Home జాతీయ national telgu హర్గీలా: అరిష్టం అనుకునే స్థాయి నుంచి అదృష్టం అనుకునేదాకా మారిన ఈ కొంగల కథేంటి?

హర్గీలా: అరిష్టం అనుకునే స్థాయి నుంచి అదృష్టం అనుకునేదాకా మారిన ఈ కొంగల కథేంటి?

16
0

SOURCE :- BBC NEWS

హర్గీలా ఆర్మీ, అస్సాం మహిళలు,  కొంగల పరిరక్షణ ఉద్యమం

ఫొటో సోర్స్, Hargila Army

ఒకప్పుడు దురదృష్టానికి ప్రతీకగా భావించి, అంతరించి పోయే దశలో ఉన్న హర్గీలా కొంగను రక్షించేందుకు ఒక సైన్యం పుట్టింది. ఈ సైన్యం రాకతో వాటి సంఖ్య పుంజుకుంటోంది.

అది 2007 జనవరి.. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న దాదరా గ్రామంలో ఒకచోట నిలబడి ఉన్నారు పూర్ణిమా దేవి బర్మాన్.

ఉష్ణ మండల హరితారణ్యాలు, చిత్తడి నేలలతో ఉన్న ఆ ప్రాంతంలో తాను ప్రత్యక్షంగా చూస్తున్న విధ్వంసం గురించి ఆమె ఆలోచిస్తున్నారు.

చాలా ఎత్తుగా, ఆకుపచ్చగా ఉండి, అందంగా కనిపించే కదంబ చెట్లను స్థానికులు నరికేయడం ఆమె గమనిస్తూనే ఉన్నారు.

పడిపోయిన చెట్ల కొమ్మలు, చెల్లాచెదురుగా పడి ఉన్న ఆకులు, గూడు కట్టుకునేందుకు ఉపయోగపడే గడ్డి మధ్య, పొడవైన కాళ్లు, పదునైన ముక్కు, నలుపు తెలుపు ఈకలున్న పెద్ద పెద్ద పక్షుల కళేబరాలు నేలపై చెల్లాచెదరుగా పడి ఉన్నాయి.

అవి అస్సాంకే ప్రత్యేకమైనవి, అంతరించిపోతున్న జాతికి చెందిన భారీ కొంగలు.

అక్కడ కొన్ని పిల్లలు ఇంకా బతికే ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని చేతుల్లోకి తీసుకున్న బర్మాన్ తన గుండెల్లో పొదివి పట్టుకున్నారు.

“దాని గుండె కొట్టుకోవడం నాకు తెలుస్తోంది. దాని బాధ, ఆవేదన నాకు తెలుస్తోంది” అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఇద్దరు కవలపిల్లల తల్లైన ఆమెను ఆ చిన్న పక్షికొచ్చిన కష్టం తీవ్రంగా ప్రభావితం చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఆ సమయంలో బర్మాన్ వన్యప్రాణి సంరక్షణ, ముఖ్యంగా కొంగలను అధ్యయనంపై పీహెచ్‌డీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. తన కళ్లతో చూసింది తన జీవితాన్ని మార్చేస్తుందని ఆమెకు తెలుసు.

“నేను ఈ పక్షులను ఊరికే గమనిస్తూ కూర్చోవడం కంటే ఏదైనా చేయాలని అనిపించింది. వాటికి సాయం కావాలి” అని ఆమె అన్నారు.

స్థానికంగా హర్గీలా (ఎముకలను మింగే పక్షి) గా గుర్తింపు పొందిన ఈ పొడవాటి కొంగలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. దాదాపు 5 అడుగుల పొడవుతో గంభీరంగా కనిపించే ఈ పక్షులు చిత్తడి భూముల పర్యావరణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

జంతువుల కుళ్లిపోయిన కళేబరాలను తింటూ, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడంతో పాటు, వ్యాధులు విస్తరించకుండా అడ్డుకుంటాయి. సేంద్రియ పదార్ధాలను నలువైపులా పంపిణీ చేస్తూ నేలను సస్యశ్యామలం చేస్తాయి.

ఒకప్పుడు ఆసియా అంతటా విస్తృతంగా కనిపించే ఈ పక్షులు, ఇప్పుడు అస్సాం, బిహార్ రాష్ట్రాలతో పాటు కాంబోడియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి.

అవి గూళ్లు పెట్టే చిత్తడి నేలల్లో విధ్వంసం, మాంసం కోసం వేట, గుడ్లను సేకరించడంలాంటి చర్యల వల్ల వాటి జనాభా బాగా తగ్గిపోయింది.

ఈ పక్షుల మనుగడకు ముప్పు పొంచి ఉందని ‘ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ నేచర్’ తెలిపింది.

