Home జాతీయ national telgu కాంచన్ బాయి: తేనెటీగల దాడి నుంచి 25 మంది పిల్లలను కాపాడి మరణించిన మహిళ

కాంచన్ బాయి: తేనెటీగల దాడి నుంచి 25 మంది పిల్లలను కాపాడి మరణించిన మహిళ

14
0

SOURCE :- BBC NEWS

అంగన్‌వాడీ సహాయకురాలు కాంచన్ బాయి

ఫొటో సోర్స్, Akash Srivastava

”కాంచన్ బాయి ధైర్యం చేయకపోతే, ఇంకెంత మంది పిల్లల ప్రాణాలు పోయేవో ఊహించలేం.”

మధ్యప్రదేశ్‌లోని నీమచ్ జిల్లా రాణ్‌పూర్ గ్రామంలో ఇప్పుడు ఎవరిని కదిలించినా కాంచన్ బాయి ధైర్యం గురించే మాట్లాడుతున్నారు.

జిల్లా కేంద్రానికి 26 కిలోమీటర్ల దూరంలోని రాణ్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంపై ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. ఈ అంగన్ వాడీ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తుంటారు.

అప్పటివరకూ పిల్లల నవ్వులు, అల్లరితో సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా అరుపులు,కేకలతో భయానకంగా మారింది.

”సుమారు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో తేనెటీగలు అంగన్‌వాడీ పరిసరాల్లో ఆడుకుంటున్న పిల్లలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో అక్కడ 20 నుంచి 25 మంది చిన్నపిల్లలు ఉన్నారు” అని గ్రామస్థులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఊహాచిత్రం

ఫొటో సోర్స్, Puneet Barnala

పిల్లలను కాపాడాలని పరుగున వెళ్లి…

”తేనెటీగలు నేరుగా పిల్లల వైపు దూసుకొస్తున్నాయి. పరిస్థితిని గమనించి అక్కడున్న 55 ఏళ్ల అంగన్‌వాడీ సహాయకురాలు కాంచన్ బాయి పిల్లలను కాపాడటానికి పరుగున వెళ్లారు” అని పాఠశాల ఉపాధ్యాయుడు గుణసాగర్ జైన్ చెప్పారు.

”కాంచన్ బాయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పిల్లలను వెంటనే అంగన్‌వాడీ కేంద్రం లోపలకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అంగన్‌వాడీ కేంద్రంలోని తివాచీలు, దుప్పట్లను బయటకు తీసి పిల్లలపై కప్పారు. తర్వాత తన చీరనూ కప్పి పిల్లలను కాపాడటానికి ప్రయత్నించారు” అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఆమె సాహసం కారణంగా సుమారు 25 మంది ప్రాణాలు దక్కాయి. వారిలో ఆమె మనవడు కూడా ఉన్నాడు. కానీ పిల్లలను కాపాడే క్రమంలో ఆమె తేనెటీగల దాడికి గురై తీవ్రంగా గాయపడ్డారు.

గ్రామస్థులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు ఆమె చనిపోయినట్టు ధ్రువీకరించారు.

నీమచ్ పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ జైస్వాల్ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు.

”సోమవారం మధ్యాహ్నం జావద్ పోలీసుస్టేషన్ పరిధిలో రాణ్‌పూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంపై తేనెటీగలు దాడి చేశాయి. ఆ సమయంలో అక్కడున్న పిల్లలను కాపాడేందుకు కాంచన్ బాయి ప్రయత్నించారు. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు” అని చెప్పారు.

కాంచన్ బాయి కుమారుడు రవి

ఫొటో సోర్స్, Aakash Srivastava

‘అమ్మను చూసి గర్విస్తున్నా’

కాంచన్ బాయికి భర్త శివలాల్, కుమారుడు రవి మేఘవాల్ ఉన్నారు. శివలాల్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమయ్యారు.

వివాహమైన రవి మేఘవాల్‌కు ఒక కొడుకు ఉన్నాడు. ఆ బాలుడు (కాంచన్ బాయి మనవడు) కూడా తేనెటీగల దాడి సమయంలో అంగన్‌వాడీ కేంద్రం వద్దే ఉన్నాడు.

తేనెటీగల దాడిలో కాంచన్ బాయి చనిపోవడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రాణాలకు తెగించి 25 మంది పిల్లలను కాపాడిన తన తల్లిని చూసి ఎంతో గర్వపడుతున్నానని రవి మేఘావాల్ బీబీసీతో అన్నారు.

”తేనెటీగలు దాడి చేసినప్పుడు నేను ఊళ్లో లేను. కానీ, మా అమ్మ అక్కడున్న పిల్లందర్నీ ఎలా కాపాడారో చూసినవారంతా చెప్పారు. మా అమ్మ చాలా మంచిది. పిల్లలంటే ఆమెకు ప్రాణం. పిల్లలు దైవస్వరూపులని చెబుతుండేవారు” అని ఆయన చెప్పారు.

తేనెటీగల దాడి జరిగిన అంగన్‌వాడీ కేంద్రం పరిసరాలు

ఫొటో సోర్స్, Aakash Srivastava

‘తేనెటీగల కాటు భరించారు’

గ్రామంలోని ‘జై మాతా దీ’ అనే పేరుతో ఏర్పాటుచేసిన స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలిగా కూడా కాంచన్ బాయి ఉన్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు వంట చేయడం, వారి బాగోగులు చూసుకోవడం ఆమె రోజువారీ బాధ్యతలు.

”తేనెటీగల నుంచి మా అమ్మ కాపాడిన పిల్లల్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు. మా అబ్బాయి శరీరం నుంచి కూడా ఐదారు తేనెటీగల ముళ్లను తీశారు” అని రవి చెప్పారు.

ఆ అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్న తన కుమారుడిని తీసుకెళ్లడానికి వచ్చిన సురేష్‌చంద్ర మేఘవాల్ కూడా ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి.

”నేను వచ్చేసరికి మేడమ్ గట్టిగా అరుస్తున్నారు. లోపల నుంచి పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి. దగ్గరకు వెళ్లి చూసేసరికి తేనెటీగలు దాడి చేశాయని తెలిసింది. వాటి నుంచి పిల్లలను తివాచీలు, దుప్పట్లతో పాటు తన చీర కూడా కప్పి కాంచన్ బాయి పిల్లలను కాపాడుతున్నారు. ఆ తేనెటీగల దండు చాలా పెద్దది” అని ఆయన చెప్పారు.

”పిల్లలను రక్షిస్తున్న కాంచన్ బాయి ఎన్నో తేనెటీగలు కాటేస్తున్నా భరించారు. ఆమె ఆ సాహసం చేసి ఉండకపోతే, ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు” అని సురేష్‌చంద్ర మేఘవాల్ అన్నారు.

కాంచన్ బాయి మరిది దిలీప్ మేఘవాల్

ఫొటో సోర్స్, Aakash Srivastava

‘ఆమె శరీరం నిండా తేనెటీగల ముళ్లే’

కాంచన్ బాయికి వరసకు మరిది అయ్యే దిలీప్ మేఘవాల్ మాట్లాడుతూ, ”అంగన్‌వాడీపై తేనెటీగలు దాడి చేశాయని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను అక్కడకు చేరుకునే సమయానికి పరిస్థితి అదుపు తప్పింద”ని చెప్పారు.

”నేను వెళ్లేసరికి కాంచన్ బాయి నేలపై పడిపోయి ఉన్నారు. ఆమె శరీరం నిండా లెక్కలేనన్ని తేనెటీగల ముళ్లు గుచ్చుకొని ఉన్నాయి. కొన్ని తేనెటీగలు అప్పటికీ అక్కడే ఎగురుతున్నాయి. కాంచన్ బాయి స్పృహలో లేరు, ఆమె నోటి నుంచి నురగ వస్తోంది, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు” అని అన్నారు.

”చుట్టుపక్కల పిల్లలు ఏడుస్తున్నారు. జనం తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఒక బాబుతో కలిసి కాంచన్ బాయిని ఎత్తుకుని బయటకు తీసుకువచ్చాను. అప్పటికే అక్కడికి చేరుకున్న సురేష్‌చంద్ర ఆంబులెన్స్‌కు, పోలీసులకు ఫోన్ చేశారు” అని అప్పటి పరిస్థితి గురించి దిలీప్ చెప్పారు.

కాంచన్ బాయిని సమీపంలోని సర్వానియా మహారాజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, అప్పటికే ఆమె మరణించినట్లు వెల్లడించారు.

ఆ ఆసుపత్రి ఇన్‌ఛార్జ్, డాక్టర్ సందీప్ శర్మ బీబీసీతో మాట్లాడుతూ, ”కాంచన్ బాయి ఆసుపత్రికి చేరుకోవడానికి ముందే మరణించారు. తేనెటీగల దాడిలో ఇది కచ్చితంగా సాధ్యమే. ఆ సమయంలో మనిషి ‘అనాఫిలాక్టిక్ షాక్’కు గురయ్యే అవకాశం ఉంది, ఇది ప్రాణాంతకం కావచ్చు” అని చెప్పారు.

అనాఫిలాక్టిక్ షాక్ అంటే ప్రాణాంతక అలెర్జీ ప్రతిచర్య. అలెర్జీ కలిగించే పదార్థాలు శరీరంలోకి చొచ్చుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే సంభవించే తీవ్రమైన చర్య.

అలాంటి షాక్ రావడానికి తేనెటీగల దాడి కూడా ఒక బలమైన కారణమని డాక్టర్ సందీప్ వివరించారు.

కాంచన్ బాయి

ఫొటో సోర్స్, Aakash Srivastava

‘ఆమె పిల్లలను ప్రాణంలా చూసుకునేవారు’

కాంచన్ బాయి మరణం రాణ్‌పూర్ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. గ్రామస్తులు ఆమెను కేవలం అంగన్‌వాడీ మహిళగా మాత్రమే కాకుండా, ఒక నమ్మకమైన వ్యక్తిగా భావిస్తారు.

పిల్లలను తన పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టేవారని, వారితో ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండేవారని దిలీప్ గుర్తుచేసుకున్నారు.

”తేనెటీగల దాడి చాలా ప్రమాదం. పిల్లలను కాపాడే క్రమంలో కాంచన్ బాయి తన ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం ఆమె కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది” అని గ్రామ సర్పంచ్ లాలారామ్ రావత్ అన్నారు.

గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం ఆ కుటుంబానికి సహాయం అందజేస్తామని ఆయన తెలిపారు.

”ఇంటి బాధ్యత అంతా అమ్మే మోసేది. నాన్న చికిత్స కోసం ఇప్పటికే ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చయ్యాయి. మా భూమిని కూడా అమ్మాల్సి వచ్చింది. ఇప్పటికీ ప్రతి నెలా మందుల కోసం రెండున్నర నుంచి మూడున్నర వేల రూపాయలు ఖర్చవుతాయి” అని రవి ఆవేదన వ్యక్తం చేశారు.

”పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటం వల్ల పిల్లలు అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకోవాల్సి వస్తోంది. పాఠశాల పరిస్థితిని మెరుగుపరచాలని, ప్రహరీ నిర్మించాలని, తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా ఇప్పటికే అన్నీ బాగుండి ఉంటే, ఆ సమయంలో మా అమ్మ అంగన్‌వాడీ కేంద్రంలో ఉండాల్సిన అవసరమే వచ్చేది కాదు” అని రవి అన్నారు.

(స్థానిక విలేకరి ఆకాష్ శ్రీవాస్తవ అందించిన వివరాల ఆధారంగా)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)