Home జాతీయ national telgu వైజాగ్: ప్రపంచ దేశాల నౌకాదళ శక్తి ప్రదర్శన, ఇక్కడ ఏం జరగనుంది?

వైజాగ్: ప్రపంచ దేశాల నౌకాదళ శక్తి ప్రదర్శన, ఇక్కడ ఏం జరగనుంది?

11
0

SOURCE :- BBC NEWS

ఐఎఫ్ఆర్, ఇండియన్ నేవీ, విశాఖపట్నం

ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకే వేదికపై చేరే భారీ అంతర్జాతీయ ఈవెంట్ ఇప్పుడు విశాఖ తీరంలో జరుగుతోంది.

“ఏ ఒక్క దేశం ఒంటరిగా సముద్రాన్ని రక్షించలేదు. మానవాళి మనుగడ కోసం దేశాలు కలిసి పనిచేయాల్సిందే” అన్నదే విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ లక్ష్యం.

ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూకు పూర్తిస్థాయిలో రిహార్సల్స్‌ జరిగాయి. ఫిబ్రవరి 18న ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. మన దేశంలో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు విశాఖపట్నం రెండోసారి వేదికైంది.

ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హాజరవుతారు. భారత్‌తో పాటు వివిధ దేశాల నౌకదళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.

ఐఎఫ్ఆర్ ప్రధాన వేడుకలు మూడు రోజులే అయినప్పటికీ మొత్తంగా పది రోజులు అంటే ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 25 వరకు సందడి ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఐఎఫ్ఆర్, ఇండియన్ నేవీ, విశాఖపట్నం

ఐఎఫ్ఆర్ అంటే

ఈ కార్యక్రమంలో సుమారు 71 దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటున్నాయి. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధనౌకలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.

ఈసారి ఉత్సవాలు కేవలం ఐఎఫ్ఆర్‌కే పరిమితం కాకుండా మూడు ప్రధాన కార్యక్రమాల సమాహారంగా నిర్వహిస్తున్నారు.

స్నేహపూర్వక దేశాల నేవీలు కలిసి నౌకలు, విమానాలు, సైనిక బలాన్ని ప్రదర్శిస్తాయి. నౌకాదళ సహకారం, భద్రత, సముద్ర వ్యూహాలపై ఇందులో పాల్గొంటున్న దేశాల మధ్య చర్చలు జరుగుతాయి.

ఈ కార్యక్రమానికి ఒక్కోసారి ఒక్కో దేశం ఆతిథ్యమిస్తుంది. భారత్‌లో ఇవి 3సార్లు జరగ్గా 2001లో ముంబయి, 2016, 2017లో వైజాగ్ వేదికైంది.

భారత్‌తో పాటు ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల నౌకలు వరుసగా సముద్రంలో వెళుతుండగా ఆ నౌకల్లోని సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. ఇదే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే.

భారత్‌లో తొలి ఐఎఫ్ఆర్‌ను 2001లో ముంబైలో నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ సమీక్షించారు.

రెండోసారి 2016లో విశాఖపట్నంలో నిర్వహించగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.

ఈసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గౌరవ వందనం స్వీకరించనున్నారు.

ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకచోట చేరి తమ సామర్థ్యం, సాంకేతికత, సముద్ర రక్షణలో సత్తాను ప్రదర్శించే అతి పెద్ద నౌకాదళ ఈవెంట్ ఇది.

త్రివిధదళాల అధిపతైన రాష్ట్రపతి ముందు ఇండియన్‌ మిలటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తాయి.

ఐఎఫ్ఆర్, ఇండియన్ నేవీ, విశాఖపట్నం

సిటీ పరేడ్ ప్రత్యేకం..

ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఫిబ్రవరి 19న ఆర్‌కే బీచ్‌లో నిర్వహించే ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ ఫ్లీట్ రివ్యూలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

వివిధ దేశాల నౌకాదళాలు తమ యూనిఫామ్‌లో పరేడ్ చేస్తాయి. ఆర్కే బీచ్‌లో జరిగే ఈ పరేడ్‌ను అందరూ చూడవచ్చు.

ఈ కార్యక్రమాల ద్వారా భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, వివిధ దేశాల యుద్ధనౌకలు, జలాంతర్గాములను దగ్గర నుంచి చూసే అరుదైన అవకాశం ప్రజలకు లభించనుంది.

ఐఎఫ్ఆర్, ఇండియన్ నేవీ, విశాఖపట్నం

మిలాన్, అయాన్స్ అంటే..

ఐఎఫ్ఆర్‌తో పాటు మిలాన్ (మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజేస్), అయాన్స్ (ఇండియన్ ఓషన్ నేవల్ సింపోసిజం) కూడా ఇప్పుడే జరుగుతున్నాయి.

ఇందులో ‌ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ‘మిలాన్’ అంటే మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్‌సైజెస్, అలాగే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కార్యక్రమాలు కూడా విశాఖలోనే జరగనున్నాయి.

దీంతో హిందూ మహాసముద్ర తీర దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రదేశాలతో సముద్ర భద్రత, పరస్పర సహకారం లాంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

‘మిలాన్’ పేరుతో ప్రత్యేక గ్రామాన్ని ప్రారంభించారు. ఈ గ్రామంలో భారత్‌లోని రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. విదేశీ అతిథులకు ఇది ‘మినీ ఇండియా’గా కనిపిస్తోంది.

