Home జాతీయ national telgu అక్బర్, బీర్బల్ కథలు నిజమైనవేనా, బీర్బల్ అసలు పేరేంటి?

అక్బర్, బీర్బల్ కథలు నిజమైనవేనా, బీర్బల్ అసలు పేరేంటి?

7
0

SOURCE :- BBC NEWS

అక్బర్, బీర్బల్

ఫొటో సోర్స్, Juggernaut/GettyImages

మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానం పండితులు, కవులు, విద్యావంతులు, తత్త్వవేత్తలు, కళాకారులు, సంగీతకారులు, సైనికాధికారులు, పరిపాలనాదక్షులతో విరాజిల్లుతుండేదని చెబుతారు.

అక్బర్ కొలువులో వీరిని నవరత్నాల పేరుతో పిలిచేవారు. వీరిలో బీర్బల్ కూడా ఒకరు. బీర్బల్, అక్బర్ స్నేహానికి సంబంధించిన కథలు, బీర్బల్ హాస్యచతురత ఇవన్నీ ఈ రోజుకూ జన బాహుళ్యంలో పురాగాథలుగా నిలిచిపోయాయి.

బీర్బల్ ఎప్పుడూ తనతోనే ఉండాలని అక్బర్ కోరుకునేవారు. అక్బర్ జీవిత చరిత్ర ‘అక్బర్ ది గ్రేట్ మొఘల్’ పుస్తకంలో రచయిత ఇరా ముక్తోయ్ ”ఫతేపుర్ సిక్రీ నిర్మిస్తున్న సమయంలో బీర్బల్ కోసం ఓ ప్యాలెస్ కట్టమని ఆదేశించారు. ఈ ప్యాలెస్ 1583లో పూర్తయింది. దీని ప్రారంభోత్సవానికి అక్బర్ కూడా హాజరయ్యారు” అని రాశారు.

వీరి స్నేహం ఎంతటిదంటే మొఘల్ సామ్రాజ్యం అంతరించిపోయి శతాబ్దాలు గడిచినా అక్బర్, బీర్బల్ కథలు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు.

”ఈ కథలలో రాజు ఎప్పుడూ ఎగతాళి చేస్తున్నట్టు, బీర్బల్ అతనికంటే తెలివైనవాడుగానూ కనిపిస్తూ ఉంటాడు. ఈ కథలు నిజమైన సంఘటనల ఆధారంగానే రూపొందాయనడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. కానీ హాస్యచతురత, చమత్కారాన్ని అక్బర్ ఇష్టపడతారనడంలో ఎటువంటి సందేహం లేదు’’ అన్నారు ఇరా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అక్బర్‌ ది గ్రేట్ మొఘల్

ఫొటో సోర్స్, Aleph

“అరిస్టాటిల్ పేరు అలెగ్జాండర్ ది గ్రేట్‌తో ముడిపడి ఉన్నట్లే రాజా బీర్బల్ పేరు అక్బర్‌తో ముడిపడి ఉంది. బీర్బల్ జ్ఞాపకం భారతీయ ప్రజల మనస్సులలో లోతుగా నాటుకు పోయింది. ఆయన పేరులో రాజా, బీర్బల్ అనేవి లేవు. కానీ బీర్బల్ అనేది ఆయన బిరుదు. దీనివల్లే ఆయన అసలు పేరేమిటో మరిచిపోయారు’’ అని ఎంహెచ్ ఆజాద్ తన పుస్తకం ‘దర్బార్-ఎ-అక్బరి’లో రాశారు,

బీర్బల్ 1556 లో అక్బర్ ఆస్థానంలోకి ప్రవేశించాడని చెబుతారు. ఆ సమయంలో ఆయన వయసు 28 ఏళ్లు. అక్బర్ కంటే 14 ఏళ్లు పెద్ద.

బీర్బల్ అసలు పేరేమిటనే విషయంలో చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. అక్బర్ కాలం నాటి చరిత్రకారుడు అబ్దుల్ ఖాదిర్ బదాయుని దీని గురించి రాశారు. బీర్బల్ అసలు పేరు గడై బ్రహ్మదాస్ అని బదాయుని, మహేష్ దాస్ అని జార్జ్ గ్రియర్సన్ తెలిపారు.

