SOURCE :- BBC NEWS

పళ్లు తోముకోవడమనేది చాలా సింపుల్‌గా జరిగిపోయే విషయం. కానీ శ్రీలంకకు చెందిన ప్రేమలాల్‌కు అది ప్రమాదకరంగా మారింది.
అత్యవసరంగా శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రేమలాల్ గొంతులో ఇరుక్కుపోయిన టూత్ బ్రష్‌పై భాగాన్ని వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తొలగించి ఆయన ప్రాణాలను కాపాడారు.
“పదిరోజుల క్రితం బాత్రూమ్‌లో పళ్లు తోముకుంటూ నేను ప్రమాదవశాత్తూ జారి పడిపోయాను. నా నోట్లోని టూత్ బ్రష్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఒక భాగం నా గొంతులో ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీయడానికి చాలాసార్లు ప్రయత్నించా. అది రాలేదు. అప్పుడు నాకు ప్రమాదం తీవ్రత అర్ధమైంది” అని ఆయన బీబీసీతో చెప్పారు.
“నేను వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని వివరించాను. వాళ్లు వెంటనే నన్ను ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స ప్రారంభించారు” అని ప్రేమలాల్ తెలిపారు.

గొంతు బిగుసుకుపోవడం
మొదట వైద్యులు తన పొట్ట, ఛాతీ భాగాలను పరీక్షించారని, కానీ బ్రష్‌లో ఏ భాగం వారికి కనిపించలేదని ప్రేమలాల్ చెప్పారు.
చికిత్స పూర్తయిన తర్వాత కావాలంటే సంతకం చేసి ఇంటికి వెళ్లొచ్చని వైద్యులు చెప్పడంతో, వాళ్లు చెప్పినట్టే ఆయన ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
ఇంటికి తిరిగి వచ్చిన గంట తర్వాత ప్రేమలాల్‌కు గొంతు బిగుసుకుపోతున్నట్టు అనిపించింది. ఆయన మరొక ఆసుపత్రికి వెళ్లి తన పరిస్థితిని వివరించారు. గొంతు పట్టేసినట్టు ఉందని, దగ్గు పెరిగిందని, కఫంతో పాటు రక్తం పడుతోందని డాక్టర్‌తో చెప్పారు. అక్కడి వైద్యుడు లక్మల్ వెంటనే ఎక్స్‌రే చేయించుకోవాలని ప్రేమలాల్‌కు సూచించారు.
టూత్ బ్రష్‌పై భాగం ఆయన గొంతు లోపల ఇరుక్కుపోయిఉందని ఎక్స్‌రేలో తేలింది.
“బ్రష్ పై భాగం గొంతు లోపల ఉన్నట్టు ఎక్స్‌రేలో కనిపించింది. ప్లాస్టిక్ వస్తువులు ఎక్స్‌రేల్లో కనిపించవని అంతకుముందు వెళ్లిన ఆసుపత్రిలో నాకు చెప్పారు. కానీ ఇక్కడ ఎక్స్‌రేలో కనిపించింది” అని ప్రేమలాల్ తెలిపారు.

మాత్తరై నుంచి గాలె వరకు…
ఒక వైద్యుడి సలహా మేరకు ప్రేమలాల్ తన కొడుకుతో కలిసి మాత్తరై నుంచి గాలెలోని ఈఎన్‌టీ డాక్టర్ అనిరుద్ధ విక్రమసింఘే దగ్గరకు వెళ్లారు.
తాను వెళ్లినప్పుడు డాక్టర్ అనిరుద్ధ అక్కడ లేకపోవడంతో ప్రేమలాల్ నిరాశ చెందారు.
”పరిస్థితి తీవ్రతను గ్రహించిన వైద్య సిబ్బంది వెంటనే నా ఎక్స్‌రే, వైద్య నివేదికను వాట్సాప్‌లో డాక్టర్ అనిరుద్ధకు పంపి పరిస్థితి వివరించారు. వైద్య నివేదిక చూసిన తర్వాత డాక్టర్ అనిరుద్ధ అక్కడే ఉండమని నాకు సలహా ఇచ్చి కొన్ని గంటల్లోనే గాలె జాతీయ ఆస్పత్రిలో చేర్చారు” అని ప్రేమలాల్ తెలిపారు.

గొంతులో బ్రష్ ఇరుక్కుపోయినా మామూలుగానే మాట్లాడిన ప్రేమలాల్
గాలే నేషనల్ హాస్పిటల్‌లో చేరిన ప్రేమలాల్‌కు ఉదయం 9 గంటల సమయంలో డాక్టర్ అనిరుద్ధ పర్యవేక్షణలో ఎండోస్కోపీ చేశారు. విరిగిన బ్రష్ ముందు భాగాన్ని వారు గుర్తించలేకపోయారు.
కాసేపు నొప్పి తగ్గినట్టు, మామూలుగా మాట్లాడగలిగినట్టు తనకు అనిపించినప్పటికీ, మళ్లీ కొద్దిసేపటికే పాత లక్షణాలు కనిపించాయని, గొంతులో మళ్లీ రక్తస్రావం మొదలైందని ప్రేమలాల్ వైద్యునికి తెలిపారు.
డాక్టర్ అనిరుద్ధ సలహా మేరకు ప్రేమలాల్ మళ్లీ ఎక్స్‌రే తీయించుకున్నారు. బ్రష్ విరిగిన భాగం గొంతు లోపలే ఉందని వైద్యులు నిర్ధరించారు. ఆయనకు సీటీ స్కాన్ కూడా చేశారు. అయితే ప్రేమలాల్ మామూలుగానే మాట్లాడుతుండడం, తినడం వైద్యులకు ఆశ్చర్యం కలిగించింది.
తర్వాత ప్రేమలాల్ గొంతుకు శస్త్రచికిత్స చేశారు.
“శ్రీలంకలో ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదని డాక్టర్ నాతో చెప్పారు. ఇది ప్రాణాలకు చాలా ప్రమాదకరమని చెప్పారు” అని చికిత్సకు ముందు వైద్యులు తనతో అన్న మాటలను ప్రేమలాల్ గుర్తు చేసుకున్నారు.
“సరిగ్గా ఉదయం 11.45 గంటలకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నన్ను ఆపరేషన్ రూమ్ నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. టూత్ బ్రష్ విరిగిన భాగం ఇప్పటికీ నా దగ్గర ఉంది” అని ప్రేమలాల్ చెప్పారు.

‘చిన్న విషయాలే ప్రాణాంతకం కావొచ్చు’
ప్రేమలాల్ వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు.
” ఈ బిజీ షెడ్యూల్‌లో మనం దైనందిన జీవితంలో చేసే అతి చిన్న పనులు కూడా ఒక్కోసారి ప్రాణాపాయం కలిగిస్తాయి. శ్రీలంకలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో బిజీగా ఉన్న వారందరికీ కూడా ఇది ఒక ఉదాహరణగా ఉండాలని నేను కోరుకుంటున్నాను” అని ప్రేమలాల్ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



