మరి ఓపిగ్గా, మాటలతో అన్నీ అర్థమయ్యేలా చెబుతూ పిల్లలు వినేలా చేయడం నిజంగా సాధ్యమేనా?

పేరెంటింగ్, జెంటిల్ పేరెంటింగ్ మధ్య ఉండే సన్నని విభజన రేఖ గురించి పేరెంటింగ్ కోచ్‌లు, సైకాలజిస్ట్‌లు, తల్లిదండ్రులు ఏమంటున్నారు?

“నా చిన్నప్పుడు మా నాన్న అప్పుడప్పుడు కొట్టేవారు. అందువల్ల ఆయనంటే చాలా భయం. ఇప్పటికీ నాన్నను తలచుకున్నప్పుడు ముందుగా ఆయన కొట్టడమే నాకు గుర్తుకొస్తుంది. అందుకని నా పిల్లలను కొట్టకుండా పెంచాలని అనుకున్నా. అలాగే మా అబ్బాయిని పెంచుతున్నా. కానీ, ఇది అంత సులభం కాదు. చాలా ఓపిక కావాలి” అని జెంటిల్ పేరెంటింగ్ గురించి మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న కృష్ణ అన్నారు.

“ఒక్కోసారి మా అబ్బాయి ఎంత చెప్పినా మాట వినడు. అలాంటప్పుడు సహనం పోతుంది. అయినా నా సిద్ధాంతానికి కట్టుబడి కొట్టకుండానే ఉంటున్నా. అందువల్ల నేనంటే వాడికి భయం లేదు. ఇది అప్పుడప్పుడు క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తోంది. నేను గారాబం చేయడం వల్లే వాడు అలా తయారవుతున్నాడని మా ఇంట్లో వాళ్లు అంటుంటారు. కానీ, నేను దాన్ని పూర్తిగా ఒప్పుకోను. ఇప్పుడున్న బిజీ జీవితాల్లో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే తీరిక, ఓపిక పెద్ద వాళ్లకు లేకపోవడమే అసలు సమస్య” అన్నారాయన.

బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో పని చేస్తున్న శాంతికి ఎనిమిదేళ్ల పాప. తను పెరిగిన విధానం వేరు, తన పాపను పెంచుతున్న విధానం వేరు అంటారు శాంతి.

జెంటిల్ పేరెంటింగ్‌లో కూడా పేరెంట్స్ కొంత కఠినంగా ఉండటం అవసరమని.. పిల్లల ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవితంలో తల్లిదండ్రులు నేర్పించాల్సినవి, కొన్నిసార్లు కఠినంగా చెప్పాల్సినవి కూడా కొన్ని ఉంటాయంటున్నారు శాంతి.

పేరెంటింగ్, చిన్నారులు, ప్రవర్తన, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

సానుకూలతలు

ఇందులోని కొన్ని పాజిటివ్ అంశాలు చూస్తే..

  • పిల్లలు తల్లిదండ్రులతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉండటం
  • ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉండటంతో ఇష్టాలు కష్టాలు రెండింటిని మనసువిప్పి మాట్లడటం
  • అకడమిక్స్ విషయంలో భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడం
  • జీవితాన్ని చూసే దృక్పధం పాజిటివ్‌గా ఉండటం
  • ఎలాంటి సమస్యనైనా ఒంటిరిగా ఎదుర్కోవలసిన అవసరం లేకపోవడంతో పిల్లలలో యాంగ్జైటీ సమస్యలు చాలా తక్కువగా ఉండడం
  • చదువులతో పాటు ఆటపాటలలో కూడా ముందుండటం.

కానీ, ఇది అంత సులభం కూడా కాదు. ఎందుకంటే మిలీనియల్స్‌లో చాలా వరకు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అంటే వర్కింగ్ పేరెంట్స్. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఇల్లు పిల్లలు. అలాంటప్పుడు ఈ జెంటిల్ పేరెంటింగ్ అంత ఆషామాషీ కాదని మేం మాట్లాడిన కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు.

పేరెంటింగ్, చిన్నారులు, ప్రవర్తన, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ప్రతికూలతలు

ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని నిపుణులు కూడా అంటున్నారు. ఈ పేరెంటింగ్‌లో ఉండే బౌండరీని.. అంటే సున్నితమైన లైన్‌ని కూడా తప్పనిసరిగా అర్థం చేసుకుని, బ్యాలెన్స్‌డ్‌‌గా ముందుకు సాగాలని చెబుతున్నారు డాక్టర్ విశేష్.