ఇండియన్ ఓషన్ నేవల్ సింపోసిజియం అంటే ఇవి నౌకదళ విన్యాసాలు కాదు.

ఇది ఒక మీటింగ్ ఫోరం, ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్న దేశాల నేవీలు కలిసి చర్చలు జరుపుతాయి.

సముద్ర భద్రత, శత్రు దేశాలతో వచ్చే సమస్యలు, నేచురల్ డిజాస్టర్ రెస్క్యూ, సమాచార మార్పిడి వంటివి ఇక్కడ చర్చిస్తారు.

ఈ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ నిర్వహిస్తోంది.

ఐఎఫ్ఆర్, ఇండియన్ నేవీ, విశాఖపట్నం

ఐఎఫ్ఆర్ కి ఎందుకింత ప్రాముఖ్యత?

భారత్‌కు మూడు వైపులా విస్తృత సముద్ర తీరం ఉండటంతో ఐఎఫ్ఆర్ ఈవెంట్ వ్యూహాత్మకంగా కీలకమైనది.

ఐఎఫ్ఆర్ ఈవెంట్ ద్వారా ఇండియా తన సముద్ర శక్తిని ప్రపంచానికి చూపిస్తోంది.

“ఐఎఫ్ఆర్ ఒక దేశం తన నౌకాదళ శక్తిని ప్రపంచానికి చూపించే వేదిక మాత్రమే కాదు, సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరిచే కీలక కార్యక్రమం. ఇందులో అనేక దేశాల నౌకలు పాల్గొనడం ద్వారా దేశాల మధ్య విశ్వాసం పెరుగుతుంది. సముద్రంలో సంయుక్తంగా పని చేసే సామర్థ్యం మెరుగవుతుంది. ఇది రక్షణ శక్తి ప్రదర్శనతో పాటు డిప్లొమసీకి కూడా ఉపయోగపడుతుంది” అని తూర్పునౌకాదళం అధికారులు చెప్పారు.

“ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సహకారం, సముద్ర మార్గాల రక్షణ వంటి అంశాల్లో దేశం కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రపంచానికి తెలియజేస్తుంది” అని తూర్పు నౌకాదళం రిటైర్డ్ అధికారి పి. రాజు బీబీసీతో చెప్పారు.

ఐఎఫ్ఆర్, ఇండియన్ నేవీ, విశాఖపట్నం

విశాఖకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఐఎఫ్ఆర్ లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో రాష్ట్రపతి ఈ విన్యాసాలను సమీక్షిస్తారు.

రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుతో ఐఎఫ్ఆర్-2026 కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

దేశాల మధ్య సముద్రయాన శక్తిని, సహకారాన్ని, స్నేహాన్ని ప్రదర్శించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని భారత నౌకాదళం వివరించింది.

ఈసారి ఐఎఫ్ఆర్‌లో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఐఎఫ్ఆర్, ఇండియన్ నేవీ, విశాఖపట్నం

ఫ్లీట్ రివ్యూ రిహార్సల్…

ఐఎఫ్‌ఆర్‌-2026లో భాగంగా బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొనే ఫ్లీట్ రివ్యూ జరగనుంది. ఇందుకు సంబంధించిన రిహార్సల్ బంగాళాఖాతంలో మంగళవారం జరిగాయి.

తీరంలో త్రివిధ దళాలు విన్యాసాలు చేశాయి. యుద్ధ ట్యాంకర్లు, మిగ్‌-29, హాక్‌ ఫైటర్‌ జెట్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమం ద్వారా భారత యుద్ధ నౌకలు, నేవీ సామర్థ్యంతో పాటుగా వివిధ దేశాల నౌకలను దగ్గరి నుంచి చూసే అవకాశం ప్రజలకు కలిగింది.

ఫిబ్రవరి 18న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ ముగిసిన తరువాత 19న రామకృష్టా బీచ్‌లో వైమానిక దళం ప్రదర్శించనున్న సాహస విన్యాసాలను ప్రాక్టీస్‌ చేశారు.

ఆహూతుల ముందు నుంచి జాతీయ పతాకం, నౌకాదళం పతాకం రెపరెపలాడిస్తూ సాగిపోయే హెలికాప్టర్లు, ఒకదాని తరువాత ఒకటిగా దూసుకొచ్చే యుద్ధ విమానాల విన్యాసాలు రెప్ప వేయనివ్వలేదు.

మిగ్‌-29కే యుద్ధ విమానాలు, నిఘా విమానం పీ8ఐ, సీ కింగ్‌, కమోవ్‌ హెలీకాప్టర్లు విభాగాల వారీగా వచ్చి కనువిందు చేశాయి,

సముద్రంలో చేతక్‌ హెలికాప్టర్ల రెస్క్యూ ఆపరేషన్‌, తీరంపై శత్రుమూకల దాడి వంటి అంశాలన్నీ కళ్ల ముందు యుద్ధం జరుగుతున్నట్టుగా ప్రదర్శించారు.

రిహార్సల్స్‌లో భాగంగా నిర్వహించిన ఈ విన్యాసాలకు సంబంధించిన అధికారిక విన్యాసాలు ఫిబ్రవరి 18, 19న పూర్తిస్థాయిలో జరుగుతాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)