SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
6 గంటలు క్రితం
చదివే సమయం: 6 నిమిషాలు
అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై చర్చ తీవ్రమైంది.
అఫ్గానిస్తాన్ యుద్ధాలలో పాకిస్తాన్ పాత్ర గురించి ఇటీవల జాతీయ అసెంబ్లీలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు.
ఈ యుద్ధాల విషయంలో అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను ఉపయోగించుకుని, తర్వాత ‘టాయిలెట్ పేపర్’ లాగా వదిలేసిందని ఆయన ఆరోపించారు.
ఇస్లాం లేదా మతం పట్ల ప్రేమతో అఫ్గాన్ గడ్డపై జరిగిన రెండు యుద్ధాల్లో పాకిస్తాన్ పాల్గొనలేదని ఆయన అన్నారు.
ఇది జిహాద్ కాదని, ఇది అగ్రరాజ్యాల మధ్య జరిగిన యుద్ధం అని ఖవాజా ఆసిఫ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నారు?
రెండు అఫ్గాన్ యుద్ధాలలో పాకిస్తాన్ పాల్గొనడానికి కారణం మతపరమైనదన్న వాదనను ఆయన తిరస్కరించారు. ఇస్లాం కోసమో, జిహాద్‌లో భాగంగానో అఫ్గానిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ పాల్గొనలేదని, పాకిస్తాన్‌లోని ఇద్దరు సైనిక నియంతలు ( జనరల్ జియా-ఉల్-హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్) అమెరికాతో పొత్తు పెట్టుకున్నట్లు చూపించడానికి ఈ యుద్ధాలలో సహకరించారని ఆయన ఆరోపించారు.
“కాబూల్‌లోని ప్రభుత్వ ఆహ్వానం మేరకు సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌కు వచ్చింది. ఇది ఆక్రమణ కాదు. అమెరికా ప్రచారం మాత్రమే” అని 1979లో ప్రారంభమైన సోవియట్- అఫ్గాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నారు.
“అది జిహాద్ కాదు, రెండు అగ్రరాజ్యాల మధ్య జరిగిన యుద్ధం. దాని కోసం మా పాఠ్యాంశాలను కూడా మార్చాం. కానీ ఇప్పటికీ వాటిని 1960–70లలో జరిగిన అసలు వాస్తవాలకు తగ్గట్లుగా మార్చలేకపోయాం” అని ఆయన అన్నారు.
“అమెరికా తయారు చేసిన జిహాద్‌లో పోరాడాల్సి రావడంతో మా రాజకీయ, మతపరమైన విలువలు, సంప్రదాయాలు కూడా మారిపోయాయి. కానీ ఆ జిహాద్ నుంచి పాకిస్తాన్ ఎటువంటి పాఠం నేర్చుకోలేదు. ఆ తర్వాత, వారు మమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. అయినా కూడా పాకిస్తాన్‌కు బుద్ధి రాలేదు” అని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
అమెరికాతో సంబంధాల వల్ల నష్టం గురించి ఆసిఫ్ ఏమన్నారు?
1999 తర్వాత, ముఖ్యంగా సెప్టెంబర్ 11, 2001 దాడుల తర్వాత అమెరికాతో తిరిగి జత కట్టడం వల్ల పాకిస్తాన్‌కు ఎంత దారుణమైన నష్టం వాటిల్లిందో ఆసిఫ్ వివరించారు.
2001 తర్వాత, అమెరికా నాయకత్వంలో జరిగిన అఫ్గాన్ యుద్ధంలో పాకిస్తాన్ మళ్ళీ అమెరికాకు మద్దతు ఇచ్చిందని, ఇందుకోసం తాలిబన్లకు వ్యతిరేకంగా మారిందని ఆసిఫ్ వివరించారు.
‘‘అమెరికా ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. కానీ, పాకిస్తాన్ మాత్రం హింస, ఉగ్రవాదం, ఆర్థిక ఒత్తిడితో ఇబ్బంది పడుతూనే ఉంది” అని ఆయన అన్నారు.
“1999లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అమెరికా మద్దతు పొందేందుకు చాలా ఆత్రుతగా ఉండేది” అని ఆయన అన్నారు.