హర్గీలా ఆర్మీ, అస్సాం మహిళలు,  కొంగల పరిరక్షణ ఉద్యమం

ఫొటో సోర్స్, Hargila Army

‘దురదృష్టానికి ప్రతీకలు’

ఈ కొంగల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఇవి దురదృష్టానికి ప్రతీకలని కొన్నేళ్లుగా అస్సాంలో గ్రామాల్లో ప్రజలు భావిస్తూ వచ్చారు.

కీడుగా భావించి భయపెట్టడం, వాటి మాంసం కుష్టుని నయం చేస్తుందనీ, విషానికి విరుగుడుగా పని చేస్తుందనీ నమ్మడం, మాంసం కోసం వేటాడటం… ఇలా అనేక రూపాల్లో వాటి అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది.

గ్రామస్థుల భూములు, పొలాలు, నివాస ప్రాంతాల్లో గూడు కట్టుకునే అలవాటు ఈ కొంగల పరిస్థితిని మరింత దిగజార్చింది.

కొన్నాళ్లు పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆ కొంగల జాతే నాశనమయ్యేది. అయితే స్థానిక మహిళల బృందం ఒకటి కొంగల దుస్థితిని మార్చాలని నిర్ణయించుకుంది.

ప్రస్తుతం ఈ బృందంలో 20వేల మంది మహిళలు ఉన్నారు.

కొంగల సంఖ్య తక్కువగా ఉండటం ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశమైనప్పటికీ, వాటి పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు ఆశను రేకెత్తించాయి. అవి చెప్పుకోదగ్గ విజయం సాధించాయి.

అస్సాంలో ఈ పక్షులను ప్రస్తుతం 8 ప్రాంతాలలో గుర్తించారు. వాటి సంఖ్య 1800 ఉంటుందని ఐయూసీఎన్ అంచనా వేసింది. 2007లో అస్సాంలో ఈ పొడవాటి కొంగల సంఖ్య కేవలం 450.

హర్గీలా ఆర్మీ, అస్సాం మహిళలు,  కొంగల పరిరక్షణ ఉద్యమం

ఫొటో సోర్స్, Rachele Bowen

హర్గీలా ఆర్మీలో అందరూ మహిళలే

అస్సాంలోని కామరూప్ ప్రాంతానికి చెందిన బర్మాన్, తన డాక్టరేట్ పరిశోధన కోసం ఈ కొంగల అలవాట్ల అధ్యయనం , చిత్తడి నేలల పరిరక్షణలో వాటి పాత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అయితే వాటికి పొంచి ఉన్న ముప్పు, వాటి పట్ల గ్రామీణుల్లో ఉన్న ద్వేషం, అవి అంతరించిపోతున్న తీరును చూసిన తర్వాత, అధ్యయనానికి మించి చేయాల్సింది చాలా ఉందని ఆమె గ్రహించారు.

కొంగలను కాపాడేందుకు ఆమె గ్రామాల్లో పర్యటించారు. అవి మంచి శకునమని గ్రామీణులకు వివరించారు.

అయితే, తాను ఒక్కదాన్నే ఈ పని చేయలేనని ఆమెకు తెలుసు.

2007లో కదంబ చెట్లను విపరీతంగా నరికేస్తున్న విషయాన్ని బర్మాన్ గుర్తించారు. దీన్ని ఆపేందుకు ఆమె గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లారు. చాలామంది మహిళలతో మాట్లాడారు.

కొంగలపట్ల వ్యవహరిస్తున్నట్లే మన పిల్లలపట్ల కూడా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ఆమె వారిని కోరారు. వారిలో చైతన్యం నింపారు.

స్థానిక మహిళ ప్రతిమా కలిటా రాజ్‌బోంగ్షీకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. 2009లో ఆమె బర్మాన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.

గతంలో తమ గ్రామంలో జనం ఈ పక్షుల మీద రాళ్లు విసిరిన సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమావేశంలో వాళ్లిద్దరి మధ్య జరిగిన చర్చ రాజ్‌బోంగ్షిపై గట్టి ప్రభావం చూపింది.

“మన పిల్లలకు జబ్బు చేసినప్పుడు మనం వారికి చికిత్స చేయిస్తాం. అయితే మనం ఆ కొంగలు, వాటి పిల్లలను మాత్రం హింసిస్తున్నాం. వాటి గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నానని పూర్ణిమా మేడమ్ చెప్పారు. ఆ రోజో నేను హర్గీలా సైన్యంలో క్రియాశీలక సభ్యురాలిగా చేరాలని నిర్ణయించుకున్నాను” అని రాజ్ బోంగ్షి చెప్పారు.

