Home జాతీయ national telgu భారత్, పాకిస్తాన్ మ్యాచ్: కెప్టెన్లు ఇద్దరూ షేక్‌ హ్యాండ్ గురించి ఏం చెప్పారు?

భారత్, పాకిస్తాన్ మ్యాచ్: కెప్టెన్లు ఇద్దరూ షేక్‌ హ్యాండ్ గురించి ఏం చెప్పారు?

6
0

SOURCE :- BBC NEWS

భారత్-పాకిస్తాన్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

3 గంటలు క్రితం

చదివే సమయం: 6 నిమిషాలు

టీ20 ప్రపంచ కప్‌లో కొలంబోలో జరగనున్న మ్యాచ్‌కు ముందు, భారత్, పాకిస్తాన్ కెప్టెన్లు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్‌ వేసే సమయంలో కెప్టెన్ల షేక్ హ్యాండ్, అభిషేక్ శర్మకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాను కూడా విలేకరులు ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్, కెప్టెన్ల కరచాలనం గురించి ప్రశ్నలు అడిగారు.

సూర్యకుమార్ యాదవ్ కరచాలనంపై మాట్లాడుతూ, “టాస్ వేసే సమయానికి చూద్దురుకానీ, ఇంకా 24గంటల టైముంది కదా’’ అన్నాడు.

భారత ఆటగాళ్లతో కరచాలనం చేసే ప్రశ్నకు సల్మాన్ ఆఘా కూడా “దాని గురించి రేపు చూద్దాం” అన్నారు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బరిలోకి దిగుతాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బంగ్లాదేశీ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ టీమ్ కేకేఆర్ నుంచి తొలగించిన తర్వాత..టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వచ్చేందుకు బంగ్లాదేశ్ జట్టును పంపమని బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.

తదుపరి ఐసీసీ ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించి, స్కాట్లాండ్‌ను చేర్చింది

బంగ్లాదేశ్‌ను తొలగించడానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన పాకిస్తాన్ జట్టు.. భారత్‌తో మ్యాచ్‌లను ఆడేందుకు నిరాకరించింది.

అయితే, ఐసీసీ, పీసీబీ మధ్య సమావేశం జరిగిన తర్వాత.. పాకిస్తాన్ జట్టు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించింది.

ఉస్మాన్ తారిక్ గురించి పాకిస్తాన్ కెప్టెన్ ఏం చెప్పాడు?

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై అడగగా.. తారిక్ తమ ట్రంప్ కార్డు (తురుపు ముక్క) అని సల్మాన్ అఘా చెప్పాడు.

”ఉస్మాన్ తారిక్ మా ట్రంప్ కార్డు. అతని బౌలింగ్ యాక్షన్ గురించి చర్చించుకుంటున్నారు. కానీ, మేం అసలు పట్టించుకోం. ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్‌ను (నిబంధనలకు లోబడే ఉందని) ఇప్పటికే రెండుసార్లు క్లియర్ చేశారు. ఎందుకు పదేపదే దాని గురించి మాట్లాడుకుంటున్నారో నాకర్థం కావడం లేదు” అని సల్మాన్ అఘా అన్నాడు.

”ప్రారంభం నుంచి ఏ స్ఫూర్తితో అయితే ఆడుతున్నామో అదే స్ఫూర్తితో ఈ గేమ్ కూడా ఆడతామని ఆశిస్తున్నాను” అని తెలిపాడు.

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా

ఫొటో సోర్స్, Joe Allison/Getty Images

భారత ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ గురించి ప్రశ్నించగా.. ”రేపు ఉదయం దాని గురించి చూద్దాం” అని సల్మాన్ అఘా అన్నాడు.

”ప్రపంచ కప్‌లో భారత్‌తో మాకు మంచి రికార్డు లేదు. కానీ, చరిత్రను మేం మార్చలేం” అని తెలిపాడు.

ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్‌ జరగడానికి ముందు.. తమ స్టార్ బ్యాట్స్‌మాన్ బాబర్ అజామ్‌ ఫామ్‌పై జట్టులో ఎలాంటి ఆందోళనలు లేవని అఘా స్పష్టం చేశాడు.

”బాబర్ అజామ్ గురించి మాకెలాంటి ఆందోళన లేదు. అతను పరుగులు చేస్తాడు. రేపు కూడా అతను పరుగులు చేస్తాడని ఆశిస్తున్నాం. జట్టుకు సాయపడతాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మేం ఎక్కువగా మార్పులు చేయాలనుకోలేదు” అని తెలిపాడు.

భారత్ బ్యాట్స్‌మాన్ అభిషేక్ శర్మ

ఫొటో సోర్స్, Asanka Ratnayake/Getty Images

అభిషేక్ శర్మ గురించి ఏం చెప్పాడు?

భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక శర్మ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడతాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు.

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా కూడా దీనిపై మాట్లాడాడు. ‘‘అతను గొప్ప ఆటగాడు. అతను ఫిట్‌గా ఉండి, మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ జట్టు కోరుకుంటుంది. గొప్ప జట్టుతో మైదానంలో తలపడాలని పాకిస్తాన్ కోరుకుంటుంది’’ అని సల్మాన్ అఘా తెలిపాడు.

”అభిషేక్ శర్మ రేపు ఆడతాడని ఆశిస్తున్నా” అని అఘా చెప్పాడు.

భారత స్టార్ బ్యాట్స్‌మాన్ అభిషేక్ శర్మ ఫిట్‌నెస్ గురించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కడుపులో ఇన్‌ఫెక్షన్ కారణంగా అభిషేక్ శర్మ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీనివల్ల నమీబియాతో జరిగిన గత మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు.

పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్

ఫొటో సోర్స్, Getty Images

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై చర్చ ఏంటి?

పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తర్వాత, అతని బౌలింగ్ యాక్షన్ గురించి సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది.

కొందరు నెటిజన్లు ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌ యాక్షన్‌ను ప్రశ్నిస్తే.. మరికొందరు బాల్ వేసేముందు ఇస్తున్న ‘బ్రేక్’ ఐసీసీ నిబంధనల ప్రకారం సమ్మతమేనా? అనే సందేహాలు లేవనెత్తారు.

ఉస్మాన్ బంతికి అమెరికన్ బ్యాట్స్‌మెన్ అవుట్ అయిన వీడియోను శ్రీవత్స్ గోస్వామి అనే నెటిజన్ తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు.

ఆ బాల్ వేసేముందు ఉస్మాన్ ఒక క్షణం ఆగినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

“ఫుట్‌బాల్‌లో కూడా, పెనాల్టీ రన్‌అప్ సమయంలో ఆటగాళ్లు ఒకక్షణం పాజ్‌కు(ఆగేందుకు) అనుమతి లేదు. మరి ఇదెలా ఆమోదయోగ్యం? బౌలింగ్ యాక్షన్ ఫర్వాలేదు, కానీ ఈ పాజ్ ఇవ్వడం ఏంటి? అది కూడా బాల్ వేసేముందు. ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు” అని శ్రీవత్స్ గోస్వామి ఆ పోస్టులో రాశారు.

గోస్వామి పోస్టును కోట్ చేస్తూ భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ “అవును, ఫుట్‌బాల్‌లో ఇలాంటివి అనుమతించరు, అది నిజమే. కానీ, ఒక బ్యాట్స్‌మెన్ అంపైర్‌కు చెప్పకుండానే ఒకవైపు బంతిని మరోవైపు, రివర్స్ ఆడుతున్నప్పుడు.. రూల్స్ మాత్రం బౌలర్లకే ఎందుకు? అంపైర్‌కు చెప్పకుండా బౌలర్లు మరో చేత్తో బౌలింగ్ చేయడానికి కూడా అనుమతి లేదు. ముందు ఈ రూల్ మార్చాలి”.. అని రాశాడు.

