Home జాతీయ national telgu ఇండియాతో మ్యాచ్‌ విషయంలో పాకిస్తాన్ ‘యూ టర్న్’ వెనుక బంగ్లాదేశ్ పాత్ర ఏంటి?

ఇండియాతో మ్యాచ్‌ విషయంలో పాకిస్తాన్ ‘యూ టర్న్’ వెనుక బంగ్లాదేశ్ పాత్ర ఏంటి?

15
0

SOURCE :- BBC NEWS

సూర్యకుమార్ యాదవ్, నజ్ముల్ హుస్సైన్ శాంతో

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images

9 గంటలు క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

ఫిబ్రవరి 15న ఇండియాతో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ఫిబ్రవరి 1న పాకిస్తాన్ ప్రకటించింది.

అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన చేసింది. అందులో.. ‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ పోటీలలో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతిస్తోంది. కానీ ఫిబ్రవరి 15న ఇండియాతో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ మైదానంలోకి దిగదు’ అని పేర్కొంది.

బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ చెప్పింది. తనకు మద్దతుగా నిలిచినందుకు పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ కృతజ్ఞతలు చెప్పింది.

ఫిబ్రవరి 5న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో యువజన, క్రీడల మంత్రిత్వశాఖ సలహాదారు అసీఫ్ నజ్రుల్ పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఈమేరకు ఫేస్‌బుక్‌లో నజ్రుల్ ఓ పోస్టు పెట్టారు.

అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ సోమవారం రాత్రి సమావేశం కావడానికి ముందు.. ‘క్రికెట్ ప్రయోజనాలను’ దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 15న ఇండియాతో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసింది.

అనంతరం.. ఇండియాతో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయాన్ని పాకిస్తాన్ ఉపసంహరించుకున్నట్టు పీసీబీ, ఐసీసీ వేరువేరు ప్రకటనలలో తెలిపాయి.

అయితే.. గతంలో ఇండియాతో బరిలోకి దిగమని పాకిస్తాన్ చెప్పినప్పుడు హర్షం వ్యక్తం చేసిన బంగ్లాదేశే మళ్లీ ఇండియాతో మ్యాచ్ ఆడాల్సిందిగా పాకిస్తాన్‌ను ఎందుకు కోరింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

టీ 20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. ఇందుకు భద్రతను కారణంగా చూపింది.

తాము భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌లను మరో చోటుకు తరలించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని బంగ్లాదేశ్ అభ్యర్థించింది.

కానీ ఈ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది.

ఆ తర్వాత, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు టోర్నీలో స్థానం కల్పించారు.

దీనిపై ఐసీసీ ‘ద్వంద్వ ప్రమాణాలు’ పాటిస్తోందని పీసీబీ విమర్శించింది.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అమీనుల్ ఇస్లాం

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్‌కు ఏంటి లాభం?

టోర్నీనుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్‌పై ఐసీసీ భారీ జరిమానా విధించే అవకాశం ఉందని చాలా మంది క్రికెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

కానీ ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు ఎటువంటి శిక్ష విధించబోమని తాజాగా ఐసీసీ స్పష్టం చేసింది.

దీంతో పాటు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు 2028 నుంచి 2031మధ్య మరో ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశాన్నిఇచ్చింది.

దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్… పీసీబీకి కృతజ్ఞతలు తెలుపుతూ భారత్‌తో మ్యాచ్ ఆడాలని అభ్యర్థించింది.

చర్చల సందర్భంగా ఐసీసీ ఆదాయ పంపిణీ తీరుపైనా పీసీబీ అభ్యంతరాలు లేవనెత్తింది. అయితే, ప్రభుత్వం లేదా ఐసీసీ నుంచి వచ్చిన ఏ ప్రకటనలోనూ దీని గురించి ప్రస్తావించలేదు.

భారత్‌తో మ్యాచ్‌లు ఆడటానికి బదులుగా.. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్‌ల ముక్కోణపు సిరీస్ నిర్వహించాలని పాకిస్తాన్ షరతు పెట్టిందని గతంలో కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

అయితే ఇలాంటి షరతులేవీ తాము విధించలేదని పీసీబీ పేర్కొంది.

అంతకుముందు లాహోర్‌లో పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ, బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లాం ఐసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖవాజా మధ్య సమావేశం జరిగింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ నుంచి మినహాయించాలనే నిర్ణయాన్ని పీసీబీ వ్యతిరేకించింది.

కానీ సోమవారం సాయంత్రానికల్లా పరిస్థితులు వేగంగా మారిపోయాయి.

బంగ్లాదేశ్‌ విషయంలో ఐసీసీ నిర్ణయం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కృతజ్ఞతలు చెప్పడం, ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వంటి పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి.

దీంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో నెలకొన్ని ప్రతిష్టంభన ముగిసింది.

దీంతో ఇండియా, పాకిస్తాన్ జట్లు కొలంబోలో ఫిబ్రవరి 15న తలపడనున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)