  • తల్లితండ్రులకు స్ట్రెస్.
  • సానుభూతితో అన్ని సమస్యలూ పరిష్కారం కావు.
  • తల్లిదండ్రులు వాళ్లను తిట్టరనే నమ్మకంతో పిల్లలు కాస్త మొండిగా ప్రవర్తించడం. (ఉదాహరణకు, వద్దని చెబుతున్నా గంటల పాటు ఫోన్ చూటడం)
  • ఎన్నిసార్లు చెప్పినా విషయాలపై శ్రద్ధ పెట్టకపోవడం. ( లెక్కచేయకపోవడం)

కొన్నిసార్లు పిల్లల మొండి ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులకు తాము సరైన దారిలోనే వెళ్తున్నామా? అనే సందేహం కూడా కలుగుతుంది.

ఈ జెంటిల్ పేరెంటింగ్‌తో విసిగిపోతున్నామని చెప్పే పేరెంట్స్ కూడా ఉన్నారు.

అందుకే, చాలామంది పేరెంట్స్ ఇప్పుడు ఫాఫో పేరెంటింగ్ బాట పడుతున్నారు.

పేరెంటింగ్, చిన్నారులు, ప్రవర్తన, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫాఫో పేరెంటింగ్

చెప్పిన మాట విననప్పుడు పదేపదే చెప్పకుండా, దాని వల్ల ఎదురయ్యే ఇబ్బందులు వారి అనుభవానికి వచ్చేలా చేయడం. అంటే, మాటల్లో కాకుండా ప్రాక్టికల్‌గా వారికి అర్థమయ్యేలా చేయడం మంచిదంటున్నారు. ఇదే ఫాఫో పేరెంటింగ్ (FAFO – Fool Around and Find Out)

దానివల్ల పదేపదే చెప్పాల్సిన అవసరం ఉండదని, ఒకసారి దెబ్బపడితే, వాళ్లని మనం పదేపదే బుజ్జగించడంలేదని అర్థమైతే.. పిల్లలు మొండితనాన్ని తగ్గించుకుంటారన్నది ఫాఫో పేరెంటింగ్ థియరీ.

జెంటిల్ పేరెంటింగ్ లానే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులున్నాయంటున్నారు సైకాలజిస్ట్, ‘పేరెంటింగ్ ఫర్ హ్యూమన్స్’ రచయిత డాక్టర్ ఎమ్మా స్వాన్‌బర్గ్.

పిల్లలు వాళ్లకి ఎదురైన ఇబ్బందుల నుంచే కాదు, ఆ సమయంలో తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు? అనే దాన్ని చూసి కూడా నేర్చుకుంటారని అంటున్నారు స్వాన్‌బర్గ్.

పిల్లలు ఏదైనా తప్పు చేసి ఇబ్బంది పడుతున్నప్పుడు ‘నాకేం సంబంధం లేదు’ అని పేరెంట్స్ చెప్పడం వలన వాళ్లలో కూడా అదే రకమైన స్వభావం, ప్రవర్తన పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎమోషనల్‌గా పిల్లలు ‘షేమ్’ ఫీల్ అవుతారని, తాము ఒంటరివారమన్న భావనలోకి వెళ్లిపోతారని అంటున్నారు.

పేరెంటింగ్, చిన్నారులు, ప్రవర్తన, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫాఫో పేరెంటింగ్ అనేది అసహనం నుంచి పుట్టిన విధానమని, అది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్.

‘‘తల్లిదండ్రులు కఠినంగా మాట్లాడటం వల్ల పిల్లల్లో కూడా సున్నితత్వం తగ్గిపోవచ్చు, అది భవిష్యత్తులో చాలా ప్రమాదాలకు కారణం కావచ్చు’’ అని ఆయన అన్నారు.

అయితే, పేరెంటింగ్ విధానాల్లో ఎన్ని కొత్త పద్ధతులు వచ్చినా అన్నింటిలో కావాల్సింది, అవసరమైంది సమతుల్యత అంటారు డాక్టర్ విశేష్. అంటే, తల్లిదండ్రులు ఫ్రీడమ్, కంట్రోల్, గైడెన్స్.. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ పిల్లలను పెంచగలిగితే మంచిదని ఆయన చెబుతున్నారు.