“ఐక్యరాజ్యసమితిలో హిల్లరీ క్లింటన్ చేసిన ప్రసంగంలో ఆమె పాకిస్తాన్‌ను ఎలా ఉపయోగించుకున్నారో మొత్తం వివరంగా ఉంది. అది ఒక చారిత్రక ప్రసంగం. ఆమె మమ్మల్ని ఒక టిష్యూ పేపర్‌లా వదిలి వెళ్ళారు. టిష్యూ పేపర్ అయినా ఫర్వాలేదు. కానీ టాయిలెట్ పేపర్‌లా వదిలేశారు. అయినప్పటికీ మేం దాని నుంచి ఏమీ నేర్చుకోలేదు. పైగా కేవలం రెండు గంటలపాటు బిల్ క్లింటన్ ఇక్కడ పర్యటించినప్పుడు, అప్పటి రాజకీయ నాయకులు ఆయనకు పూలమాలలు వేసి స్వాగతించారు” అని ఆయన అన్నారు.
2000 సంవత్సరంలో, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కొన్ని గంటల పాటు పాకిస్తాన్‌లో పర్యటించారు.
“మొత్తంగా వారు (అమెరికా) 20-25 సంవత్సరాలలో దాదాపు 10 కోట్ల మంది ముస్లింలను చంపారు. గడాఫీ కుమారుడిని కూడా వదిలిపెట్టలేదు’’అని ఖవాజా ఆసిఫ్ అన్నారు.
“9/11 దాడిని ఎవరు చేయించారో ఇప్పటి వరకు తెలియదు. అది కచ్చితంగా అఫ్గానిస్తాన్ చేయించలేదు. దాడి చేసిన వారిలో పష్తున్ ఎవరూ లేరు. అయినప్పటికీ 25ఏళ్లపాటు (అమెరికాకు) అద్దెకు అందుబాటులో ఉన్నట్టుగా వ్యవహరించాం. దానికి ప్రధాన కారణం జనరల్ పర్వేజ్ ముషర్రఫ్‌కు అమెరికా మద్దతు అవసరం కావడమే” అని ఆయన అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో 22–23 సంవత్సరాల పాటు పాకిస్తాన్ పోషించిన పాత్ర వల్లే ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉగ్రవాదం పెరిగిందని, ఇది పాక్‌కి ఎదురుదెబ్బ అని ఖవాజా ఆసిఫ్ అన్నారు.
ఆసిఫ్ ప్రకటనకు స్పందన ఏంటి?
అమెరికాకు వ్యతిరేకంగా ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ మీడియాలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. డాన్ న్యూస్, ది నేషన్ పత్రికలు ఆయన ప్రసంగాన్ని ప్రతిపక్ష నేత మహ్మూద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా పేర్కొన్నాయి. పాకిస్తాన్ సైన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మహ్మూద్ ఖాన్ విమర్శించారు.
“రెండు అఫ్గాన్ యుద్ధాలలో పాకిస్తాన్ పాత్రను ఒక పొరపాటుగా రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అభివర్ణించారు. నేడు దేశంలో ఉగ్రవాదం, గతంలోని నియంతృత్వ నేతల తప్పుల ఫలితమని అన్నారు” అని డాన్ న్యూస్ రాసింది.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు ఇప్పుడు సైనికుల అంత్యక్రియలకు కూడా హాజరుకావడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా డాన్ న్యూస్ ప్రస్తావించింది.
“పాకిస్తాన్‌లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడంలో భారత్ పాత్ర ఉందని ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. అఫ్గాన్ ఉగ్రవాదులను భారత్ మా మీద ప్రయోగిస్తోంది. పాకిస్తాన్‌పై భారత్ ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఆయన అన్నారు” అని డాన్ న్యూస్ పేర్కొంది.
అయితే భారత్ ఈ ఆరోపణలను ఖండించింది.
ఆసిఫ్ వ్యాఖ్యలపై విమర్శలు కూడా వచ్చాయి.