అలహాబాద్ కోటలోని అశోక స్తంభంపై తరువాత కాలంలో చెక్కిన వర్ణనలో, బీర్బల్ అసలు పేరు మహేష్ దాస్ అని, ఆయన తండ్రిపేరు గంగా‌దాస్ అని రాశారు.

అశోక స్తంభం

ఫొటో సోర్స్, UP Tourism

అక్బర్ ఆస్థానంలో బీర్బల్ ఎలా చేరారు?

బీర్బల్ అక్బర్ రాజాస్థానంలో 24 సంవత్సరాలు పనిచేశారు. అంతకుముందు పలువురు రాజుల వద్ద ఆస్థాన కవిగా పనిచేశారు బీర్బల్. రేవా రాజు రామచంద్ర ఆస్థానంలో బీర్బల్ పనిచేసినట్టు బదాయుని చెబుతారు.

అక్బర్ ఆస్థానంలోకి బీర్బల్ ఎలా వచ్చారనే విషయంపై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

అక్బర్, బీర్బల్ మధ్య జరిగిన ఓ సమావేశంలో బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైన అక్బర్ ఆయనను తన ఆస్థానానికి పిలిపించారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అయితే అమెర్ రాజు భగవాన్ దాస్ తన ఆస్థానంలో పనిచేసే బీర్బల్‌ను అక్బర్ ఆస్థానానికి బహుమతిగా పంపారని మరికొందరు చరిత్రకారులు చెబుతారు.

అక్బర్ ఆస్థానానికి తోడరుమల్లే బీర్బల్‌ను తీసుకువచ్చారని మరో జీవిత చరిత్ర రచయిత అభిప్రాయం.

“తాన్‌సేన్‌లానే బీర్బల్ గతంలో రేవా రాజు రాజా రామచంద్ర ఆస్థానంలో పనిచేశారు. అక్బర్ ఆయనను ఆహ్వానించారు’’ అని డాక్టర్ ఆర్.పి. త్రిపాఠి తన ‘పార్టీస్ అండ్ పాలిటిక్స్ ఇన్ ది మొఘల్ కోర్ట్’ పుస్తకంలో రాశారు.

బీర్బలే స్వయంగా అక్బర్ ఆస్థానానికి వచ్చారని, ఆయన చురుకుదనం, తెలివితేటలు, మాటకారితనానికి ఆకర్షితుడైన అక్బర్ ఆయన్ను తన ఆస్థానంలోనే ఉండిపొమ్మాన్నారని బదాయుని నమ్ముతున్నారు.

బీర్బల్, అక్బర్, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Juggernaut

ట్రబుల్ షూటర్

“ఇబదత్ ఖానాలో మతపరమైన విషయాలపై జరిగిన చర్చలలో, బీర్బల్ చమత్కారాన్ని, వాక్చాతుర్యాన్ని మతఛాందసవాదులకు వ్యతిరేకంగా అక్బర్ అద్భుతంగా ఉపయోగించారు” అని జె.ఎం.షెలాత్ తన ‘అక్బర్’ పుస్తకంలో రాశారు.

“వైష్ణవం, సూర్యారాధనపై పై నమ్మకం ఉన్న బీర్బల్, అక్బర్‌పై ఎంత ప్రభావాన్ని చూపాడంటే, అక్బర్ కూడా సూర్యుడు, అగ్ని ప్రాముఖ్యాన్ని అంగీకరించడానికి సిద్ధమయ్యారు” అని షెలాత్ పేర్కొన్నారు.

ఎం.ఎల్. రాయ్‌చౌదరి ‘దిన్-ఇ-ఇలాహి’లో ఇబదత్ ఖానా గురించి వివరిస్తూ, “అక్బర్ ఆస్థానంలో, బీర్బల్ సీటు ఈశాన్యంలో ఉండేది. ఫైజీ వాయువ్యంలో, అబుల్ ఫజల్ ఆగ్నేయ దిశలో కూర్చునేవారు” అని రాశారు.

