Home జాతీయ national telgu ‘కెప్టెన్ సల్మాన్ చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది’-పాక్ మాజీ క్రికెటర్లు

‘కెప్టెన్ సల్మాన్ చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది’-పాక్ మాజీ క్రికెటర్లు

7
0

SOURCE :- BBC NEWS

భారత్- పాక్ మ్యాచ్, టీ ట్వంటీ వరల్డ్ కప్, పాకిస్తాన్ టీమ్, ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, AFP via Getty Images

2 గంటలు క్రితం

చదివే సమయం: 7 నిమిషాలు

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో భారత్‌పై పాక్ ఓటమికి సల్మాన్ అఘా తీసుకున్న నిర్ణయాలే కారణమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అంటున్నారు.

ఆదివారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్ మీద 61 పరుగుల తేడాతో నెగ్గింది.

ఈ విజయంతో భారత జట్టు గ్రూప్ ‘ఏ’ నుంచి సూపర్ 8 దశకు చేరుకుంది.

176 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ జట్టు ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. కనీసం 20 ఓవర్లు ఆడలేకపోయింది. 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది.

పాక్ సీనియర్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, బాసిత్ అలీ, రమీజ్‌రాజా భారత్‌జట్టును ప్రశంసించారు. పాకిస్తాన్ ఓటమిని మరో ‘సిగ్గు చేటు ఓటమి’గా అభివర్ణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తీసుకున్న నిర్ణయాలపై వారు సందేహాలు లేవనెత్తారు పాక్ మాజీ క్రికెటర్లు.

మ్యాచ్‌లో కీలకమైన టాస్ గెలిచినప్పటికీ దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమైందని అన్నారు.

భారత బ్యాట్స్‌మెన్లపై స్పిన్ బౌలర్లను ఉపయోగించడంలో కెప్టెన్ విఫలమయ్యాడని పాక్ సీనియర్లు విమర్శిస్తున్నారు.

భారత్- పాక్ మ్యాచ్, టీ ట్వంటీ వరల్డ్ కప్, పాకిస్తాన్ టీమ్, ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, AFP via Getty Images

కెప్టెన్ నిర్ణయాలపై అఫ్రిది ఆగ్రహం

‘‘భారత బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ని పరిశీలిస్తే, వారు విజయానికి అర్హులుగా కనిపిస్తారు. తప్పులు జరుగుతాయి. కానీ మేము తప్పులు చేశాము” అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అన్నారు.

కెప్టెన్ సల్మాన్ అఘా నిర్ణయాలపై అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

“మొదటి ఓవర్ తప్ప, కెప్టెన్ నిర్ణయాలేవీ నాకు అర్థం కాలేదు. పాక్ ట్రంప్ కార్డ్ బౌలర్ ఉస్మాన్ తారిక్‌కు 10 ఓవర్ల వరకు బంతిని ఇవ్వలేదు. మొదట్లో కాన్ఫిడెన్స్ లేనట్లు కనిపించిన షహీన్‌షాతో చివరి ఓవర్ వేయించారు” అని అఫ్రిది పాక్ టీవీ చానల్‌తో చర్చలో చెప్పారు.

“పాక్ టాప్ ఆర్డర్ ఎంత బలహీంగా ఉందో భారత బౌలింగ్ బయట పెట్టింది. బంతి స్వల్పంగా బౌన్స్, స్వింగ్ అయ్యే చోట మన బ్యాట్స్‌మెన్ టెక్నిక్, ఇతర సామర్థ్యాలన్నీ వృథా అయ్యాయి” అని అఫ్రిది విశ్లేషించారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏడుగురు బౌలర్లను ఉపయోగించింది. దీనిపైనా ఆఫ్రిది ప్రశ్నలు సంధించారు.

“ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ‘ఎనిమిదిన్నర మంది బౌలర్లతో’ బరిలోకి దిగింది. ఐదుగురు బౌలర్లు, ఒక ఆల్‌ రౌండర్‌తో మ్యాచ్ ఆడితే బావుండేది కాదా?” అని ఆయన ప్రశ్నించారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆరుగురు స్పిన్నర్లను రంగంలోకి దించింది. షహీన్‌షా అఫ్రిది రెండు ఓవర్లే బౌలింగ్ చేశాడు. టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో స్పిన్నర్లు 18 ఓవర్లు వేయడం రికార్డే.

ఫఖర్ జమాన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపైనా షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మీరు ఒక సీనియర్ ఆటగాడిని టూర్‌కు తీసుకెళ్లి, అతడిని ఆడించకపోతే ఉపయోగం ఏంటి? ఇవే మనం చేసిన కొన్ని తప్పులు” అని అఫ్రిది అన్నారు.

బాబర్ అజామ్ ఔటైన తీరుపైనా అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు.

“గెలుపు ఓటములు సహజం. కానీ పాకిస్తాన్ ఓటమికి అర్థం పర్థం లేదు. సీనియర్ ఆటగాళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సింది” అని అఫ్రిది అన్నారు.