“9/11 తర్వాత ఉగ్రవాదంపై యుద్ధంలో తమ దేశం తనను తాను అమెరికాకు ‘అద్దెకు’ పనిచేసిందని ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ పార్లమెంటులో చెప్పారు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా చర్యలకు సాయం చేసినందుకు పాకిస్తాన్ సైనిక, ఆర్థిక సహాయం పొందిందనేది రహస్యం కాదు” అని అఫ్గానిస్తాన్ మాజీ అమెరికా రాయబారి జల్మయ్ ఖలీల్జాద్ ..ఎక్స్‌లో రాశారు.
‘‘అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలపై పోరాడుతున్నవారికి కూడా రక్షణ కల్పించింది. కాబట్టి, ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడిందా? అంటే, మరో శక్తి ద్వారా అమెరికాను బలహీనపరచడానికి ‘అద్దె’ పొందిందా? అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలపై పోరాడుతున్నవారికి రక్షణ ఇచ్చినందుకు ప్రభుత్వం ఏం పొందింది, ఎక్కడి నుండి పొందింది? లేక ఇది వేరే కారణాల వల్ల జరిగిందా? మంత్రి ఆసిఫ్ దీనికి వివరణ ఇస్తారా? ఆయన సమాధానాలు నిజంగా ఆసక్తికరంగా ఉండొచ్చు” అని ఆయన రాశారు.
ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, పాక్ సంబంధాలు ఎప్పుడూ ఒడిదుడుకులతోనే…
నాలుగు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్‌లో అమెరికా ప్రతి సైనిక జోక్యంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది.
1980ల నాటి సోవియట్ వ్యతిరేక పోరాటం నుంచి 9/11 తర్వాత అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనిక చర్య వరకు, 2021లో సైన్యాన్ని ఉపసంహరించుకునే వరకు పాకిస్తాన్ అమెరికాకు అండగా నిలిచింది. 2001 దాడుల తర్వాత ఉగ్రవాదంపై యుద్ధం అంటూ అమెరికా ప్రారంభించిన ఆపరేషన్‌లో అతిపెద్ద మిత్రదేశంగా పాకిస్తాన్ వ్యవహరించింది. ప్రతిగా, అమెరికా నుంచి సైనిక, ఆర్థిక సహాయాన్ని పొందింది.
అయితే పాకిస్తాన్, అమెరికా సంబంధాలలో కూడా ఒడిదొడుకులు ఉన్నాయి.
ఈ విషయంలో తాము చేసిన సహాయానికి అనుగుణంగా పాకిస్తాన్ స్పందించలేదని అమెరికా అభిప్రాయపడింది. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ చనిపోయారు. దీన్ని తమ ఐక్యత, సమగ్రతపై దాడిగా పాకిస్తాన్ భావించింది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా తన మొదటి పదవీకాలంలో పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు తీసుకున్నారు. పాకిస్తాన్‌కు అమెరికా నుంచి వచ్చే బిలియన్ల రూపాయల నిధులను కూడా ఆయన నిలిపివేశారు. తర్వాత జో బైడెన్ పదవీకాలంలో కూడా అమెరికా, పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడలేదు.
2022 ఏప్రిల్‌లో పాకిస్తాన్ ప్రధాని పదవి నుంచి తొలగించడానికి ముందు ఇమ్రాన్ ఖాన్ అమెరికాను బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు. తాను ప్రధాన మంత్రి పదవిని కోల్పోవడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కూడా కారణమని ఆయన నిందించారు.
అయితే, ఇప్పుడు ట్రంప్ రెండవ పదవీకాలంలో పాకిస్తాన్, అమెరికా సంబంధాలు తిరిగి గాడిన పడినట్లు కనిపిస్తున్నాయి.
గత మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణను నివారించడంలో కీలక పాత్ర పోషించానని ట్రంప్ పేర్కొన్నారు. మరుసటి నెలలో, ఆయన పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్‌లో లంచ్‌కు ఆహ్వానించారు.
ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి కూడా పాకిస్తాన్ నామినేట్ చేసింది. ఇప్పుడు గాజాలో శాంతి కోసం ట్రంప్ ప్రతిపాదించిన అమెరికా శాంతి మండలిలో పాకిస్తాన్ సభ్యదేశం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