బాంబర్ గాస్క్వైన్ తన ‘ది గ్రేట్ మొఘల్స్’ పుస్తకంలో ” అక్బర్‌కు హిందూ మతాన్ని అర్థం చేసుకోవడంలో బీర్బల్ చాలా సహాయపడ్డారు. బీర్బల్ కూడా స్వయంగా ఇస్లాం, ఇతర మతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. రెండు వేర్వేరు మతాలతో విభజితమైన సమాజంలో, అక్బర్, బీర్బల్‌ లు ప్రజలను ఐకమత్యంగా సామరస్యంగా జీవించగలిగే కొన్ని సారూప్యతలను కనుగొనడానికి ప్రయత్నించారు” అని రాశారు.

పరిపాలనలోన బీర్బల్ ఘటికుడే. బీర్బల్ మంత్రి పదవి స్వీకరించకుండా, మంత్రుల విధులను నిర్వర్తించేవారు. ప్రస్తుత రోజుల్లో ఆయనను పోర్ట్‌ఫోలియో లేని మంత్రితో పోల్చవచ్చు. 1577లో, మథుర బ్రాహ్మణుల సమస్యను పరిష్కరించడానికి పంపారు.

1578లో, మదద్-ఇ-మాష్ నిర్వహణ కోసం బీర్బల్‌ను జలంధర్‌కు పంపారు. పశువుల ధరలను, విక్రయాలను నియంత్రించే మజ్లిస్‌లో ఆయన సభ్యుడిగా నియమితులయ్యారు.

బీర్బల్, అక్బర్, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

సైనిక పోరాటాల్లోనూ..

దౌత్యవేత్తగా బీర్బల్ ముఖ్యమైన పని అక్బర్, ఇతర హిందూ రాజుల మధ్య అనుసంధానకర్తగా పనిచేయడం. బీర్బల్ జోక్యం చేసుకున్న కారణంగానే 1568లో రాజా రామచంద్ర రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవాలనే ఆలోచనను అక్బర్ విరమించుకున్నారు.

బీర్బల్‌ను మొఘలుల ఆస్థానంలో తమ రక్షకుడిగా చూసేవారు రాజ్‌పుత్‌లు. హిందూ, ముస్లిం వర్గాలలో ఆదరణ పొందడంతోపాటు చక్రవర్తితో బీర్బల్‌కున్న సాన్నిహిత్యాన్ని చూసి ఆయనపట్ల వినయంగా ఉండేవారు.

మొఘలుల సైనిక స్థావరాలకు బీర్బల్ వెళ్లడాన్ని బట్టి ఆయన ప్రాముఖ్యాన్ని అంచనా వేయవచ్చు. పంజాబ్‌లోని సమస్యాత్మక ప్రాంతాన్ని నియంత్రణలోకి తెచ్చేందుకు బీర్బల్‌ను పంపారు అక్బర్.

కాంగ్రా పోరాటంలో ఆయన పాత్రకుగాను 1572లో ఆయనకు నాగర్‌కోట్ జాగీర్‌ను మంజూరు చేశారు అక్బర్.

బీర్బల్, అక్బర్, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Robinson

బీర్బల్ ప్రాణాలు కాపాడిన అక్బర్

ఫతేపూర్ సిక్రీలో 1583లో జరిగిన ఒక సంఘటన అక్బర్-బీర్బల్ ఎంత సన్నిహితులో నిరూపించింది.

”ఓ పొలంలో అక్బర్, ఆయన సభికులు కలిసి ఏనుగుపోరాటాన్ని చూస్తున్నారు. ఆ సమయంలో అక్బర్ గుర్రంపై ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఏనుగు బీర్బల్‌పైకి దూసుకొచ్చింది. దీన్ని చూసి అక్బర్ తన గుర్రాన్ని బీర్బల్‌కు, ఏనుగుకు మధ్యకు పోనిచ్చాడు. దాంతోపాటు ఆగు అంటూ ఆయన తన రాచస్వరంతో హెచ్చరించినట్టుగా కేక వేయడంతో ఆ ఏనుగు అక్కడే ఆగిపోయింది” అని అమితా సరిన్ తన ‘అక్బర్ అండ్ బీర్బల్, టేల్స్ ఆఫ్ విట్ అండ్ విజ్డమ్’ పుస్తకంలో రాశారు.

‘‘మరో సందర్భంలో బీర్బల్ గుర్రం నుంచి పడిపోయి స్పృహ కోల్పోతే అక్బర్ తన నోటి ద్వారా శ్వాస అందించారు’’ అని పార్వతి శర్మ తన “అక్బర్ ఆఫ్ హిందూస్థాన్‌” పుస్తకంలో రాశారు.