అతిగా గారం చేయడం, అతిగా ఫ్రీడం ఇవ్వడం, అతిగా కంట్రోల్ చేయడం.. ఇలా ఏది మితిమీరినా అది ఇబ్బందులు తెచ్చి పెడుతుందని చెబుతున్నారు.

‘‘అన్నింటికన్నా ముఖ్యంగా పేరెంటింగ్, దాని ఇంపార్టెన్స్ చాలామంది తల్లిదండ్రులకు తెలియకపోవడమే ఈ సమస్యలకు కారణం’’ అంటున్నారు డాక్టర్ విశేష్.

అసలు ఈ పేరెంటింగ్ గురించి ఎవరితోనూ చర్చించరనీ, అమ్మానాన్నలయ్యాక అది సహజంగా తెలుస్తుందని, నేర్చుకోవాల్సిన అవసరం లేదని వాళు భావిస్తారనీ, అదే అసలు సమస్య అని ఆయన అంటున్నారు.

కొత్త కొత్త విషయాలు ఎలా తెలుసుకుంటామో, తెలుసుకోమని పిల్లలను ఎలా ఎంకరేజ్ చేస్తామో, పేరెంటింగ్ గురించి కూడా అలాగే నేర్చుకోవడం.. తెలుసుకోవడం మంచిదని సైకాలజిస్ట్ విశేష్ అభిప్రాయపడ్డారు.

పేరెంటింగ్, చిన్నారులు, ప్రవర్తన, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఫాఫో పేరెంటింగ్‌లో భాగంగా పిల్లలకు సహజంగా ఎదురయ్యే సమస్యలను వాళ్ల అనుభవానికి తీసుకురావడంలో ఎలాంటి సమస్య లేదు.. కానీ, వాళ్లకి తెలిసిరావాలంటూ పేరెంట్స్ పూర్తిగా వాళ్లని వదిలిపెడితే.. వారి ప్రవర్తన మరొకరికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కూడా ఎదురుకావొచ్చు. అందుకే అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్త అవసరమని ది సెక్యూర్ చైల్డ్ సెంటర్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్ ఫౌండర్, చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ టమారా గ్లెన్ సోల్స్ ‘పేరెంట్స్’ అనే ఆన్‌లైన్ మేగజీన్‌కు చెప్పారు.

ఉదాహరణకు.. పిల్లలు అన్నం తిననని మొండికేస్తారు. వాళ్లకు బాగా ఇష్టమైందే వండాలంటారు. అలాంటప్పుడు ఒకరోజు వాళ్లని అన్నం ఇవ్వకుండా వదిలిపెట్టండి. ఇబ్బందేం లేదు. దాని వలన వాళ్లకి ఆకలి అర్థం అవుతుంది. అంటే ఫాఫో పేరెంటింగ్ ఇక్కడ ఫర్వాలేదు.

‘‘కానీ, ఎవరైనా ఫ్రెండ్ తనకు నచ్చిన ఆట ఆడటం లేదని తనతో మీ పాప లేదా బాబు గొడవ పడటం లేదా కొట్టడం చేస్తున్నప్పుడు మాత్రం చూస్తు ఊరుకోకండి. ఎందుకంటే, దాని వలన మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రమాదం జరగొచ్చు’’ అని చెబుతున్నారు డాక్టర్ సోల్స్.

జెంటిల్ పేరెంటింగ్‌తో విసిగిపోతున్న పేరెంట్స్ ఫాఫో వైపు వెళ్లాలనుకుంటే కచ్చితంగా బ్యాలెన్స్ అవసరమని చెబుతున్నారు పేరెంటింగ్ కోచ్, అలబామా యూనివర్సిటీ ప్రొఫెసర్ కింబర్లీ కింగ్.

‘‘ఒక పని చేస్తే దాని వలన జరిగే మంచి చెడులను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా చాలా ముఖ్యం’’ అని అదే మేగజీన్‌లో ఆమె అభిప్రాయపడ్డారు.

పిల్లలు సమస్యలను అనుభవించే ముందు దానివల్ల కలిగే ఇబ్బందుల గురించి , ఆ సమస్యను ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ల దగ్గరున్న చాయిస్‌లు ఏంటి అన్నది వాళ్లతోనే మాట్లాడటం అవసరమని చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)