హర్గీలా ఆర్మీ సభ్యులు కొంగలను సీమంతం వేడుకలకు తెచ్చేవారు. మహిళలు చేతితో చేసిన పక్షి దుస్తులు ధరించి ఆ వేడుకల్లో డాన్సులు చేసేవారు. ప్రతీ ఆనందకరమైన సందర్భంలోనూ కొంగలకు చోటు దక్కేది.

గ్రామాల్లో చిన్న చిన్న సంఘాలను ఏర్పాటు చేశారు బర్మాన్. కుట్టు పని చేసే వారిని గుర్తించి, వారికి చీరలు, కుషన్ కవర్లు, దుప్పట్లు, శాలువాలపై కొంగల బొమ్మలు వేయడానికి డబ్బు చెల్లించేవారు.

ఇలా కొద్దిమంది మహిళల చొరవతో కొంగల సంరక్షణ మొదలైందని బర్మాన్ చెప్పారు. తర్వాతి కాలంలో ఆ మద్దతు మరింత పెరిగిందని ఆమె అన్నారు.

ప్రస్తుతం హర్గీలా ఆర్మీ 20వేలకు చేరుకుంది. ఇందులో 47 గ్రామాలకు చెందివవారున్నారు. వాళ్లంతా పక్షుల్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారని బర్మాన్ తెలిపారు.

గతంలో మహిళలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కాదని రాజ్‌బోంగ్షి చెప్పారు. అయితే హర్గీలా సైన్యం కార్యకలాపాలు వారిని ఆకర్షించడంతో, వాటిలో పాల్గొనేందుకు వారు ముందుకొచ్చారు.

“పక్షులను సంరక్షించడంలోనే తమ మనుగడ ముడిపడి ఉందని మహిళలు గుర్తించారు” అని రాజ్‌‌బోంగ్షి చెప్పారు.

హర్గీలా ఆర్మీ, అస్సాం మహిళలు,  కొంగల పరిరక్షణ ఉద్యమం

ఫొటో సోర్స్, Hargila Army

దాదరాలో నివసించే 41 ఏళ్ల లవిటా బైష్యా 2017లో హర్గీలా ఆర్మీలో చేరారు.

“మాకు పక్షులను ఎలా గౌరవించాలనే దాని గురించి జానపద గీతాలు నేర్పారు” అని ఆమె చెప్పారు.

గ్రూప్‌లో మహిళలకు కుట్టుపని, ఎంబ్రాయిడరీ పట్ల ఆసక్తి ఉండటాన్ని బర్మాన్ గుర్తించారు. ఆమె రెండు కుట్టు మిషన్లు కొన్నారు. 2023లో టైలరింగ్ సెంటర్ ప్రారంభించారు. అక్కడ ఇతర మహిళలకు శిక్షణ ఇచ్చేవారు.

హర్గిలా థీమ్‌తో దుస్తుల్ని తయారు చేసేవారు. ఇక్కడ తయారైన దుస్తుల్ని ఆన్‌లైన్‌లో అమ్మేందుకు హర్గీలా ఆర్మీకి మొబైల్ కార్ట్ ఉంది. గువాహటిలో మంచినీటి సరస్సు డీపోర్ బీల్‌లో 2023లో రిటైల్ ఔట్‌లెట్ తెరిచారు. ఆన్‌లైన్‌లోనూ తమ ఉత్పత్తుల్ని అమ్ముతున్నారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గ్రూప్‌లో మహిళలకు అందిస్తున్నారు.

బైష్యా మాదిరిగానే ఈ గ్రూప్‌లో ఏడుగురు టీచర్లు ఉన్నారు. అందరికీ కుట్టుపనిలో అనుభవం ఉంది. వాళ్లు ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు. దీంతోపాటు పర్యావరణం మీద శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారని బర్మాన్ చెప్పారు. వాళ్ల ఉత్పత్తుల అమ్మకాలు పుంజుకోవడంతో కొంగల పట్ల వారికి అపేక్ష పెరిగింది.

జానపద కథలు, స్థానిక సంప్రదాయాలు, కుట్టు పని నైపుణ్యాలు, కథలు చెప్పడం లాంటివి ఈ ప్రాంతంలో వన్యప్రాణుల పరిరక్షణకు ఎలా ఉపయోగపడ్డాయనే దాని గురించి పరిశోధనా పత్రం వెల్లడించింది.

బర్మాన్, స్థానిక మహిళలు కలిసి కొంగల పరిరక్షణకు ఎలా కృషి చేశారో దిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ పరిశోధకురాలు దీపా మోనీ డోలీ వివరించారు.

కొంగల్ని కాపాడేందుకు బర్మాన్ చేసిన కృషిని టైమ్స్ మేగజీన్ గుర్తించింది. 2025లో ఆమెను టైమ్స్ మేగజీన్ విమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది.