భారత్- పాక్ మ్యాచ్, టీ ట్వంటీ వరల్డ్ కప్, పాకిస్తాన్ టీమ్, ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, Getty Images

‘ఓడిపోవడం కంటే వాన పడితే బాగుండేది’

పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా నిర్ణయాలపై బాసిత్ అలీ చాలా ఆగ్రహంగా కనిపించారు.

భారత్-పాక్ మ్యాచ్‌పై యూట్యూబ్ చానెల్ ‘గేమ్ ప్లాన్‌’తో ఆయన మాట్లాడారు.

“ఈ పిచ్ మీద జరిగిన మొదటి మూడు మ్యాచ్‌లలో ముందు బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. అయితే పాకిస్తాన్ టాస్ గెలిచిన తర్వాత కూడా బౌలింగ్ తీసుకుంది. తమ స్పిన్ బౌలర్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమర్థించుకుంది. అది కూడా అభిషేక్ శర్మ లాంటి ఆటగాడు మొదటి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ బంతికి ఔటైన తర్వాత ఇలాంటి సమర్థనలకు అర్థముంటుందా” అని బాసిత్ అలీ ప్రశ్నించారు.

“తారిక్ ఉస్మాన్ అంటే భయం ఉండేది. అతన్ని నిద్ర పుచ్చి, తర్వాత బౌలింగ్ చేయించారు. ముందుగా బ్యాటింగ్ చేయాలో, బౌలింగ్ చేయాలో తెలియని వ్యక్తి పాకిస్తాన్ ప్రధాన కోచ్ అయ్యారు” అని బాసిత్ ఆలీ అన్నారు.

“ఓడిపోయే బదులు వర్షం పడి ఉంటే బావుండేది. కనీసం ఒక పాయింట్ అయినా వచ్చేది. ఇప్పుడు నమీబియాతో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది” అని బాసిత్ అలీ అన్నారు.

“అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్, బ్యాటింగ్ ఆర్డర్‌లో నాల్గో స్థానంలో వస్తున్నాడు” అంటూ బాబర్ అజామ్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి బాసిత్ అలీ అభిప్రాయపడ్డారు.

ఇషాన్ కిషన్ ‘టాప్ క్లాస్’ బ్యాటింగ్ చేశాడని పాక్ సీనియర్లు కితాబిచ్చారు.

“ఇషాన్ కిషన్ నిర్భయంగా, దూకుడుగా అర్థ సెంచరీ చేయడం రెండు జట్ల మధ్య తేడా ఏంటో నిరూపించింది” అని పాకిస్తాన్ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ చెప్పారు.

“అతనికి భయం లేదని అనుకుంటున్నాను. ఇషాన్ గ్రౌండ్‌లో అన్ని వైపులా షాట్లు కొట్టగల సమర్థుడు. అతను కేవలం లెగ్‌సైడ్‌కే పరిమితమైన ఆటగాడు కాదు. ఆవైపు అతను చాలా బలంగా ఉన్నాడని మాకు తెలుసు. అయితే అతను రివర్స్ షాట్ కూడా ఆడగలడు. ముఖ్యంగా పవర్‌ ప్లేలో స్పిన్ బౌలర్లపై విరుచుకు పడకుండా అతన్ని ఆపడం అతి పెద్ద సవాలు” అని మ్యాచ్ అనంతరం విలేఖరుల సమావేశంలో హెస్సన్ అన్నారు.

భారత్- పాక్ మ్యాచ్, టీ ట్వంటీ వరల్డ్ కప్, పాకిస్తాన్ టీమ్, ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, AFP via Getty Images

టాస్‌పై ప్రశ్నలు

టాస్ గెలిచిన తర్వాత ముందు ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా నిర్ణయాన్ని క్రికెట్ విశ్లేషకుడు సామి ఛౌదురి విమర్శించారు.

‘‘పరిస్థితుల్ని బట్టి టాస్ గెలిచిన వ్యక్తి ఏ నిర్ణయం తీసుకుంటాడా అని ఆందరూ చూస్తున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఏం మంత్రం వేశాడో కానీ భారత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది” అని ఆయన అన్నారు.

శ్రీలంకలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాత బంతితో పరుగులు సాధించడం కష్టం. అలాంటిది రెండో ఇన్నింగ్స్‌లో పాత బంతితో పెద్ద లక్ష్యాన్ని ఎవరు ఛేదించగలరని ఆయన ప్రశ్నించారు.

ఈ పిచ్ ‌మీద ఇంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో లక్ష్య ఛేదన చాలా కష్టమని నిరూపితమైందని ఆయన తెలిపారు.

పాకిస్తాన్ తన స్పిన్ స్క్వాడ్ విషయంలో నమ్మకంగా ఉన్నప్పటికీ, భారత జట్టులోనూ అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేశారు.

ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు భారత స్పిన్ ‌బౌలింగ్‌ను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించవచ్చని అనుకోవడం తెలివితక్కువతనంతప్ప మరొకటి కాదని ఛౌదురి విశ్లేషించారు.

“టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ కు మంచి అవకాశం వచ్చింది. వారు ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే సులభంగా 160 నుంచి 170 పరుగులు చేయగలిగేవారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ద్వారా మీరు మంచి అవకాశం కోల్పోయారు. ఉస్మాన్ తారిక్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చాడు. అది కూడా భారత్ లాంటి జట్టు మీద. అతనికి అన్యాయం జరిగింది” అని ది గేమ్ ప్లాన్ చర్చలో కమ్రాన్ అక్మల్ చెప్పారు.

“పాక్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని ఎందుకు నిర్ణయించుకుందో నాకు తెలియదు. పాకిస్తాన్ జట్టు వద్ద ఎలాంటి వ్యూహం ఉన్నట్లు అనిపించలేదు. మొదటి ఓవర్ మాత్రమే ఆ జట్టుకు సానుకూలంగా ఉంది” అని కమ్రాన్ అక్మల్ అన్నారు.

పాక్ జట్టు వద్ద ఎలాంటి ప్రణాళిక, వ్యూహం లేదని, ఆ జట్టు ‘మరో అవమానకరమైన ఓటమి’ని చవి చూసిందని పాక్ సీనియర్ క్రికెటర్ రమీజ్ రాజా అన్నారు.

“పాకిస్తాన్ బ్యాటింగ్ డిజాస్టర్. భారత జట్టు మూడేళ్లుగా ఒకే రకమైన బౌలింగ్ దాడి చేస్తోంది. బూమ్రా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్లను ఎలా ఆడాలో పాక్ జట్టు నేర్చుకోలేదు” అని ఆయన అన్నారు.

“బుమ్రా భారతజట్టు వద్ద ఉన్న ప్రమాదకరమైన ఆయుధం, అతను వికెట్లు తీస్తాడు. అతను మ్యాచ్ విన్నర్. మీరు అతనికి కొంత గౌరవం ఇవ్వాలి” అని రమీజ్ రాజా సూచించారు.

పాక్‌క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ ఈ మ్యాచ్ గురించి ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. అందులో షాహీన్, బాబర్, షాదాబ్‌పై విమర్శలు గుప్పించారు.

“షహీన్, బాబర్, షాదాబ్‌కు సమయం మించిపోతున్నట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్ టీ ట్వంటీ జట్టుకు బలహీనమైన ప్రత్యర్థులపై గాలివాటుగా వచ్చే విజయాలు సాధించే బదులు సత్తా ఉన్న కొత్త ఆటగాళ్లు అవసరం” మొహమ్మద్ యూసుఫ్ తన సందేశంలో రాశారు.

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సాహిబ్ మక్సూద్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు

“పాకిస్తాన్ క్రికెట్‌కు అసలు సమస్య గట్టి ప్రత్యర్థుల్ని ఎదుర్కోకపోవడం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్లు పాక్‌లో ఆడేందుకు వచ్చినప్పుడు ఏడెనిమిది మంది కీలక ఆటగాళ్లు లేకుండానే వచ్చాయి. అలాంటి జట్ల మీద సిరీస్‌లు గెలిచి మా జట్టు బాగానే ఉందనుకున్నాం. అయితే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో అన్ని జట్లు తమ బలగాలతో అడుగు పెడతాయి. ఇక్కడ జట్ల బలహీనతలు బయటపడతాయి. సల్మాన్ అఘా కెప్టెన్సీ అలాగే బయటపడింది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో అతను విఫలం అయ్యాడు” అని సాహిబ్ మక్సూద్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

భారత్- పాక్ మ్యాచ్, టీ ట్వంటీ వరల్డ్ కప్, పాకిస్తాన్ టీమ్, ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గంగూలీ ఏమన్నారు?

భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఇకపై పెద్ద మ్యాచ్ కాదన్నారు సౌరబ్ గంగూలీ.

“ఇప్పుడు పెద్ద మ్యాచ్ అనేదే లేదు, గతంలో పెద్ద మ్యాచ్‌లు జరిగేవి. ప్రస్తుత పాక్ జట్టును జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, షాహిద్ తన్వీర్‌ల జట్టుగా భావించి మనం పొరపాటు పడుతున్నాం. కానీ అది ఇప్పుడు పాకిస్తాన్ కాదు” అని సౌరవ్ గంగూలీ ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థతో అన్నారు.

“నా అభిప్రాయం ప్రకారం ఇది పెద్ద మ్యాచ్ కాదు. నిజమైన పెద్ద మ్యాచ్‌లు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా, ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, భారత్, పాక్ జట్ల మధ్య చాలా తేడా ఉంది. ఫలితం ఏంటో ముందే ఊహించవచ్చు. రెండు జట్ల ఆట తీరులో తేడా ఏంటో మ్యాచ్ ఫలితం చెబుతోంది” అని గంగూలీ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)