అక్బర్

ఫొటో సోర్స్, Victoria & Albert Museum

బీర్బల్ మరణం

స్వాత్, బజౌర్ ప్రాంతంలో పష్తూన్ యూసుఫ్‌జాయ్ ప్రజల తిరుగుబాటును అణిచివేయడానికి 1586లో అక్బర్ జైన్ ఖాన్ కోకా, బీర్బల్‌లను పంపారు.

అబుల్ ఫజల్ కూడా ఈ పోరాటానికి నాయకత్వం వహించాలనుకున్నారు. అక్బర్ లాటరీ పద్ధతిలో బీర్బల్‌ను ఎంచుకున్నారు. కానీ ఫిబ్రవరి 16, 1586న మొఘల్ సైన్యం ఓడిపోయింది. బీర్బల్‌తో సహా 8 వేల మంది సైనికులు మరణించారు.

“అఫ్గాన్లు మలంద్రాయీ కనుమ పైకిఎక్కి మొఘలులపై దాడి చేశారు. మొఘల్ సైనికుల పరిస్థితి గిన్నెలో చేపలా మారింది. బాణాలు, రాళ్లతో వారిపై అఫ్గాన్లు దాడి చేశారు” అని బదాయుని రాశారు.

బీర్బల్, అక్బర్, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Rekhta Books

బీర్బల్ మరణంపై అక్బర్ విచారం

“ఈ వార్త తెలిసిన తర్వాత అక్బర్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తరువాతి రెండు పగళ్లు, రాత్రులు ఆయన ఏం తినలేదు. పచ్చి మంచినీళ్లయినా ముట్టలేదు. తురాన్ నుండి వచ్చిన దూతను కలవడానికి నిరాకరించారు. ప్రజలకు కనిపించడానికి ఝరోఖే కిటికీ దగ్గరకు కూడా రాలేదు” అని ఇరా ముక్తోయ్ రాశారు.

‘‘అక్బర్ అన్నింటిపైనా ఆసక్తిని కోల్పోయారు. ఆయన తల్లి హమీదా బానో, ఆయన సహచరుల విజ్ఞప్తుల తర్వాత ఆయన మళ్ళీ సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించారు. ఈ ఆకస్మిక విపత్తు తన హృదయాన్ని కదిలించిందని ఆయన స్వయంగా నాతో అన్నారు’’ అని అబుల్ ఫజల్ ‘అక్బర్‌నామా’లో రాశారు.

“బీర్బల్ మరణానికి బాధపడినంతగా మరే మంత్రి మరణానికీ అక్బర్ బాధపడలేదు. తన జనరల్స్ జైన్ ఖాన్, అబుల్ ఫజల్‌పై అక్బర్ చాలా కోపంగా ఉన్నారు. వారి ముఖాలు తనకు చూపించొద్దని ఆదేశించారు. బీర్బల్ మృతదేహాన్ని కూడా తన వద్దకు తీసుకురాలేక పోయారని, ఆయనకు సరైన అంత్యక్రియలు నిర్వహించలేకపోయామని కూడా అక్బర్ బాధపడ్డారు” అని అక్బర్ మానసిక స్థితిని వివరిస్తూ బదాయునీ కూడా రాశారు.

అక్బర్ చాలా కోపంగా ఉన్నారు. బీర్బల్ మృతదేహాన్ని తీసుకురావడానికి తాను స్వయంగా కాబూల్‌ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆయన స్నేహితుడి శరీరాన్ని శుద్ధి చేయడానికి సూర్యకాంతి సరిపోతుందని రాజదర్బార్‌లోనివారు ఆయనకు సర్దిచెప్పారు.

బీర్బల్ మరణించిన కొన్ని వారాల్లోనే తోడర్‌మల్ నాయకత్వంలో స్వాత్, బజౌర్‌లపై అక్బర్ దాడి చేయించారు. ఈసారి మొఘల్ సైన్యం విజయంతో తిరిగి వచ్చింది.

“ఆయన అందరికంటే గొప్పవాడు. మన సన్నిహితులలో అత్యుత్తముడు, ఎవరికీ సాటిలేనివాడు” అని బీర్బల్‌కు నివాళులర్పించారు అక్బర్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)