“మహిళా గ్రూపుల్ని ఇందులో భాగస్వాముల్ని చేసిన తర్వాత అద్భుతం జరిగింది. పురుషులు కూడా తర్వాతి రోజుల్లో కొంగలపట్ల తమ వైఖరి మార్చుకున్నారు” బర్మాన్ చెప్పారు.

అస్సాంలో స్థానిక మహిళలు, స్థానిక సంప్రదాయాల్ని కలగలిపి ఉద్యమించడం వల్లనే హర్గీలా ఆర్మీ చేపట్టిన కొంగల సంరక్షణ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని కెన్యా రాజధాని నైరోబిలోని యూఎన్ పర్యావరణ కార్యక్రమం ఎకో సిస్టమ్స్ డివిజన్ డైరెక్టర్ సుసాన్ సి గార్డ్‌నర్ చెప్పారు.

“అంతరించిపోతున్న పక్షి జాతుల్ని సంరక్షించడం ద్వారా స్థానిక మహిళలు ఆర్థిక అవకాశాలు పొందే నమూనాకు ఇదొక ఉదాహరణ” అని గార్డ్‌నర్ అన్నారు.

హర్గీలా ఆర్మీ, అస్సాం మహిళలు,  కొంగల పరిరక్షణ ఉద్యమం

ఫొటో సోర్స్, Hargila Army

ప్రస్తుతం బర్మాన్ ఇద్దరు కవల కూతుళ్లు కూడా కొంగల సంరక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హర్గీలా డెస్క్ పేరుతో స్థానిక మహిళలు సాధించిన విజయాల గురించి కథనాలు ప్రచురిస్తున్నారు.

హర్గీలా ఆర్మీ ప్రయత్నం విజయవంతమైనప్పటికీ, రానున్న రోజుల్లో అనేక సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. చిత్తడి నేలలను ఆక్రమించి కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక జీవవైవిధ్యానికి ముప్పుగా మారాయి.

హర్గీలా కొంగలు గూళ్లు కట్టుకునే ప్రదేశాలను సంరక్షించడం మరో కష్టతరమైన కార్యక్రమం.

అస్సాంలో పొడవైన సిల్క్ కాటన్ చెట్లు, ముఖ్యంగా బొంబాక్స్ సైబా జాతికి చెందినవి ఈ పొడవాటి పక్షులకు సరైన ఆవాసం. అయితే ఇవి తగ్గిపోతున్నాయి. కలప కోసం వీటిని నరికేస్తున్నారు. వీటి స్థానంలో భవనాలు వెలుస్తున్నాయి.

స్థానికంగా అక్రమ కలప మిల్లులు పెరుగుతున్నాయి. ఈ మిల్లుల యజమానులు లైసెన్స్ లేకుండా స్థానికంగా ఉండే చెట్లను విచక్షణా రహితంగా నరికేస్తున్నారని స్థానిక కథనాలు చెబుతున్నాయి.

మరో క్లిష్టమైన విషయం ఏంటంటే, హర్గీలా కొంగలు సమూహంగా గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. గుంపులు గుంపుగా నివసిస్తాయి. చెట్ల సంఖ్య తగ్గిపోవం వల్ల వాటి నివాస స్థలాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

“కొంగల్ని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయడం అంటే చెట్లను సంరక్షించడమే. అయితే ఇప్పుడు అతి పెద్ద సవాలు ఏంటంటే, ఇక్కడున్న పెద్ద పెద్ద చెట్లన్నీ ప్రైవేటు స్థలాల్లోనే ఉన్నాయి” అని బర్మాన్ చెప్పారు.

గూడు కట్టుకునేందుకు కొంగలు ఇష్టపడే మరో ప్రదేశం కదంబ చెట్లు. ఇవి కూడా ధ్వంసం కావడాన్ని బర్మాన్ గుర్తించారు.

భారత దేశపు సతతహరిరణ్యాలలో కదంబ చెట్టు, పందిరి లాంటి దాని పై భాగం, పసుపు పచ్చ, నారింజ రంగుల్లో ఉండే పూలకు ప్రసిద్ధి చెందింది. ఈ చెట్టు పైభాగం పరిపూర్ణ గోళాకారంలో ఉంటుంది.

కొంగలతో పాటు ఈ చెట్లను కూడా కాపాడటం తమకు చాలా ముఖ్యమని బర్మాన్ చెబుతున్నారు.

“మార్పు తీసుకు రావాలంటే ముందుగా మీరు మీ గొంతు వినిపించాలి. మహిళలు కలిసి వచ్చినప్పుడు దేన్నైనా రక్షించే శక్తి మనకు ఉందని నిరూపించాం” అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)