SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, UGC
విపక్ష వైసీపీ నేతల విమర్శలు, అభ్యంతరకర భాషతో దూషణలు.. ప్రతిగా అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ధ్వంసరచన.. ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయం.
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇటీవల సిట్ రిపోర్టు బయటికి వచ్చిన నేపథ్యంలో అధికార టీడీపీ, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయం తారస్థాయికి చేరింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిందని, ముఖ్యంగా జంతు అవశేషాల కొవ్వు కలిపారంటూ గతంలో టీడీపీ ఆరోపించింది.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడంతో విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ను ఏర్పాటు చేశారు. విచారించిన సిట్ ఇటీవల కోర్టులో ఛార్జిషీట్ ఫైల్ చేసింది.
ఈ ఛార్జిషీట్‌లో తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ నిజమే అని తేల్చింది. కాకపోతే అందులో జంతువుల కొవ్వు కలిసిన ఆనవాళ్లు లేవని పేర్కొంది.
లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో పామాయిల్‌తో పాటు ఇతర రసాయనాలు కలిపారంటూ నివేదిక ఇచ్చింది.
దీంతో రాష్ట్రంలో రాజకీయంగా వివాదం రేగింది.
టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
తిరుమల లడ్డూలో కల్తీ నిజమేనంటూ తెలుగుదేశం నాయకులు పలుచోట్ల వైసీపీని విమర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కొన్ని చోట్ల జంతు కొవ్వు ఆరోపణలను రిపీట్ చేశారు కూడా.

ఫొటో సోర్స్, UGC
అంబటి రాంబాబు బూతులు, టీడీపీ కార్యకర్తల దాడులు
ఈ క్రమంలో గుంటూరు గోరంట్ల ప్రాంతంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ .. అనేక వివాదాలకు దారితీసింది.
ఆ ఫ్లెక్సీని తీసివేయాలని, లేదంటే తామే తీసివేస్తామంటూ జనవరి 31వ తేదీ శనివారం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లగా.. టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.
దీంతో రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని అంబటి రాంబాబును వెనక్కి వెళ్లిపోవాలని చెప్పడం.. అందుకు అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేయడం.. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు రావడం.. వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
సరిగ్గా ఈ సమయంలోనే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై తీవ్రమైన దూషణలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మీడియాలో రాయలేని భాషలో మాట్లాడారు.
ఆ వ్యాఖ్యల అనంతరం వందలాదిమంది తెలుగుదేశం మద్దతుదారులు అంబటి రాంబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
అంబటి రాంబాబు కార్యాలయంపైనా దాడి చేసి నిప్పుపెట్టే యత్నం చేశారు. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన సమయంలో పోలీసులు చూసీచూడనట్టు ఉండిపోయారన్న విమర్శలు వచ్చాయి.
దాడి చేసిన వారిపై కేసులు ఉంటాయా అనే అంశంపై పోలీసులను బీబీసి ప్రశ్నించింది.
ఫొటో సోర్స్, Face book/Ambati rambabu
ఇంకా ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న సీఐ
అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌పై దాడికి సంబంధించి ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పట్టాభిపురం సీఐ జి.వెంకటేశ్వర్లు బీబీసీతో అన్నారు.
అందుకే ఆ విషయం ఆలోచించలేదని చెప్పారు.
అయితే రెండు మూడు రోజులు చూసి ఎవరూ ఫిర్యాదు చేయకపోతే తామే సుమోటోగా కేసు పెడతామని అన్నారు.
అంబటి ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసిన వారిపై కేసుల విషయం అప్పుడే చెప్పలేమని గుంటూరు ఏసీపీ అరవింద్ బీబీసీతో అన్నారు.
“ఆ ప్రాసెస్‌లో ఉన్నాం.. అప్పుడే చెప్పలేం” అని ఆయన వ్యాఖ్యానించారు.
దాడి దృశ్యాల్లో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ “అన్నీ చూడాలి, అప్పుడే ఏమీ చెప్పలేం”అన్నారు.
ఫొటో సోర్స్, UGC
జోగి ఇంటిపై దాడి కేసులో..
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించే వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్లపై ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు.
జనవరి 31 శనివారం విజయవాడ సమీప ఇబ్రహీంపట్నంలోని శ్రీఆంజనేయస్వామి గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు.
మంత్రి నారా లోకేష్‌ను పరుష పదాలతో విమర్శించారు.
ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు.
పెట్రోలు బాంబుల వేసి ఇంట్లోని వస్తువులకు నిప్పుపెట్టారు.
ఫొటో సోర్స్, UGC
జోగిపై కేసు నమోదు చేశామన్న ఏసీపీ
మంత్రి లోకేష్‌పై వ్యక్తిగత దూషణలతో పాటు కుల, మతాలను రెచ్చగొట్టారన్న అభియోగాలతో సెక్షన్ బీఎన్‌ఎస్ 196 కింద జోగి రమేష్‌పై కేసు నమోదు చేసినట్టు విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు బీబీసీకి చెప్పారు.
టీడీపీ కార్యకర్త కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామన్నారు.
జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వాళ్లపై కేసుల పరిస్థితేమిటని ప్రశ్నించనప్పుడు “ప్రైవేటు ఆస్తుల్లోకి అక్రమంగా చొరబడటం, ఆస్తులు ధ్వంసం చేయడం వంటి అభియోగాలతో కేసులు నమోదు చేస్తామని” చెప్పారు.
ఫొటో సోర్స్, facebook.com/mdnaseerahmedofficia
ఆ కోపం న్యాయమేనన్న టీడీపీ ఎమ్మెల్యే
”మా అధినేత చంద్రబాబు గురించి చాలా దారుణంగా మాట్లాడితే సహజంగానే టీడీపీ శ్రేణుల్లో కోపం వస్తుంది. సంయమనం పాటిస్తూ నిరసన తెలిపేందుకు గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వెళ్లాం. అయితే కార్యకర్తలు ఆవేశంతో కొంత దూకుడు ప్రదర్శిస్తే వారిని ఎలా ఆపగలం. అందులో పదులు, వందల మంది కాదు వేల మంది వచ్చారు. ఎవరిని నియంత్రించగలం?. కార్యకర్తల కోపంలో అర్థం ఉంది. అది న్యాయమైన కోపం. పోలీసులు ఎవరిపైన కేసులు పెడతారు ?” అని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ బీబీసీతో అన్నారు.
స్వయంగా ఎవరిపైనైనా దాడి జరిగితే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తారు కానీ పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి జరిగిందని, ఆ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
“పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి. ఇక పోలీసులు వారిపై ఏం కేసులు పెడతారు” అని పేర్ని నాని ప్రశ్నించారు.
ఒకవేళ మీడియాకి భయపడి కేసులు పెట్టినా ఏదో నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకొంటారని విమర్శించారు.

వైసీపీ నేతల బూతులు, ప్రతిగా టీడీపీ శ్రేణుల దాడులు చూస్తుంటే రాష్ట్రంలో చట్టబద్ధ పాలన సాగడం లేదని, రాజకీయ పాలన కొనసాగుతున్నట్టు అర్ధం అవుతోందని గుంటూరుకి చెందిన జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.
ఇది సరైన విధానం కాదని, పాలకులు చట్టం చేతుల్లోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ బాబీవర్ధన్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో మేధావులు, తటస్థులు ముందుకొచ్చి ఈ సంస్కృతిని బహిరంగంగా ఖండించకపోతే రాష్ట్రం పూర్తిగా గాడితప్పే పరిస్థితి ఉంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS