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఒక వీడియోలో, ఉస్మాన్ తారిక్ యాక్షన్‌ను ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ స్పిన్ బౌలింగ్‌‌కు అదొక బలంగా అభివర్ణించాడు.

“ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ ఆసక్తికరంగా ఉంది. టీవీ చూస్తున్నప్పుడు, ఒక్క క్షణం ఫ్రీజ్ అయినట్లు అనిపిస్తుంది. అతను ఒక క్షణం అలా ఆగి, బౌలింగ్ చేస్తాడు. నెమ్మదిగా బౌలింగ్ చేస్తాడు. దానివల్ల ఎలాంటి సమస్యా ఉండదని అనుకుంటున్నా. ఫర్వాలేదు, ఒక క్షణం ఆగి బౌలింగ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఎలాంటి రూల్ లేదు. నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, మోచేతిని వంచడం లేదు” అని అన్నాడు.

అయితే, చేతిని వంచకుండా బంతి వేగాన్ని 20 నుంచి 25 కిలోమీటర్లు వేగంగా వేయడం సాధ్యమేనా? అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.

ఈ చర్చ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్‌లో మరో సుదీర్ఘమైన పోస్ట్ రాసేందుకు కారణమైంది. “మొదట, ఐసీసీ బౌలింగ్ టెస్టింగ్ సెంటర్‌లో బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారమే ఉందా లేదా అని మాత్రమే పరీక్షిస్తారు” అని ఆయన రాశాడు.

“రెండోది, 15 డిగ్రీల నిబంధన. దీని ప్రకారం, బౌలర్ మోచేతి యాక్షన్ సరిగ్గా ఉందా లేదా అని చూస్తారు. మైదానంలో బౌలింగ్ చేసేప్పుడు బౌలర్ 15 డిగ్రీల లోపే బౌలింగ్ చేస్తున్నాడా లేదా అని పరిశీలించడం అంపైర్‌కు అసాధ్యం.”

“రియల్ టైం కాంపిటీషన్ టెస్టింగ్ టూల్‌ను తీసుకురావడమే దీనికి ఏకైక పరిష్కారం. అసలు ఎలాంటి స్పష్టతా లేని ఈ విషయాన్ని ఎవరో తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించడం సరికాదు. క్రీజు లోపల బంతి పాజ్ చేయడం చట్టబద్ధమా? కాదా? అంటే.. అది అతని సహజసిద్ధమైన బౌలింగ్ యాక్షన్ కాబట్టి చట్టబద్ధమేనని నేను భావిస్తున్నా” అని అశ్విన్ రాశాడు.

అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఉస్మాన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి అశ్విన్ సూచనలు

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై ఎలాంటి అనుమానాలు ఉన్నా.. క్రీజులో నుంచి పక్కకు తప్పుకునే పూర్తి హక్కు బ్యాట్స్‌మెన్‌కు ఉంటుందని ఆర్‌. అశ్విన్ తన యూట్యూబ్ షోలో చెప్పాడు.

”బౌలింగ్‌కు ముందు ఉస్మాన్ ఆగితే, బ్యాట్స్‌మాన్ క్రీజు నుంచి తప్పుకుని, ‘అతను ఆగినట్లు నాకనిపిస్తుంది’ అని ఫిర్యాదు చేయచ్చు” అని చెప్పాడు.

”ఇది ఆసక్తికర కేసు కానుంది. అంపైర్‌ను క్లిష్ట పరిస్థితిలో పడేయనుంది. బౌలర్‌పై మానసిక ఒత్తిడిని కూడా పెంచనుంది’ అని తెలిపాడు.

”నేను బ్యాటింగ్ చేసేటప్పుడు, నిబంధనలను పాటించేవాడిని. బౌలర్ బంతిని వేసే సమయంలో నేను సిద్ధంగా లేనని చెప్పి, పక్కకు తప్పుకునేవాడిని” అన్నాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)